శ్రీ కమనీయ హారమణి చెన్నుగ దానును కౌస్తుభంబునం
దా కమలావధూటియు నుదారత దోప పరస్పరాత్మలం
దాకలితంబులైన తమ యాకృతు లచ్ఛత పైకి దోచియ
స్తోకతనందు దోచెనన శోభిలు వేంకట భర్త గొల్చెదన్
(శ్రీ కమనీయ హారమణిన్ చెన్నుగ తానును కౌస్తుభంభునందు ఆ కమలావధూటియున్ఉదారతన్ తోపన్ ) లక్ష్మీదేవికంఠంములో ఉన్న కమనీయమైన హారములోని మణిలో అందంగా తను,తన కంఠంలోని కౌస్తుభమునందు ఆ లక్ష్మీదేవి మిక్కిలి అందంగా ప్రతిబింబించగా (పరస్పర ఆత్మలందున్ఆకలితంబులైన తమ ఆకృతుల్ అచ్ఛతన్ పైకిన్ తోపన్)పరస్పరము ఒకరి మనసులో ఒకరు నిలిచినతమతమ ఆకారములు శరీరస్వచ్ఛతచేత బయటకు కనిపించగా(అస్తోకతన్ అందున్ తోచెన్ అన)ఎక్కువగా పరస్పరం ఒకరి హారములో మరొకరు కనిపించారేమో అన్నట్లుగా వెలుగొందే వేంకటాచలపతిని కొలిచెదను.ఇది ఆముక్తమాల్యదా ప్రబంధంలోని ప్రథమపద్యం. తొలిపద్యంలోనే అద్భుతమైన విశేషాలను చూపించాడు రాయలు. మొదటివిశేషము తన స్వతంత్రభావావేశము, రీతి. సాధరణముగా శార్దూలవృత్తముతో ప్రబంధాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. ప్రసిద్ధ ప్రబంధకారులందరూ అలాగే చేశారు.
'శ్రీవక్షోజకురంగనాభ మెదపై చెన్నొంద'అని పెద్దన తెలుగులో తొలి స్వతంత్రకావ్యమైన, ప్రబంధమైన మనుచరిత్రను, 'శ్రీరామా కుచమండలీమృగమద శ్రీగంధసంవాసిత స్ఫారోదార భుజాంతరుండు' అని శ్రీనాధుడు శృంగార నైషధాన్ని, 'శ్రీ భూపుత్రి వివాహవేల నిజమంజీరాగ్ర రత్న స్వలీలాభివ్యక్తిన్' అని భట్టుమూర్తి వసుచరిత్రనూ, 'శ్రీకాంతామణి గన్మొరంగి మది ధాత్రిన్మంచినన్'అని తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యాన్నీ ప్రారంభించారు, ఒక ఉదాహరణ కోసం, మరొక నాలుగుతెలుగుమహాకావ్యాలను స్మరించడంకోసం ఈ వివరం. రాయలుమాత్రం ఉత్పలమాలావృత్తంతో ప్రారంభంచేశాడు.సరే, ఉత్పలమాలతోనే ఎందుకు అనేది యింకా విశేషం. గ్రంథకథ మాలతో ముడిపడివుంది కనుక, గ్రంథనామములోనే మాలవున్నది కనుక, ఒక మాలనుసూచించడంకోసము అలాచేశాడు అనుకోడానికి , కేవలంఅదే అయితే చంపకమాలా వృత్తంకూడా సరి ఐనదే కావొచ్చు కదా, చంపకమాలా వృత్తం ఎందుకు వాడలేదుఅంటే ఉద్దేశ పూర్వకంగానే అని నా ఉద్దేశం.'లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతి , ఋషీనాం పునరాద్యానాం వాచమర్థో నుధావతి' అని ఒకగొప్పమాట అన్నాడు భవభూతి 'ఉత్తర రామచరితము' అనే గొప్ప నాటకంలో, అంటే , లౌకికులైన సాధువులవాక్కులకు అర్థం అనుసరించి వస్తుంది, అంటే వారి వాక్కులు అర్ధవంతములుగా ప్రయోజన పూర్వకములుగావుంటాయి, కానీ , ఋషులకు అర్ధములను బట్టి వాక్కు తనంత తానుగా అనుసరించి వస్తుంది, అంటే వారిమనసులోని అర్ధాన్ని అనుసరించి పలుకులు తమంత తాముగా మేమంటే మేము అని వస్తాయి,
సామాన్యకవిపండితులలాగా వాక్కులకోసం వెదుక్కునే, పలుకులకోసం పలవరించే పరిస్థితి ఉండదు. వాక్కులే వారిబంట్లవలె ఎదురుచూస్తూంటాయి వారిమనసులోని అర్ధానికి అక్షరరూపాన్ని ఇవ్వడంకోసం. మంచి ఉపన్యాసకుల పలుకులకు మంచి అర్థాలు వస్తాయి, మహా వక్తలకు మంచి అర్థాలనిచ్చే పలుకులు పరుగెత్తివస్తాయి, మనకు తెలిసినదే కదా. శ్రీకృష్ణదేవరాయలు ఋషితుల్యుడు. సందేహమే లేదు.ఉత్పలమంటే కలువ. నీలోత్పలమంటే నల్లకలువ. కలువలలో శ్రేష్ఠమైనది నల్లకలువ. ఇందులో నాయికవరించినది నల్లనయ్యను. కనుక నీలోత్పలం స్ఫురణకు వచ్చింది కనుక ఉత్పలమాల నీలోత్పలమాలఐపోయిందిక్కడ. మరొక విశేషం కూడా వున్నది. మన్మధుడిని పంచబాణుడు అన్నారు భారతీయలు.ఆయనబాణాలు పూలే. ఆ ఐదు పూలబాణాలు అరవిందము( పద్మము, తామరపూవు ) అశోకము(అశోక పుష్పము) మామిడి, నవమల్లిక, నల్లకలువ. ఈ ఐదుపూలకూ మాదనము(కామము) ఉన్మాదము,సంతాపనము(దు:ఖము) సంశోణము(శుష్కించిపోవడం) నిశ్చేష్ఠాకరణము అనే ఐదు విశిష్ఠగుణాలున్నాయి.ఈ ఐదుగుణాలూ ఒకటొకటిగా ప్రారంభమై, క్రమ క్రమంగా తర్వాతిదాన్ని, ఆతర్వాతిదాన్ని కలుపుకుంటూపోయి చివరికి ఐదవది ఐన నిశ్చేష్ఠగా పరిణమిస్తాయి! అంటే చివరిదాంట్లో అంతకుముందు చెప్పిన నాలుగు గుణాలూ కలిసిపోయి ఉంటాయి అన్నమాట! అంటే, వలచినవారి మీద మదనభావము చిగురించి, అది తీరకుంటే ఉన్మాదమైపోయి, ఆ బాధ తీవ్ర దు:ఖానికి దారితీసి, ఆ వలచినవారికోసం నిద్రాహారాలు మానిశుష్కించి, చివరికి చేష్టలుడిగి స్తంభించిపోవడం లేదా జడత్వం దాపురించడం జరుగుతాయి. నల్లనయ్యప్రేమలోపడి, ఈ అవస్థలను అన్నింటినీ అనుభవించి చివరికి నిశ్చేష్ఠ ఐపోయింది గోదాదేవి, ఇక ఏమీచేయడానికి చేతకాని స్థితిలో చివరికి ఆత్మత్యాగానికి కూడా సిద్ధమయ్యింది, అంతే గాదు, తన ప్రేమ,మోహ, కామపాశాల్లో బంధించడం కోసం సాక్షాత్తూ ఆ నల్లనయ్యపై ఇన్నిబాణాలూ ప్రయోగించి ఐదవబాణంతోఆయన్ని కూడా నిశ్చేష్ఠావస్థకు గురిచేసింది.
లోకంలో సహజంగా పిల్లనిస్తామని వెళ్తారు పిల్ల తల్లిదండ్రులు,యిక్కడమాత్రం కథ తారుమారై పిల్లనివ్వమని లోకేశ్వరుడే పిల్లతండ్రిని అడిగి బ్రతిమిలాడేవరకూ వెళ్ళిందికథచివరికి. నీలోత్పలానికి ఇంత కథ వుంది కనుక, నీలోత్పల సూచనకోసం, ఉత్పలమాలను ఉద్దేశపూర్వకంగారాయలు తన ప్రారంభపద్యానికి ఎన్నుకున్నాడు!ప్రహ్లాదుడు కూడా శ్రీహరిని తీవ్రంగా ఆరాధించి, ప్రేమించి, ఏకాంతంలో రోదించేవాడు, మైమరచిపోయి గానంచేశేవాడు, శ్రీ హరి తప్ప వేరే ఏమున్నది అని సన్నగా నవ్వుకునే వాడు, శ్రీ హరి అనే పెన్నిధి దొరికిందనిఎగిరి గంతులు వేశే వాడు ఒకోసారి, చివరికి 'ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలితనేత్రుడై ఒక చోట నిలిచి వూరకుండు' అన్నాడు పోతన మహానుభావుడు! పరమాత్మునితో ప్రేమలోపడినాచివరికి చేష్టలుడిగి పోవడం జరుగుతుంది, సమాధిభావం అంటే అదే! పరమాత్ముడు ఒక్కడే పురుషుడుసృష్టిలో, మిగిలిన అందరూ స్త్రీలే, ఈ భావంతో పరమాత్ముడిని నాధునిగా ఆరాధించడాన్ని మధురభక్తిమార్గంఅంటారు, భారతీయ భక్తి వేదాంతంలో. రాధాదేవి ఈ మార్గానికి ఆద్యురాలు. కలియుగంలో ఈ ప్రణయభక్తి మార్గానికి పరాకాష్ఠగా జన్మించిన జగజ్జనని అంశ ఐన గోదాదేవి శ్రీ కృష్ణుడిని ఆరాధనకు, ప్రణయభక్తికిగురుస్థానీయురాలు!
ఆ గోదాదేవియే ఈ ప్రబంధ నాయకురాలు కనుక, ఆమె పరమాత్ముని ప్రేమలోపడి,తాను ధరించి వదిలిన 'పూ మాలను' ఆయనకు ఇచ్చిన విషయాన్ని సూచించడం కోసం తానుకూడా ఒకమాలను, ఉత్పలమాలను సమర్పించాడు వేంకటేశ్వరుడికి. ఇక పద్యాన్ని పరిశీలిస్తే, 'శ్రీ' యొక్క అంటే లక్ష్మి యొక్క మెడలోని కమనీయమైన హారంలోని మణిలో తను,తన వక్షస్థలం మీది కౌస్తుభ మణిలో ఆవిడ పరస్పర ప్రేమాతిశయంచేత కనిపిస్తున్నారు. ఇద్దరూ తమతమఆత్మల్లో, హృదయాలలో, ఒకరినొకరు నిలుపుకుని వున్న కారణం చేత, స్వచ్చమైన ఆ ఆత్మల కారణంగా, మరీ స్వచ్చమైన శరీరములనుండి పైకివచ్చి మరీ కనిపిస్తున్నాయేమో అన్నట్లుగా, ఆవిడమెడలోని హారంలోనిమణిలో ఈయన, ఈయన వక్షస్థలం పైనవున్న కౌస్తుభమణిలో ఆవిడ కన్పిస్తున్నారు. ఈ రకంగా శోభిల్లేవేంకటాచలపతిని నేను సేవించెదను అని తన మనోరథాన్ని వెల్లడించాడు.చాలా చమత్కారపూర్వకమైన పద్యం ఇది. జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మూడు దృశ్యాలున్నాయి. ఒకటి లక్ష్మీదేవిఅమ్మవారు. ఆవిడ మెడలోని హారంలో మహావిష్ణువు కనిపిస్తున్నాడు. రెండవది విష్ణుమూర్తి. ఆయనవక్షస్థలంపైన వున్న కౌస్తుభమణిలో లక్ష్మీదేవి కనిపిస్తున్నది. మూడవదృశ్యం శ్రీ వేంకటాచలపతి. లక్ష్మీదేవి మనసులోపలహృదంతరాళంలో వున్నవాడే పైనవున్న హారంలో ప్రతిఫలించాడు. ఎంత గొప్పభక్తుడో, ఉపాసకుడో, రాయలు ఎంతజ్ఞానియో, అవధులులేని పాండిత్య, ప్రతిభా, వ్యుత్పత్తులకు పెన్నిధివంటివాడో చెప్పడానికి ఈపద్యం ఒకమచ్చుతునక. 'అంతర్బహిశ్చతః సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతంవిశ్వశంభువం..' బయటా, లోపలా అంతటా వ్యాప్తమైవున్న, అందరిలోనూ, అన్నింటా ఉన్నదే విష్ణుతత్త్వము అనినారాయణోపనిషత్తులోని ఈ మంత్రార్థాన్ని స్ఫురింప జేశాడు ఉపాసనా పరంగా, ఉపనిషత్తుల పరంగా,సర్వభూతముల హృదయదేశంలో నేనున్నాను అర్జునా అన్న గీతాచార్యుని పలుకులను ధ్వనించాడు. అన్నింటావున్నవాడే అమ్మహృదయంలో వున్నాడు కనుక ఆయనే పైకికనిపించాడు, అమ్మయొక్క స్వచ్చత కారణంగా.ఆవిడ స్వచ్చమైన దేహంలోనుండి లోపలి హ్రుత్పుండరీకంలో వున్న ఈయన కనిపించాడు అంటే, స్వచ్చమైనమనసుతో స్వామినేతప్ప ఎవరినీ తెలియని పతివ్రత కనుక, స్వచ్చమైనదేహం లక్ష్మిది, కనుక స్వచ్చమైనదేహంపారదర్శకం గావడంచేత పైనవున్నహారంలోని మణిలో లోపలవున్న ఆయన కనిపించాడు అంటే, అంతేస్వచ్చమైనహృదయంతో తననే హృదయంలో నిలుపుకున్న గోదాదేవిని ఇలాగే కరుణించాడు, కరుణిస్తాడు అని ధ్వని.లక్ష్మీవిష్ణులు అభిన్నులు, పార్వతీశివుల వలె, సరస్వతీ బ్రహ్మలవలె, సీతారాములవలె , వాక్కూ దానిఅర్ధములవలె, సూర్యుడూ ఆయన వెలుతురువలెనే.
కనుకనే లక్ష్మీవిష్ణుల సంయోగ తత్త్వమైన వెంకటేశ్వరునికి,తన ఇష్ట దైవమైన వెంకటేశ్వరునికి వందనములు చేస్తున్నాడు. లౌకికంగా చూసినా ఆభరణాలలో తమ ప్రియుల, ప్రియురాండ్ర చిత్రాలను ఉంచుకోవడం కొత్త విషయమేమీ కాదు.హృదయానికి దగ్గిర ఆభరణాలలోనే కాదు, హృదయాలలోనే పరస్పరం వారు ఒకరినొకరు నిలుపుకున్నారు అనిచెప్పడం అందరికీ తెలిసినవిషయమే ఐనా మరలాచెప్పడం ఎందుకంటే అనురాగము, అరిభావము(శత్రుత్వము)రెండూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే దాన్నిబట్టే పెరగడం, తరగడం అనేవి వుంటాయి. ఆయన ఆమెను తనహృదయపీఠంలో నిలుపుకున్నాడు కనుకనే, ఆవిడ ఆయన పదముల చెంత కనిపిస్తుంది ఎప్పుడూ! తన స్త్రీనిహృదయంలో నిలుపుకునే పురుషుడికి అతని స్త్రీ స్వయంగా పదదాసి ఔతుంది, స్వచ్చందంగా, బేషరతుగా!షరతులు పెట్టకుండానే గుండెల్లో నిలుపుకునేవాడికి ఇంకా పెట్టడానికి ఏమీ షరతులుంటాయి కనుక?)మరొక దివ్యమైన లౌకికఅందం ఏమిటంటే చివరిలో ముక్తాయింపుగా వేంకటేశ్వరసేవచేసెదను అని ముగించాడు.వేంకటేశ్వరునితో ప్రారంభం ఐంది ఆయన మనసులో భావం, వేంకటేశ్వరుని హృదయ పీఠంపై వుండే లక్ష్మీదేవి అమ్మవారి మూర్తి దర్శనమిచ్చింది, వేంకటేశ్వరుని వక్షస్థలంపైన వుండే కౌస్తుభమణి కనిపించింది, అందులోఅమ్మవారు కనిపించింది. శుద్ధసాత్త్వికభావం స్వచ్చమైనది. శుద్ధసత్త్వస్వరూపులైన ఇద్దరి స్వచ్చమైనదేహాలలోనుండి ఇరువురి హృదయాలలోని మూర్తులు కనిపిస్తున్నాయా అన్నట్లు ఉన్న వేంకటేశ్వరుని స్మరణతోప్రారంభం చేశాడు, వేంకటేశ్వరుడు లక్ష్మీనారాయణుల సమిష్ఠితత్త్వం అనే సూచనతో!వేదములకు ఓంకారము ప్రథమాక్షరం వలెనే, కృతులకు శ్రీకారము ప్రథమము అని సూక్తి కనుక, ‘శ్రీ’కారముతోమొదలుబెట్టాడు. ఆదిలో మంగళం, మధ్యలోనూ మంగళం, చివరిలోనూ మంగళసూచకములుగా మహాకావ్యరచనవుండాలి కనుక, శ్రీవాచకముతో మొదలుబెట్టడం, మంగళవాచకముతో మొదలు బెట్టడం కావ్యలక్షణం, సంప్రదాయంకనుక 'శ్రీ'కారం చుట్టి మొదలుబెట్టాడు! ఆశీస్సు, నమస్కారము, వస్తునిర్దేశంతో మంగళ కావ్య ప్రారంభం చేయడంసంప్రదాయం కనుక, ఇన్నీ కలిసివచ్చేలా, మంగళవాచకంతో, ధ్వనిగా వస్తునిర్దేశంతో(అంటే కావ్యానికి సంబంధించినవిషయసూచనతో) నమస్కారంతో (వేంకటాచల పతికి)తన కావ్యప్రారంభం చేశాడు, అత్త్యుత్తమమైన లోకపరిశీలన,ప్రతిభ, పాండితీ, వ్యుత్పత్తీ, ఆధ్యాత్మిక జ్ఞానములనే పంచనదుల ప్రవాహంగా, పరమాత్మసాగరానికి అభిముఖంగా,తన కవిత్వరస ప్రవాహాన్ని పరుగులెత్తించాడు!
కావ్యప్రారంభంలోనే తన సర్వస్వతంత్ర సార్వభౌమలక్షణాన్ని చాటాడు. తనకు అవసరం లేదు అనుకున్న శార్దూలవృత్తంతో ప్రారంభం, 'మ' గణముతో ప్రారంభం అనే సంప్రదాయాన్ని ఎంత చవగ్గా పక్కకు బెట్టాడో, మిగిలిన కావ్యలక్షణాలనూ, సంప్రదాయాన్నీ అంత నెత్తికెత్తుకున్నాడు. అంతేగాదు, కావ్యంలో తన స్వేచ్ఛ ప్రకారమే గోదాదేవిని,జగజ్జనని పాత్రను, ఇది ప్రబంధం కనుక, ప్రబంధ నాయికగా కావలసిన శృంగార లక్షణాలు అన్నింటినీ ఆరోపించిఅద్భుతమైన వర్ణనలు చేశాడు, కనీసం ఒక్కచోటగూడా పూర్తి ఆధ్యాత్మికసూచనలైన తిరుప్పావై పాశురాలజోలికివెళ్ళలేదు, ఆళ్వారుల గురుపరంపరా ప్రభావం లోనుండి తీసుకున్న విషయాలను కూడా తన ప్రణాళిక ప్రకారం,మార్పులూ, చేర్పులూ, కథలను వెనకా ముందూ చేసి, ప్రబంధ విలువలకు పెద్దపీట వేశాడు, దేశ, కాల, పాత్రలపరిమితులను పక్కకు బెట్టి, అపరిమితమైన ఆనందాన్ని, సందేశాన్నీ ఇవ్వడంకోసం. ప్రత్యేకించి నాటకీయత,పాత్ర చిత్రణం, పాత్రలతో పలికించే సంభాషణల గొప్పదనానికి ఆముక్తమాల్యద కు సాటివచ్చే ప్రబంధం లేదు.ఈవిషయంలో షేక్స్పియర్మాత్రమే సరిజోడు రాయలకు, ఆయన కూడా యూనిటీ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ యాక్షన్అని అంతకుముందు ఆంగ్లనాటక కర్తలు పెట్టిన బంధనాలను తెంచిపారేసి ప్రపంచం ఉన్నంతకాలమూ నిలిచిపోయేపాత్రలను, సంభాషణలను అందించిపోయాడు!
అంతేకాదు, ప్రత్యేకించి ఒక సందేశాత్మకమైనకథను, మాలదాసరికథను, ఎక్కడో వరాహ పురాణంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి, ప్రధాన కథకు అద్భుతంగా జోడించి, అత్యుత్తమఆధ్యాత్మిక జ్ఞానప్రబోధం చేశాడు రాయలు. ఈ వ్యాసములోకూడా మరీ లోతైన పూర్తి ఆధ్యాత్మిక విషయాలనుచెప్పిన వాటిని దాటేసుకుని, ప్రబంధ సంబంధమైన, రససంబంధమైన, సరస సంబంధమైన వాటిని మనంఎక్కువగా పరిశీలనచేద్దాము, కేవలం సాహిత్య ప్రేమికులు ఐన వారిని దృష్టిలో పెట్టుకుని.ప్రథమాశ్వాసంలోని ఈ ప్రథమ పద్యంలోని ఇంకొక్క చమత్కారాన్ని చర్చించుకుని ముందుకు సాగిపోదాం.ఎదురెదురుగాఉంచిన దర్పణాలలో కనిపించే ప్రతిబింబములసంఖ్య ఎంత అని పోటీపరీక్షల్లో అడుగుతుంటారుఅప్పుడప్పుడు. ఎంత ఆ సంఖ్య అంటే అనంతము! ఇక్కడ కూడా అదే చమత్కారం చేశారు రాయలవారు.వేంకటేశ్వరుని మూర్తిలో వక్షస్థలం పైన కౌస్తుభ మణి వుంది. అందులో అమ్మవారు దర్శనమిస్తుంది. ఆదర్శనమిచ్చిన అమ్మవారి హారంలోని మణిలో అయ్యవారు దర్శనమిస్తారు, మరలా కౌస్తుభమణి కూడాకనిపిస్తుంది కదా, అందులో మరలా అమ్మవారు, యిలా అనంతమూర్తుల అంతులేని దివ్యదర్శనములపరంపర అన్నమాట, ఇది ఎందుకంటే, ఆయన అనంతుడు, అనంతమైన విశ్వకర్త అని ఈయనకు నమ్మకంగనుక. పైన ప్రారంభంలో ఉదహరించుకున్న 'అంతర్బహిశ్చతః సర్వం వ్యాప్య నారాయణస్థితః' తర్వాతివాక్యం'అనంత మవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం' అంటే, అనంతుడు, అవ్యయుడు (తరిగిపోనివాడు,అంటే క్షీణించడం, నశించడం లేనివాడు) సృష్టికర్త, సముద్ర పర్యంతమైన విశ్వానికి ఆయన అధిపతి కనుక.అంతేకాదు, ఇక్కడ వక్షస్థలవ్యూహలక్ష్మిని రాయలవారు చెప్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని నిజరూపదర్శన సమయంలో ప్రతిఉదయమూ ఆ వక్షస్థలంమీద వున్న లక్ష్మీదేవిని పూజిస్తారు. వేంకటేశ్వరునికితులసీదళములతో అర్చన చేసిన తర్వాత ఆ అర్చనలో ఉపయోగించిన తులసీ దళములతోనే మరలా పద్మాసన, ద్విభుజ ఐన ఆ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు, వరాహపురాణాంతర్గత చతుర్వింశతి (24)నామములతో. ‘ఓం శ్రీ యై నమః’తో మొదలై ‘ఓం అబ్ధిజాతాయై నమః’ అనే ఇరవైనాలుగు నామములలోనిమొదటిదైన 'శ్రీ' పదమును వాడడం, వక్షస్థలముమీది అమ్మవారిని చూడడం, ఆ అమ్మవారి మెడలోనిహారపుమణిలో స్వామివారిని చూడడం ఇవన్నీ ఇందుకు సూచనలుగా, ఈ వర్ణనకు అనువుగా, పైన చెప్పినగ్రంథార్ధమును సూచించడంకోసం, భావికథాసూచకంగా, అనంత సృష్టి చతుర్వింశతి తత్త్వములతో నిండి వున్నదికనుక (శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనే పంచ తన్మాత్రలు, ప్రుథివ్యాపస్తేజో వాయురాకాశములనేపంచభూతములు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేఅంతఃకరణ చతుష్టయం. ఇవీ ఆ ఇరవైనాలుగుతత్త్వములు, వీటి పంచీకరణం అంటే రకరకాలపాళ్ళలో మిశ్రమంచేయడం వలన, మరొక భాషలో చెప్పాలి అంటే ఈ ఇరవై నాలుగు తత్త్వముల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్వలన సృష్టిలోని భూతకోటి ఉద్భవించింది అని భారతీయ వేదాంత శాస్త్రం చెప్తుంది) ఆ చతుర్వింశతితత్త్వసూచకంగా చతుర్వింశతి నామములతో చేసే వ్యూహలక్ష్మీపూజను ధ్వనిస్తూ, అనంతకోటిబ్రహ్మాండనాయకుడు,లక్ష్మీవిష్ణుల సమిష్టితత్త్వము ఐన వేంకటేశ్వరుని ప్రార్ధనతో తొలిపద్యాన్ని అందించి ఆముక్త మాల్యదాగ్రంథాన్నిప్రారంభం చేశాడు రాయలవారు!
(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు