సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam

 శ్రీకృష్ణదేవరాయల విరచితమైన ఆముక్తమాల్యద’ ఆంధ్ర  సారస్వత యుగంలోనే కాదు, అఖిల భారత సారస్వత ఉద్యమాలలోనూ ప్రపంచ సాహిత్య యుగాలలోనూ అత్యున్నత శ్రేణికి చెందినది, శతాబ్దాల తరబడి కోట్లాది ప్రజలను ప్రభావితులను చేసినది, భారతీయ సాహిత్య ఆలోచనా ధోరణులను, తెలుగువారి సాహిత్య, సారస్వత సంపదను సమృద్ధం చేసినది, శ్రీకృష్ణ దేవరాయల యుగం! రాయలు కవి, పండిత, గాయక, కళాకారులను పోషించిన వాడు మాత్రమే కాదు. జీవిత కాలంలో ఒక్క యద్ధములోనూ వోడిపోని మహావీరుడు, నిరంతరమూ యుద్ధరంగంలో బ్రతికినవాడు మాత్రమే కాదు, స్వయంగా గొప్ప సంస్కృత, ఆంధ్ర కావ్యకర్త. గొప్ప సంగీతవిద్వాంసుడు, వీణావాదకుడు, మల్లయుద్ధ వీరుడు, గొప్ప కళాకారుడు, కళా పోషకుడు, కళాభిమాని, మానవతావాది, సంఘసంస్కర్త.

తనచేతిలో పరాజితులైన యితర ధర్మాలవాళ్లకు కూడా వారి వారి ధార్మిక కార్య క్రమాలకు సహకరించిన మహా సంస్కర్త. తాను వీర వైష్ణవుడైనా, శైవులను, బౌద్దులనూ, యితర ఆలోచనా ధోరణులనూ  ఆదరించి ఆశ్రయమిచ్చినవాడు! తను హిందువు ఐనా మసీదులనూ, చర్చిలనూ కట్టించి ఇచ్చినవాడు, తన పాలనలో, అన్ని మతాల, కులాల, ధర్మాల వాళ్ళనూ  సమానంగా ఆదరించినవాడు! ఆంధ్ర సాహిత్యంలోని పంచ మహాకావ్యాలలో నాలుగు రాయల ప్రత్యక్ష ప్రమేయంతో వెలసినవే. అందులో ఒకటి ఆముక్త మాల్యదను  ఆయన స్వయంగా రచిస్తే, రెండవది మనుచరిత్రమును ఆయన ఇష్టసఖుడు, గురుసముడు ఐన అల్లసాని పెద్దన రచిస్తే, మూడవది ఐన పాండురంగ మహత్యమును ఆయన ఆస్థాన కవి ఐన తెనాలి రామకృష్ణుడు రచించాడు, నాలుగవది ఐన వసుచరిత్రమును అల్లసాని పెద్దన శిష్యుడు ఐన భట్టుమూర్తి అని పిలువబడిన రామరాజ భూషణుడు రచించాడు.

రామరాజ భూషణుడు రాయల సామ్రాజ్య ఉచ్చ స్థితిలో పెద్దన శిష్యరికం చేసిన వాడు, భువన విజయ సాహిత్య  మధురిమలను తన వసంత గానముగా మలుచుకున్న వాడు! ఐదవది ఐన శృంగార నైషధం మాత్రం శ్రీనాధ మహాకవి రచించినది, అది స్వతంత్ర కావ్యం కాదు! సంస్కృత కావ్యానికి అనువాదం మాత్రమే! ఈ ఒక్క సత్యం చాలు ఆంధ్ర సాహిత్యానికి ఎల్లలులేని సేవ చేసిన వాడు శ్రీకృష్ణ దేవరాయలు అని రుజువుచేయడానికి!

తన  తనువృత్తి  సామ్రాజ్య రక్షణంగా, మనః ప్రవృత్తి సరస సంగీత సాహిత్య సాంస్కృతిక సీమల రసవీక్షణంగా బ్రతికినవాడు రాయలు. తన శరీరాన్ని సమర రంగానికీ, తన మనసునూ, ఆత్మనూ సంగిత, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు అంకితం చేసినవాడు రాయలు! కరవాలముతో కన్న  ఘంటముతోనే తాను చిరంజీవిని  కాగలనని, కావలెనని తలచినవాడు రాయలు. సామ్రాజ్య సీమలను సంరక్షించు సైకునికన్న  సాంస్కృతిక సీమలను పరిరక్షించు కళాకారుడు శాశ్వతునిగా చరిత్రలో నిలిచిపోగలడు అని నమ్మినవాడు రాయలు! రాజులు  వెళ్లిపోతారు కానీ, కవిరాజులు శాశ్వతులై నిలిచి పోతారు చరిత్రలో, ప్రజల హృదయాలలో అని నమ్మినవాడు రాయలు! సమాజశాంతికి సవ్యమైన పరిపాలన, సభ్యమైన నడవడిక ఎంత ముఖ్యములో స్వచ్చమైన, స్వేచ్చయైన సాహిత్య, సంగీత సాంస్కృతిక సర్వతోముఖ వికాసమూ అంతే ముఖ్యము అని నమ్మి, తన పరిపాలనలో, తన యుగంలో ఆచరించి, చూపించినవాడు, ప్రపంచచరిత్రలో అత్యంత గొప్పచక్రవర్తులలో నిశ్చయంగా ఒకడు శ్రీ కృష్ణ దేవరాయలు!

స్వతంత్ర  భావాలకు, రసభావాలకు, సరసభావాలకు పురిటిల్లు ఐన భావ కవితోద్యమ రసధ్వని, 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు?' అని పొగరేసిన, తల ఎగరేసిన, తలపుల పొగేసిన కృష్ణ శాస్త్రి వంటి మహానుభావుడు కూడా 'అప్పుడు పుట్టివుంటే’ అనే కథలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో పుట్టివుంటే ఎంత బావుండేది! పుడితే అప్పుడు నేను పెద్దన గానే పుట్టివుంటాను' అని కలలు గన్నాడు.. ఇంతకన్నా రాయల రసరమ్యమయ మూర్తికి నిదర్శనము ఏం కావాలి? రాయలను ఆదరించడం అంటే అమ్మను ఆదరించడం, అప్పచెల్లెళ్ళను అభిమానించడం, అన్నదమ్ములను అనురాగంతో సమీపించడం! రాయలకవిత్వరస వీక్షణం చేయడం అంటే అమ్మ తెలుగు భాష పోయిన హొయలను, పలికిన గమకాలను, కులికిన లయలను సంతోషంచెమర్చిన కళ్ళతో చూడడం! అంతే కాదు, ఆదికవి నన్నయగారి సంస్కృతశ్లోకంతో మొదలైన ఆంధ్రసారస్వతంలో ఆనాటి పదకొండవ శతాబ్దినుండి నేటి వరకూ ఆంధ్రభాషకు అత్యున్నత స్థాయినిచ్చిన వర్ణనను శ్రీకృష్ణ దేవ రాయలే చేశాడు, వేరెవరూ చేయలేదు! దేవతలలో వెంకటేశ్వరుడికి సమానమైన దైవం కానీ, భాషలలో తెలుగు భాషకు  సమానమైన భాష కానీ లేదు అని ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు! ముందు ముందు వివరంగా ఈ వ్యాససంపుటిలో ఈ సత్యాన్ని మనం దర్శించవచ్చు! విశేషించి తెలుగు నేలపై, తెలుగు  భాషపై, తెలుగు ప్రజలపై అత్యంత అనురాగాన్ని కలిగినవాడు  శ్రీ కృష్ణ దేవరాయలు.

తన అధికారులుగా, ప్రతినిధులుగా తెలుగువారినే నియమించుకుని,  తెలుగు వారి సర్వతోముఖాభివ్రుద్ధికి  నిరంతరమూ పెద్ద పీట వేసినవాడు! ఆముక్తమాల్యద రాయల సర్వతోముఖ ప్రతిభకు, పాండిత్యానికి, చమత్క్రుతికి, పరిశీలనాదృష్టికీ, మానవతావాదానికీ అద్భుతమైన దర్పణం! వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రం, సంగీత శాస్త్రం, పాక శాస్త్రం, ఒకటేమిటి సమస్త శాస్త్రాలలో తన ప్రతిభకు గీటురాయిగా ఆముక్త మాల్యదను  రాయలు మలిచాడు!

ఆరు  ఆశ్వాసాల ఆముక్త మాల్యదా ప్రబంధంలో వున్న వేల కొలదీ గద్య పద్యాలను సమీక్షించడం ఈ వ్యాస ఉద్దేశం కాదు. ఆరు ఆశ్వాసాల సంక్షిప్త  కథనూ, ముఖ్యమైన సన్నివేశాలనూ, శ్రీకృష్ణ దేవరాయల సర్వతోముఖ ప్రతిభనూ వెల్లడించే పద్యాలనూ విమర్శనాత్మకంగా పరిశీలించడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం. ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘ రత్నములైన  ప్రబంధములలో మణిపూస వంటి , కొలికిపూస వంటి ఆముక్త మాల్యదా ప్రబంధమునకే కాక, రాయల వ్యక్తిత్వానికీ దర్పణం పట్టడం ఈ వ్యాస కర్త యొక్క లక్ష్యం. తద్వారా ఆంధ్రసాహిత్య రస గ్రహణకు, విమర్శకూ మరొక పర్యాయం ఆంధ్ర సాహిత్య ప్రియులను సంసిద్ధులను చేయడం ఈ వ్యాసం వెనుక వున్న మహదాశయం!

సాహితీ ప్రియులు ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి అభిమానిస్తారని నా  ఆకాంక్ష. ఆముక్తమాల్యద - పూర్వభూమిక - సంక్షిప్తకథా పరిచయం ఆముక్త మాల్యద తెలుగు ప్రబంధములలో కెల్లా అద్భుతమైన ఋతు వర్ణనలు, పాత్ర చిత్రణమూ కల ప్రబంధమని ప్రశంసింపబడినది. ఆముక్తము అంటే విడువ బడినది, అంటే ధరించి విడిచిపెట్టబడినది అనే అన్వయంలో, ధరించి విడిచిపెట్టిన 'మాల్యము' అంటే మాల, పూమాల ను 'ద' అంటే ఇచ్చినది..అంటే తను ధరించి విడిచిపెట్టిన పూమాలను ఇచ్చినది, ఇంత అర్ధాన్నీ ఇచ్చే పేరును తెలుగులో అత్యుత్తమమైన వాటిలో ఒకటని చెప్పబడిన ప్రబంధానికి పెట్టాడు శ్రీకృష్ణ దేవరాయలు. పరమాత్ముడికి అలంకరణంగా తన తండ్రి ఐన విష్ణు చిత్తుడు నిత్యమూ సమర్పించే పూమాలను తన తండ్రికి తెలియకుండా తాను ధరించి (అంటే ఒకరకంగా ఎంగిలి చేసి..) ఇచ్చిన గోదాదేవి ఈ ప్రబంధములోని నాయిక. ఆమెయే ఆముక్త మాల్యద.

''శూడి క్కొడుత్తాళ్'' అనే తమిళములోని పదం, ఆముక్త మాల్యద అనే పదానికి సరి ఐన పదం. 'శూడి క్కొడుత్తాళ్ ' అంటే ధరించి ఇచ్చినది అని అర్ధమట! అందుకే గోదాదేవి రెండు మాలలను స్వామికి సమర్పించిందని తమిళ సారస్వతములోని  గోదాదేవి స్తుతులు తెల్పుతాయి( పాడిక్కొడుత్తాళ్ నర్పామాలై, పూమాలై శూడిక్కొడుత్తాలైచ్చొళ్ శూడిక్కొడుత్త శుడర్కొడియే ..) ఆ రెండూ, ఒకటి  పామాల, అంటే పాటల మాల, అంటే ఆమె తను చేసిన వ్రతంలో భాగంగా ప్రతి రోజూ రోజుకొక్కటి చొప్పున మాసం కాలం విరచించిన ముప్పై పాశురముల అంటే పాటల మాల ఐతే, రెండవది పూమాల అంటే తను ధరించి విడిచి, ఎంగిలి చేసి స్వామికి ఇచ్చిన పుష్పమాల! ఆముక్త మాల్యదా ప్రబంధానికి 'విష్ణు చిత్తీయము'  అనే రెండవ పేరు కూడా వున్నది. నాయిక ఐన గోదాదేవితండ్రి విష్ణుచిత్తులు ఇందులో ప్రధానపాత్ర కనుక, ఆయన నడవడిని, శీలాన్ని, విజయాన్ని ఇందులో వర్ణించడం జరిగింది కనుక దీనికి విష్ణు చిత్తీయము అనికూడా పేరు!

విష్ణుచిత్తులు వైష్ణవ  ధర్మ ప్రవర్తకులలో గురువులైన  పన్నిద్దరు ఆళ్వారులు అని పిలువబడే పన్నెండుమంది మహానుభావులలో శ్రేష్టుడు, అత్యంత భక్తుడు అని ఆయనను 'పెరియాళ్వారు' అంటే పెద్ద ఆళ్వారు అని పిలుస్తారు! ఆళ్వారు అంటే మహాభక్తుడు అని అర్థం. మహా విష్ణు భక్తులైన వైష్ణవ ధర్మ గురువులలో ఈయన పెద్ద అంటే గొప్పవాడు కనుక ఈయనకు మాత్రమే ఆ పేరు. ఆ పన్నెండు మంది ఆళ్వారులలో ఒకతే స్త్రీ, ఆమెయే గోదాదేవి. పన్నెండు మంది ఆళ్వారులలో శ్రేష్టుడు ఐన విష్ణుచిత్తుడు, ఏకైక  స్త్రీ మూర్తి ఐన గోదాదేవి ఈ ప్రబంధములోని  ప్రధాన పాత్రలు కనుక, పరమ వైష్ణవుడు, విశిష్టాద్వైత మత అవలంబి ఐన శ్రీకృష్ణ దేవరాయలు దీని కర్త కనుక ద్రావిడ గురు పరంపర ప్రభావము అనే గ్రంధము నుండి ప్రధాన కధను రాయలు ఈ ప్రబంధం కోసం స్వీకరించి స్వేచ్చగా, సందర్భోచితంగా కొన్ని మార్పులను చేసి, ప్రధాన కధతో జోడించాడు! విష్ణుచిత్తులు  నేటి తమిళనాడులోనిది, ఆనాటి పాండ్య  ప్రభువుల ఏలుబడిలోనిది ఐన శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో  జన్మించారు.

ఈ గ్రామానికే ధన్వినవ్య పురం అనే పేరుకూడా ఉంది, వైష్ణవ సంప్రదాయంలో. ఆ గ్రామంలో వటపత్రశాయి ఐన మహావిష్ణువు దేవాలయం ఉంది .ఆ స్వామిని ఆ సంప్రదాయంలో వడపెరుంగోయిలాన్ అని పిలుస్తారు. ఆ ఆలయ పూజారి ఐన ముకుందాచార్యులు, పద్మ అనే దంపతులకు జన్మించిన బాలకుడు విశేష జ్ఞానము, పాండిత్యమూ లేకున్నప్పటికీ, అపరిమితమైన భక్తి, సాత్విక గుణం కలిగినవాడు. ఆయనే విష్ణుచిత్తులు. యజుశ్శాఖాధ్యాయి, బోధాయన సూత్ర అనుయాయి. తన తండ్రి వలెనే ఆయన కూడా ఆ వటపత్ర శాయిని  నిత్యమూ పరమ భక్తితో అర్చన చేస్తుండేవారు. తమ తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన సారవంతమైన భూమిలో ఒక గొప్ప ఉద్యానవనమును పోషిస్తూ ఆ ఫల, పుష్పములచే స్వామిని అర్చిస్తూ..తమ తోటలోని తులసీ దళములనూ, పుష్పములనూ మాలికలల్లి నిత్యమూ స్వామికి అలంకరించి అతి నిరాడంబరమైన జీవనాన్ని గడిపే ఆ దంపతులకు సంతానం లేని కొరత మాత్రమే ఉండేది.

ఒకనాడు ఎప్పటిలాగే తన తోటలోని తులసీ దళములను సేకరించడానికి  వెళ్ళిన విష్ణుచిత్తుల వారికి తోటలో ఒక అందమైన స్త్రీ శిశువు లభించింది. ఆవిడకు 'గోద'యని  (తమిళంలో 'ఆండాళ్' అంటే లక్ష్మి కనుక ఆండాళ్  అని వారు పిలుచుకుంటారు) పేరుబెట్టి పెంచుకోవడం ప్రారంభించారు ఆ దంపతులు. విష్ణుచిత్తులు తన ఆరాధ్యదైవమైన వడ పెరుంగోయిలాన్  ఆజ్ఞపై, ఆ పాండ్యదేశ  మహారాజు ఐన మత్స్య ధ్వజుడి కొలువుకు వెళ్లి మహారాజుకు వైష్ణవ  తత్త్వాన్ని  బోధించి, మిగిలిన పండితులను జయించి, శ్రీ మహావిష్ణువే శ్రేష్టుడు అని నిరూపించి ఆ మత్స్య ధ్వజుడిని వైష్ణవునిగా మారుస్తాడు. మత్స్య ధ్వజుని అసలు పేరు  వల్లభదేవుడు. ఈ వల్లభదేవుడు అంతకు క్రితం ఒక వేశ్యకు లోలుడై నిత్యమూ ఆ వేశ్యతో కామ భాగాలలో తేలి ఆనందించే వాడు. ఒక రోజు రాత్రి ఎప్పటిలాగే ముసుగువేసుకుని ఆ వేశ్యయింటికి వెడుతున్న  రాజుకు ఒక యింటిఅరుగుమీద తోడి పండితులతో సంభాషణ  చేస్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన ఒక శ్లోకము వినిపిస్తుంది. '' వానాకాలపు నాలుగు నెలల కొరకు మిగిలిన ఎనిమిది నెలలో ఆహార ధాన్యములను సమకూర్చుకొనవలెను, రాత్రిళ్ళు అవసరమయే వాటికోసం పగటిపూటనే ప్రయత్నము చేసి సిద్ధము చేసుకొనవలెను, వృద్ధాప్యము కొరకు యవ్వనములోనే తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను, పరలోకములోని జీవనము కొరకు అంటే దేహానంతరము దుర్గతులు పొందకుండా ఉండవలెను అంటే ఈ జన్మలోనే మంచి కర్మములను చేయవలెను''యిదీ ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన శ్లోక తాత్పర్యము. ఈ శ్లోకాన్ని విన్న రాజుకు ఆలోచన, పరివర్తన కలిగి, ఇంత కాలమూ తను సమయాన్ని, యవ్వనాన్ని, ధనాన్ని వెచ్చించి తుచ్ఛమైన భోగముల కొరకు ప్రాకులాడినందుకు పశ్చాత్తాపము కలిగి, వెంటనే తన భవనానికి వెళ్లి, మర్నాడు రాజగురువుతో, యితర ముఖ్యులతో సభ దీర్చి తనను దయజూసి దరిజేర్చ గలిగిన దైవము ఎవరు అని నిర్ణయింపగోరి తన కొలువుకూటములో ఒక స్తంభమునకు బంగారు కాసుల మూటను వ్రేలాడ దీయించి, తనకు తగిన ఆధ్యాత్మిక ఉపదేశమును, దైవమును చూపించిన వారికి ఆ బంగారు నాణెముల మూటను కానుకగా ప్రకటించాడు!

విష్ణుచిత్తులకు సాక్షాత్కరించిన వటపత్ర శాయి రాజ సభకు వెళ్లి అక్కడి పండితులతో వాదించి అన్య మతములను నిరసించి, వోడించి, విష్ణు మతమును స్థాపించి, రాజును వైష్ణవునిగా చేయుమని ఆజ్ఞాపించగా, నేను పండితుడను కాను, కేవలము నీ సేవలు తప్ప అన్యము తెలియని వాడిని అక్కడికి పంపి ఎందుకు నా పరాజయ, పరాభవాలకు నీవు అప్రదిష్టపాలుగావడం  అని అన్న విష్ణుచిత్తునకు నేనున్నానుగా, నీకేమీ భయము లేదు, నా ఆజ్ఞను దిక్కరించక నీవు వెళ్లి వాదించుమయ్యా , అంతా నేను చూసుకుంటాను అనగా, వల్లెయని విష్ణుచిత్తులు రాజసభకు వెళ్లి, అక్కడి సర్వమతప్రతినిధులను తన పాండిత్య, జ్ఞాన, తార్కిక ప్రతిభ చేత అప్రతిభులను జేసి, శ్రీమహావిష్ణువే పరదైవము అని నిరూపించగా  స్తంభమునకు వ్రేలాడదీసిన ధనపుసంచి ముడి తెగి..తనంత  తానుగా నేలరాలి, విష్ణుచిత్త విజయము రూడియై, మహారాజు ఆయనకు శిష్యుడై ఆయనను సత్కరించి పంపుతాడు.

ఆయనకు భగవద్దత్తముగా దొరికిన బాలిక గోదాదేవి తన తండ్రి ఐన విష్ణు చిత్తులు స్వామికి అలంకరించుటకు సిద్ధము జేసే పూలమాలికలనూ, తులసీమాలికలనూ తనతండ్రి చూడకుండా ధరించి పరవశించి పోతూ మరలా ఆ మాలలను ఏమీ ఎరుగనట్లు యథాస్థానములో నుంచేది. ఆవిషయము తెలియని ఆమెతండ్రి ఆమాలలనే  స్వామికి అలంకరించేవాడు. ఒకనాడు విష్ణుచిత్తులవారు స్వామికి సిద్ధం చేసిన మాలికను తనకూతురు ధరించడం చూసి, కుమార్తెను మందలించి, ఆరోజు ఆ మాలను స్వామికి అలంకరించడం మాని, మిగిలిన పూజను యథావిధిగా చేసి  నిదురించగా, స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, ఆమె తన ఆంతరంగిక భక్తురాలనియూ, ఆమె ధరించి ఇచ్చిన మాల తనకు అత్యంత ప్రీతికరమైనది  అనీ తెలిపి, ఆమె కారణజన్మురాలని తెల్పుతాడు. దిన దిన ప్రవర్ధమానయై అతిలోక లావణ్యవతియై  పెరుగుతూ, బాల్యమునుండే విష్ణు భక్తి గలదియై, తనతోనే పెరుగుతున్న విష్ణుభక్తి చేత మహావిష్ణువును ఆరాధించి, ఆయననుతప్ప అన్యులను వివాహమాడనని నిశ్చయించుకుని, స్వామిమీద విరహముతో కృశించి పోవుచూ చివరికి ఆత్మత్యాగము చేయుటకైననూ నిశ్చయించుకొనగా ఆమె చెలికత్తెలు వారించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అంశతో జనించిన కారణ జన్మురాలని, పూర్వ జన్మలో గోదాదేవియే సత్యభామయనీ, తాము నాగకన్యలమనీ , క్రితంజన్మలో తామే గోపికలుగా వున్నప్పుడు, కాత్యాయనీ వ్రతముచేసి శ్రీ కృష్ణుని భర్తగా  పొందినట్లే ఈ జన్మలోనూ గోద ఆ వ్రతమును ఆచరించినట్లయితే స్వామిని పొందవచ్చు అని తెలుపుతారు.  వారి ఉపదేశానుసారము మార్గశిర మాసములో ధనుస్సంక్రమణంతో మొదలై మాసం సాగే ధనుర్మాసములో గోదాదేవి నెలరోజులు కాత్యాయనీ వ్రతమును చేసి, ఆ నెలరోజుల వ్రతములో తనను గోపకన్యగా, తన చెలికత్తెలను గోపకన్యలుగా, తన విల్లిపుత్తూరును నందగోకులంగా తమ నాధుడు శ్రీకృష్ణుని పొందడం కొరకు వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి, ప్రతి రోజూ ఒక దివ్యమైన గేయాన్ని రచించి స్వామికి వినిపించేది.

ఈ వ్రతనిష్ఠలతో, ఉపవాసములతో, విరహముతో నానాటికీ చిక్కి శల్యమైపోయిన కుమార్తె స్థితినీ, ఆమె మన్మధావస్థనూ అమాయకుడైన విష్ణుచిత్తుడు గుర్తించక తనస్వామితో వాపోతాడు. స్వామి ' ఈమె నన్నే ఆరాధించుచున్నది, నాకొరకే ఈ అవస్థ యంతయూ సమస్త భక్తి విధానములలోనూ గాన కైంకర్యము చేత నేను అత్యంత తృప్తి పొందుతాను! నిష్కల్మషమైన భక్తి చేత నన్ను పొందుటకు  ఎవ్వరికైననూ ఏ విధముగా పొందుటకైననూ  అడ్డంకులు లేవు, రావు'  అని దానికి ఒక ఉదాహరణముగా ఒక పరమభక్తుడు ఐన మాలదాసరి కథను చెప్తాడు విష్ణు చిత్తులవారికి. ఒక మాలదాసరి నిత్యమూ మంగళ కైశికీ రాగంలో కీర్తనలను రచించి స్వామికి మేలుకొలుపులు పాడి వినిపించి సేవించేవాడు. ఒకనాటి అర్ధరాత్రంలో ఒక అడవిపిల్లి కోళ్ళగుడిశెలో దూరగా కోళ్ళు భయంతో అరవడంతో ఆ కోడికూతలకు తెల్లవారినదని  భ్రమచేత, ఆ మాలదాసరి యింటినుండి బయలుదేరి చీకటిలో దారి తప్పి, ఒక బ్రహ్మరాక్షసునకు చిక్కి, వానికి ఆహారము కాబోయి, వానిని బ్రతిమిలాడి, ప్రాధేయపడి, స్వామికి ఆ రోజుకూడా మేలుకొలుపు పాడి వచ్చి ఆహారము నౌతాను అని అతి కష్టము మీద ఆ బ్రహ్మరాక్షసుని ఒప్పించి, అదే ప్రకారముగా స్వామికి గాన కైంకర్యము చేసి, వచ్చి, తనను చంపి తినవచ్చునని చెప్పగా, ఆ బ్రహ్మరాక్షసుడు ఆ మాలదాసరి సత్య నిష్థకు ఆశ్చర్యపడి, ఆతని ఔన్నత్యమును గుర్తించి, పాదములపైబడి, తను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ యువకుడననీ భ్రష్టుడై, దుష్టకర్మల కారణంగా ఈ జన్మ వచ్చినదనీ చెప్పి మాలదాసరిని తన గాన కైంకర్య ఫలితాన్ని తనకు ధార పోసి తన బ్రహ్మరాక్షస రూపమును  తొలగించమని వేడుకొని, బ్రతిమిలాడి,  ప్రాధేయపడగా, ఎట్టకేలకు ఆ నాటి గాన కైంకర్య ఫలితాన్ని మాత్రము ధార పోసెదనని  ఆ మాలదాసరి పలికి,  ఆ గాన ఫలితాన్ని సమర్పించగా,  బ్రహ్మరాక్షసుడికి  పూర్వ రూపము, పాండిత్యమూ వచ్చి, మాల దాసరి పాదములపై బడి దాసరిని తన గురువుగా స్తుతించి, శ్రీ రంగములో స్వామికీ, గోదాదేవికీ కళ్యాణము జరుగ బోవుచున్నదని పలికి దాసరితో గూడి శ్రీ రంగమునకు చేరుకుంటాడు.

ఈ కథను వినిపించి, గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొనివచ్చి సమస్త లాంఛనములతో  తనకు ఇల్లాలిని చేయమని చెప్పి స్వామి విష్ణుచిత్తునితో  పలుకగా అట్లే యని విష్ణుచిత్తుడు గోదాదేవిని స్వామికి కన్యాదానం చేయగా, గోదాదేవి శ్రీ రంగని పెండ్లాడి ఆయనలో ఐక్యమై  పోతుంది. యిది సంక్షిప్తంగా గోదాకళ్యాణ కథ. ప్రధానంగా 'గురుపరంపరా ప్రభావము'  అనే వైష్ణవ గురువుల చరిత్ర ఐన ప్రాచీన గ్రంథమునుండి గ్రహించిన మూల కథతో విష్ణు పురాణము, వరాహ పురాణము, అనేకములైన ఉపనిషత్తులు, వేదములు, ధార్మిక గ్రంధములనుండి గ్రహించిన అనేక వివరములతో, అనేక శాస్త్రముల మర్మములతో, తన లోక పరిశీలనా పాటవంతో, కథన వైశిష్ట్యంతో సాటిలేని ప్రబంధముగా ఆముక్తమాల్యదను  శ్రీకృష్ణదేవరాయలు తీర్చిదిద్దాడు. శ్రీకృష్ణదేవరాయల అంతటి పరిశీలనాదృష్టి కలిగిన, సన్నివేశముల, పాత్రల చిత్రణ చేసిన కవులు చాలా కొద్దిమంది మాత్రమే కన్పిస్తారు ప్రబంధ యుగంలో కూడా. ఆ కొద్దిమంది కన్నా కూడా ఒక పిసరు ఎక్కువ లోకానుభవము వివిధ శాస్త్ర  పరిచయము రాయలకే వున్నాయి అనిపిస్తుంది! ఇది కేవలం ఒక సంక్షిప్త కథ మాత్రమే. రాయలు తన రచనకు స్వీకరించిన వాటిలోనుండి మార్పులతో, చేర్పులతో,  నూతన వ్యాఖ్యానముతో జోడించి ఆముక్తమాల్యదలో ఇచ్చాడు. ఒక్కొక్క ఆశ్వాసములోని ప్రసిద్ధమైన, ముఖ్య పద్యాలను, సన్నివేశాలను తెలుసుకునే సందర్భములో ఈ వివరాలను మనం పూర్తిగా తెలుసుకుందాము.

(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వర ప్రసాదరావు

 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి