నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

ఆకాశంలో అలజడులు -శుభ సూచికలా? విజయాలకి సంకేతాలా?...

."శకునాలు మంచివాయేనమ్మా, ఉత్తరానఉరుములురిమేనమ్మా, ముత్తైదువలిద్దరు అంగనా శోభనము పాడేరమ్మా, వనజాక్షి నా విభుడైన వాడు వచ్చేగాబోలు..... 'శకునాలు మంచివాయేనమ్మా“ అని సాగిన ఆ దరువు....కూచిపుడి నృత్య రీతిలో ఓ ముఖ్యమైన నాట్యాంశం - ‘భామా కలాపం’ లోనిది....

సత్యభామ  తన ప్రియసఖిని,శ్రీ కృష్ణుని  వద్దకు  రాయబారముగా పంపుతున్నప్పటి  సన్నివేశం అది.. డాన్స్ విషయం అటుంచి,... ’నిజంగానే ఉత్తారాన  ఉరుములు,  తూర్పున మెరుపులు  -భవిష్యత్తులో జరగనున్న మంచి చెడులని చేబుతాయా?’ అని అలోచింపజేసాయి, అనుభవంలోని కొన్ని సందర్భాలు...

ప్రతి యేడూ, కుటుంబంతో కలిసి,  తిరుపతి వెంకటేశ్వరస్వామిని,  శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోడం నాన్నకి పరిపాటే....దానిలో భాగంగా, 1977 లో ముందుగా తిరుపతి వెళ్ళాము.ప్రత్యేకం ఏమంటే, మొత్తానికి ఆ తడవ స్వామి దర్శనం మా విదేశీ పర్యటనలకి ఆశీర్వాదమయింది....  దేవుని దర్శనం సజావుగా జరిగింది.   అమ్మా వాళ్ళు కళ్యాణం చేయించారు.

త్రికరణశుద్ధిగా ఆ  స్వామిని వేడుకున్నాను.  ... అనుకున్న విధంగా,దక్షిణాఫ్రికా – మారిషస్,  సింగపూర్ – మలేషియా, ఫూజి– ఆస్ట్రేలియాలకి  మా  కల్చరల్ టూర్స్ అన్నీ, త్వరలోనే కార్యరూపం దాల్చాలనిమొక్కుకున్నాను.

రెండు రోజులు దిగువ తిరుపతి, పాపనాశనం కూడా వెళ్ళి,  తిరిగి  హైదరాబాద్ బయలుదేరాము... మా తిరుగు ప్రయాణ అనుభవం,  ఆ  విమానయానం  వర్ణనాతీతం. ఆనాటి తిరుపతి– హైదరాబాద్  ఫ్లైట్ - ఎక్కే మెట్టు, దిగే మెట్టులా,ఆకాశంలో పక్షిలా అల్లలాడింది....పైగా హోరున వాన.... ఉరుములు మెరుపులు...ఏనాడు అంత దగ్గరగా ఉరుములు,  మెరుపులు చూడలేదు.... బాగా భయపడ్డాము...మామూలుగా అయితే,  వర్షం వచ్చేలా ఉందని  బయటకి వెళ్ళేదాన్ని కూడా కాదు.

‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’అనో, ‘ఆయా సావన్ ఝూంకే’’ అనో కనీసం పాడుకునేదాన్ని కాదు....మా ఫ్రెండ్స్ లా...
అలా ఉధృత వాతావరణాన్ని అవాయిడ్చేయడానికి కూడా కారణం ఉంది.

ఎదురు కాళ్ళన పుట్టానని – వర్షంలో  బయటకెళ్ళడం అటుంచి, నన్నసలు కిటికీకి  దగ్గరగా  కూడా  కూర్చోనిచ్చేది  కాదు  అమ్మ.  ఎదురుకాళ్ళ న పుట్టినవారు ఉరుములు, మెరుపుల్ని ఆకర్షిస్తారట.  కొద్దిరోజులు పంచలోహాలతో చేసిన కడియం కూడా వేసింది మా అమ్మ నాకాలికి.

అలాంటి నాకు ఆనాటి ఆ తిరుపతి ఫ్లైట్, ఆ భీకర వాతావరణం భయంగాను, కొత్త అనుభూతిగాను  అనిపించింది.....

ఫ్లైట్ కుదుపికి,ఓ తోటి  ప్రయాణీకురాలుభయంతో వణికిపోతూ,  దేవుడికి ప్రార్ధనలు చేస్తూ కూర్చుంది.  మధ్యలో ఓ సారి, ఆ పెద్దామె కళ్ళు తెరిచి మా వంక చూసింది. “ఇక్కడి నుండి బతికి బయట పడితే మాత్రం, మనందరికికూడా ఇదంతా శుభసూచికమౌతుంది,  అంతా మేలు జరుగుతుంది,”  అనేసి మళ్ళీ కళ్ళు మూసుకుని  దేవుణ్ణి ప్రార్ధించడం మొదలు పెట్టింది..

అంత భయంలోనూ నాకూ, అమ్మకి కూడా కోపం వచ్చింది ఆమె మీద...’బయటపడితే’.... అని అనుమానం కలిగించినందుకు... మొత్తానికి కాసేపటికి వాతావరణం సర్దుకుంది...

తిరుపతి ట్రిప్ అయి ఇంటికొచ్చిన మరునాడే,  ఎంతో జాప్యం అవుతూ వచ్చిన మా విదేశీ యానంకి –పాస్పోర్ట్, వీసాలతో పాటు,సౌత్ ఆఫ్రికా – జొహనస్ బర్గ్ – మారిషస్ కి కల్చరల్ టూర్ వివరాలు చేతికందాయి...

ట్రావెల్ ఐటనరీ తో ప్రిలిమినరీషెడ్యూల్ తో సహా - స్పెషల్  డెలివరీ  గా ఇంటికే వచ్చాయి... నేను, అమ్మ ముఖాలు చూసుకున్నాము... ఫ్లైట్ లో పెద్దామె మాటలు గుర్తు చేసుకున్నాము.

మరోమారు   ఆకాశాన  విలయతాండవం..........

1977 మే లో, నెలరోజుల పాటుసౌత్ ఆఫ్రికా, జొహనస్ బర్గ్ లల్లో,  మా అంచనాలని మించిఎంతో ఘనంగా జరిగిన,ముప్పైకి పైగా ప్రోగ్రాములు, టి.వి షోలు,’ ముగించుకొని, విజయోత్సాహంతో డర్బన్ నుండి–మారిషస్ ప్రయాణమయ్యాము.

ఆ రోజే అందిన మా టూర్ ఫోటోలబ్యాగుని, నా చేతికందించారు సభ ఆర్గనైజర్.  అదీ వచ్చే ముందు, ఎయిర్పోర్ట్ లో.

ఫోటోలు చూస్తూ, మా సింగర్స్ చంద్రకాంత, దుర్గ తో మాట్లాడుతూ సరదాగా గడుస్తున్న ఆ విమానయానం... ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది.   ఉన్నట్లుండి,  చీకట్లు కమ్మాయి... విమానం వేగం పెరిగినట్టు కొద్దిక్షణాలు,  అంతలోనే,  ఓ చుట్టు చుట్టి వెనుతిరిగినట్టుగా  అయ్యి  వేగం తగ్గినట్టుగా మరి కాసేపు.... చీకటిగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా తిరిగి పట్టపగలుగా మారింది...

ఇంతలో అనౌన్స్మెంట్ –బయట వాతావరణం ‘అలజడి’ గా ఉందని, దయచేసి సీట్ బెల్ట్లు  కట్టుకొని కూర్చోమని...... సరే, కూర్చున్న కాసేపటికి,  వెలుగైన  నీలాకాశం  మళ్ళీ  చీకటి మయమైంది.

మా ఆర్కెస్ట్రా వాళ్ళ గోల, భయం వర్ణనాతీతం...నేనూ భయపడ్డాను – కానీ  ఈ విమానం కుప్పకూలితే?....  అన్న తలంపు కలగలేదు.  అంతటి పర్యవసానం గురించి ఆలోచించలేదు... చిన్నదాన్నవడంవల్లనేమో,  అంత దూరం ఆలోచించలేదని ఇప్పుడన్పిస్తుంది... నా ఫోటోల బాక్స్ వొళ్ళోనే ఉంది.  చేత్తో ఓ సారి దాన్ని తడిమాను.  ‘అత్యంత విజయవంతంగా జరిగిన మా టూర్ విశేషాలు- మిన్నంటిన  ప్రశంశల  పర్వాలు, కొత్తగా విదేశాన నా నృత్యానికి - నేనందుకున్న ఎనలేని  ప్రజాదరణ– ఇవన్నీ - స్వదేశాన అందరితో పంచుకొనే  అవకాశం  కావాలని’  దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను......

ప్లేన్కుదుపికి తల తిరిగినట్టయి, కళ్ళు మూసుకున్నాను.

మరికాసేపటికి పిడుగు లాంటి వార్త అందించాడు ఫ్లైట్ కాప్టెన్.   ప్లేన్ కి ఉన్న నాలుగు ఇంజీన్స్ లో రెండు ఫెయిల్ అయ్యాయని, కనుక ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయవలసిన అవసరం ఉందని...కాబట్టి ఓపిక పట్టమని, కోపరేట్ చేయమని,  ఎప్పటికప్పుడు  సమాచారం అందిస్తామని   అనౌన్స్ చేసాడు.

అది విని మా ఒకొక్కరి మనస్థితి ఎలా ఉంటుందోమాటల్లో చెప్పేది కాదు....

మా అందరిలో తక్కువ భయపడింది నేనేనేమో... ఏడవలేదు...కూడా.  మా సింగర్ చంద్రకాంత ముఖం మీద కూడా చిరునవ్వు అలాగే ఉంది.... మొత్తానికి ‘సెషల్స్’  అనే ఐలాండ్ వాళ్ళు,ప్లేన్కి ఎమర్జెన్సీలాండింగ్ కి అనుమతి ఇవ్వడంతో,మళ్ళీ భూమ్మీద కాలు పెట్టగలిగాము...

‘సెషల్స్’ ఓ చిన్న ఐలాండ్.. ఆ ప్రదేశం యొక్క అందం వర్ణణాతీతం.   మేము ఓ ‘ఇన్’ లో ఉన్నాము.   అట్లాంటిక్ మహా సంద్రం అంచుల మీద కట్టిన పెద్ద హోటల్... లాడ్జింగ్-బోర్డింగ్ సదుపాయం ఫైవ్ స్టార్  గానే ఉంది.... బయటకి వస్తే,  మైళ్ళ దూరం వరకు  మేము చూడగలిగింది – సముద్రం – ఆకాశం – అలలు- తెల్లని చల్లని ఇసుక, కొబ్బరి చెట్లు. అల్లంత దూరంగా  మాత్రం - ఆ నిశ్చల సముద్రం,నీలాకాశపుటంచుల్ని  తాకుతున్నట్టుగా అనిపిస్తుంది.... ... ‘భూమి ఇంత విశాలంగా ఉంటుందా?’ అనిపించింది...

అందరిలో టెన్షన్ కాస్త తగ్గింది...ప్రతి పూట ఏదో తినడం మైళ్ళ దూరాలు నడిచి, ఇసుకలో పరిగెత్తడం, కూర్చుని పాటలు పాడుకోడం చేసాము... మా సింగర్స్ -దుర్గ, చంద్రకాంత, నేను జీవితకాలంపాటు సరిపడా కబుర్లు, కథలు చెప్పుకున్నాం.

తిరిగి  హైదరాబాద్ వెళ్ళాక ఏమేమి పనులున్నాయో, ఏమి చేయాలో మాట్లాడుకునేవాళ్ళం, నాన్న, అమ్మ, నేను.

నాలుగు రోజులైనా ప్లేన్ రిపైర్అవ్వలేదు... వేరే ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందని చెప్పారు.   అందరికీ ఓపికలు  నశించడం మొదలైంది. ఆత్రుత పెరిగింది.   ఐదో రోజు,  నిలిపివేయబడిన ఎయిర్-క్రాఫ్ట్ఇంజిన్స్రిప్లేస్ అవ్వాలి...కాబట్టి,  దాన్ని పూర్తిగా నిలిపివేశారని విన్నాము. మధాహ్నానికల్లా,  వేరే ఫ్లైట్ వచ్చింది..మొత్తం రెండువందల మందినీ తీసుకొని, సునాయాసంగా సముద్రాలు దాటుకొని,  మారిషస్ చేరాము...

‘అమ్మయ్య’ అని గుండెల నిండా గాలి పీల్చుకున్నాము...

మారిషస్ ‘మహాత్మా గాంధి సెంటర్’ లో అత్యంత విజయవంతంగా ప్రోగ్రాంలు  ముగించుకుని ఇల్లు చేరాము...అక్కడుండగా,  మారిషస్ ప్రెసిడెంట్ ఆహ్వానం పై ఆయన్ని వెళ్ళి ప్రెసిడెన్షియల్ భవనం లో కలిసాము...

మలేషియా – సింగపూర్ - మా తదుపరి టూర్,  అవుతుందని ఆశించిన  నాలో  నిరాశ  చోటుచేసుకోసాగింది.  ఆ కార్యం కష్టతరమయ్యేలా ఉందని తెలిపారు, మలేషియా లోని స్థానిక తెలుగు సంఘం వారు.  ఏవో కారణాల వల్ల ఆ  టూర్  కార్యరూపం దాల్చే అవకాశం కూడా సన్నగిల్లింది  అప్పట్లో. 

తిరుపతి ఫ్లైట్ లో ఆ పెద్దావిడ అన్న మాటలు గుర్తొచ్చాయి...–ఓ సందేహం- ఓ ఆశ కలిగాయి.

మా డర్బన్ ఫ్లైట్ సమయంలో, అన్ని వైపులనుండి మమ్మల్ని భయపెట్టిన ఉరుములు మెరుపులు కూడా శుభసూచికలేనేమో...ఎలాగైనా మా తత్తిమ్మా టూర్స్ కూడా త్వరలో

కార్యరూపం దాల్చేనేమో అన్న ఓ wishful thought  కలిగింది...మా గాయని చంద్రకాంతతో  అన్నాను.  ఇద్దరమూ ‘సిల్లీ థాట్’  అని నవ్వుకొని కొట్టిపారేశాము.

ఆకాశంలో ఆశల హరివిల్లులు....సాకారమైన నాట్యకలలు.... 

వెంటనే ఉంటుందనుకున్న మలేషియా టూర్, రెండు నెలల సమయం పట్టినా, అనూహ్యంగా,ఆ కల కూడా సాకారమైంది.   మలేషియా లోని ‘రామసుబ్బయ్య స్కాలర్షిప్ ఫండ్’ వారు మా టూర్ కి సహకరిస్తామన్నారు.   తమిళ సంఘాలు కూడా సహకరించి ప్రోగ్రాములు మరింత పెద్దెత్తున జరిగే అవకాశం  ఉందని నాన్న చాలా సంతోషించారు.

మా సంతోషాన్ని పదింతలు చేసిన విషయం - మలేషియా టూర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పాన్సర్ చేయడానికి ముందుకు రావడం.కూచిపూడి రంగాన నా కృషిని పరిగణనలోకి తీసుకొని, సాంస్కృతిక రాయబారిగా నన్ను గుర్తించడం కొసమెరుపు.మా ప్రదర్శనల ద్వారా సేకరించిన నిధులని – మలేషియా లోని ‘పేద విద్యార్ధుల స్కాలర్షిప్ నిధికి’ మరియు ‘ద్వితీయ తెలుగు ప్రపంచ మహాసభల నిర్వహణలకి’  సమానంగా కేటాయించడాన్ని, నాన్న   స్వచ్చందంగా ఒప్పుకున్నారు.

మా ఆ టూర్ వల్ల, నృత్య కళాకారిణిగా  చిన్న వయస్సులోనే అనూహ్య స్థాయినందుకున్నానని  పలు పత్రికలు - టి.వి. ప్రసారాలు – కళాభిమానులు,  ప్రశంసల పరంపరలందించారు.

అయితే, మా మలేషియా టూర్ అంత చక్కగా జరిగి, అంతటి ఖ్యాతిని తెచ్చిపెడుతుందని,  నా కళా జీవితానికి మరో వెన్నెల మెట్టవుతుందని ఊహించానా?  లేదే!

డర్బన్  నుండి మారిషస్ ప్రయాణమప్పుడు, ఆకాశాన అంతటి తీవ్రమైన అలజడులు –మా తదుపరి ‘మలేషియా-సింగపూర్  ట్రిప్’ కూడా  ఘనంగా జరుగుతుందన్న  విషయాన్నే చెప్పాయేమో మరి? అనుకున్నాను....

ముచ్చటగా  మూడో  మారు కూడా, మా పై మెరుపులు మెరిపించి,  ఉరిమింది నీలాకాశం..
కౌన్తాన్ మహారాజు ఆహ్వానం పై,  ప్యాలస్ లో నా నృత్య ప్రదర్శన...


మా షెడ్యూల్లో లేని ఓ ప్రోగ్రాం తగిలింది. పినాంగ్ లో పర్ఫామెన్స్ కి వెళుతుండగా, కౌన్తాన్అనే ఓ నగరంమహారాజు గారి ప్యాలస్ నుండినృత్య ప్రదర్శన చేయవలసిందిగా ఆహ్వానం పలికారు...టైం లేదు.  ఎలా సాధ్యమౌనో అర్ధం కాలేదు.  ఎందుకంటే,  మరునాడు కౌలాలంపూర్ లో మా farewellprogramకి ఘనమైన  ఏర్పాట్లు జరిగాయి.  పలువురు ప్రముఖలతో పాటు, రెండువేల మంది ప్రేక్షకులు ప్రోగ్రాం కి వస్తారని అంచనా.   ఇక ఆ తరువాతి రోజు, హైదరాబాదుకి  మా తిరుగు ప్రయాణం.

అయితే, మహారాజా వారి నుండి సభకి, సంఘం వారికి అందగల నగదు, నజరానాలు దృష్టిలో పెట్టుకొని, ఎలాగైనా ఆ అదనపు ప్రొగ్రాం చేద్దామనే  నిశ్చయమయ్యారు  సభ వాళ్ళు.

హడావిడిగా అయినా,  కౌన్తాన్రాజా వారి కొలువులో, ప్రోగ్రాం బాగాజరిగింది. కౌలాలంపూర్ లో పర్ఫామెన్స్ కి, తిరుగు  ప్రయాణమయ్యాము.   రెండు నగరాలకి దేశమంత దూరం.  వాతావరణం ఉధృతంగా ఉండడంతో,  ఫ్లైట్ కాన్సెల్అయింది. నిముషాల మీద చార్టర్డ్ ఫ్లైట్ఏర్పాటు చేసారు... పదిమంది పట్టే చిన్న ప్లేన్ అది.... మా లగేజ్, మేము కొంత ఇరుగ్గానే ఉంది. 

ఆకశం లో గూడ్సుబండిలా మెల్లగా ఎగురుతూ వెళ్తున్న ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఉదృతమైన  గాలివానలో చిక్కుకుంది....ప్రతి మెరుపుకి మా కళ్ళు చెదురుతూంటే, ప్రతి ఉరుముకి అదురుతూ  ఎగిరింది మా చార్టర్డ్  ఫ్లైట్.  ఆర్కెస్ట్రా వాళ్ళ మంత్రాలు, పూజలు, మా కేకలతో ఎయిర్ క్రాఫ్ట్ లోపల కూడా గందరగోళంగా ఉంది...

అప్పుడు కూడా,‘ఈ విమానం కూలితే’, అన్న భయం నాకు కలగలేదంటే, ఇప్పుడు  నేనే నమ్మలేను.   చాలా గంటలు అలాగే ప్రయణమయి మేముండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి చేర్చారు....

ఆ అనుభవం తలుచుకున్నప్పుడల్లా  అసలు నిజంగా అలా జరిగిందా!!! అనిపిస్తుంది....

మలేషియా - సింగపూర్  టూర్ కూడా అప్పటివరకు ఇతర ప్రోగ్రామ్స్ ఏవీ జరగనంత బాగా జరిగాయని,  ప్రేక్షకులనుండి, పాత్రికేయుల నుండి మంచి స్పందన ఉందని –తెలుగు సంఘం వారు, రామసుబ్బయ్య స్కాలర్షిప్ వారు సంతృప్తి వ్యక్త పరిచారు.  సమాచారాన్ని పత్రికలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అందజేశారు....

ఆకాశంలో  అలజడులు  శుభసూచికలే నన్నారు మా వాళ్ళు.  రెండునెలల తరువాత జరిగిన నా వివాహానికి,ఆకాశంలో నాటి ఆ అలజడులే  - మేలతాళాలయ్యాయని,  పెళ్ళికి  వచ్చిన  మా ఆర్కెస్ట్రా వాళ్ళు  అనడం, అందరమూ నవ్వుకోవడం  ఇంకా గుర్తే!

మలేషియా – సింగపూర్ టూర్ నిధులు:

మా ప్రోగ్రాముల ద్వారా సేకరించిన నిధుల నుండి –10 లక్షల మలేషియన్ డాలర్లు అక్కడ జరగనున్న రెండవ ప్రపంచ తెలుగు మహా సభల నిధికి అందించాము... అంతే మొత్తాన్ని వంద మంది నిరుపేద విద్యార్ధుల విద్యాబోధనకి, లైబ్రరీలకి, స్కాలర్షిప్ నిధికి –శ్రీ రామసుబ్బయ్య స్కాలర్షిప్ ఫండ్ కి అందించడమైంది...

 

సౌత్ ఆఫ్రికా తెలుగు మహా సభలు సేకరించిన నిధులు అక్కడ రామాలయ నిర్మాణానికి, తెలుగు భాషాభివృద్ధికి, అక్కడి తెలుగు వారి సంస్కృతి సాహిత్యాలని వృద్దిపరచే పలు కార్యక్రమాల నిధికి  వినియోగించడమైంది....

కొన్ని హై లైట్స్:

లోక ప్రఖ్యాతి గాంచిన మిమిక్రీ కళాకారులు – శ్రీ వేణుమాధవ్ గారు మా సౌతాఫ్రికా టూర్ లో, మాతో పాటే పాల్గొనడం...ఆయన ప్రదర్శనలు ప్రేక్షకుల మన్ననలు పొందడం...

మలేషియాలో కొందరు స్థానికులు మా ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ చూడాలని ఉందని బస్సుల్లో మమ్మల్ని ఫాలో అవడం...(దగ్గరిలో ఉన్న ప్రోగ్రాములు కొన్ని మేమూ వాన్ లో తిరిగి చేసేవాళ్ళం)..మేము పర్యటించిన వరకు సౌత్ ఆఫ్రికా లోని తెలుగు వారు – మా రాక వల్ల, నా నృత్య కార్యక్రమాల వల్ల – అనూహ్యమైన స్పందన పొందారట.  మా ప్రోగ్రాములు, మా ఆహార్య వ్యవహారాలు వారిని ఎంతగానో ఉత్తేజపరిచాయట.   నిదర్శనంగా మేము తిరిగి వచ్చేసిన తరువాత వెంటనే తెలుగువారింట పుట్టిన ఆడపిల్లలికి ‘ఉమాభారతి’ అని పేరు కూడా పెట్టుకున్నారట...అన్న విషయం కూడా మరెన్నో వివరాలతో పాటు వాళ్ళ సావనీర్ లో ప్రచురించారు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి