ఈ డిప్రెషన్ అనే పదం సాధారణంగా , ఏ బంగాళాఖాతం లోనో “వాయుగుండాలు” ఏర్పడినప్పుడు, మన వాతావరణ శాఖవారు ఉపయోగిస్తూంటారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకునేది, మనుషుల్లో ఏర్పడే డిప్రెషన్ గురించి. దీనికి ఓ వేళా పాళా ఉండదు. మనలో లేనిది అవతలివారిలో చూసినా, మనం తినలేనిది ఇంకోడు హాయిగా తింటున్నా, మనం చేయలేనిది మరోడు అవలీలగా చేసేస్తున్నా, ఈ “డిప్రెషన్” ఏర్పడిపోతుంది. దీనికి ఓ మందూ, మాకూ ఉండదు. అలాగని , పోనీ తగ్గుతుందా, అంటే అదీ లేదూ. అవడం క్షణికమైనా, అసలు ఇదొచ్చిందంటే , మానసికంగా బలహీనుడైపోతాడు. మన ఆలోచనా పధ్ధతి మార్చుకోడమే, దీనికి అసలైన మందు. కానీ, మారదే !!
ఉదాహరణకి, ఓ పెద్దమనిషి ఓ రెండురూమ్ముల ఇంట్లో ఉన్నాడనుకుందాం, ఈయనగారికి, తన తోటివాడు, మూడురూమ్ముల ఫ్లాట్ లో ఉండడం చూస్తే, డిప్రెషనూ. వాడిదీ, నాదీ జీతమొక్కటేకదా, ఇంత పెద్ద ఫ్లాట్ ఎలాతీసికున్నాడూ, అని జుట్టుపీక్కుంటాడు, అలాగని మొహమ్మీద అడగలేడూ, పోనీ ఏదో ఆస్థి కలిసొచ్చో, లేదా స్వగ్రామంలో ఉండే ఇల్లు అమ్మో, ఇక్కడ పెద్ద ఇల్లు తీసికున్నాడేమో అని సరిపెట్టుకుంటాడా అంటే అదీ లేదూ. ఊరికే తనలో తను మధన పడిపోతూంటాడు.
అలాగే ,తాను కుటుంబంతో వెళ్ళి చూడలేని, టూరిస్ట్ ప్రాంతాలూ, పుణ్యక్షేత్రాలూ , ఇంకోడెవడో చూసొచ్చాడంటే చాలు, ఈయనగారు ఎక్కడలేని “డిప్రెషన్” లోకీ వెళ్ళిపోతాడు. దీనికి సాయం, అవతలివారిని “ఊరించేటట్టుగా” కబుర్లు చెప్పేవాళ్ళు కొందరూ. వాళ్ళకి ఇంకోపనేమీ ఉండదు. నిజంగా వెళ్ళొచ్చాడో, లేక ఏ పుస్తకంలోనో చదివాడో కానీ, కబుర్లకేమీ లోటుండదు. ప్రతీసారీ అలాగే కాదనుకోండి, అప్పుడప్పుడు. ఏ LTC యో తీసికుని, కుటుంబంతో సహా వెళ్ళాడే అనుకుందాం, వెళ్ళిన చోట పూర్తిగా చూశాడా, పెట్టాడా, ఆ వెళ్ళిన చోటు గురించి ఓ పుస్తకంలోనో, అంతర్జాలంలోనో చదివేస్తే చాలు. తనెలాగూ చూడలేకపోయాడు, కానీ ఓ నాలుగు కబుర్లు చెప్పి, వెళ్ళొచ్చినవాడి “ మూడ్ “ తగలేయొచ్చుగా..అలా నిశ్చయించేసికుని, ఆమధ్యనే వెళ్ళొచ్చిన సహోద్యోగి ఇంటికి బయలుదేరతాడు. ఆ గృహస్థు ఇచ్చిన కాఫీ, పలహారాలు సుష్ఠిగా తినేసి, ఇంక మొదలెడతాడు. ఏమిటీ ఈమధ్య LTC మీద వెళ్ళొచ్చావుట, ఎక్కడెక్కడికెళ్ళేరేమిటి .. అంటూ. ఆ రెండోవెర్రిబాగులోడు, కనీసం ఎవడోఒకడు అడిగాడుకదా అనుకుని, తానూ, కుటుంబమూ కలిసి చూసిన స్థలాల గురించి చెప్పుకొస్తాడు. దీనికి సాయం, వెళ్ళిన ప్రతీ చోటా, ఎంతంత మంచి గైడ్లు దొరికేరో, ఎంత వివరంగా చెప్పుకొచ్చేడో, అలా తానుచూసొచ్చిన వాటిగురించి, ఎంతో ఉత్సాహంగా వర్ణిస్తాడు. మధ్యమధ్యలో ఆయనగారి భార్యకూడా ఈ వర్ణనలో అందుకుంటూంటుంది.
తన భర్త చెప్తూంటే అడ్డొచ్చి, “ మనతో వచ్చిన గైడు కాదండీ, ఇంకో జంటొచ్చిందే వాళ్ళూ చెప్త, అప్పటికే రెండు మూడుసార్లు చూసొచ్చారుట కూడానూ..” మొత్తానికి ఆ భార్యాభర్తలు, ఆ పర్యటన ఎంతగా ఎంజాయ్ చేశారో, పిల్లలు కూడా ఎంతగా ఆనందించారో, విడివిడిగానూ, జంటగానూ చెప్పి, అక్కడ తీసికున్న ఫొటోలూ అవీ చూపిస్తారు. పాపం వాళ్ళ సంతోషం వాళ్ళది మరీ.
ఏదో టిఫినూ, కాఫీ లాగించిన విశ్వాసంతో అప్పటిదాకా విన్నాడు కానీ, మన ఫ్రెండుకి ఇవన్నీ కళ్ళు కుట్టేట్టు చేస్తాయి. ఇలా ఉందా వీళ్ళపనీ అనుకుని ఇంక తనొచ్చిన “కార్యక్రమం” లోకి దిగిపోతాడు. అసలొచ్చిందే అందుకోసంకదా, ఏదోలాగ హాయిగా కొత్తప్రదేశాలు చూసొచ్చిన ఉత్సాహం మీద నీళ్ళు చల్లడమేగా. తాను పుస్తకాల్లో చదివిన “పరిజ్ఞానం” తో, “ఫలానాది చూశారా, ఫలానా దానికి వెళ్ళేరా...” అంటూ, వీళ్ళు వర్ణించిన ప్రదేశాల్లో చెప్పనివాటన్నిటిగురించీ అడుగుతాడు. పాపం వాళ్ళు వెర్రిమొహం వేస్తారు. “అరే దానిగురించి ఎవరూ చెప్పనేలేదూ..” అంటూ నిరుత్సాహపడిపోతారు. అప్పటిదాకా ఎంతో పొగిడిన వీళ్ళ గైడు మీద వీళ్ళ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఇంక భార్యామణిగారు “ అప్పటికీ చెప్తూనే ఉన్నాను, కొద్దిగా డబ్బు ఎక్కువైనా, మంచి గైడుని చూడండీ... మీరేమైనా నామాట ఎప్పుడు విన్నారు కనుక.. పెళ్ళాం చెప్పిందీ, మనమెందుకు వినాలీ ..అనే కానీ..” ఇంక ఆరోజునుంచీ ఎడమొహం, పెడమొహమూ. మన ఫ్రెండు కి మాత్రం మనసులో లడ్డూలే. అనుకున్నది సాధించాం అనుకుంటాడు.
ఎవరైనా ఓ కొత్తవస్తువు కొనుక్కున్నారని తెలియడం తరవాయి, మన “డిప్రెషన్ సృష్టికర్త “ అక్కడ ప్రత్యక్షం. ఏమిటీ కొత్తగా కొన్నట్టున్నారూ, ఏ కొట్లో ఏమిటీ అంటూ ప్రారంభం.పాపం ఆ గృహస్థు, తను ఎన్ని కొట్లలో చూశాడో, చివరికి తనకు నచ్చిన మోడల్ ఏ కొట్లో దొరికిందో, బేరం ఆడి, కొట్టువాడిని ఒప్పించి, ఎంత చవకలో కొనగలిగాడో అన్నీ చెప్పుకొస్తాడు. మన ఫ్రెండా ఊరుకునేదీ.. “ అదేమిటీ అంత ధర పెట్టి కొన్నారా, ఫలానా షాపులో కొనుంటే, మీకు ఇంకా చవకలో దొరికేదిగా. అయినా కొనే ముందర నాతో ఓ మాటనుంటే, ఇద్దరం కలిసేవెళ్ళేవాళ్ళంకదా.. ఏమిటో ప్రతీదీ రహస్యంగానే చేయాలని నీ బుధ్ధిమాత్రం పోగొట్టుకోలేదోయ్..”. ఆమాత్రం చాలదూ, ఎంతో శ్రమపడి, పైసపైసా కూడబెట్టుకుని , ఎన్నాళ్ళనుండో కొనాలనుకున్న వస్తువు ఇంటికి తెచ్చాననే ఉత్సాహం మీద నీళ్ళు చల్లడానికి?
అలాగే ఓ కొత్త ఇల్లు కొన్నప్పుడనండి, ఓ కారు కొనుక్కున్నప్పుడనండి, పిల్లనో, పిల్లాడినో ఏదో ఓ స్కూల్లో చేర్చినప్పుడనండి, లేదా కూతురికి ఓ మంచి సంబంధం కుదిర్చినప్పుడనండి, దేశాకాలమానపరిస్థులతో సంబంధం లేకుండా, వీరిని విమర్శించి, డిప్రెషన్ లోకి దింపగలిగే మహనీయులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అసలు వాళ్ళు ఈ భూమ్మీదకు వచ్చిందే అందుకూ.
ఇలాటి వారి బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే విరుగుడు, వీళ్ళగురించి పట్టించుకోపోవడం. వాడు వాగినంతసేపూ వాగనిచ్చి, “ Why don’t you mind your own business..? “ అని సున్నితంగా చెప్పడం. అలా మొహం మీద చెప్పడానికి మొహమ్మాట పడ్డారా .. అంతే సంగతులు. తిరిగిరాలేని “డిప్రెషన్ “ లోకి దిగిపోవడం. Choice is in your hands…