సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam

అల్లసాని పెద్దన విరచిత ‘స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)

గంగాతరంగిణీ రంగత్తరంగ శీ, కర శీత సైకతోత్కరములందు
మందార మాకంద మకరంద తుందిలేం, దిందిరానందకృన్నందనములఁ
గాంత నిశాకాంత కాంత వితర్దికా, క్రాంత భూభృద్బృంద కందరముల
మసృణ బిసాహార మాంసల హంసికా, సంసదాసార కాసార తటులఁ

దమక తమక ప్రియుం డని తమక మెసఁగఁ
బడఁతు లుప్పొంగఁ గ్రీడించెఁ పద్మినీ ప్ర
భావ ఘటితాన్నపాన భూషా విశేష
మాల్య వస్త్రానులేప సామగ్రిఁ జెంది.

ఆ విధంగా మనోరమ, విభావాసి, కళావతి అనే ముగ్గురు ముల్లోక సుందరీమణులను భార్యలుగా పొంది, చల్లని గంగానదీ తరంగ బిందువులతో స్నానమాడే  ఇసుక తిన్నెలవెంట,  మందార,మంచి మామిడి తేనెల సోనలను గ్రోలి బలిసి మదించి విహరించే తుమ్మెదలకు నెలవైన వనలతా నికుంజములలో, చంద్రకాంత మణి వేదికామయమైన కొండచరియలలో,  తామర తూళ్ళను మెక్కి, నునుపెక్కి, బలుపెక్కి విహరించే హంసలకు నెలవైన సరస్సుల తీరములందు, పద్మినీవిద్యచేత లభించిన దివ్యమైన ఆహార, పానీయ, ఆభరణ, అనులేపన, మాల్య , వస్త్రములతో యథేచ్ఛగా విహరిస్తూ, ‘నావాడు’ ‘నావాడు’ అని మువ్వురు భార్యలు మోహంతో మురిపిస్తుండగా కామభోగాలలో  తేలియడుతున్నాడు స్వరోచి.  అలా విహరిస్తూ ఒకనాడు చిరు చల్లదనంతో, తీరములందు పెరిగిన తీయమామిడి చెట్లపై చిలుకలు కొరకడంచేత జాలువారుతున్న తీయని రసం కారిపోయి, తీయనైన నీటితో నిండిన సరస్సును చూసి, ఆ తీరమునందున్న, నందనోద్యానవనముతో సాటివచ్చే వనములో, చల్లని పిల్లగాలులకు పరవశిస్తూ విహరించసాగాడు.వారిని చూసి ఆ సరస్సులో క్రీడిస్తున్న ఆడు హంస ఒకటి తన స్నేహితురాలైన ఆడు చక్రవాక పక్షిని పిలిచి, స్వరోచిని ఆతని ముగ్గురు భార్యలను చూపిస్తూ ఏ విభేదములూ లేకుండా వీరు ఇలా ఆనందంగా ఉండడం ఎన్ని జన్మల తపస్సు ఫలితమో కదా అన్నది మెచ్చుకోలుగా.

మెలఁతకుఁ బతిపై నైనను
మెలఁతుకపైఁ బతికి నైన మేలగు టెందుం
గలయది మెలఁతకుఁ బతికిన్‌
వలపు సమం బగుట జన్మవాసన చెలియా!

స్త్రీకి పురుషునిమీద, పురుషునికి స్త్రీ మీద మిక్కిలి అనురాగం ఉండడం ఎక్కడన్నా జరుగుతుంది సహజంగా, స్త్రీ పురుషులకు పరస్పరం సమానంగా గాఢానురాగం కలగడం పూర్వజన్మ సుకృతమే కదా చెలియా అన్నది ఆడహంస ఆడచక్రవాకంతో.   ఆడచక్రవాకం నిరసనగా చూస్తూ ‘తమ కళ్ళ ఎదురుగానే వేరే స్త్రీతో సుఖిస్తున్నా సిగ్గులేకుండా వీరు ఆతనివెంట బడుతుంటే నువ్వు వారిని మెచ్చుకుంటున్నావు, ఒకడికి ఎందరితోనో ఎందరికో ఒకడితో ప్రేమ ఉండడం అసాధ్యం, అసహజం కూడా! వీరిది ప్రేమ కాదు. రాజు తన అనుచరులతో అందరితో చనువుగా ఉన్నా వారిపై మనసులో ఎంత అనురాగం ఉంటుందో వీరికి కూడా పరస్పరం అంతే, వీరు దాసీ జనుల్లాగా ఈతనివెంటబడి తిరుగుతున్నారు.  

తగులు నెవ్వఁడొక్క తరుణికి నొకనికి
మెలఁత వలచు నదియ మే లనంగ
వచ్చుఁ గాని పెక్కు వనితలపైఁ గూర్మి
గలుగు ననుట బొంకు గాదె తరుణి!

ఎవడు ఒక్కస్త్రీపైనే ప్రేమ కలిగిఉంటాడో, వాడిపైననే ఆ ఒక్క స్త్రీకి నిజమైన ప్రేమ ఉంటుంది. అనేకులమీద ఒకడికి, ఒకడిపై అనేకులకు ప్రేమ ఉండడం ఉత్తి అబద్ధం అన్నది. వెయ్యి మాటలెందుకు, నాకు నా మగడు ఒక్కడే, నా మగనికి నేను ఒక్కతెనే స్త్రీని, మాది అసలైన అనురాగం అంటే, నన్నూ నా మొగుడినీ మించిన అదృష్టవంతులు, నిజమైన ప్రేమికులు లేనే లేరు, ఈ స్వరోచి నా భర్తతో ఎందుకూ పోలడు, ఈ ముగ్గురు స్త్రీలు నాతో పోలరు పో!అన్నది ఆ ఆడ చక్రవాకం. పశుపక్ష్యాదుల భాషలు తెలిసిన స్వరోచి ఆ మాటలను విన్నాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు. అయినా భార్యలమీది మమకారంతో మరొక వంద సంవత్సరాలు సుఖించాడు.  ఒకనాడు బంగారు వన్నెతో మెరిసిపోతూ, నీలమణులవంటి కన్నులు మెరుస్తుండగా ఆడ జింకలు తనను నలుదిక్కులా చుట్టిముట్టి ఉండగా, వనంలో విహరిస్తున్న ఒక మగ జింకను చూశాడు స్వరోచి. ఆ జింకను తన భార్యలకు చూపిస్తుండగా,  ఆ ఆడ జింకలు మోహంతో మగజింకను సమీపించి, మెడ నాకుతూ, ముఖాన్ని మొరక చూస్తుండగా, ఆ మగజింక ఆడజింకలను ఇలా హెచ్చరించింది.  

హుంకారం బొనరించి వే తలఁగు డోహో! నేను స్వారోచినే
పంకేజాక్షులతోడ నెల్లప్పుడు దర్పస్ఫూర్తిఁ గ్రీడింప? ల
జ్జాంకూరం బడఁగించినారు తలపోయన్‌ నాకు రోఁతయ్యె మీ
రింకన్‌ బోయి వరింపుఁ డొక్కరుని భోగేచ్ఛన్‌ నివారించితిన్‌.

హుంకరించి, ‘తప్పుకోండి! పంకజాక్షులతో నిరంతరమూ మదంతో విహరించడానికి నేనేమన్నా స్వరోచిని అనుకున్నారా? సిగ్గు ‘మొలకలు’ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు! ఆలోచిస్తుంటేనే నాకు రోత పుడుతున్నది, నేను కామ వాంఛను నియంత్రించుకున్నాను. కావాలనుకుంటే వేరే ఎవడినైనా వరించండి వెళ్లి’ అన్నది ఆ మగజింక. తాను భరించగలడో  లేదో అన్నది ఆలోచించకుండా పలువురిని పెళ్లియాడి, వారిలో ఒకతి ఐన కళావతి ఇచ్చిన పద్మినీ విద్యతో వీడు ఇలా ఇందరితో కులుకుతున్నాడు, ఆ ధనం కూడా వీడిది కాదు, స్త్రీ తెచ్చిన ధనంతో వీడు కులుకుతున్నాడు కనుక వీడికి ఇహమూ పరమూ రెండూ లేవు, నన్ను కూడా వీడిలాగా భ్రష్టుడిని చేద్దామనుకుంటున్నారా? పొండి పొండి అన్నది ఆ మగజింక.  నేనేమన్నా వెర్రిని అనుకున్నారా వీడిలాగా మానాభిమానాలను వదిలేసి ఎప్పుడూ ఆడవాళ్ళ వెంటబడి తిరగడానికి ? అన్నది, ఆ ఆడ జింకలు వెళ్ళిపోయాయి. ఆ పలుకులను విని అర్ధం చేసుకోగలడు కనుక సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు స్వరోచి. ఈ జింక పలుకులు గతంలో ఆడచక్రవాకం పలికిన పలుకులను మళ్ళీ గుర్తు చేశాయి. మరింతగా సిగ్గుపడి, స్తీలు ఇలాంటి జుగుప్సాకరమైన ప్రవర్తనకు, అవమానాలకు హేతువులు, ఇక వీరితో సాంగత్యాన్ని విడనాడాలి అనుకున్నాడు, కానీ వివేకము బలహీనమై మరలా వారితో ఆరువందల దేవతాసంవత్సరాలు కామభోగాలలో తేలియాడాడు. మానవులకు మూడొందల అరవై ఐదు సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరంతో సమానం, అంటే మరొక రెండులక్షల పద్నాలుగువేల మానవ సంవత్సర కాలపర్యంతం వారితో సుఖించాడు. మనోరమ, విభావసి, కళావతులతో వరుసగా విజయుడు, మేరునందనుడు, విభావసుడు అనే ముగ్గురు కుమారులను పొంది, తూర్పున విజయునికి విజయపురం అనేదాన్ని, ఉత్తరాన మేరునందనుడికి గంధవతి అనే పట్టణాన్ని, దక్షిణ దిక్కులో విభావసుడికి ‘ధార’ అనే పట్టణాన్ని నిర్మించి ఇచ్చి వారిని పట్టాభిషిక్తులను చేసి ఒకనాడు వేటకు వెళ్ళాడు. పరుగెత్తుతున్న జంతువులను పడగొట్టాలి అని పట్టుబట్టి వేట కొనసాగిస్తున్నాడు. సంధ్యాకాలంలో పొడిచిన చంద్రరేఖవంటి కోరలతో పలుగువంటి ముట్టెతో అడవి నేలను తవ్వుతున్న ఒక మహా వరాహాన్ని చూశాడు.    

జంభారిభిదుర సంరంభంబు వీక్షించి, జరుగు నంజన మహాశైల మనఁగ
ఝంఝా ప్రభంజ నాస్ఫాలనంబున కుల్కి, యరుగు సంవర్త కాలాభ్ర మనఁగఁ
గఠిన కంఠేకాలకంఠమూలము వాసి, వెస వచ్చు నుజ్జ్వల క్ష్వేళ మనఁగఁ
గలుష ధూర్వహ ఖలోత్కరముపైఁ బఱతెంచు, దండధర క్రూర దండ మనఁగ

ఘుర్ఘురారావ సంఘాత ఘూర్ణమాన
సప్త పాథోధి పాథః ప్రచండ నక్ర
తిమి తిమింగిల మగుచు నభ్రమును మహియుఁ
గ్రమ్ముకొని వచ్చు నొక యేకలమ్ముఁ గనియె

దేవేంద్రుని వజ్రాయుధపు దెబ్బకు భయపడి పారిపోయి వస్తున్న అంజనాద్రి(నల్లని పర్వతం) లాగా ఉన్నది ఆ అడవిపంది. తుఫానుగాలి తాకిడికి వచ్చిపడ్డ ‘సంవర్తం’అనే కాలమేఘం లాగా ఉంది. పరమశివుని కంఠంనుండి జారి వెల్లువలా వచ్చిన హాలాహలంలా నల్లగా ఉంది. పాపాత్ములపై యముడు ప్రయోగించిన దండాయుధంలా ఉంది. సప్తసముద్రాల్లోని మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు సుళ్ళు తిరిగి పడిపోయేలా భయంకరంగా ఘుర్ఘుర ధ్వానాలు చేస్తూ అడవంతా అల్లకల్లోలం చేస్తున్న ఆ అడవిపందిని చూశాడు. దానిపై తన వాడి ఐన బాణమును సంధించాడు. బాణం విడువబోతుండగా ఎక్కడినుండో ఒక్క సుందరమైన ఆడ లేడి వచ్చి మానవ కంఠస్వరంతో ‘రాజా! ఈ అడవిపంది నీకేం అపకారం చేసింది. అంతగా వేటాడాలంటే నాపై నీ బాణాన్ని వేసి నన్ను  చంపి నాకు ఉపకారం చెయ్యి’ అంది. అదేమిటి? నీకు అంత కష్టం ఏమొచ్చింది అని అడిగాడు స్వరోచి ఆశ్చర్యపడుతూ. వేరేస్త్రీలమీద మనసు పెట్టినవాడిని ప్రేమించడంకంటే మరణించడమే మేలు కదా, నన్ను చంపేయ్ మహారాజా అని ప్రాధేయపడ్డది ఆ లేడి.ఎవరిమీద నువ్వు మనసుపడ్డావేంటి అని అడిగాడు స్వరోచి. నా మనసు నీపైనే చిక్కుకుంది రాజా! నా మదనోద్రేకాన్ని తీర్చనైనా తీర్చు, లేదా దయచేసి నన్ను పరిమార్చు అన్నది ఆ లేడి. ఇదేమి చోద్యం? నువ్వు మ్రుగానివి, నేను మానవుడిని, మనిద్దరికీ ఎలా పొందు సాధ్యం? అన్నాడు స్వరోచి. ‘సరే, కనీసం నన్ను కౌగిలించుకో, అదే చాలు’ అన్నది ఆ లేడి జాలిగా ప్రాధేయపడుతూ. జాలిపడిన స్వరోచి ఆ లేడిని చేరదీసి కౌగిలించుకున్నాడు. అంతే!

వల్లీమతల్లి లావణ్య సర్వస్వంబు, విమలాంగ రేఖ నావిర్భవింప
మంజుల మంజరీ మహిత సౌభాగ్యంబు, పరివృత్త కుచవృత్తిఁ బరిణమింపఁ
బల్లవచ్ఛద చారు భావానుభావంబు, మృదుహస్తలీల మూర్తీభవింపఁ
రమణీయ ముకుళ విభ్రమ భాగధేయంబు, కరరుహ స్ఫూర్తి సాక్షాత్కరింపఁ

జేసి మృగియై వహించు నక్షిద్వయంబు
భాసురంబుగఁ దన యంకపాళిలోన
మించుక్రొమ్మించు నుపమించు మెలఁత యగుచు
నిలుచు నవ్వనదేవత నృపతి సూచి.

లతల లావణ్యం సుకుమారమైన దేహముగా, పూలగుత్తులు స్తనములుగా,  చివురాకులు చేతులుగా, లేతమొగ్గలు గోళ్ళుగా, అనన్యమైన అందంతో వనదేవతగా మారిపోయింది ఆ లేడి, ఒక్క కన్నులుమాత్రం ఏ మార్పూ లేకుండా అలాగే ఉన్నాయి, లేడి కళ్ళుగా! ఎంత అందమైన చమత్కారాన్ని సరళంగా, క్లుప్తంగా చివరలో ఒక మెరుపులా మెరిపించాడు పెద్దన ఈ పద్యంలో. అందమైన స్త్రీ కళ్ళను లేడి కళ్ళు అంటాము కదా, లేడి స్త్రీగా మారితే, కళ్ళు మారకుండా అలానే ఉండడం సహజం, వాంఛనీయం కదా మరి!అబ్బురపడి ‘లేడిగా కనిపించి, మానవ భాష మాట్లాడి అందమైన స్త్రీగా మారిపోయావు, ఎవరు నువ్వు, ఏమిటి ఈ విచిత్రం?’అని అడిగాడు స్వరోచి. ఆమె ‘ నేను ఈ వనదేవతను మహారాజా! దేవకార్యం కోసం ఇలా నిన్ను సమీపించాను. నీకు నాయందు కారణజన్ముడు ఐన శిశువు పుట్టవలసి ఉంది. ఆ శిశువే రాబోయే మన్వంతరంలో మనువు అవుతాడు కనుక దేవతలు నన్ను నీ వద్దకు పంపారు, నన్ను చేపట్టు మహారాజా!’ అన్నది. సరేయన్న స్వరోచి ఆమెను వివాహమాడి, ఆవిడతో సుఖించడం వలన కొంతకాలానికి ఆ వనదేవత గర్భం ధరించి ఒక దివ్యముహూర్తంలో ఒక దివ్యశిశువును ప్రసవించింది.   

కాంచెం బుత్త్రు విశాల నేత్రుఁ బృథువక్షఃపీఠ విభ్రాజితుం
బంచాస్యోద్భట శౌర్యధుర్యు ఘనశుంభద్బాహుఁ దేజోనిధిం
బంచాస్త్రప్రతిమాను మానఘను సామ్రాజ్యైకహేతుప్రభూ
తాంచల్లక్షణలక్షితున్‌ సుగుణ రత్నానీక రత్నాకరున్‌.

విశాలనేత్రములున్నవాడు, విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు, పంచాశ్యుని(శివుని)వంటి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడే ఐదు ముఖములు కలిగిన శివునివంటి శౌర్యం కలిగిన బలిష్టములైన దీర్ఘములైన బాహువులు కలిగినవాడు, అందంలో పంచాస్త్రుడితో, అరవిందము, అశోకము, మామిడి, నవమల్లిక, నల్లకలువ అనే ఐదు పూవులను ఐదు బాణములుగా కలిగిన మన్మథునితో సమానుడు, విమలమైన శుభ చిత్తమును కలిగినవాడు, మహాసామ్రాజ్య చక్రవర్తి అయ్యే శరీర లక్షణాలను కలిగినవాడు, సుగుణములనే రత్నరాశులను కలిగిన సుగుణ సాగరుడు ఐన పుత్రుడిని ప్రసవించింది ఆ వనదేవత. దేవదుందుభులు మ్రోగాయి. పూలవర్షం కురిసింది. ఎల్లలోకులూ జయజయ ధ్వానాలు చేసి ఆనందపడ్డారు. ఆ శిశువు పెరిగి పెద్దవాడై అంతరింద్రియములను, బహిరింద్రియములను జయించి, సత్యము, దయ, శుచి యందు ఆసక్తి కలిగి, కామముయందు విరక్తి కలిగి దీర్ఘకాలం మహావిష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేశాడు. ఆతని తపస్సు ఫలించింది. శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించాడు.

నీలమేఘము డాలు డీలుసేయఁగఁ జాలు, మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ
నరవిందములకచ్చు లడఁగించు జిగిహెచ్చు, నాయతం బగు కన్నుదోయితోడఁ
బులుఁగురాయని చట్టుపల వన్నె నొరవెట్టు, హొంబట్టు జిలుఁగు గెంటెంబుతోడ
నుదయార్కబింబంబు నొఱపు విడంబంబుఁ, దొరలంగ నాడు కౌస్తుభముతోడ

జయజయ ధ్వని మౌళి నంజలులు సేర్చు
శర్వ శతధృతి శతమన్యు శమన శరధి
పాలకైలబిలాదిదేవాళితోడ
నెదుటఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు

నీలిమేఘపు కాంతిని ధిక్కరించే ప్రకాశవంతమైన చామనచాయరంగు నీలవర్ణముతో, పద్మముల అందాన్ని వైశాల్యాన్ని నాజూకుతనాన్ని కించపరిచే విశాలమైన లేత ఎఱ్ఱని కన్నులతో, తన వాహనమైన గరుడుడి డొక్కలను ఒరుసుకుని పచ్చపచ్చగా మిలమిలలాడేట్టు చేస్తున్న పీతాంబరంతో, ఉదయభానుడి ప్రకాశాన్ని ధిక్కరించే ఎర్రని కాంతులను విరజిమ్ముతున్న కౌస్తుభ మణితో, జయజయ ధ్వానాలు చేస్తూ అంజలులు ఘటిస్తున్న శివుడు(శర్వుడు)బ్రహ్మ(శతధృతి )దేవేంద్రుడు(శతమన్యు) యముడు (శమనుడు)వరుణుడు(శరధి పాలకుడు)కుబేరుడు(ఐలబిలుడు, ఇలబిల కుమారుడు)మొదలైన దేవతాసమూహంతో ఎట్ట ఎదుట ప్రత్యక్షమైనాడు శ్రీమహావిష్ణువు. యిదే పద్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’ కావ్యములో ఒక్క ఎత్తుగీతిని మార్చి యథాతథంగా పొందుపరచాడు. అలా చేయడంలో ఒక రమ్యమైన, చమత్కారపూర్వకమైన విశేషం ఉన్నది, ఈ వ్యాసకర్త ఉద్దేశంలో. ‘సాహితీవనం’ లో తరువాతి పుష్పమైన ‘ఆముక్తమాల్య కుసుమాపచయం’ చేసేప్పుడు ఆ సరసమైన రహస్యాన్ని తెలుసుకుందాము! పులకించి, స్వామిని ప్రస్తుతి చేశాడు ‘స్వారోచిషుడు’.

జయజయ దానవ కారణ శార్ఙ్గ రథాంగ గదాసి ధరా!
జయజయ చంద్ర దినేంద్రశతాయుత సాంద్ర శరీర మహః ప్రసరా!
జయజయ తామరసోదర సోదర చారుపదోజ్ఘిత గాంగఝరా!
జయజయ కేశవ! కేశినిషూదన! శౌరి! హరీ! దురితాపహరా

దానవుల నాశనానికి కారణములైన శార్జ్గ ధనుస్సును, సుదర్శనచక్రమును, కౌమోదకీ గదను, నందక ఖడ్గమును ధరించినవాడా, పదిలక్షల చంద్రుల, పదిలక్షల సూర్యుల కాంతిని కలిగిన దేహ ప్రభలను వెలువరిస్తున్నవాడా, గంగను ఉద్భవింపజేసిన పద్మములవంటి పాదములు గలవాడా, కేశవా! కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా!శూరవంశములో జనించినవాడా, శ్రీకృష్ణా! శ్రీహరీ, పాపవినాశాకా! నీకు జయము అని స్తుతించాడు. కేశవుడు అంటే ప్రశస్తమైన కేశసౌందర్యము కలిగినవాడు, బ్రహ్మ రుద్రులను కలిగినవాడు అంటే ఉద్భవింపజేసినవాడు అని కూడా అర్ధం. శ్రీమహావిష్ణువు బ్రహ్మను, బ్రహ్మ శివుడిని ఉద్భవింపజేశారు కనుక కేశవుడు. ‘శంభోః పితామహో బ్రహ్మ పితా శక్రాద్యధీశ్వర..’ అని పద్మపురాణం శ్రీమహావిష్ణువును కీర్తించింది. కేశి అనే రాక్షసుడిని చంపిన కారణంగా ‘కేశవుడవని కీర్తింప బడుదువు’ అని హరివంశం చెబ్తుంది! కవిరాజ విరాజితం అనే ఛందస్సులో ఉన్న ఈ ‘స్తోత్రం’ కూడా ‘ఆముక్తమాల్యద’లో కేవలం చివరి పాదంలో ‘శౌరి శరజ్జలజాక్ష హరీ’ అనే చిన్ని మార్పుతో మిగిలినదంతా యథాతథంగా కనబడుతుంది. స్వామి ప్రసన్నుడై, అభీష్ట వరములను కోరుకొమ్మన్నాడు ‘స్వారోచిషుడిని’. దివ్యమైన దశావతార స్తుతులు చేసి, నాకు ఏమీ వద్దు, నీ సాలోక్యాన్ని, నీ లోకాన్ని చేరుకొని నిరంతరమూ నిన్ను సేవించే భాగ్యాన్ని ప్రసాదించు చాలు  అన్నాడు స్వారోచిషుడు. యిందులో కూడా ఒక కిటుకు ఉంది. సాలోక్యం పొందిన తర్వాత, సామీప్యం అంటే ఆయన సమీపములోనే ఉండి సేవ జేయడం, తర్వాత సారూప్యం అంటే ఆయన రూపము వంటి రూపమును సమస్త లక్షణములతో ఆహార్యంతో పొందడం, తర్వాత సాయుజ్యం అంటే ఆయనలో ఐక్యమయ్యే అదృష్టం లభిస్తుంది హరిభక్తులకు వారి సేవాపుణ్యఫల కారణంగా, అంటే అంచెలంచెలుగా లభించే పదవీ ఉన్నతి అన్నమాట! చివరికి లభించే అరుదైన ఫలితాన్ని మొదలే కోరుకుంటే అత్యాశ అవ్వదూ మరి? ‘నీకు సాలోక్యం చివరకు లభిస్తుంది. నీవు ద్వితీయ మనువుగా పాలించడంకోసం, దేవకార్యం నిర్వర్తించడం కోసం జన్మించావు, కనుక ధర్మ బుద్ధితో దేవతలకు, తాపసులకు, ధర్మాచరణకు అనుకూలుడవై ద్వితీయ మనువుగా పాలించి సాలోక్యాన్ని పొందుతావు’ అని పలికి బ్రహ్మాది దేవతల సమక్షంలో స్వారోచిషుడిని మనువుగా పట్టాభిషిక్తుడిని చేసి సమస్త దేవతలూ ఆశీస్సులు అందజేసినతర్వాత అంతర్ధానుడైనాడు శ్రీమహావిష్ణువు. సుభిక్షంగా, శాంతితో, సౌఖ్యంతో ఆనందించేట్లు పరిపాలించి, తర్వాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు స్వారోచిషుడు. ఈ స్వారోచిష మనువు కథను విన్నవారికి, వ్రాసినవారికి, చదివినవారికి ధన ధాన్య సంపద, ఆరోగ్యవంతులైన సత్పుత్ర సంపద లభిస్తుంది, చివరకు అమరత్వము సిద్ధిస్తుంది’ అని పక్షులు జైమిని మహర్షికి బోధించాయి అని సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులకు తెలియజేశాడు అని శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తికి మనుచరిత్రమును  చెప్పాడు పెద్దన. 

కాంతా లతాంతశర! యే
కాంతిక భక్తి ప్రతోషితాంభోధిసుతా
కాంతా! ప్రతాప రవిశశి
కాంతాయిత విమతనృపతి కాంతాహృదయా!

లతాంతము అంటే లతకు చివరన ఉండేది, అంటే పుష్పము, ఆ పుష్పాన్ని బాణంగా కలిగినవాడు మన్మథుడు, కాంతలపాలి మన్మథుడా, ఏకాంత భక్తితో అంబోధిసుత ఐన లక్ష్మికి కాంతుడైన శ్రీహరిని సంతోషింపజేసేవాడా, సూర్యప్రకాశము వంటి ప్రతాపముతో  శత్రు రాజుల భార్యలను (సూర్యప్రకాశము ముందు)శశికాంతమణులవలె చిన్నబుచ్చినవాడా,  వారి భర్తలను సంహరించి వారిని దుఃఖితులను చేసినవాడా, యిది నాచే విరచితమైన ‘స్వారోచిష మనుసంభవము’ లోని హృద్యంబైన పద్యముల ఆరవ ఆశ్వాసము, సకలమూ సంపూర్ణము అని ముగించి, తన కావ్య కన్యకను శ్రీకృష్ణదేవరాయలకు అంకితం చేశాడు పెద్దన.‘సాహితీవనం’ వ్యాస పరంపరలో భాగంగా నా అల్ప ప్రజ్ఞకు అందినమేరకు, సాహిత్య, ఆధ్యాత్మిక విశేషాలను, అక్కడక్కడ మహానుభావులైన పూర్వ విమర్శకుల ఆలోచనలకు  భిన్నంగా స్ఫురించినవాటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాను. వరూధినీ ప్రవరాఖ్యం తర్వాత దాదాపు ప్రతి పద్యాన్ని స్పృశించే ప్రయత్నం చేశాను, ‘మనుచరిత్రం’ అంటే కేవలం వరూధినీ ప్రవరాఖ్యం కాదు అని చెప్పడానికి. ఒకోచోట కొద్దిగా దీర్ఘం ఐనప్పటికీ మూల కథను, కథనాన్ని ఎక్కడా విడిచిపెట్టకుండా, సామాన్య సాహిత్య ప్రియులకు కూడా తేలికగా ఉండేట్లుగా నాకు సాధ్యమైనంతలో ప్రయత్నం చేశాను. ఆంధ్రకవితాపితామహునికి అంజలి ఘటిస్తూ ‘ఆంధ్రసాహితీవనం’లోని ‘మరొక కవనపుష్ప పరీమళాలను, మకరంద మాధుర్యాన్ని మోసుకురావడానికి ప్రయత్నం చేస్తాను వచ్చే సంచికలో!   

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి