పలుకే బంగారమాయెరా... - భమిడిపాటి ఫణిబాబు

paluke bangaramayeraa...

 ఆ కంచర్ల గోపన్న గారు, ఏ ముహూర్తాన్న పై పాట పాడేరో కానీ, ఈరోజుల్లో చాలామందికి వర్తిస్తోంది. అసలు ఈ రోజుల్లో ఎవరిని చూడండి, ఏం పలకరిస్తే ఏం చుట్టుకుంటుందో అనుకునేవారే. ఇదివరకటి రోజుల్లో, కనీసం ఓ కార్డుముక్క ద్వారానైనా, క్షేమసమాచారాలు తెలిసికునే వారు.తరువాత టెలిఫోన్లొచ్చాయి, అవి కూడా ఫలానా టైములో నిముషానికింతా, రాత్రి పదినుండి, తెల్లారేదాకా సగంరేటూ, ఏదో మొత్తానికి ఎవరి సావకాశాన్నిబట్టి మాట్టాడడమైనా ఉండేది. కాలక్రమేణా అవేవో సెల్ ఫోన్లొచ్చాయి. ఈరోజుల్లో సెల్ ఫోను లేకుండా ఉండే మానవ మాత్రుడు  లేడంటే ఆశ్చర్యం లేదు. అసలు పిల్లలు పుట్టీపుట్టడమే  ఈ సెల్ ఫోన్లతో.ఈరోజుల్లో టెక్నాలజీ చాలా అభివృధ్ధిచెందింది, మంచిదే కానీ,మనుష్యుల  మధ్య ఉండే సంబంధాలు మాత్రం gone for a toss !

ఒకానొకప్పుడు ఉత్తరాలద్వారా క్షేమ సమాచారాలు తెలిసేవి. ఏదైనా పుట్టినరోజో, లేదా ఇంకో శుభసందర్భమో అయితే, కనీసం గ్రీటింగు స్వయంగా ఇవ్వడమో, లేదా ఏ పోస్టుద్వారానో తెలియపరచేవారు. సాధారణ టెలిఫోన్లున్నప్పుడు కనీసం, ఒకసారి ఫోనులో మాట్టాడడమైనా ఉండేది. కానీ ఈ సెల్ ఫోన్లధర్మమా అని, ఉత్తి ఎస్.ఎం.ఎస్సులే. ఇంక ఉత్తరాలసంగతంటారా, అవి ఏనాడో కొండెక్కేశాయి. ఎక్కడ చూసినా ఈ మెయిల్సే. అవి అందేయా లేదా అనేదానితో పనిలేదు.ఈ రోజుల్లో ఏ ఇంటిలో చూసినా, ఒకరితో ఒకరు మాట్టాడడం అసలు వినిపించనే వినిపించదాయె. అందరి చేతుల్లోనూ అవేవో ఐఫోన్లే. ఎవరింటికైనా వెళ్ళినా, అదేదో “సంతాప సభ” లాగే కనిపిస్తుంది.ఎందుకంటే అక్కడంతా “భయంకరమైన” నిశ్శబ్దం తాండవిస్తూంటుంది. ఎవరి దారిన వాళ్ళు ఆ ఫోన్లలో ఏదో ఒకటి కెలుకుతూంటారు.ఒకానొకప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోడానికి ఒకరింటికి ఒకరు నెలలో కనీసం ఒక్కమారైనా వెళ్ళేవారు. ఈరోజుల్లో ఇంకోరింటికి వెళ్ళి మౌనవ్రతాలు పాటించడంకూడా ఎందుకూ? సొసైటిల్లో కూడా చూస్తూంటాం, ఎవరికి వారే యమునాతీరే. పూర్వం ఓ పిల్లో,పిల్లాడో ఏదో కారణం చేత స్కూలుకి వెళ్ళలేకపోతే, ఆరోజు ఇచ్చిన హోంవర్కు గురించి తెలిసికోడానికో, ఆరోజు చెప్పిన పాఠం చర్చించకోడానికైనా వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ముచ్చటా తీరిపోయింది. సెల్ ఫోనులోనే ఆ కార్యక్రమంకూడా జరిగిపోతోంది.

వీటన్నిటికీ సాయం, అంతర్జాలంలో ఉండే “సోషల్ నెట్ వర్కింగు “ సైట్లు-Facebook, Twitter  లాటివి. పిల్లలు ఊళ్ళోనే ఉన్నారో, లేక బయటికెక్కడికైనా వెళ్ళేరో, ఈ ఫేస్బుక్ లోనే చూసి తెలిసికోవాల్సిన దుస్థితి ఈ రోజుల్లో.  కనీసం బయటి ఊళ్ళకేదైనా వెళ్తున్నప్పుడైనా, ఊళ్ళోనే ఉండే  తల్లితండ్రులకోసారి, ఫోను చేసి చెప్తే వాళ్ళ సొమ్మేంపోతుందో అర్ధం అవదు. ఫోనుచేసి వెళ్తున్నామని చెప్తే, వీళ్ళూ తయారవుతారని భయమా? అధవా వెళ్ళాల్సొచ్చినా , ఓ మాటా మంతీ ఉంటుందా అంటే అదీ లేదూ.కారులో ఉండే భార్యాభర్తలకి ఆ టైములోనే ఎక్కడలేన్ని కబుర్లూ వచ్చేస్తాయి. వెనక్కాల తల్లీ తండ్రీ ఉన్నారే, పోనీ వాళ్ళతోనైనా మాట్టాడితే బాగుంటుందేమో అనే ధ్యాసే ఉండదు. ఈమాత్రందానికి పిల్లలతో వెళ్ళడం ఎందుకూ అనే భావం వాళ్ళల్లోనూ వచ్చేస్తుంది.

ఇదివరకటి రోజుల్లో ఏదైనా కొత్త ఊరికి వెళ్తే, వెంటనే పట్టేసేవారు వీళ్ళు ఊరికి కొత్తా అని ! కారణం, ఆ ఊరిలో ఉండే ప్రతీవారూ ఒకరికొకరు తెలుసు కాబట్టీ, ఒకరితో ఒకరు మాట్టాడి క్షేమసమాచారాలు తెలిసికొనేవారు కాబట్టీనూ.అందుకనే కొత్తగా ఎవరైనా వస్తే ఇట్టే తెలిసిపోయేది. ఫలానా వారి ఇల్లెక్కడా అని అడగ్గానే, ఎవరో ఒకరు చూపించేవారు. కానీ ఈరోజుల్లో ప్రతీ ఫోనులోనూ అవేవో GPS లుట. వాటి ధర్మాన, ఎవరినీ అడగఖ్ఖర్లేకుండానే పనైపోతోంది. మళ్ళీ ఈమాత్రం దానికి ఊళ్ళో కనిపించిన వాడినల్లా అడగడం ఎందుకూ అనే అభిప్రాయం లోకి వచ్చేశారు.

ఈ మధ్యన ఓ కొత్త ఒరవడి వచ్చింది. అస్తమానూ ఊళ్ళోనే ఉండే తల్లితండ్రులని చూడ్డానికి వెళ్ళడం ఎందుకూ, ఓ ఐఫోను లాటిది, తల్లి చేతిలో పెట్టేస్తే సరిపోతుందిలే, ఎప్పుడో వారానికోసారి ఫోనుచేసి క్షేమసమాచారం అడిగితే, పాపం ఆ వెర్రితల్లి సంతోషిస్తుందీ అనుకునేవారు కొంతమందీ. ఎంతైనా కన్నతల్లికదండీ, పాపం ఆవిడకేమో ప్రతీరోజూ తన కొడుకు గొంతుక వినాలనుకుంటుంది, చేతిలో ఓ ఫోనోటుందిగా, ఎప్పుడో ఓసారి ఫోనుచేస్తుంది, “ ఎలా ఉన్నావురా కన్నా.. “ అంటూ. ఆ టైములో, ఆ కొడుగ్గారు ఏ ఆఫీసు మీటింగులోనో ఉండుంటాడు. ఇటువైపు ఈవిడకేమో ఖాళీగా ఉంటుంది కానీ, అవతలివైపు ఆ సుపుత్రుడికేమో ఆఫీసూ, గొడవానూ. ఏదో ఫోనిచ్చిన కొత్తలో బాగానే ఉంటుంది, ఆవిడ ఫోన్  రాగానే వెంటనే జవాబిస్తాడు. రానురానూ, ఆయనక్కూడా విసుగొస్తుంది, ఎప్పుడు పడితే ఆప్పుడు ఈవిడ ఫోన్లేమిటీ అనుకుంటూ, ఓసారి ఫోను ఎత్తి , “ తరువాత నేను ఫోను చేస్తానులే మమ్మీ.. అని పెట్టేస్తాడు. ఆమాత్రం సమాధానికే ఆవిడ బోల్డంత సంతోష పడిపోతుంది. ఎప్పుడైనా ఈ “అమ్మలు” అల్పసంతోషులుకదండీ..  చేస్తానని చెప్పడమంటే చెప్పేశాడుకానీ, చేశాడా పెట్టాడా? ఎన్ని పనులూ, ఎంత కథా ఎంత కమామీషూ.. అమ్మఫోను విషయం గుర్తుండాలి, గుర్తున్నా, ఇంటికెళ్ళినతరువాత , భార్య తో గడపాలి, పిల్లల విషయాలు తెలిసికోవాలి, ఇంత హడావిడిలో అమ్మ ఫోను విషయం గుర్తే ఉండదు.ఈ వ్యవహారం ఉందే అంటే “తరువాత ఫోను చేస్తానూ..” అనేదాన్ని, ఆధునిక పదజాలంలో “ call you later syndrome..” అనికూడా అంటూంటారు. ఈ సిండ్రోమ్ ఉందే అది ఎయిడ్స్ సిండ్రోమ్ కంటే కూడా భయంకరమయింది. ఇదంటూ రాకూడదుకానీ, వచ్చిందా అక్కడ అవతలివారెవరూ అనికూడా చూసుకోకుండా, ఇదే రంధి. అక్కడ అమ్మ ఏమైనా మణులడిగిందా, మాణిక్యాలడిగిందా, జస్టు ఓ “ పలకరింపు”. అదికూడా కరువైపోయింది ఈ రోజుల్లో. అయినా పాపం ఆ వెర్రి ఇల్లాలు ఏమీ అనుకోదు “ వెర్రినాయన ఏ మీటింగులో ఉన్నాడో ఏమో..” అని సరిపెట్టుకుంటుంది.

ప్రపంచంలోని జీవకోటి లో ఒక్క మనుష్యుడికే “ మాట్టాడే” శక్తి ఇచ్చాడు ఆ భగవంతుడు. కానీ దాన్నికూడా సద్వినియోగం చేసికోలేకపోతున్నాం ఈరోజుల్లో.భగవంతుడు అదివ్వలేదూ, ఇదివ్వలేదూ అని ఏడ్చేబదులు, ప్రసాదించిన ఆ “గొంతుక” ని ఎంతవరకూ ఉపయోగించుకుంటున్నామూ అని ఆలోచించుకోవాలి..

ఒక్క పలకరింపు ఎంతైనా సాధించగలదు. ...

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి