‘అమ్మే గురువైన వేళ –అభినందనల పరంపర‘షురూ’...
‘యువ నర్తకిగా గుర్తింపు–తద్వారా ‘సుడిగుండాలు’ చిత్రంలో నటించే అవకాశం -అవార్డుల వెల్లువ, స్కూల్లో పాపులారిటీ –పదిమందిలో ప్రత్యేకత’ - నాకు లభించాయంటే, - అంతా అమ్మ చలవే, ఆమె కృషి వల్లే ....
మద్రాస్ లో వెంపటి చినసత్యం గారి శిష్యరికంలో ఐదేళ్లు కూచిపూడి శిక్షణ పొందాక, నాట్యం పట్ల నా ఆసక్తి మరింత ఎక్కువైంది. నిత్యం అదే ధ్యాసగా ఉండేదాన్ని... నేర్చుకోవడమే కాదు ప్రదర్శనివ్వాలన్న ఆసక్తి కూడా ఉండేది.
నాన్నగారి బదిలీల వల్ల, కొద్దిరోజులు హైదరాబాద్, గుంటూరు, తరువాత వరంగల్కి మా నివాసం మారింది. నా నృత్యశిక్షణ వెనక బడిందనే అనుకోవచ్చు.
వరంగల్ వెళ్ళాక మిడిల్-స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నా, నృత్య శిక్షణ మాత్రం కొనసాగలేదు. కూచిపూడి నృత్యం నేర్పే పేరున్న గురువులు దొరక్క, ఇతర నాట్య రీతులలో ఆసక్తి లేక అమ్మ నన్ను ఎక్కడికీ పంపలేదు.
అమ్మే గురువుగా రంగప్రవేశం చేసింది –
నేను Warangal -Platinum Jubilee మిడిల్ స్కూల్లో సిక్స్త్, సెవెంత్, ఎయిత్ స్టాండర్డ్స్ చదివాను. వెంపటి సత్యం గారి వద్ద శిక్షణ పొందానని చెప్పడంతో, స్కూల్లో వేడుకలకి performచేయమని నన్నే ముందుగా అడిగేవారు, మా ప్రిన్సిపాల్ మేడమ్...అలా స్కూల్ కల్చరల్ ఫంక్షన్స్ కి నా participationముఖ్యమైపోయింది.
నాట్యం చేసే అవకాశమేదీ పోనీయకూడదని, అమ్మే నాకు గురువుగా రంగప్రవేశం చేసింది.తనకి స్వతహాగా నాట్యమంటే ఆసక్తి ఉండడమే కాక, చిన్నతనంలో డాన్సుచేసేది. పొడగరి, ఉంగరాల జుత్తుతో అందంగా ఉండే అమ్మ కృష్ణుడి వేషం వేసేదట. సంగీతం కూడా పద్దతిగా నేర్చుకొని, వాళ్ళమ్మతో సాంప్రదాయ పాటలు పాడేదట కూడా.
ఆ అనుభవంతో, అమ్మ నాకు కొన్ని డాన్సులు నేర్పింది. సినిమాల్లోని సాంప్రదాయ,జానపద పాటలని వెతికి పట్టేది అమ్మ. వేదిక మీద చేయడానికి అనుగుణంగా, ఆ సంగీతానికి నృత్యాలని కూర్చేది. నేనూ సహాయ పడేదాన్ని.
అహర్నిశలూ నా నృత్యం కోసం పాటు పడింది అమ్మ. వరంగల్ కి ముందు, కొన్నాళ్ళు గుంటూరులో ఉన్నాము. అక్కడ, తను చిన్నప్పుడు చదివిన స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి సాయం చేసి, నాకు ఆ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేయడానికి అవకాశం కల్పించేది అమ్మ.
మా చదువుల్లోనూ ఎంతో శ్రద్ధ పెట్టేది...నాకు రెండు సార్లు డబల్ ప్రొమోషన్ వచ్చింది కూడా. Upper K.G,3rd standardస్కిప్చేసాను. మా తమ్ముడు కూడా బాగా చదివే వాడు.
నాట్యరంగాన నా పురోగతికి,తొలి సోపానాలయిన - వోరుగల్లు, హనుమకొండలు......
ఫంక్షన్స్ కి ప్రిపేర్ అవడానికి, స్కూల్లో నాకు స్పెషల్ గా ఓ గది ఏర్పాటు చేసి, మిగతా పార్టిసిపెంట్స్ కి నా చేత, శిక్షణ ఇప్పించేవారు, మా Platinum Jubilee ప్రిన్సిపాల్
మేడమ్.... అలా నాలోచాల కాన్ఫిడెన్స్ వచ్చింది.
నా నృత్యానికి స్టేట్ లెవెల్ అవార్డ్ .......
అంతే కాదు, మా ప్రిన్సిపాల్ మేడమ్ ఎంతో కాన్ఫిడెన్స్ తో నన్ను మా స్కూల్ తరఫున స్టేట్-లెవెల్ inter-collegiate డాన్సు పోటీలకి పంపారు. ముందుగా ఆ విషయమై తర్జన-భర్జనలు జరిగాయి.ఆ పోటీలకి, మిడిల్ స్కూల్ స్టూడెంట్ ని పంపే అవకాశం లేదని తెలిసింది... మా ప్రిన్సిపాల్ గారు కాలేజీ కల్చరల్ బోర్డ్ తో మాట్లాడి, వారి అనుమతి పొంది, ప్రత్యేకంగా నాకు పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు...
ముందుగా హనుమకొండలో జరిగిన మొదటి విడత పోటీలలో పాల్గొని గెలిచాను. ప్రేక్షకుల మన్నన పొందాను... రెండవ విడత పోటీలు వరంగల్లులో, మూడవది హైదరాబాదులో జరిగాయి... అందులోనూ నేను గెలిచాను...పాల్గొన్న వారందిరిలో నేనే చిన్నదాన్ని.అన్ని కార్యక్రమాల్లోనూ గెలిచి, మా స్కూలుకి, మా అమ్మానాన్నలకి ఎంతో ఆనందాన్ని కలిగించానని అంతా నన్ను మెచ్చుకున్నారు. నా గెలుపు గురించి, నా ఫొటో సహా ఎన్నో పేపర్లల్లో వచ్చింది...
ఈ కార్యక్రమాలకి, నాకు కాస్ట్యూమ్కోసం, ఫోటోలు తీయించడం కోసం అమ్మా నాన్నా చాలా శ్రమపడ్డారు. వరంగల్లో కన్నా హైదారాబాదులో కాస్ట్యూమ్స్ కుట్టేవాళ్ళు ఉన్నారని ఎన్నో మార్లు అక్కడికి వెళ్ళి మేకప్ సామాను, వగైరాలు సమకూర్చుకుంది అమ్మ.అమ్మ నేర్పంగా, నాకు గుర్తుండిపోయిన కొన్ని పాటల్లో ‘సలలితరాగ’అనే పాట – మహారాజు కొలువులో నర్తకి చేసిన పార్ట్,‘జోహారు శిఖిపింఛ మౌళీ’, ‘దశావతారాలు పాట’ ఉన్నాయి..
అమ్మ ఓపిగ్గా నాతో రోజూ వ్యాయామం చేయించేది... నన్ను స్పెషల్ డైట్ మీద కూడా ఉంచేది...తిరిగి మేము పర్మనెంటుగా హైదరాబాదులో స్థిరపడేంతవరకు మరిఅమ్మే నాకు గురువు....
‘రవీంద్రభారతి’ వేదిక పై నర్తించే అవకాశం, ‘సుడిగుండాలు’ చిత్రం ....
నన్ను వరంగల్ స్కూల్ ప్రోగ్రాముల్లో,చూసిన డైరెక్టర్,టి.మాధవరవుగారు, హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్న మరో ప్రోగ్రాంలో డాన్సు చేయమని అడిగారు. మాధవరావు గారు, కె. విశ్వనాథ్ గారు కలిసి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేస్తున్న సమయం అది. రవీంద్రభారతి ప్రోగ్రాములో నేను ఓ ఇరవై నిమిషాలు చేసాను. అన్నీ అమ్మ నేర్పిన డాన్సులే...అది నా మొదటి ప్రోగ్రాం (ఒకటి కంటే ఎక్కువ డాన్సులు చేసిన)..
మెప్పులు, మన్ననలు పొందాను. అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాల్లో నా డాన్సు తప్పక ఉండేది. పెద్దవాళ్ళంతా నాకు శాస్త్రీయ నృత్యం నేర్పితే మంచి నర్తకి నవుతానని సలహాఇచ్చారు.
రచయిత్రి - ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి నుండి - డాన్స్ అవార్డు,
‘సుడిగుండాలు’ చిత్రంలో అవకాశాలతో వడిగా సాగిన నా కళాజీవనయానం.....
‘సుడిగుండాలు’ సినిమాలో, పిల్లల డాన్సుడ్రామా లో ‘భారతమాతగా’
వేయాలని అడిగారు, చక్రవర్తి ప్రొడక్షన్స్ వారు. వెళ్ళాము. చేసాను.1968 సం.లో విడుదలైన ఆ సినిమా ‘నందిఅవార్డు’ చిత్రమైంది. ఆదుర్తి సుబ్బారావు గారు, డైరెక్ట్చేశారు.కె.విశ్వనాథ్, టి. మాధవరావు గార్లు ఆయనకి అసిస్టంట్లగా పనిచేసారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు జడ్జి పాత్ర పోషించారు. సాంఘిక సమస్యలపై తీసిన గొప్ప చిత్రం ఇది.
స్టేట్ వైడ్ ఇంటర్-కాలేజీయేట్ డాన్స్ పోటీల్లో నేను గెలుచుకున్న అవార్డ్, తరువాత రెండు నెలలకి వరంగల్లులో జరిగిన ‘జాతీయ రచయిత్రుల మహాసభ’లో – ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి చేతుల మీదుగా అందుకున్నాను...
మా అమ్మానాన్నల సంతృప్తి,సంతోషాలే నాకు మెండు... నాకు గర్వంగా అనిపించింది...
నేను అప్పటివరకు కూడా, ఒకరి మెప్పు కోసమో, అవార్డుల కోసమో డాన్స్ చేసిన గుర్తు లేదు.... డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఫీల్ అయ్యే ఆనందం వర్ణనాతీతం... లోకంలోని అత్యున్నత శిఖరాలనధిరోహించిన ఉత్సాహం, అనుభూతి పొందేదాన్ని. నా ఆనందం కోసం డాన్స్ చేసాను.. కాకపోతే నాకు అంతటి ప్రోత్సాహాన్నిచ్చిన తల్లితండ్రులు మాత్రం, నా అదృష్టం...
మహేశ్వరి– భారతిగా .......
నా అసలు పేరు ఉమా మహేశ్వరి. ‘సుడిగుండాలు’ షూటింగ్ సమయంలో, ఫస్ట్ ఫిలిం ‘భారతమాత’ గా చేస్తున్నాను కాబట్టి పేరు ‘ఉమాభారతి’ గా మార్చాలని డైరెక్టర్ మాధవరావు గారు అనడం, నాన్నఒప్పుకోడం, నా ఎదురుగానే జరిగాయి.‘ఉమాభారతి’ అప్పటి నుండి నా స్టేజి-నేమ్ అవ్వడం. బాగా అచ్చొచ్చిందనే అనాలి.
మా అమ్మ, నాన్నలు ఎంతో శ్రమ పడి, ఓర్పుతో, నేర్పుతో, నన్ను వృద్దిలోకి తెచ్చారని, అప్పుడు, ఇప్పుడూ కూడా నాకు తెలుసు... మా అమ్మలోని సహనానికి, శ్రమకి నా జోహార్లు...నా పురోగతిని దృష్టిలో పెట్టుకొని, ఓ పది అడుగులు ఎక్కువే నడిచారు నా తల్లితండ్రులు...‘అమ్మ’ పై ఓ కవిత రాసాను ఆమధ్య... రాసిన నా మొదటి కవిత కూడా!పబ్లిష్ అయిన నాల్గవ కవిత...చంద్రునికో నూలుపోగు!...
వెక్కివెక్కి ఏడ్చినప్పుడు, అక్కున చేర్చుకునేది అమ్మ
వాన నీళ్ళలో, కాగితపు పడవలతో ఆడించేది అమ్మ
ఆటైనా, పాటైనా, తానోడి, నన్నేగెలిపించేది అమ్మ
వేలెట్టుకు నడిపించి, బడిలో, అమ్మేగా, దిగవిడిచేది!
తిరగడానికి కారు ఇచ్చి, విద్యల్లోఎదగడానికి ఊరు మార్చి
ఇంటా బయటా, అన్నిటా నావైపే నిలిచేది అమ్మ
చదివి అలిసినప్పుడు, తన ఒడిలో సేద తీర్చేది అమ్మ
డిగ్రీ చదువులు, కోరిన నగలు, రంగుల కలలు, అమ్మ చలవే !
సమస్యలనెదురించి, బతుకు పరీక్షల్లో నెగ్గడం నేర్పింది అమ్మ
రోజులెప్పుడూ మనవే కావని చెప్పింది కూడా అమ్మే!
నేనదిరినా, బెదరినా చేయూతనిచ్చింది అమ్మ
అందంగా ఎదిగ న నన్ను చూసి తెగ మురిసింది అమ్మే!
కష్టం తెలీకుండా, నష్టం కలగకుండా, కొమ్ము కాసిందీ అమ్మే!
అన్నిటా, నాకు పెన్నిధి, తానే అయింది అమ్మ
నేకలత పడితే, తొలుత చమర్చిన కన్నులు అమ్మవే!
నా నలతలకి ఎప్పుడైనా అమ్మ సేవలేగా ఔషధాలు!
కాలాలు మారినా, వర్ణాలు వెలిసినా, జలాలు ఉప్పొంగినా
తొణకనిది, అలుపెరగనిది, నిండైన అమ్మ మనసేగా
ఆమె త్యాగానికి, బిడ్డనైన నా భాగ్యానికి, నా మాతృమూర్తికి
పాదాభివందనాలు, శతకోటిఅభివందనాలు
వయసు పైబడినా, చూపు పలుచనైనా
భోగాలు నాకందించి, యోగినిలా వెలుగు పంచింది
ఏమని తలవను, అమెనెలా మరువను?
నాదేవతే ఐన అమ్మకి, ఇదో చిరు సందేశం...
నీ ప్రాపకంలో ఎదిగిన నేను, నీ జ్ఞాపకాలలో ఒదిగినప్పుడు,
జీవిత యాత్ర సుదీర్ఘమై తోచినప్పుడు,
దిక్కువై, చిరు దివ్వెవై, చెలిమివై, చేయూతవై,
నా దారులలో వెలుగులు నింపేది, నువ్వేగా అమ్మా......