సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam
ఆముక్తమాల్యద (గతసంచిక తరువాయి)

ప్రథమ పద్యం తరువాత, ఇది విష్ణుసంబంధమైన ప్రబంధం కనుక, శ్రీకృష్ణదేవరాయలు,  తను వ్యక్తిగతంగా వీరవైష్ణవుడు కనుక , వరుసగా ఆదిశేషుడైన అనంతుని ఒక పద్యంలో, విష్ణువాహనమైన గరుడుడిని ఒక పద్యములో, విష్ణుకార్య దురంధరుడు, వైష్ణవ భక్తి మార్గంలో దేవసేనాపతి ఐన విష్వక్సేనుడిని  ఒక పద్యంలో, అలాగే పాంచజన్య శంఖమునూ, సుదర్శన చక్రమునూ, కౌమోదకీ గదనూ, శార్జ్గధనుస్సును, శ్రీహరి ఖడ్గమైన నందకమును, వైష్ణవ మార్గ గురువులు ఐన పన్నిద్దరాళ్వారులనూ, ఇలా మొత్తం తొమ్మిది పద్యాలలో ఇష్టదేవతా స్తుతిగా మహావిష్ణు పరివారముగా భావించే పైన చెప్పిన అందరినీ, ఆయన ఆయుధములనూ, ఆ మార్గంలో శ్రేష్ఠులు ఐన గురువులనూ ప్రార్ధించి ఆ తర్వాత  ఈ గ్రంథ రచనకు కారణమైన దివ్య సన్నివేశాన్ని ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచి వర్ణించాడు.పైన చెప్పుకున్న తొమ్మిదిపద్యాలూ నిజంగా నవరత్నాలు. అద్భుతమైన వర్ణనలు, చమత్కారము వున్నాయి, కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక అంశాలు గనుక వాటి గురించి విశేషముగా ఇక్కడ చర్చ చేయకుండ, ఒక మాట మాత్రం చెప్పుకుందాం. భగవంతుడి పరివారము, ఆయుధములు, భక్తులు వీరందరూ కూడా భగవత్సమానులే.

వారిని స్మరించుకొనడం చేత భగవానుడికి తనను స్మరిస్తే ఎంత ప్రీతి కలుగుతుందో, అంతటి ప్రీతి కలుగుతుంది. కనుక ఈ ప్రార్ధనలు. సంప్రదాయప్రకారం కూడా ముందు పరివార దేవతలను సేవించి, వారి అనుమతితో, వారిని సంతృప్తులను  చేసిన తర్వాత ప్రధాన దేవతను సేవించాలి. లౌకికంగా చూసినా, మనము అత్యంత ప్రేమతో ఆరాధించే వారి ప్రతి కదలిక, కట్టూ, బొట్టూ, మాటతీరూ అన్నీ మనను మైమరచిపోయేట్లు చేయడం ఎంత సహజమో, వారిని తలచుకోగానే వారికి సంబంధించిన సర్వమూ గుర్తుకు రావడం అత్యంత సహజం, అది మన అంకిత భావానికి అసలైన దర్పణం.  మనము అభిమానించే  నాయకుల, కళాకారుల, క్రీడాకారుల పిల్లలు, బంధువులు, మిత్రులు, వారి వాహనాలు, వారి అలంకార వస్తువులు మనకు మనం అభిమానించే ఆ నాయకులూ, కళాకారులూ, క్రీడాకారులతో సమానంగా అభిమాన పాత్రం ఐనప్పుడు ఇక భగవద్భక్తులకు భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ భగవంతుడితో సమానమే కావడం  విచిత్రమూ అసమంజసమూ ఏమీ కాదు! కనుక ఇలా తన ఇష్ట దేవతా స్తుతి చేసిన తర్వాత, తనను ఈ గ్రంథ రచనకు ప్రేరేపించిన సన్నివేశాన్ని వర్ణించాడు రాయలు.యుద్ధ విజయాలకై దండయాత్రలకు ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రసిద్ధ దేవాలయాలను దర్శించి, ఇనాములూ, భూములూ ఇచ్చి,  జీర్ణమై పోయిన ఆలయాలను ఉద్ధరించి, తన దర్శనానికి గుర్తుగా కొన్ని శాసనాలనో, గుర్తులనో స్థాపించి, కొన్ని స్మృతిచిహ్నాలను తీసుకుని తిరిగి రాజధానికి చేరుకునేవాడు రాయలు. కళింగ దండయాత్ర సందర్భముగా విజయవాడ మీదుగా వెళ్ళేప్పుడు,  వెనక్కు తిరిగి వచ్చేప్పుడూ శ్రీ కాకుళ ఆంధ్ర మహా విష్ణువు దర్శనం చేసుకున్నాడు రాయలు. సింహాచలం, ఉదయగిరి, అన్నవరం, ఇలా ఎన్నో ప్రముఖ దేవాలయాలను ఆ దండయాత్ర సందర్భంగా దర్శించాడు. శాసనాలను వేయించాడు. జీర్ణ దేవాలయ ఉద్ధరణ చేశాడు. గాలి గోపురాలను నిర్మించాడు. ఉదయగిరి నుండి అక్కడి బాలకృష్ణుని ప్రతిమను తీసుకుని వెళ్లితన పూజా మందిరంలో స్థాపించుకున్నాడు. విజయవాడలో కొన్ని మాసములు మకాం వేశాడు. విజయవాడ-మచిలీపట్టణం మార్గంలో, విజయవాడ తర్వాత దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల తర్వాత ప్రధాన రహదారి దిగి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ శ్రీ కాకుళం అనే గ్రామం వున్నది. అక్కడి ప్రసిద్ధ దేవాలయంలోని విష్ణుమూర్తికి ఆంధ్ర మహావిష్ణువు అని పేరు. ఈ నాటికీ అక్కడ ఈ దేవాలయం ఉన్నది. శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేక మహోత్సవం జరిగి ఐదువందల  సంవత్సరాలు పూర్తి ఐన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం వారు మహోత్సవాలను జరిపిన సంవత్సరం తర్వాత, ఏ ఆంధ్రుల సంక్షేమం గురించి, సాహిత్యం గురించి, సాంస్కృతిక వైభవాన్ని గురించి నిరంతరమూ ఆలోచించాడో, ఆ ఆంధ్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కూడా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను జరిపించింది.

'' అని యిష్టదేవతా ప్రార్ధనంబు జేసి మున్నే గళింగ దేశ విజిగీషా  మనీషన్ దండెత్తిపోయి విజయవాటిం గొన్ని వాసరంబులుండి  శ్రీకాకుళ నికేతనుండగు నాంధ్ర మధుమథను  సేవింపం బోయి హరివాసరోపవాసం బచ్చట గావింప నప్పుణ్య రాత్ర చతుర్థ యామంబున..'' అని ఒక చిన్ని గద్యం లో తన స్వప్న వృత్తంత నేపధ్యాన్ని చెప్పాడు. ఇది ఈ రచనకు కీలకమైన సన్నివేశం కనుక ఈ గద్యను కూడా పరామర్శ చేసుకుందాము.అప్పటికి కొంతకాలం క్రితం కళింగదేశం ( ఒరిస్సాపై, గజపతులపై) మీదికి దండయాత్రకు వెళ్ళినప్పుడు, విజయవాటిక అంటే విజయవాడలో కొన్నిదినములు నివసించి, సమీపంలోనే వున్న శ్రీ కాకుళం  అనే గ్రామములోని ఆంధ్ర మహావిష్ణువు అని పేరు గల విష్ణుమూర్తిని దర్శించి, ఒక ఏకాదశి నాడు అక్కడనే ఉపవాసం చేసి, ఆ సన్నిధిలో నిదురించిన తనకు (రాయలకు) ఆ రాత్రి చతుర్థ యామంలో ఒక కల వచ్చినదనీ, ఆ కలలో ఆ శ్రీ కాకుళ ఆంధ్ర మహా విష్ణువు ఇలా దర్శనమిచ్చి, ఇలా ఆనతిచ్చాడనీ కొనసాగిస్తున్నాడు రాయలు. చతుర్థయామము అంటే నాలుగవ ఝాము. ఝాము అంటే మూడుగంటల కాలవ్యవధి. పగలు నాలుగుఝాములు, రాత్రి నాలుగుఝాములు , వెరసి ఇరవైనాలుగు గంటలు ఒకరోజు అది భారతీయుల లెక్క. రాత్రి నాలుగవఝాము అంటే రాత్రి చివరి భాగంలో, అంటే తెల్లవారు ఝామున, ఇంత ప్రత్యేకంగా చెప్పడం ఎందుకంటే,

తెల్లవారబోయే ముందు వచ్చిన కలలు సత్త్వరమే నిజము అవుతాయి అని నమ్మకం. రాత్రి ఒకటవఝామున వచ్చిన కలలు ఒక సంవత్సరానికి, రెండవఝామున వచ్చిన కలలు ఆరు నెలలకు,  మూడవఝామున వచ్చిన కలలు ఒక నెలలోనూ నాలుగవఝామున వచ్చిన కలలు వెంటనే ఫలిస్తాయని జ్యోతిష శాస్త్రం స్వప్న సంబంధ విషయాలలో చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయలు సకలశాస్త్ర పారంగతుడు అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. అందుకే ప్రత్యేకంగా చతుర్థయామమున అని ప్రత్యేకముగా చెప్పడం, ద్వితీయ, తృతీయ యామము అన్నా గ్రంథరచనకు వచ్చే యిబ్బందేమీ ఉండదు! 

సీ.             నీలమేఘము డాలు డీలు సేయగ జాలు
                 మెరుగు జామనచాయ మేని తోడ
                 నరవిందముల కచ్చులడగించుజిగి హెచ్చు 
                 నాయతంబగు కన్నుదోయి తోడ
                 బులుగురాయని  చట్టుపల వన్నె నొరబట్టు
                 హొంబట్టుజిలుగు రెంటెంబుతోడ 
                 నుదయార్క బింబంబు నొరపు విడంబంబు 
                 దొరలంగనాడు కౌస్తుభము తోడ 

            తే. దమ్మికేలుండ బెరకేల దండ ఇచ్చు
                 లేములుడిపెడు   లేజూపు లేమతోడ 
                 దొలకు  దయదెల్పు చిరునవ్వుతోడగల ద 
                 దంధ్ర జలజాక్షు డిట్లని యానతిచ్చె

(నీలమేఘము డాలు డీలు సేయగా జాలు మెరుగు చామయన చాయమేనితోడ)నీలి మేఘము యొక్క చర్మము అంటే చర్మకాంతిని నీరసించేట్లు, తక్కువ చేసేట్లు చేయ గలిగిన మెరిసిపోయే చామనచాయలోనున్న శరీరంతో(అరవిందముల కచ్చులు అడగించు జిగిన్ హెచ్చు ఆయతంబగు కన్నుదోయి తోడ) పద్మముల అతిశయమును అణచివేసే, కాంతితోనూ, విశాలమైన కన్నులతోనూ(పులుగు రాయని చట్టుపల వన్నెన్ ఒరబట్టు హొంబట్టు జిలుగు రెంటెంబు తోడన్)పక్షులరాజైన గరుత్మంతుని రెక్కల రంగును ఒరుసుకుని పోవుచున్న, సానబెట్టుచున్న బంగారపు వర్ణములోని పట్టునేతగల వస్త్రముతో (ఉదయార్క బింబంబున్ ఒరపు విడంబంబు తొరలంగనాడు కౌస్తుభము తోడన్)ఉదయించుచున్న సూర్యబింబమును పోలి, తూలనాడే, పరిహసించే కౌస్తుభ మణితో(తమ్మికేలుండన్ పెర కేల దండ ఇచ్చు)పద్మము ఒక చేతిలో నుండగా ఇంకొక చేతితో చేయూతనిస్తూ, స్వామి చేతిలో చేయి కలిపి(లేములుడిపెడు లే జూపు లేమ తోడ)రిద్ర్యమును తొలిగించే లేత చూపుల యింతితో, లక్ష్మీ దేవితో (దొలకు దయ దెల్పు చిరునవ్వు తోడన్ కల)తొణికిసలాడుతున్న దయనుసూచించే చిరునవ్వుతో, 'కల'యందు (తదంధ్ర  జలజాక్షుడు ఇట్లు అని ఆనతిచ్చెన్)పద్మములవంటి కనులు గలిగిన ఆ ఆంధ్ర మహావిష్ణువు ఇలా పలికి ఆజ్ఞాపించాడు.

నీలిమేఘము యొక్క కాంతిని  ధిక్కరించే ప్రకాశవంతమైన చామనచాయ రంగులో వున్నవాడు, పద్మముల 'కచ్చులు' అంటే  అతిశయాన్ని, అంటే ప్రగాల్భాలను అణిచి వేశే కాంతివంతమైన, విశాలమైన కన్నుల జంట గలవాడు దర్శనమిచ్చాడు. కచ్చులు అనేది చాల అరుదైన పదం. అచ్చ తెలుగు పదం. ఎదిగే అమ్మాయిలకు పరికీణీలు, గౌనులు కుట్టించేప్పుడు కొద్దిగా కచ్చులు వదిలి పెట్టమని చెప్తారు తల్లులు, అదనంగా కుట్టులో గుడ్డను వదిలిపెట్టమని, ఎదిగే వయసు కనుక బిగుతు ఐనప్పుడు కుట్లు విప్పుకుంటే ఆ అదనపు గుడ్డ వల్ల కొలత సరిపోతుంది, కొద్దిగా వొళ్ళు చేసినప్పుడు కూడా అని. కచ్చులు అంటే అదనమైన, అధికమైన అని. స్నేహితులు పరస్పరం వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు విసురుకుంటూ, 'ఎక్స్ట్రా' లు చెయ్యొద్దు అనుకుంటుంటారు, కచ్చితంగా ఆ భావాన్ని తెలిపే పదం ఇది. ఆ స్వామి ధరించిన బంగారపు వర్ణపు అంచులు కలిగిన పట్టువస్త్రం ఎంత కొత్తగా,మిసిమి పసుపులో వుంది అంటే, పులుగురాయడు, అంటే పక్షులకు రాజైన గరుత్మంతుడిని ఎక్కి స్వామి ప్రయాణం చేస్తున్నప్పుడు, అటూ ఇటూ కాలువేసుకుని కూర్చోడం వల్ల( మనం ద్విచక్ర వాహనం మీద కూర్చున్నట్లు ) రెండుప్రక్కల, డొక్కలమీద, రెక్కల వద్ద, ఈ పట్టు వస్త్రాల రాపిడికి ఆ రంగు గరుడుడి పార్శ్వాలను సానబెట్టినట్లు, రుద్దినట్లుగా ఆ రెక్కలు, పార్శ్వాలు పసుపురంగును పూసుకుంటాయేమో  అన్నంత పచ్చని పట్టువస్త్రాలను ధరించి వున్నాడు,  ఉదయిస్తున్న  సూర్య కాంతిని  ధిక్కరించే లేతదైన ఎర్రని కాంతి కలిగిన, కౌస్తుభమణిని కలిగివున్నవాడు, ఆయన ప్రక్కన ఒక యింతి వున్నది, ఆమె ఒకచేతిలో పద్మము వున్నది, మరొక చేయి స్వామి వారి చేతికి ఊతం ఇస్తున్నది, ఆమె లేత చూపులు సమస్త దరిద్రాలనూ దూరం చేస్తాయి, ఎందుకంటే ఆమె శ్రీ మహాలక్ష్మి కనుక. లేత చూపులు అంటే ప్రసన్నంగా చూసే కొనగంటి చూపులు, కరుణతో నిండిన నాజూకైన చూపులు. కొసలు లేతగా వుంటాయి కనుక కొసకంటినుండి, చూసీ చూడనట్టు చూసే కంటినుండి వచ్చే చూపులు!  ఇటువంటి ఇంతితో కలిసి దర్శనమిచ్చిన ఆ స్వామి దయ తొణికిసలాడే కనులతో, చిరునవ్వుతో యిలా పలికి, యిలా  ఆజ్ఞ ఇచ్చాడు.  

సీ. పలికి తుత్ప్రేక్షోపమల జాతి బెం పెక్క 
        రసికులౌనన మదాలస చరిత్ర 
    భావధ్వనివ్యంగ్య సేవధి కాగ జె
        ప్పితివి  సత్యావధూ  ప్రీణనంబు 
     శృతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి 
        సకలకథాసార సంగ్రహంబు 
     శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగా రచించితి సూక్తి
        నైపుణి  జ్ఞాన చింతామణి కృతి

తే. మఱియు రసమంజరీ ముఖ్య మధుర కావ్య
     రచన మెప్పించుకొంటి గీర్వాణ భాష
     నాంధ్ర భాష యసాధ్యంబె యందు నొక్క 
     కృతి వినిర్మింపుమిక మాకు బ్రియము కాగ

(ఉత్ప్రేక్ష ఉపమల జాతి పెంపెక్క రసికులౌనన మదాలస చరిత్ర పలికితి )ఉత్ప్రేక్ష, ఉపమాన, జాతి (అంటే స్వభావము అనే ధ్వనితో) స్వభావోక్తులతో రసికులు మెచ్చుకునేట్లు మదాలస చరిత్ర రచించినావు. (భావ ధ్వని వ్యంగ్య సేవధి కాగ సత్యావధూప్రీణనంబు చెప్పితివి) భావము, ధ్వని, వ్యంగ్యము నిక్షేపించి 'సత్యావధూప్రీణనంబు' రచించితివి. (శృతి పురాణ ఉపసంహితలు ఏర్చి సకల కథా సార సంగ్రహంబు కూర్చితివి)వేదములను, పురాణములను సంహితలను శోధించి సకలకథాసారసంగ్రహమును రచించితివి. (శ్రోతృ అఘ ఛటలు విచ్చుగా జ్ఞాన చింతామణి కృతి సూక్తి నైపుణి రచించితి)వినేవారి పాప సమూహాలు విచ్చిపోయేట్లు జ్ఞాన చింతామణి కృతిని చక్కని సూక్తుల నైపుణ్యంతో రచించితివి. శ్రీకృష్ణ రాయా! ఉత్ప్రేక్షా , ఉపమానాలంకారాలతో, స్వభావోక్తులతో రసికజనులు భళీ అనేట్లు మదాలస చరిత్రను, మధురమైన భావాలను, ధ్వని, వ్యంగ్యమూ నిక్షేపించి సత్యావధూప్రీణనంబు అనే గ్రంథమును, వేదములను, పురాణములను, సంహితలను శోధించి సకలకథాసారసంగ్రహమునూ, వినేవారి పాప సమూహాలు తోలిగిపోయేట్లుగా  జ్ఞాన చింతామణి కృతినీ, ఇంకా రసమంజరి మొదలైన మధుర కావ్యములను రచించి సంస్కృత భాషలో మెప్పులను పొందిన నీకు ఆంధ్ర భాషలో కావ్య నిర్మాణం చేయడం అసాధ్యమా? ఇక ఆ ఆంధ్ర భాషలో ఒక కృతిని అద్భుతంగా రచించి మాకు ప్రీతిని చేకూర్చవయ్యా అన్నాడు ఆ ఆంధ్ర మహా విష్ణువు. సంస్కృతంలో నీ ప్రజ్ఞను చూపించి మెప్పులు పొందావు కదా. ఇక సంస్కృత  గ్రంథరచనకు కొంత విరామమునిచ్చి తెలుగులో ఒక కావ్యాన్ని 'మాకు' ప్రీతి కలిగేట్లు అనడం 
గౌరవవాచకంగా మాత్రమే కాదు, వచ్చినవాళ్ళు ఇద్దరు, లక్ష్మీ నారాయణులు, ఎక్కడికెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు, అరుదుగా అప్పుడప్పుడు కొంచెం వెనుకా ముందుగా వెళ్ళారు  రక రకాల అవతారాలలో, ఇద్దరూ కలిసే వుంటారు అనే సూచనగా ఒక్క వేంకటేశ్వరుడి దర్శనం లోనే ఆయనకు లక్ష్మీనారాయణుల రూపాలు గోచరమైన సంగతి మనకు ఇంతకుముందు తెలిసినదే, ఎక్కడికైనా కలిసే వెళ్తారు కనుక ఇద్దరూ కలిసే కలలో దర్శనం ఇచ్చారు, కనుక మాకు అంటే మా ఇద్దరికీ కూడా ప్రియముగా తెలుగు భాషలో ఒక కృతిని రచించవ య్యా  అన్నాడు , గోదాదేవి అమ్మవారి అవతారమే కనుక జరుగబోయే కథారచన ఆవిడకుకూడా ప్రీతిని కలిగించేదే, అది ఇక్కడి చమత్కారం!  

ఉ. ఎన్నిను గూర్తు నన్న విను మే మును  దాల్చినమాల్యమిచ్చు న 
     ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము మున్ను గొంటి నే
     వ న్ననదండ యొక్క మగవాడిడ నేను దెలుంగు రాయడన్   
     గన్నద రాయ యక్కొదువ గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్

(ఇది కొంత సులువైన పద్యమే కనుక ప్రతిపదార్ధము అవసరము లేదు.)'' యే నీ గురించి చెప్పను..? '' అని అడుగుతావేమోనన్ను. అంటే అనంతమైన అవతారములలో, అర్చామూర్తులలో ఏ అవతారము గురించి అన్న సందేహము వస్తుందేమో.'మే' అంటే శరీరం మీద క్రితం తను ధరించిన మాల్యమును (పూదండను) ఇచ్చి, నన్ను శ్రీరంగమందు పెళ్లి జేసుకున్న ఆ+పిన్నది అంటే ఆ పిల్ల అని ఒక అర్థమైతే 'నప్పిన్న' అంటే గోదాదేవి యని వాడుక తమిళ వైష్ణవ ప్రబంధాలలో, అది ఇక్కడి విరుపు..ఆ పెండ్లి కథను చెప్పు,   ఇది కూడా భావి దృశ్య సూచకం. శ్రీహరి తన కూతురిని చేపడతాడు అని తెలిసిన తర్వాత విష్ణు చిత్తుల వారు కుమార్తెను అడుగుతారు, హరియొక్క ఏ అవతారము తన మనసులో ఉన్నది అని, ఆమె అవతారముల, అర్చామూర్తుల వివరాలు అడిగితే  దివ్య  దేశాలు  అని  పిలువ  బడే  108 పుణ్య  క్షేత్రాల  గురించి , అక్కడి అర్చనా, అలంకార, పూజా  విశేషాలను  గురించి  చెప్తే  ఆ  108 మూర్తులలో రంగనాథుడిని ఆవిడ ఎన్నుకుంటుంది , దాన్నే యిక్కడ సూచనచేశాడు ఆంధ్రమహావిష్ణువు  పలుకుల  ద్వారా  శ్రీకృష్ణదేవరాయలు. మున్ను గొంటి..ఏవన్..ఆ ననదండ ఒక్క మగవాడిడ..అంతకు ముందు ఒక మగవాడు ఆ పూమాలను ఇస్తే, దాన్ని అయిష్టంగానే స్వీకరించాను మరి, ఆ కొరతను(కొదువను) 'ప్రియాపరిభుక్తభాక్కథ' ప్రియురాలిచేత అనుభవించబడ్డ, ఎంగిలిచేయబడ్డ దాన్నిపొందిన నా కథను చెప్పవయ్యా! యిక్కడ కొంత జాగ్రత్తగా విమర్శ చేసుకోవాలి. అంతకు ముందు ఒక మగవాడిస్తే ఏవగా అంటే, విముఖతతోనే స్వీకరించాను అన్నదానికి క్రితం ఆముక్తమాల్యదను పరిశీలించిన పెద్దలు ఆ మగవాడు అంటే శ్రీ కృష్ణావతారంలో సుదాముడు అని, లేదా విష్ణుచిత్తులు అని భావించారు, కానీ , అది సరిగాదు ,రాయల శైలి పదముల కూర్పులోనే కాదు, పదములను ఉపయోగించే స్థలంలోనూ కొంత క్లిష్టంగా వుంటుంది, సంస్కృత భాషా సాహిత్య ప్రయోగాల అలవాటువల్ల, పెండ్లి చేసుకున్న అనే పదమును  ఉపయోగించిన తర్వాత ఇది చెప్పాడు కనుక, కూతురు పరమాత్ముడికొరకు తను సిద్ధం చేసిన మాలను ముందుగా ఆమె ధరించి ఇస్తున్న సంగతి గ్రహించిన విష్ణు చిత్తులు కుమార్తెను మందలించి, ఆ నాడు మాలను సమర్పించకుండా మిగిలిన పూజ యథావిధిగా చేసి, ఆ తర్వాత కుమార్తె ధరించకుండా జాగ్రత్త పడిన మాలనే స్వామికి అర్పించేవాడు, స్వప్నములో స్వామి కనపడి, ఆమె ధరించి ఇచ్చిన మాలయే తనకు ఇష్టమని చెప్పడం, ఆమె తనకు భార్య కాబోతున్నది అని చెప్పడం కథలోని భాగాలు. కనుక ఆమె ధరించి ఇచ్చిన మాలకు అలవాటుపడ్డ తర్వాత పెండ్లి అయ్యే దాక ఆమె సంపర్కం లేకుండా విష్ణు చిత్తులు ఇచ్చిన మాలను అయిష్టముగా స్వీకరించి, ఇక ఆమెను తన ఇల్లాలిని చేసుకోన వలసిందే అని నిశ్చయించుకున్నాడు, ఇలా భావించడమే ఉచితము అని ఈ వ్యాసకర్త ఉద్దేశము.  ఓ కన్నడ రాయా, శ్రీకృష్ణ దేవరాయా, నేను తెలుగు రాయడను అని అప్పుడు తను ఎవరో స్పష్టం చేశాడు. అప్పుడు తన ఎదురుగా వున్న మూర్తి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు మూర్తి అని రాయలకు నిశ్చయం అయ్యింది. ఆ ఆంధ్ర మహావిష్ణు మూర్తి ఇలా కొనసాగించాడు.

  ఆ.       తెలుగదేలయన్న దేశంబు దెలు, గేను 
             తెలుగు వల్లభుండ తెలుగొ కండ 
             ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
             దేశభాషలందు తెలుగు లెస్స

తెలుగులోనే ఎందుకు అంటావా? ఇది తెలుగు దేశము, నేను తెలుగు నేలపై వెలసిన వాడిని, తెలుగు భాష అంటావా, 'కండ' అంటే తీయనిది, మధురమైనది, (కండ అంటే పుష్టి కలది అని కాదు యిక్కడ, కండ అంటే నిఘంటువు ప్రకారం కూడా పటికబెల్లము అని అర్థము వున్నది, ఖండసారి చక్కెర కు అచ్చ తెనుగు పదం కండ చక్కెర ) రాజులందరూ నిన్ను కొలిచి, పొగుడుతుంటే తెలుగు భాష లోని మాధుర్యాన్ని తెలుసుకున్నవాడవే కదా నువ్వు! అంతే గాదు, దేశ భాషలందు తెలుగు లెస్స, సంస్కృతం దేవభాష కనుక సమస్త భాషలలోనూ గొప్పదే, నీకు తెలుసుగదా, కనుక తెలుగు 'దేశ భాషలందు' శ్రేష్ఠమైనది!   

       క.  అంకితమోయన నీకల
            వేంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీ 
            యాంకితము సేయు మొక్కొక 
            సంకేతముగా కతడరస న్నేగానే       

ఇక అంకితము ఎవరికీ ఇవ్వాలి అని అడుగుతావా? నీకు వేంకటేశ్వరుడు యిష్ట దైవము కనుక వెంకటేశ్వరునికి అంకితము చేయవయ్యా, ఒక్కొక్క అవతారము ఒక్కొక్క తత్త్వానికి సంకేతము, అంతే గానీ, 'అరసన్' అంటే అరసిచూడగా, పరిశీలించి చూస్తే, ఆ వెంకటేశ్వరుడిని కూడా నేనే కాదా? ఈ రెండు పద్యాలూ తెలుగు భాషకు ఇంతకుమున్డైనా, ఇకపైన ఐనా అందిన, అందగలిగే అత్యున్నత ప్రశంసలు. రాయలకంటే మున్డుకానీ, రాయల తర్వాత కానీ తెలుగు భాషపై ఇంత ఉన్నతమైన ప్రశంసలను ఎవరూ చేయలేదు, ఇకపై చేయలేరు! 'దేశ'భాషలలో  తెలుగు లెస్స, ఏ రకంగానైతే సమస్త భాషలలోనూ 'దేవ'భాష ఐన సంస్కృతం లెస్స ఐనదో, తీపి కలిగిన భాష.ఈ పలుకులను  సాక్షాత్తూ  శ్రీ మహావిష్ణువు నోటివెంట పలికించాడు. మరొక చమత్కార పూర్వకమైన విశేషం వుంది యిక్కడ. ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరుగుతున్నప్పుడు బట్టలకోసం, బంగారం కోసం, యితర ముఖ్యమైన వస్తువుల కోసం ఎక్కడ తీసుకుంటే, కొంటే, బావుంటుందో అని అడుగుతుంటాం ఆ కొనుగోళ్లలో అనుభవజ్ఞులైన వారిని, వారు బట్టలైతే ఫలానా దగ్గిర మన్నికగా వుంటాయి, చవకగా దొరుకుతాయి, బంగారం అయితే ఫలానా దుకాణంలో స్వచ్చం గా వుంటుంది, కల్తీ లేకుండా, అని చెప్పినట్లు, యిక్కడ సాక్షాత్తూ దేవభాష ఐన సంస్కృతం సమస్త భాషలలోకీ గొప్పది, తియ్యనైన తెలుగు భాష సమస్త 'దేశ' భాషలలోకీ గొప్పది, ఇక దేవతలలో వేంకటేశ్వరుడు గొప్పవాడు, కనుక, ఇంతవరకూ సంస్కృత రచనలు చేశావు కదా, ఇప్పుడు తెలుగు భాషలో ఒక కావ్యాన్ని రచించు, వెంకటేశ్వరునికి అంకితం చెయ్యి, అని చెప్పి భాషలలో తెలుగు  భాష దేవతలలో వెంకటేశ్వరుడితో సమానమైన గొప్పదనాన్ని కలిగివుంది కనుక నీ కావ్యపరంగా భాషకూ, కావ్యపతి పదవికీ  తెలుగు, వెంకటేశ్వరుడూ తగినవారు అని తెల్చిపారేశాడు. మరొక ఆధ్యాత్మిక రహస్యాన్నీ చెప్పాడు. '' ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి'', ఆకాశమునుండి  పడిన వర్షపు నీరు ఎక్కడెక్కడ, ఏ పేరుతొ , ఏ రూపంతో ప్రవహించినా చివరికి సముద్రంలో కలిసినట్లు, ఏ దేవుడికీ, దేవతకూ చేసిన నమస్కారం ఐనా కేశవుడికి, అంటే విష్ణువుకు చెందుతుందని, అసలు కేశవనామ అర్థం 'క' కార, 'శ'కార, 'మ' కారములు మూడూ త్రిమూర్తులకు సంకేతాలు అని చెప్పిన ఉపనిషత్తుల సారాన్ని ధ్వనించి, ఈ ఆంధ్రమహావిష్ణువే ఆ వేంకటేశ్వరుడు కాదా, కాకుంటే ఒక్కొక్క విశేష తత్త్వానికీ ఒక్కొక్క కార్య సాధనకూ ఒక్కొక్క అవతారాన్ని నేను ( పరతత్త్వం) దాల్చడం జరుగుతుంది అని చెప్పాడు.

కనుక దేవుళ్లలో వేంకటేశ్వరుడికీ, భాషలలో తెలుగు భాషకూ, కవులలో శ్రీకృష్ణ దేవరాయలకూ మించిన వారు లేరు! తెలుగువాడిని అని చెప్పుకునే  ప్రతివ్యక్తీ విధిగా కంఠస్థం చేయవలసిన పద్యాలు ఇవి,  తెలుగు సాహిత్యసమావేశాలలో ముందు ప్రార్థనా పద్యాలుగా పఠించవలసిన పద్యాలు ఇవి, ఈ రెండుపద్యాలూ రాయలచిత్రంతో కలిపి ప్రతి తెలుగువాడూ, కనీసం ప్రతి తెలుగుసాహిత్య ప్రేమికుడూ తన ఇంట్లో గోడకు అలంకరించుకోవాలి ఈ వ్యాసకర్త ఉద్దేశంలో!      '...యిలా ఈ కావ్య రచన చేయవయ్యా, నీకు ముందు ముందు ఎంతో అభివృద్ది జరుగుతుంది'అని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తియ్యగా ఆనతియ్యగా, తనను ఆశీర్వదించి అదృశ్యుడు  కాగా, మేలుకొన్న రాయలు ఆ దేవాలయ గోపురానికి వందనం చేసి, రాజధానికి తిరిగి వచ్చి, తన మంత్రులతో, దైవజ్ఞులతో, భువన విజయ కవులతో, పురప్రముఖులతో సభదీర్చి, తన స్వప్న వృత్తాంతమును వారికి వివరించి, అందరి అభినందనలను, ఆ స్వప్న శుభఫలితముల వివరణలనూ అందుకుని,  తన వంశచరిత్రనూ, గొప్పదనాన్నీ, తన పూర్వ జన్మ పుణ్యాన్నీ కొనియాడిన మధురమైన పద్యములను అందించి, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరునికి అంకితం చేసిన పద్యాలను చెప్పి ప్రథాన కథలోకి దిగాడు. అంకితంగా చెప్పినా మూడు ముచ్చటైన 
పద్యాలను రుచిచూసి మనము కూడా ప్రధాన కధలోకి వెళ్లేముందు ఒక విశేషాన్ని మాత్రం ఇక్కడ పరిశీలిద్దాము. 'నీలిమేఘము డాలు డీలు చేయగ జాలు' అనే పద్యం అల్లసాని పెద్దన గారి 'మనుచరిత్రము'లో ఉన్నది. దాన్ని కేవలం రెండు మూడు పదాలను మాత్రమే మార్చి మిగిలిందాన్ని ఇక్కడ యథాతథంగా రాయలు వాడాడు. ఎందుకిలా అంటే, ను స్వప్నంలో దర్శించిన దృశ్యాన్ని వివరిస్తున్నాడు. స్వప్నంలో కనిపించే దృశ్యాలు, మాటలు మనం నిజజీవితంలో చూసిన, విన్నవాటిని స్ఫురింప జేస్తుంటాయి. కలలో తనకు కనిపించిన మూర్తిని చూస్తుండగా, ఆ భగవంతుడిని వర్ణిస్తూ పెద్దన చెప్పినది, తను విన్నది ఐన పెద్దన గారి ఈ పద్యం రాయలకు గుర్తుకొచ్చింది. తర్వాత తన 
స్వప్నవృత్తాంతాన్ని కొలువులోని పెద్దలకు చెప్తున్నప్పుడు ఆ కలలో తను మననంచేసుకున్న పద్యమూ గుర్తుకొచ్చింది. చూసిన దృశ్యాన్ని చూసినట్టే, విన్న పలుకులను విన్నట్టే చెప్తున్నాడు, కనుక ఆ పద్యాన్నే తనూ చెప్పాడు. యిది ఉద్దేశపూర్వకంగా రాయలుచేసిన చమత్కారం, స్వప్నదర్శనాలను సహజంగా విమర్శచేయడం అని ఈవ్యాసకర్త ఉద్దేశం.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి