గురు-శిష్య పరంపర....
కూచిపూడి గురువులు పద్మశ్రీ. వెంపటి చినసత్యం గారు....నా మొదటి నాట్యాచార్యులు...
సత్యం మాస్టారి గారితో, ప్రత్యేక అనుబంధం....
ఆసక్తి ఉండి శ్రద్దగా నేర్చుకునేవాళ్ళని సత్యంమాస్టారు గమనించేవారు. మెచ్చుకునే వారు.ఆరేళ్ళప్పుడు, అలా ఆయన నన్ను గమనించి మెచ్చుకున్న రోజు పండుగలా ఉండేది. వారానికో రోజు సీనియర్స్ తో కలిపి, చిన్న పోటీ పెట్టి, అడుగులు చేయించేవారు. నేను ఎక్కువ మార్లు గెలిచేదాన్ని కూడా. మాస్టారు ప్రేత్యేకంగా ప్రోత్సహించేవారిలో నేను ఒక్కత్తిని. డాన్స్ క్లాస్ మొదలుపెట్టిన రెండేళ్ళకి ఆర్మీ వాళ్ళ ఫ్లాట్స్ తయారయ్యాయి. మేము కొత్త ఫ్లాట్ కి మారవలసి వచ్చింది. మరీదూరమేమీ కాదు. అయినా డాన్స్ క్లాస్ అయ్యాకచీకట్లో ఇంటికి రావడం కష్టం అని అమ్మడాన్స్ క్లాస్ మానిపించింది. మాస్టార్ గారికి ఆసంగతి తెలిసి, తానే బాధ్యత తీసుకొని, నన్ను క్లాస్ నుండి ఇంటికి బధ్రంగాచేరుస్తానని మా అమ్మని ఒప్పించారు. ఎన్నోమార్లు క్లాసు అయ్యాక ఆయనే నన్ను ఇంటివరకు దిగబెట్టేవారు. లేదంటే, శేషు మాస్టారువెంట ఇంటికి పంపేవారు. అంతటి శ్రద్ధతీసుకొనే వారాయన శిష్యుల విషయంలో.నేను స్ట్రైన్ అయినప్పుడల్లా కాస్త జ్వరం వచ్చేది. రెండు రోజులు క్లాసుకి రాకపోతే, మాస్టర్ గారు, ఇంటికొచ్చి కనుక్కొనే వారు.అలా నా కూచిపూడి నృత్య శిక్షణ బేషుగ్గా సత్యం మాస్టారి గారి వద్ద, ఓ నాలుగేళ్ళ పాటు జరిగింది.నాన్నకి బదిలీ అయి, మేము వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు, మాస్టారు గారు ఎంతో బాధపడ్డారు.నన్నుమంచి నర్తకిగా తీర్చి దిద్దుతానని, కాన్వెంట్లో చదువుకుంటూ డాన్సు నేర్చుకోవచ్చుననీ, మద్రాస్ లోనే తన వద్దవదిలేసి వెళ్ళమని, మిగతా పిల్లలతో పాటేచక్కగా చూసుకుంటానని, చాల అడిగారు మానాన్నగారిని. (ఇతర దేశాల నుండి కూడా కళ మీద ఆసక్తితో వచ్చి, అప్పటికే ఆయన ఏర్పరిచిన హాస్టల్లో ఉండి, నాట్యం అభ్యసించేవారు కొందరు)
ఆయన అలా అనడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతటి గొప్ప గురువుగారు నా అంత చిన్నపిల్లపై ఉంచిన నమ్మకం నాలో చాలా ఉత్సాహాన్ని నింపింది.ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో చెప్పలేను. మా అమ్మ వాళ్ళలోనూ నాపై నమ్మకం పెంచిందేమో.వాళ్ళకే కాదు నా మీద నాకు కూడా ఓ గొప్పకాన్ఫిడెన్స్వచ్చేసింది. తప్పకుండా ఎక్కడ వున్నా కూచిపూడి గురువు వద్ద నాట్యాభ్యాసన కంటిన్యూ చేయిస్తామని అమ్మ మాస్టారు గారితో అన్నది.
నా రెండవ కూచిపూడి గురువు - వేదాంతం జగన్నాధ శర్మగారు. ఆయన, సత్యం గారుఅన్నదమ్ముల కొడుకులు. ఇద్దరూ, శర్మ గారి తండ్రిగారైన శ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణశాస్త్రి గారి వద్ద నాట్యం అభ్యసించారట.జగన్నాధశర్మ గారి వద్ద నా శిక్షణ కొనసాగడం కూడా అదృష్టమే. నృత్యశిక్షణ లో గొప్ప సాంప్రదాయం కొనసాగించ గలిగాను.1976 లో,మద్రాస్ కళామహల్లో జరిగిన నానృత్య ప్రదర్శనకి సత్యం మాస్టార్ గారువిచ్చేసి, గ్రీన్ రూం లోకే వచ్చారు. “నీవు డాన్సర్ గా ఇంతటిదానవౌతావని నాకు ఎప్పుడో తెలుసు,” అంటూఆశీర్వదించారు. మొదటి వరుసలో కూర్చుని నానాట్యాన్ని తిలకిస్తున్న ఆయన్ని నేనుగమనించాను కూడా. చాలా బెరుగ్గా ఫీల్అయ్యాను. ఆయన నా నాట్యాన్నిమెచ్చుకోవాలి అని ఆశ పడ్డాను.
అలాగే, దేశవిదేశాల్లో జరిగే సాంస్కతిక సభల్లోఅప్పుడప్పుడు కలిసే వాళ్లము. తప్పకుండానాతో మాట్లాడి నన్ను ప్రోత్సహించే వారు.చుట్టూ ఉన్న వాళ్ళ కి “ఉమ నా శిష్యురాలే,” అని చెబుతూ, ఇప్పుడు మా జగన్నాధ శర్మశిష్యురాలు అని గర్వంగా అనేవారు.1982 లోమలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో కలిసినప్పుడు కూడా, “డాన్స్ విషయంలో నీ గురించిన వార్తలువింటూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను, చాలాసంతోషం,” అని సత్యం మాస్టారు అన్నప్పుడు నాకింకేమిగుర్తింపు కావాలి? అనుకున్నాను.డిట్రాయిట్, యూ.ఎస్.ఏ లో 1997 లో జరిగినATA తెలుగు సభల్లో కలిశాము. మాస్టార్ గారిప్రోగ్రాం అవుతూనే మా ప్రోగ్రాం ఉండడంతో, ఆయన డయాస్ దిగుతుండగా, నేను పైకి డయాస్మీదకి వెళ్తూ పాదాభివందనం చేశాను.
తరువాత 1998 లో డల్లాస్, యు.ఎస్.ఏ (U.S.A) లో జరిగిన తానా TANA కాన్ఫెరెన్స్ లో, ప్రారంభ సమావేశానికి మా అమ్మాయితో చేయించిన ‘అయిగిరినందిని’ డాన్సు చూసి, వివరాలు కనుక్కొనినా కోసం కబురంపారు. నేను, మా అమ్మాయిశిల్ప వెళ్లి కలిసాము.ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రశంసించారు.“అమ్మాయి పోలికలు, నృత్యంచూసి, అప్పుడేఅనుకొన్నాను మీ అమ్మాయే అయి ఉంటుందని. నీవు టెక్సాస్ లోనే ఉంటావని తెలునుగా. చాల సంతోషం”,అని ఆశీర్వదించారు.
బదిలీల వల్ల నా నృత్య శిక్షణ వెనుక బడిందని అనుకున్నా, మా అమ్మ నా నిరాశని ఇట్టే మాయం చేసింది...తానే ఉత్సాహంగా నాలో ఉన్న కళకి ఓపిగ్గా మెరుగులు దిద్దింది. షుమారు నాలుగేళ్ల ‘గ్యాప్’ లో అమ్మ మేకప్ నేర్చుకొంది, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది... పాత పోరాణిక సినిమాలు చూసేది ఐడియాల కోసం...లలితసంగీతం నుండి, పౌరాణిక సినిమాల నుండి, సంప్రదాయ, జానపద పాటలని తీసుకొని కొరియోగ్రఫీ చేసి నాకు నేర్పేది...అలా అమ్మే గురువుగా, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రేక్షకుల మెప్పు పొందాను. మేము వరంగల్ నుండి, హైదరాబాదు వచ్చాక మాత్రం, అప్పటివరకు చేస్తున్నట్టుగా కాక, కూచిపూడి నర్తకి గానే, మళ్ళీ నేను వేదికల పై నృత్యం చేయాలని అమ్మ నిర్ణయించింది...
కూచిపూడి గురువు కోసం అన్వేషణ మొదలు పెట్టాము...
కానున్న కార్యం గంధర్వులేచూస్తారన్నట్టు’ ....జరిగింది, నా రెండవ గురువుగారైన ‘కళాప్రపూర్ణ’ వేదాంతం జగన్నాధ శర్మ గారి విషయంలో...
ఆ రోజు నేను స్కూల్ నుండి ఇంటికి వెళుతూ,మారేడుపల్లి బస్ స్టాండులో,జగన్నాధ శర్మ గారిని చూసుండకపోతే,నా నృత్య శిక్షణ తిరిగి మొదలయ్యేదో లేదో తెలియదు....అలా కనబడ్డ మాస్టారు గారిని నేను గుర్తు పట్టాను. ఆయన నన్ను గుర్తు పట్టలేదు... అప్పుడు నేను నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను.“బస్సుకి టైం అవుతుందమ్మా, వెళ్ళాలి,” అని ఆయన అంటున్నా, “ప్లీజ్ మాస్టారు, ఒక్కసారి వచ్చి మా అమ్మని కూడా కలిసి, కాఫీ తాగి వెళ్ళండి. మా ఇల్లు నాలుగడుగుల దూరమే,” అని ఆయన్ని బతిమాలి, ఇంటికి తీసుకువెళ్ళాను...ఆ సంఘటన నా జీవితానికి ఓ దశ, దిశా సూచించిందనే చెప్పొచ్చు... మా అమ్మ, నాన్నల సహకారంతో, అలా మలుచుకోగలిగాననే అనవచ్చు...అప్పటి నుండి, వెనుకంజ వేయకుండా, వెనుతిరిగి చూడకుండా సాగింది నా నృత్య శిక్షణ. వెన్నంటే నృత్య ప్రదర్శనలు కూడా......
కళాప్రపూర్ణ వేదాంతం జగన్నాధ శర్మ గారు.... జగమెరిగిన గురువులు. ఆయన వంశ పారంపర్యంగా వస్తున్న కూచిపూడి కళకి వారసుడు.
ఆయన తండ్రిగారైన వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు, కూచిపూడి నాట్యకళకి జీవం పోసి, ఆ కళ స్థాయిని పెంచిన మహనీయుల్లో మొదటి వారు. ‘నాట్యశాస్త్రము’లో ఆయన్ని ఎంతో గణనీయంగా ప్రశంసించి కూచిపూడి నృత్యకళ నిర్మాణంలో ఓ మూల స్థంబమంటి వారని ప్రస్తావించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారే, వెంపటి చిన్న సత్యం గారు, జగన్నాధ శర్మ గారు, పసుమర్తి కృష్ణమూర్తి గారు కాక మరెందరో గొప్పపేరున్న గురువులు…పోతే, మా మాస్టారు - జగన్నాధ శర్మ గారు, చిన్నప్పుడు ‘ఉషాపరిణయం’ లో ఉషగా వేషం కట్టి నృత్యం చేసి ప్రఖ్యాతి గాంచిన కళాకారులు. ఎన్నో చలనచిత్రాలకి నృత్య దర్శకత్వం వహించారు. ఎందరో నటీమణులకు శిక్షణనిచ్చి, డాన్స్ డైరెక్టర్ గా పేరు పొందారు. తరువాత, ఎల్.వి. ప్రసాద్ గారి వొత్తిడితో, హైదరాబాదులో ‘కూచిపూడి కళాశాల’ స్థాపించి, అక్కడ స్థిరపడ్డారు....ఆయన వద్ద శిక్షణ పొందుతూనే, ముందుగా, Hyderabad Lions Club వారి స్టేట్ లెవెల్ డాన్స్ పోటీల్లో పాల్గొని, కూచిపూడి మరియు జానపద నృత్య విభాగాల్లోగెలిచి మొదటి స్థానం గెలుచుకున్నాను.అలాగే, సీనియర్స్విభాగంలో “All India Kuchipudi Dance Competitions”లో పాల్గొని, 1st place, gold medal, AkkineniNageswarRao Rolling trophy గెలుచుకున్నాను...
నా కూచిపూడి రంగప్రవేశం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన ‘నట్టువాంగం’ కి ఎంతో పేరు. దాదాపు 12 ఏళ్ళ పాటు నాకూ మాకుటుంబానికి కూడా ఓ గురువుగానే కాక ఓ శ్రేయోభిలాషిగా చాలా దగ్గరయ్యారు, మా మాస్టారు. నేను యు.ఎస్.ఏ వచ్చేసాక కూడా ఆయన అనారోగ్యం తో బాధ పడుతూ ఉండగా నాకు చేతనైన సాయం చేసేదాన్ని.
నా భరతనాట్య గురువులు— ముందుగా ‘పద్మశ్రీ’ ఫకీర్ స్వామి పిళ్ళై, ఆయన శిష్యులంతా హెమాహెమీలు. నాకుమంచి శిక్షణ నిచ్చారు భరతనాట్యంలో.
‘కళైమామణి’ శ్రీ త్యగరాయ రాధాకృష్ణన్ కూడా నా పెర్ఫార్మెన్స్ కి ఎన్నో సాంప్రదాయ భరత నాట్య నృత్యాలు నేర్పి, నాకోసం కొన్ని పాటలు తెలుగులో రాయించి మరీ చేయించేవారు. ఆయన కళాక్షేత్ర సాంప్రదాయానికి చెందిన వారు. ఇప్పటికీ ఆయన కూర్చిన ‘ఆండాళ్ స్వప్నం’ నా కెంతో ఇష్టమైన నృత్యం. ఆయనకీ నేనంటే చాల అభిమానం, నమ్మకం కుడా. ఐదేళ్ళు నాకు ఆయన గురువుగా ఉన్నారు. తరువాత కేరళ వెళ్ళిపోయారు.నలుగురూ మహానుభావులే....గొప్ప గురువులు, నాకు గొప్ప శిక్షణనిచ్చారు. నా కళాజీవితానికి గొప్ప తోడ్పాటు వారి వద్ద శిష్యరికం --- నాకు గొప్ప అదృష్టం కాదా!!...
నాట్యభారతీయం పాత భాగాలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.gotelugu.com/issue80/2153/telugu-columns/natyabharateeyam/