అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

006. కమలాసన సౌభాగ్యము

 

కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు

1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ

2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు

3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు (05-307)

ముఖ్యమైన అర్థాలు
కమలాసన = పద్మము ఆసనముగా కలది(లక్ష్మి) ; సౌభాగ్యము = వైభవము; కలికితనంబులు = ప్రౌఢతనములు; సొబగు=చక్కదనము;ప్రమదంబులు= సంతోషములు;

మించిన=అతిశయించు;  చొక్కు=పారవశ్యము; మీరిన = అతిశయించు; ఆస= అపేక్ష; పంచేంద్రియములు= చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు (ఇవి 05 జ్ఞానేంద్రియములు) వాక్కు, హస్తములు, పాదములు, పాయువు, ఉపస్థ (ఇవి 05 కర్మేంద్రియములు); ఎడపని = విడదీయని; పంచ బాణుడు = అరవిందము(lotus), అశోకము( Jonesia asōka), చూతము (mango blossom), నవమల్లిక (Arabian jasmine), నీలోత్పలము ( blue lotus) అను అయిదు బాణములు కలవాడు (మన్మథుడని భావం.); పరిణతలు=  పరిపక్వము పొందిన చేష్టలు;

కనుగవజలములు= కళ్ల వెంట  నీళ్లు; కమ్మని చెమటలు= తియ్యని చెమటలు; అనయము = ఎల్లప్పుడును; చెలులకు = చెలికత్తెలకు; ఆడికలు= నిందలు, అపవాదాలు; మరపులు =పారవశ్యములు; వెరపులు=భయములు; వినుకలి= వినుటకు; కనుకలి = చూపుకు; వేడుక = కుతూహలము, ఇచ్ఛ, అభిలాష, సంతోషము, వినోదము

మోవి= పెదవి; మెరుంగులు=తళతళయనెడు కాంతులు;  చిత్తములు=పెద్దవారేదేని చెప్పునపుడు అంగీకార సూచకముగ వాడు                పదము, అలాగే ఔను అను అర్థమున వాడు పదము; తావి =పరిమళము; దర్పకు=మన్మథుడు(= దర్పింపచేయువాడు.); అలసములు = శ్రమచెందుటలు

తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ   వైభవములు,  ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.

1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి  ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!

2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని  మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ  రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి  పద్మినీజాతి  సౌగంధ్యం కలిగిన  కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే    చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి  ఆనందం కలిగించే విషయాలు.

3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత  చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే”  అనే  వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు.  మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.

ఆంతర్యము
ఈ కీర్తన మూడు చరణాల్లో చివర వర్ణించిన క్రియా పదాల్లో మొదట పరిణతి ఉంది. తర్వాత వేడుక, ఆపిమ్మట   అలసట ఉంది. ఆలోచించినకొద్దీ కవితాప్రియులకు ఇందులో ఆనందం కనబడుతుంది.

చాలామంది అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనలను మనసారా పాడుకొని. ఆనందానుభూతిని పొందుతారు. శృంగార కీర్తనలను పాడటానికి, చదవటానికి , నలుగురిలో ప్రస్తావించటానికి  ఇబ్బంది పడే జాతి ఒకటి ఈ మధ్య బయలుదేరింది.  వారందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ రకమైన  శృంగార వర్ణనలు చేయటంలో అన్నమయ్య ఒకడే కాదు. వాల్మీకి, వ్యాసుడు  కూడా ఉన్నారు. వారు  ఎంత గొప్పగా భక్తిని రాసారో, అంత గొప్పగా శృంగారము, తదవయవ వర్ణన చేసారు.ఉదాహరణకి  పరమ పవిత్రమైన వాల్మీకి రామాయణంలో సీతమ్మ తనను తాను ఇలా వర్ణించుకొంటోంది:

"నా నేత్రాలు, పాదాలు,  చీలమండలు, ఊరువులు అన్నీ సమప్రమాణములో  పుష్టిగా ఉన్నాయి.నా స్తనాలు సుందరాలు. చనుమొనలు గంభీరాలు. నా నాభి లోతు.." (రామాయణము- యుద్ధ కాండ(09-12 శ్లోకాలు)

నెత్తి మీద  రామాయణాన్ని మోసే మనమెవరమూ కూడా , ఇటువంటి వర్ణనలు ఉన్నాయని రామాయణాన్ని పక్కన పెట్టలేదు. నిత్యము పారాయణ గ్రంధంగా  గౌరవిస్తున్నాము.

వ్యాస భగవానుడు దేవీభాగవతంలో   రెండవ అధ్యాయంలో ఇలా వ్రాసాడు:

“……కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు. ఎడమ భాగంలో స్త్రీ, దక్షిణ భాగంలో పురుషుడు ఉద్భవించాడు.  అమె శరీరపు  కాంతి విప్పారిన పద్మంలా ఉంది. ఆమె తొడలు చంద్ర బింబం కంటె అందంగా ఉన్నాయి. ఆమె పిరుదులు అరటి బోదెల్లా ఉన్నాయి. ఆమె స్తనాలు మారేడు పండ్లలా ఉన్నాయి. ….”

ఇలాంటి శృంగారపు వర్ణన ఉన్నంత మాత్రాన ఆ వర్ణనలు చదవటం మానేసి, మిగతా దేవీభాగవతాన్ని మాత్రమే భక్తులమైన మనము చదువుతున్నామా? కాదు. ‘ కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు ‘అను వాక్యంలోని లోతును తెలుసుకొని మనం  చదివేటప్పుడు  వికారాలకు గురి కావటం లేదు. ఆధ్యాత్మికఫలితాలు పొందుతున్నాం.

ఉన్నది ఒకడే. అతడే పురుషుడు. మిగతావాళ్లంతా స్త్రీలు అని ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతపు పునాది మీద లేచినవే ఆన్నమయ్య శృంగార కీర్తనలు. అన్నమయ్య శృంగార కీర్తన చదివిన ప్రతిసారి ఈ విషయాన్ని తలుచుకొంటుంటే ఇదమిత్ధమని  చెప్పలేని తీపితో కలిసిన భక్తి భావనకు గురవుతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశుడు . అతనికోసం అన్నమయ్య నాయిక అయ్యాడు. నాయికలుగా మారాడు. పోట్లాడాడు. అలిగాడు. పంతాలాడాడు. ఏది చేసినా ఒకటే లక్ష్యం. స్వామిలో లీనం కావటం. అదే మోక్షం.  దానికి  అన్నమయ్య శృంగారపు భావాల తొడుగు తొడిగాడు.

దేవీ భాగవతాన్ని, రామాయణాన్ని  ఎంత భక్తి ప్రపత్తులతో చదువుతామో, అన్నమయ్య భక్తి కీర్తనలతో పాటు ఆయన మధుర భక్తి కలిగిన శృంగార కీర్తనలు కూడా చదవాలి.  అన్నమయ్య శృంగారపు స్థాయికి చేరకపోయినా సరే కాని-  ఆయన స్థాయిని అవమానించటం- తిరుపతి వెంకన్న మూల విరాట్టు ముందు నిలబడి, , నమస్కారం చేయకుండా పక్కకి వెళ్లినంత మహా పాపం. స్వస్తి.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు