మరువలేని సంగతే మరి!...
అమ్మ వెంటే ఉండి,తమ్ముణ్ణి జోకొట్టి నిద్ర పుచ్చడం, అన్నం తినిపించడం, వాడి నోరు తుడిచి నీళ్ళు తాగించడం సహా, అమ్మలాగానే అన్నీ చేసేదాన్ని. .......
నాకన్నా యేడాదిన్నర చిన్నవాడైన తమ్ముడంటే, ఇష్టమే.. అయినాగాని, అమ్మలా పనులు చేయడమే నా ముఖ్య ధ్యేయం..
అమ్మ మాత్రం “అబ్బో మా ఉమి ఎంత మంచిదో. తమ్ముణ్ణి ప్రేమగా చూసుకుంటుంది. పాలు పట్టి నిద్ర పుచ్చుతుంది కూడా,” అని అందరికీ నాగురించి గొప్పగా చెప్పేది.
మూడేళ్ళు నిండాకేమో, నాకు చెవులు కుట్టించింది అమ్మ. బాగా ఏడ్చాను. నొప్పి తెలియకుండా ఏదో ఆయింట్మెంట్ కూడా రాసింది.కాసేపటికి కాస్త తగ్గినట్టు అనిపించినా, ఆ నొప్పికి ఏడ్చి నిద్రపోయాను.
నేనైతే నిద్రపోయాను కానీ, నా పక్కనే అప్పటివరకు పడుకుని నిద్రలేచిన తమ్ముడుకి నా చెవి కున్న కొత్త వస్తువేదో కనబడుంటుంది. దాని సంగతేమిటో చూద్దామన్న ఉద్దేశంతో, దగ్గర చేరి, తన చిటికిన వేలు నా చెవికున్న రింగులోకి వేసి ముందు మెల్లగా, తరువాత కాస్త బలంగా లాగడం మోదలెట్టాడు. ఏడ్చి అలిసిపోయి పడున్న నాకు, కాసేపటికి గాని వాడు చేస్తున్న పనికి నొప్పి తెలియలేదు.. .లేచి ఏడుపు లంకించుకుని గగ్గోలు పెట్టాను కూడా. వాడి వేలు రాదు... నాకేమో నొప్పి. అమ్మ పరుగున వచ్చింది. కాస్త కష్టపడి ఆ రింగు నుండి వాడి వేలు వేరు చేయగలిగింది.
మా పడక గది నుంచి, సిటింగ్ లోకి నాలుగు మెట్లు దిగాలి. ఓ మధ్యాహ్నం తమ్ముడు లేచి మెట్లవైపు నడిచాడు. ఎప్పటిలా నేను ఆ తడవ సాయం చేసి మెట్లు దింపలేదు...పై మెట్టు మీద నిలబడి, ఎలా దిగాలా అని చూస్తున్న వాడికి చేయందించలేదు.వాడు అటు, ఇటూ తచ్చాడి, మరో మెట్టు దిగి, పాపం పడిపోయాడు. కాస్త దెబ్బలు తగిలాయి మరి.....
వాడికి సాయం నిరాకరించాలనే తప్ప, మరేమీ ఆలోచించలేదు నేను....
అప్పుడు వాడికి రెండేళ్ళ వయసు.. నాకు మూడున్నర...నా చెవి గాయపడి తగ్గడానికి చాలా రోజులు పట్టిందని, తమ్ముడు మీద నాకు పీకల వరకు కోపం ఉందన్న సంగతి నాకే తెలియలేదు.....
పాపం’ అంటూ చీమల్ని కూడా తొక్కకుండా నడవాలని ట్రై చేసేదాన్నని గుర్తు మరి.....అలా అంత కోపం పెట్టుకోవడం ఏమిటో!
అదలా ఉంటే, నా ఎడమ చెవికి ఏ కాస్త బరువైన నగ పెట్టినా ముందుకు పడిపోతుండేది. మళ్ళీ చెవి తమ్మిని, సర్జన్ చేత రిపైర్ చెయ్యించాల్సిందే నన్నారు.
నాకేమో జుంకాలు, లోలాకులు పెట్టుకోడం ఇష్టం... వెనక సపోర్ట్ కి వాషర్స్ పెట్టి, చిన్న జుంకాల నుండి, పెద్ద బరువైన నగల వరకు అన్నీ పెట్టాను... సగం జీవితం అలాగే మానేజ్ చేసాను.
ఈ మధ్యనే సర్జన్ చేత చెవి తమ్మి రిపైర్ చేయించాను...కానీ, ఇక ఇప్పుడేమో, పెద్ద పెద్ద జుమ్కాలు, లోలాకులు పెట్టాలన్న షోకు తగ్గింది.
ఏదెలా ఉన్నా, నా తమ్ముణ్ణి నేను ప్రేమగానే చుసానండోయ్!... అప్పటినుండి ఇప్పటి వరకు కూడా వాడికి అండగానే ఉన్నాను....మా అమ్మ అన్నది నిజమే... నాకు వాడంటే ప్రేమే....
నాన్నకి కళారంగమంటే ఉన్న ఆసక్తి, కళలంటే ఉన్న మక్కువ, నా పై ఎంతటి ప్రభావం చూపిందో, మా తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ పై కూడా అంతే ప్రభావం చూపిందనే అనుకుంటాను...
సాంఘి కాలేజీలో బి.కాం (హానర్స్) పూర్తి చేసి, ఎం.కాం చదువుతూ కరాటే లో బ్లాక్బెల్ట్, కాలేజీ బాడీ బిల్డర్ టైటిల్ సాధించాడు.
కొంతకాలం స్మాల్ స్కేల్ బిజినెస్ చేసాడు. ఫార్ములా రేస్ కార్స్, బగ్గీస్ నిర్మించేవాడు. ఇంట్లో తెలియకుండా మాత్రం , మద్రాస్ కార్ రేసెస్ లో పాల్గొనేవాడు కూడా....
అయితే, మరికొద్ది కాలానికి హైదరాబాదులో మొట్టమొదటి HIGH-BAND U-MATIC STUDIO స్థాపించిన ఘనత వాడిదే.. అనతికాలంలోనే రాష్ట్రంలోనే ‘విరాజిత స్టుడియోస్’ ప్రసిద్దికెక్కిన EDITING/RECORDING సంస్థగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి పౌరాణిక సీరియల్ ‘భోజరాజు కథలు’ నిర్మాత గా పాప్యులర్ అయ్యాడు ప్రసాద్. అందులో నటుడుగా పరిచయమయ్యి, అన్నిరంగాలలో పనిచేస్తూ మరెన్నో సీరియల్స్, టెలి ఫిల్మ్స్ తీసి నిర్మాతగా, నటుడుగా స్థిరపడ్డాడు.
స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యలతో పాటు, ఎడిటర్ గా కూడా మారాడు.
‘అసలే పెళ్ళైన వాడిని’ సినిమా నిర్మించి, అందు నటించాడు. రామానాయుడు ఫిల్మ్స్ వారి ‘సర్పయాగం’ లో విలన్ పాత్ర పోషించాడు.
‘ఇదెక్కడైనా ఉందా?” సీరియల్ కి ప్రసాదే నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ప్లే, డైలాగ్ రైటర్.....అడ్వర్టైజ్మెంట్లు, వార్తల ద్వారా, నాకు బాగా గుర్తుండి పోయింది మాత్రం రామాయణం లో సీతా పాత్ర వేసిన ‘రూప గంగూలీ’ తో హీరో/విలన్ గా, ప్రసాద్ నటించిన ‘శశిరేఖా శపథం’....దాసరి నారాయణ గారితో, ‘సమ్మక్క-సారక్క’ చిత్రం మరొకటి..
పదేళ్ళ పాటు అలా ఎన్నో చిత్రాలు, సీరియల్స్ చేసాడు...దుర్యోధనుడి పాత్రతో పాటు మరెన్నో పౌరాణిక పాత్రలు కూడా వేసాడు.
మొత్తానికి మంచి నటుడు అని పేరు పొందాడు... ఉత్తమ నటుడుగా, విలన్ గా, ఫిలిం కౌన్సిల్ అవార్డ్లుల తో పాటు ... నిర్మించిన సీరియల్స్ కి స్టేట్ అవార్డ్స్ కూడా పొందాడు....తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ఫిక్షన్ సీరియల్ కి ‘బంగారు నంది’ గెలుచుకున్నాడు.
డైరక్టర్ర్ మణిశంకర్ మొదటి దర్శకత్వం అవకాశం ప్రసాద్ నిర్మించిన ‘భోజరాజు కథలు’.నటి సౌందర్య హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం మా తమ్ముడిదే... “అసలే పెళ్ళైన వాడిని’....
ఇప్పుడు ప్రసిద్దులైన ఎందరో ఎడిటర్లు, యాంకర్లు, నటులు, సాంకేతిక నిపుణులని టి.వి పరిశ్రమకి తన స్టుడియో ద్వారా, తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ పరిచయం చేసాడన్నది జగమెరిగిన విషయమే....
ప్రస్తుతం ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారం లో ఉన్నాడు నాగేంద్ర ప్రసాద్....
నాట్యభారతీయం పాత భాగాలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
http://www.gotelugu.com/issue81/2175/telugu-columns/natyabharateeyam/