సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసానిపెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గతసంచిక తరువాయి)

తప మంతయుఁ బొలివోవఁగ
నపు డన్నియు నుజ్జగించి యయ్యంగనతోఁ
దపసి మనోజ క్రీడా
విపులైశ్వర్యంబు లనుభవించుచు నుండెన్‌.

తన తపస్సంతా వ్యర్ధమైపోయి, తేలిపోయి, ఇక సాధన అంతా ప్రక్కన పడేసి, ఆ ముని ఆ అప్సరతో మదనక్రీడా భోగాలను  అనుభవించడం మొదలెట్టాడు.

ఈ రీతిఁ గొంతకాలం
బారామ మహా మహీధరారణ్యములం
దా రామ వలలఁ దగిలి వి
హారము సలుపంగ గర్భమై తఱి యగుడున్‌.

ఈ విధంగా కొంతకాలం ఆరామాలు, కొండచరియలు, వనాలు, అడవులు అన్ని చోట్లా ‘ఆ రామ’( స్త్రీ) వలలో చిక్కుకుని యథేఛ్చగా విహారంచేస్తూ కామక్రీడలో మునిగితేలాడు ఆ ముని. ఆ అప్సర గర్భవతి అయ్యింది.

అంత ననుఁగాంచి యది విపి
నాంతరమునఁ బాఱవైచి యరిగెఁ, గృపార్ద్ర
స్వాంతుఁ డగు సంయమీంద్రుఁడుఁ
జింతింపకపోయె నేమి చెప్పుదు నధిపా!

అప్పుడు ఆ అడవిలోనే నన్ను ప్రసవించి, అడవిలోనే నన్ను పారేసి ఆ అప్సర వెళ్ళిపోయింది. ఏమి చెప్పను మహారాజా! దయార్ద్ర హృదయుడు కావలసిన ఆ మునీంద్రునికి కూడా కించిత్తూ కరుణ కలుగలేదు నా మీద. తన పని నెరవేరిందని ఆతను అనుకున్నాడు, తనకు అప్పజెప్పిన పని ఐపోయింది అని అప్సర అనుకున్నది, నన్ను కని పారేసి వెళ్ళిపోయింది. నన్ను కన్నతల్లి అలా అడవిపాల్జేసి వెళ్ళిపోగా, ఆకలితో ఏడ్చి ఏడ్చి నోరెండిపోయి, ఏ దిక్కూ మొక్కూ లేక ఆ అడవిలోపడి అదృష్టవశాత్తూ చంద్రకిరణములు సోకి, ఆ కిరణముల అమృతరసమునే త్రాగి ఆకలి తీర్చుకుని బ్రతికిపోయాను. ఈ సంగతి తెలుసుకున్న ముని నేనున్నచోటును వెదుక్కుంటూ వచ్చి, నన్ను తీసుకుని వెళ్లి తన ఆశ్రమములో తల్లీ తండ్రీ తానే అయి పెంచసాగాడు. చంద్రకళలచే ఆకలి తీర్చుకుని బ్రతికాను కనుక కళావతి  అని నాకు పేరు పెట్టాడు. ఇలా నా తండ్రిని సేవిస్తూ, ఆయనకు అనుకూలవతినై గారాబంగా నేను పెరగసాగాను.

ఎవ్వరు చూచినఁ జూపులఁ
జివ్వకుఁ బద నడఁగి నడచు సిగ్గున నొఱపై
రవ్వకు మొదలగు పాపపు
జవ్వన మెదిరించె జిగి యెసఁగ నా మేనన్‌.

ఇలా ఉండగా ఇంతలోనే రానే వచ్చింది నడమంత్రపు యవ్వనం. ఇదివరకట్లా చూపుకు చూపు, మాటకు మాట బదులిచ్చే పసివయసు మరలిపోయింది, సిగ్గు, మొగమాటం, బిడియము కలగలిసిన పాపిష్టి యవ్వనం నన్ను అకస్మాత్తుగా ఆక్రమించుకుంది. 

ఆ వేళం బొడగాంచి ఖేచరుఁ డొకం డాసక్తి దేవాపిసం
జ్ఞావంతుండు సబాంధవుం డగుచు నిశ్శంకన్‌ ననున్‌ వేఁడువాఁ
డై వాచంయముఁ డగ్ని కార్యనిరతుండై యున్నచోఁ బర్ణశా
లావాసంబున కేఁగుదెంచి నిజభావాకాంక్ష సూచించినన్‌

ఆ సమయంలో నన్ను చూసి ఆకర్షితుడై, దేవాపి అనే గంధర్వుడు బంధువులతో కూడి నిశ్శంకగా నన్ను అడగడానికి (వివాహం చేసుకుంటానని) మౌనవ్రతుడు(ముని) ఐన నా తండ్రి వద్దకు వచ్చాడు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు.

శిఖిపించదళ పరిష్కృతములై సేమంతి / విరుల తీరగు శిరో వేష్టనములు
నెఱగంటిచూడ్కిఁ దాయెతుల బాహులు వంచి / నారాజు లల్లార్చు నారజములుఁ
గాదంబరీ గంధగర్భంబులై వల్చు / ఘనసార మిళ దాస్య గంధములును
దరహాసములఁ దోఁచు తాంబూల సేవాంధ / కారితాధర రద క్షతుల యొఱపుఁ

జిటులుగందంపుఁ బూఁతలు జిహ్వికలకు
ననుపు నెఱవాది బంటు పంతపుఁ బదరులు
ఘన మగు జుగుప్స వెనుప నజ్జనముఁ జూచి
ఋషి మనంబునఁ గడు నసహ్యించుకొనుచు.

నెమలి కన్నులతో, చామంతి పూలతో అలంకరించిన తలపాగాలతో, ఎర్రని కండ్లతో (మద్యపానం చేయడం వలన) భుజాలకు తాయెత్తులు, దండ కడియాలు, చురకత్తుల మెరుపులతో, మద్యపు వాసన, దాని పోగొట్టుకోడం కోసం వేసుకున్న తాంబూలపు కర్పూరపు వాసన గుప్పుమంటుండగా, నవ్వినప్పుడు తాంబూల చర్వణం చేత ఎర్రబడిన దంతములు బయటపడుతూ, నిరంతరం తాంబూలం సేవించడం వలన నల్లబడిన పెదవులతో, ఒంటికి పూసుకున్న గంధపు వెగటు వాసన, తాంబూలపు వాసన, మద్యపు వాసనా కలిసిపోతుండగా వచ్చిన వారి ప్రగల్భాలు, ఆర్భాటం, తత్తరపాటు ఇవన్నీ చూసి మనసులో ఏవగింపు కలిగింది నా తండ్రికి.

ఆహా! ధన్యుఁడ గడు నైతి, మ ద్విమలవంశాచార విద్యా తప
శ్శ్రీ హోమాదులు నేఁడుగా తుది ఫలించెన్‌, నాగవాసంబు మ
ద్గేహక్షోణికి బిడ్డ వేఁడుటకు నేతేఁ గాంచుటన్‌ బ్రాహ్మ్య మిం
కోహో! చాలుఁ బొకాలిపోయెదరొ! పోరో! నోటిక్రొవ్వేటికిన్‌?

ఆహా! ఏమీ నా భాగ్యము! ఎంతో ధన్యుడిని ఐపోయాను. నా విమలమైన వంశం, ఆచారం, ప్రతిష్ఠ, విద్య, తపస్సు, యజ్ఞం అన్నీ ఈనాటికి కదా ఫలించాయి! జారుల వంశం నా బిడ్డను అడగడానికి రావడం, వారితో బాంధవ్యం కలగడం ఎంత అదృష్టం, ఇకపై ఈ బ్రాహ్మణ్యం తో పనిలేదు! చాల్చాలు! వెంటనే వెళ్ళిపోతారా పోరా? నోటికొవ్వు ఎందుకు? 

మీ తరమువార లేతఱి
నేతరితనమునఁ దపస్వి గృహకన్యకలన్‌
వీత భయ వృత్తి వేఁడిరొ
కో! తముఁ దర్కింప కౌర! క్రొవ్వు లటంచున్‌.

మీవాళ్ళు ఎప్పుడైనా దుడుకుతనంతో సిగ్గూ, ఎగ్గూ, భయమూ, సంకోచమూ లేకుండా తపస్వుల ఇంటి ఆడపిల్లలను ఇమ్మని అడిగారా తమ అంతరాలను మరిచిపోయి? మీరు క్రొవ్విపోయారు! అని అగ్గిమీద గుగ్గిలం ఐపోయాడు నా తండ్రి.

వసుధేశ! ముక్కు డుస్సిన
పసరము క్రియఁ గెరలి తిట్టెఁ బక్కున ఋషి వా
రుసురు మని వెడలిపోయిరి
ముసలి గదా! పుట్టినిల్లు ముఖ్యోష్ణతకున్‌.

మహారాజా! ఆవిధంగా, ముక్కుతాడు ఊడిపోయిన పశువులాగా చిందులేస్తూ, కోపంతో ఎగిరిపడుతూ, వారిని తిట్టాడు నా తండ్రి. ఆ ఋషి అలా తిట్టడంతో ఉస్సురుమంటూ వారు వెళ్ళిపోయారు. ముసలితనము నోటి దురుసుతనానికి పుట్టినిల్లు కదా!

నీ వైశిష్ట్యము తిట్టులన్‌ మెఱయునే నీకంటె నేఁ దక్కువే?
యీవేఁ గన్యక నీవు గాక మఱి మద్వృత్తాన్వయాచారముల్‌
నీవా పేర్కొనుపాటివాఁడ? విలఁ గానీ నిల్తుగా కేమి? పో
పో విప్రాధమ! నిన్నుఁ బోల నిఁక నల్పుల్‌ లేరు దంభవ్రతా!

నీ ప్రతిభ అంతా తిట్టడంలోనే ప్రకాశిస్తున్నదా ఏంటి? నీ కంటే నేనేమన్నా తక్కువ వాడినా? నీ కన్యను ఈయకపోతే ఈయకపోయావు, సరే, నా వంశాచారమును నా ప్రవర్తనను ఎంచడానికి నువ్వెవరివయ్యా? పోకుండా ఇక్కడే నిల్చుంటామా ఏమిటి? పో! పో! బ్రాహ్మణాధమా! నీ దొంగ వ్రతాలు నువ్వు, నీకంటే అల్పులు ఎవరూ లేరు, అంటూ జవాబుగా తానూ నిందలు చేసి ఆ గంధర్వుడు వెళ్ళిపోయాడు.  ఈ పద్యంలో కూడా ఒక చమత్కారం చేశాడు పెద్దన. ‘ నీవా పేర్కొనుపాటివాఁడ? విలఁ గానీ నిల్తుగా కేమి?’ నీవా పేర్కొనుపాటివాడవు యిలలో? సరే కానీ! ఇక్కడే నిల్చుంటానా ఏమిటి? వెళ్ళకుండా అని సామాన్య సరళమైన అర్ధంతో పాటు, ఇలపై, భూమ్మీద నిలిచుంటావా? ప్రాణాలతో బ్రతికుంటావా ఏంటి, నన్ను ఇన్ని మాటలు అని, నా కోరికను తిరస్కరించిన తర్వాత? అనే అర్ధం కూడా ధ్వనిస్తుంది, అది జరగబోయే సంఘటనను సూచిస్తుంది.

అనుచుఁ బగ చాటి పోయి, నాఁడర్థరాత్ర
సమయమున శస్త్రనిహతి మజ్జనకుఁ జంపె
నట్ల యగుఁ గాక పుడమిఁ గామాంధచిత్తుఁ
డెవ్వరి వధింపఁ? డెటు సేయఁ? డేమి గాఁడు?

అలా అంటూ తన పగను వెల్లడించి వెళ్ళిపోయి, ఆనాటి అర్థరాత్రిసమయంలో దొంగచాటుగా వచ్చి ఆయుధంతో నా తండ్రిని, ఆ మునిని చంపేశాడు వాడు, అంతే కదా! కామాంధుడు ఐనవాడు ఎవరిని చంపడు? ఏం చేయడు? ఏం కాకుండవుంటాడు అని? 

అపుడు మెడఁగోయ ముని రోఁజు టాలకించి
మేలుకొని దివ్వె యిడి సంభ్రమించి యేడ్చు
నన్నుఁ బొదివిరి పొరుగిండ్ల నున్న తపసు
లా దురాచారుఁడును బాఱె నటకు మునుప.

చురకత్తితో మెడను కోసెయ్యడంతో ఎగశ్వాస తీస్తూ ప్రయాసపడుతున్న నా తండ్రి మూలుగులను విని, నేను మేలుకుని, దీపపు వెలుగులో జరిగింది చూసి, దిగ్భ్రాంతితో ఏడుస్తుంటే ఇరుగు పొరుగు తాపసులు వచ్చి నన్ను పొదివిపట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు, అంతకుముందే , వారు రాకముందే  ఆ దుర్మార్గుడు పారిపోయాడు. తల్లీ తండ్రీ అన్నీ తానే అయి నన్ను ప్రాణప్రదంగా పెంచిన నా తండ్రి మరణించడంతో, శోకించి, ఆయనకు అగ్నిసంస్కారాలను చేయించి, తీరని దుఃఖముతో నేను తట్టుకోలేక, నా ప్రాణాలను త్యాగం చేద్దాము అనుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా, ఆకాశ వీధిలో వెళ్తున్న పరమేశ్వరి, పార్వతీదేవి నన్ను చూసి, క్రిందికి దిగి, నన్ను వారించింది.

అతిసౌందర్యనిశాంత మీతను వలభ్యం బిట్లు శోకాతురా
న్విత వై దీనిఁ దొఱంగఁగా దగునె తన్వీ! చాలు నీసాహసం
బతిలోకుండు స్వరోచి నీకుఁ బతి యౌ నారాజుఁ జేపట్టి య
ప్రతిమశ్రీవిభవంబుఁ గాంచెదవు నాపల్కొండుగా నేర్చునే?

ఇంతటి అపురూప సుందరమైన దేహం అలభ్యం, కావాలన్నా దొరకదు! శోకాతురవై దీన్ని వదిలెయ్యడం, నీ ప్రాణాలను తీసుకోవడం తగునా? నీ దుస్సాహసం చాలు. అతిలోక శూరుడు, ధీరుడు, సుందరుడు ‘స్వరోచి’ నీకు భర్త అవుతాడు. ఆ రాజును చేపట్టి, అంతులేని వైభవాన్ని, ఆనందాన్ని పొందుతావు సరేనా? నా పలుకులు కల్లలు అవుతాయా?   కనుక నీ పిచ్చి ప్రయత్నాన్ని, ఆత్మహత్యా ప్రయత్నాన్ని  మానుకో, కొంతకాలం ఓపికపట్టు! 

విను మదియుఁ గాక పద్మిని
యనఁ బరఁగిన విద్య నేఁ బ్రియంబున నిత్తున్‌
గొను నీవు తత్ప్రసాదం
బున నీకు నభీష్టసౌఖ్యములు సిద్ధించున్‌.

అంతే కాదు, పద్మిని అనే విద్యను కూడా నీకు ప్రసాదిస్తున్నాను, తీసుకో. దాని మహిమవలన సౌఖ్యాలు, సంపదలు, ఏమి కోరుకుంటే అవి అన్నీ లభిస్తాయి, సుఖంగా, శుభంగా ఉండు అని నాకు రహస్యంగా ఆ పద్మినీ విద్యను ప్రసాదించి ఆ జగజ్జనని వెళ్ళిపోయింది. ఆనాటినుండీ ఆతల్లి పలుకులనే నమ్మి ప్రాణాలను ఉగ్గబట్టి నిరీక్షిస్తున్నాను. ఆ జగజ్జనని చెప్పిన స్వరోచివి నీవే అనుకుంటాను, మహారాజా, మోసపు మాటలు లేకుండా నిజం చెప్పి, నీవే స్వరోచివి అయితే నా పద్మినీ విద్యనూ, నన్నూ గ్రహించు, అనుగ్రహించు అని కళావతి అనే రెండవ కన్య తన కథను చెప్పడం ముగించింది. 

ఏకాగ్రత నవ్విద్యలు
గైకొని పుణ్యాహపూర్వకంబుగ గుణ ర
త్నాకరుఁ డయ్యిద్దఱ న
స్తోకోన్నతిఁ బెండ్లియయ్యె సుముహూర్తమునన్‌.

ఏకాగ్రతతో ఆ విభావసి నుండి పశుపక్ష్యాదుల భాషనూ, కళావతినుండి పద్మినీ విద్యనూ నేర్చుకుని, అనంతరం పుణ్యాహ పూర్వకంగా, వేదోక్తంగా వారిద్దరినీ పెండ్లియాడాడు స్వరోచి.

ఆ సమయంబునన్‌ మొరసె నభ్రపథంబున దేవదుందుభుల్‌
సేసలు చల్లి రచ్చరలు సిద్ధనికాయము చేరి సన్నుతుల్‌
సేసెఁ బ్రసూనవృష్టి గురిసెన్‌ జన రంజన కారి వాసనో
ల్లాసములై చెలంగె శుభలక్షణ దక్షిణ గంధవాహముల్‌.

ఆ సమయంలో ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. దేవకాంతలు శుభాక్షతలను చల్లారు. సిద్ధ సమూహం సన్నుతులు చేసింది. పూలవాన కురిసింది. ప్రజలకు ఆనందకరంగా, ఉల్లాసకరంగా పరిమళ భరితమైన, శుభసూచకములైన దక్షిణ వాయువులు, మలయపవనాలు వీచాయి. 

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి