నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

 

మంజరికి,  సావిత్రి తల్లి... (కాకతీయ పిక్చర్స్ – చిల్లరదేవుళ్ళు)

సాహిత్య  అకాడెమీ  అవార్డ్  పొందిన ‘చిల్లరదేవుళ్ళు’  సినిమాలో మంజరి పాత్ర వేశాను.... నాకు సావిత్రి తల్లిగా, ప్రభాకర్ రెడ్డి తండ్రిగా,  కాంచన మరో ముఖ్య పాత్రలో నటించిన ఆ సినిమా షూటింగ్ అనుభవాలు:

శ్రీ దాశరధి రంగాచార్య గారి, సాహిత్య అకాడెమి అవార్డు పొందిన  నవల ‘చిల్లర దేవుళ్ళు’.  1976 లో కాకతీయ పిక్చర్స్ వారు సినిమాగా రూపొందించారు....

అందులోకథానాయకి ‘మంజరి’– దొరబిడ్డ  పాత్ర పోషించాను.  దొర, దొరసాని పాత్రలు  సావిత్రి గారు,  ప్రభాకర్ రెడ్డి గారు పోషించారు.  అయితే, సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర - నటి కాంచన గారిది.అసలు కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది....

‘సుడిగుండాలు’ సమయంలో - నా పేరులో ‘భారతి’ ని చేర్చమని నాన్నని ఒప్పించిన వారు,  భరతమాత పాటని నాపై చిత్రీకరించిన వారు - దర్శకులు టి. మాధవరావు గారు.  కాకతీయ ప్రొడక్షన్స్ నిర్మాతలు, రచయిత దాశరధి రంగాచార్య గారితో కలిసి, ఆయన మాఇంటికి వచ్చి,  ‘చిల్లరదేవుళ్ళు’  సినిమా లోని మంజరి  పాత్ర  చేయమని అడిగారు...

కథ, మిగతా వివరాలు కనుక్కుని నాన్న చేద్దామని ఒప్పుకున్నారు.

అప్పుడు St.  Francis  కాలేజీలో ఉన్నాను.  అప్పటికే, నాకు డాన్స్ ప్రోగ్రాముల విషయంగా  మా ప్రిన్సిపాల్ - సిస్టర్. ఆనా, అన్ని రకాల కన్సెషన్స్  ఇస్తూనే ఉన్నారు...’డే స్కాలర్’ నుండి  ‘అకేషనల్ ‘  స్టూడెంట్ గా కూడా మారాను.

ఆన్-లోకేషన్  షూటింగ్ అవడంతో, నాన్న నెల రోజులు ఆఫీసుకి సెలవు పెట్టారు.   అమ్మా, నాన్న నేను బయలుదేరాము.  వరంగల్  కి ఊరు బయట,  ఓ ‘గడీ’ లోనే ఇంచుమించు మొత్తం సినిమా తీసారు. కొద్ది సీన్స్ – బతుకమ్మ పాట – వేయి స్తంభాల గుడి ప్రాంతంలోని చిత్రీకరణలో పాల్గొన్నాను.   హైదరాబాదులోని సారధీ స్టూడియోలో మరికొన్ని సీన్స్,  సినిమాలో నా తల్లి తండ్రి పాత్రధారులైన సావిత్రి, ప్రభాకర్ రెడ్డి గార్లతో పాల్గొన్నాను...

మంజరి పాత్ర – దొర కూతురుగా,  అల్లారు ముద్దుగా పెరుగుతుంది.   ‘గడీ’ ఆవరణ దాటి బయట ప్రపంచం తెలియకుండా పెంచుతారు.   ఆమెకి పాట నేర్పడానికి వచ్చిన సంగీతం మాస్టారుని అభిమానిస్తుంది.  అంతకు మించి పరిధి దాటే స్వేచ్చ ఆమెకి లేదు. 

దొరగారి జీవన విధానం, అతని  జీవితంలోని నిజాలు, రహస్యాలు, అతని పాలనలో అక్కడి జనం ఎలా ఉన్నారు, ఏమౌతున్నారు లాంటి విషయాలు కూడా తెలుసుకుంటాడు సంగీతం మాస్టారు.   దాంతో,  ఆ యువకుణ్ణి ‘గడీ’ నుండి పంపించివేస్తారు... ఎన్నో వింత పరిణామాల పిదప, తన తండ్రి ఆసుపత్రి పాలయ్యాక తిరిగి సంగీతం మాస్టారుని కలుస్తారు మంజరి, ఆమె తల్లి.

హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆ చిత్రంలో.బతుకమ్మ పాట, కలువకు చంద్రుడు ఎంతోదూరం, ‘గడి’లో దేవత కను తెరవాలి అంటూ సాగిన మరోపాట, మరోపాట కూడా ... నా పైచిత్రీకరించారు... ‘లబ్బరు బొమ్మ’, ‘గుడిసెనక గుడిసెదానా’ పాటలు సూపర్హిట్...

ఆత్రేయ గారి రచనలు, మహాదేవన్ గారి సంగీతం......
....కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం .....
విరహంలోనే ఉన్నది అనుబంధం…….

ఈ పాట నా ఫేవరెట్ .....

డైరక్టర్ టి. మాధవరావు గారు:  ఆయన చాలా సింప్లిసిటీ పాటించేవారు... నా చిన్నప్పటి  నుండీ ఆర్ట్ విషయంలో నన్ను ఫాలో అవుతూ వచ్చారు... నా మీద, నా టాలెంట్ మీద ఆయనకి నమ్మకం.. మా నాన్నకి మంచి స్నేహితులు కూడా...సెట్స్ మీద అందరితో సరదాగా ఉండేవారు... ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టిస్ట్స్ అందరిచేత,  చక్కగా పని చేయించుకునే వారు...ఎవ్వర్నీ కోప్పడినట్టుగా నేను చూడలేదు.. నన్ను ఆప్యాయంగా పలకిరించి మాట్లాడేవారు...

ఆరోగ్యం పాడయి, చిన్న వయసులోనే  పోయారని విన్నాను ... బాధపడ్డాను.  సినీరంగం లో ఎంతో చేయాల్సిన వారు,  మరెన్నో మంచి సినిమాలు తీయాలని అంటుండేవారని నాన్న అన్నారు.

సావిత్రి గారితో.....

మరునాటి నుండి సావిత్రి గారు షూటింగ్ లో పాల్గొంటారని, ఓ రోజు ‘సెట్’ మీద అందరూ హడావిడి పడుతున్నారు...నేనూ ఆమెని చూడాలని, మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నాను.   మా నాన్న కూడా తన కాలేజీ రోజుల్లో సినిమాల్లో అసోసియేట్ డైరక్టర్ గా, నటుడుగా పనిచేసుండడం వల్ల, సావిత్రిగారు, ఆవిడ కన్నా ఆమె తండ్రిగారు... బాగా అప్పట్లో తెలిసిన వారేనంట.

ఆవిడ హీరోయిన్ కాక ముందు వీరంతా ఓ ‘బాచ్‘ అట... సినిమాల్లో మంచి అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారేనంట....

మద్రాస్ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ పూర్తి చేసి, అక్కడే‘లా’ కాలేజీలో చదువుతుండగా, సినీదర్శకులు-రచయిత గోపీచంద్,  తమ ‘ప్రియురాలు’ అనే చిత్రంలో అప్పటి వర్ధమాననటి సావిత్రి పక్కన హీరోగా, మా నాన్నని బుక్ చేసారట కూడా.. ఐతే కమీషన్డ్ ఆఫీసర్ గా ఆర్మీ రిజర్వ్డ్ లో ఉన్నందున,  అకస్మాత్తుగా ఆర్మీ నుండి పిలుపందుకొని, ఆ సినిమా అవకాశం వదులుకో వలసి వచ్చిందట...  

ఇదంతా నాన్న చెప్పగా ముందు విన్నదే అయినా,  నాకు సావిత్రి గారిని కలవబోతున్నందుకు  ఉత్సాహంగా  అనిపించింది.

ఆమెని కలిసాక  ఆమంటే నాకు అభిమానం గౌరవం ఏర్పడ్డాయి.   నన్ను ఆప్యాయంగా చాలా కాలంగా తెలిసిననట్టుగా పలికరించారామె.  ఆమెతో కొన్ని సీన్స్ చేయడం, కాస్త సమయం గడపడం ఒకెత్తైతే, నాకు ఆమె జుట్టు దువ్వి జడ వేయడం ఓ కొసమెరుపు... చాలా బాగనిపించింది.

అయితే, నా మేకప్ అస్సలు కుదరలేదని యూనిట్ లోని ముఖ్యులందరూ వ్యాఖ్యానించగా విన్నాను.  సావిత్రి గారు కూడా మేకప్ మాన్ ని మందలించి, నా జడ విప్పి మళ్ళీ వేసారామె.

ప్రభాకర్ రెడ్డి గారు కూడా సాదరంగా మాట్లాడారు.  ఆయన కూడా మా నాన్నకి పరిచయమున్న వారేనట.   ఆయన కూడా నా మేకప్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మేకప్ వాళ్ళకి చెప్పారు... విగ్గులవీ వాడవద్దని కూడా సూచించారు...

కాంచన గారి వెంట ఓ అసిస్టంట్ ఉండేవాడు... ఆమెకి సాయంగా.   ఆమెకి దైవ భక్తి ఎక్కువ.   అతను ఆమె పూజకి అన్నీ తయారు చేసేవాడు.   కాంచన గారు కూడా ఎన్నో కబుర్లు చెప్పేవారు.   సరదాగా గడిచేది ఆవిడతో... లావు అవ్వకుండా శరీరాకృతుని మైంటైన్ చెయ్యాలని చిట్కాలు చెప్పేవారావిడ.

స్వగతం:  ‘గడి’ అంటే మా అమ్మమ్మా వాళ్ళ ఇంటికన్నా అందంగా ఏమీ లేదనిపించింది.   కాకపోతే, చుట్టూ ఎకరాల స్థలం, పశు శాల, మామిడి తోటలు ఉన్నాయి...

నాకు నటనలో కంటే, నృత్యం  చేయడంలో ఉన్న ఆనందమే ఎక్కువనిపించింది...మేకప్ కుదరక, నేను - నేనులా కాక, మరోలా ఉండడం చిరాకనిపించింది.

1977 లో విడుదలైన ఈ చిత్రానికి, తరువాత రెండేళ్ళకి, సాహిత్య అకాడెమీ అవార్డువచ్చిందని నేను అమెరికా వచ్చేసాక తెలిసింది...

డాక్యుమెంటరీ ఫిలిం నిర్మాతగా– ‘భారతీయ నృత్యకళ – కూచిపూడి నృత్యం’ అనే 30 నిముషాల ఫిలింని  నిర్మించాలని నాన్నగారు  ప్లాన్ చేసారు...

నన్నే నిర్మాతగా నిర్ధారించి, రికార్డింగ్, కాస్ట్యూమ్స్, వర్కింగ్ టీమ్ సెలెక్షన్ పనులు పూర్తి చేసుకొని అందరం మద్రాస్ చేరాము. 

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారు డాక్యుమెంటరీని కొనుగోలు చేసి,  నృత్య శిక్షణాలయాలకి పంపిణీకి కాక, డాక్యుమెంటరి న్యూస్ రీలుగా విడుదల చేసారు. 

మేము హైదరాబాదులోని కొన్ని సినిమా థియేటర్స్ కి వెళ్ళి న్యూస్ రీలు మాత్రం చూసి వాచ్చేవాళ్ళం.

కూచిపూడి నృత్య రీతులు....డాక్యుమెంటరీ ఫిలిం..

Produced by OM INTERNATIONALFILM CENTER - Major. A. Satyanarayana..
Distributed by AndhraPradeshGovt Cultural & Educational Dept
Technical Director - Mrs. A. SARADA
Featuring **Uma Bharathi – Prameela – AnandaRao

Playback: Guru VedantamJagannadhaSarma,Chandrakantha Courtney, Madhavpeddi Satyam,  Vijayalakshmi, Kanaka Durga

***

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి