ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
(ఆరవ భాగం తరువాయి)
నిర్యాణం:
1948 ఆగస్టులో భగవాన్ ఎడం చేతిపై వ్రణం లేచింది. దానిని వారు పట్టించుకోలేదు. భక్తుల కోరికపై మూడుసార్లు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. శరీరం పట్ల ఉదాసీన వైఖరిని, ప్రశాంతతను చూచి వైద్యులు ఆశ్చర్యపోయారు. వారికి చికిత్స చేసిన డాక్టరు " శ్రీ భగవాన్ కి వచ్చిన వ్రణం సూది ఆకారం కల కాన్సర్. ఇది అల్నార నరం నుండి ఉద్భవించి ఉంటుంది. ఇది ఎంతో బాధనీ, నొప్పినీ కలిగించే వ్రణం" అని చెప్పారు. కాని, భగవాన్ మాత్రం " ఈ శరీరం, నేను, అనుకుంటే నొప్పి ఉంటుందేమోగానీ, ఈ శరీరం, నేను అనుకోవడం లేదు." అని చెప్పేవారు.
"జబ్బు నుండి కోలుకోవాలని సంకల్పించండి" అని ఏ భక్తుడైనా ప్రార్థిస్తే, ఆయన "ఈ సంకల్పం చేయవలసినదెవరు?" అనేవారు.
"నేను వెళ్ళిపోతున్నాను అని అంటున్నారు. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్ళగలను? నేనిక్కడే ఉండేది" అనేవారు. అలాగే తమ నిర్యాణ సమయంలో తాము అవతార సమాప్తి చేయబోతున్నట్టు గానీ, తిరిగి ఎక్కడో అవతరించబోతున్నట్లు గానీ తెలపలేదు.
"శరీరంతో వున్నంత సేపే నేను ఉండగలనని అనుకుంటున్నావు. అది నిజం కాదు. నా ఉనికికి శరీరావశ్యకత లేదు. శరీరం అడ్డం కూడా కాదు." అన్నారాయన.
"తమ భక్తులకు ఎల్లప్పుడూ వారు శరీరంలో వుండగా ఎలా జరిగిందో, అలాగే తమ శరీరానతరం కూడా కొనసాగుతుందని చెప్పారు.
శ్రీ రమణులు 1950 ఏప్రిల్ 14న రాత్రి 8 గం.47 ని.లకి అరుణాచలంలో లీనమైపోయారు. అదే సమయానికి అందమైన పెద్ద జ్యోతి ఒకటి దక్షిణ దిక్కునుండి బయలుదేరి భగవానున్న గదిని దాటి ఉత్తర భాగం లో వున్న అరుణాచలము యొక్క ఎల్లలో కలిసిపోయింది. ఈ అద్భుత దృశ్యం అరుణాచలంలోనే కాక, దేశం లో అనేక చోట్ల కనబడింది. తిరువణ్ణామలై లోని ఆశ్రమం లోనూ, భక్తుల హృదయాలలోనూ మహర్షి ఉనికి ఈనాటికీ తెలుస్తూనే వుంటుంది.
శ్రీ రమణార్పణమస్తు
తిరువణ్ణామలై (అరుణాచలం)
తిరువణ్ణామలై (అరుణాచలం) తమిళనాడు రాష్ట్రం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అతి ముఖ్యమైనది. చెన్నై నుండి 200 కిలోమీటర్లు దూరంలో వుంది. ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో పర్వతాకారముగా వెలసియున్నాడు.
అరుణ-అంటే ఎర్రని, ఆచలం - అంటే, కొండ- అరుణాచలం అంటే ఎర్రని కొండ. ఆత్మజ్ఞానమును ప్రసాదించే కొండ అని అర్థము. శ్రీ భగవాన్ ఇక్కడ 54 సంవత్సరములు గడిపారు.
ఈ గిరి చుట్టు కొలత 14 కిలోమీటర్లు, ఎత్తు 3000 అడుగులు. గిరి ప్రదక్షిణ వలన భక్తులకు ఎంతో మేలు కలుగుతుంది. ప్రతి పౌర్ణమికి దాదాపు ఒక లక్ష మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. కొండకు ఎడమ వైపున మాత్రమే గిరి ప్రదక్షిణ చేయవలెను. కుడి పక్కన దేవతలు తిరుగుతుంటారని శ్రీ భగవాన్ చెప్పేవారు.
గిరి ప్రదక్షిణ హడావుడిగా కాకుండా, వీలైనంత నెమ్మదిగా నడిస్తే మంచిదని భగవాన్ చెప్పేవారు. తిరిగేటప్పుడు "అరుణాచల శివ" అంటూ తిరిగితే మంచిది.
ఈ గిరి ప్రదక్షిణలో చూడదగిన ప్రదేశములు అరుణాచలేశ్వరాలయం నుండి ప్రారంభిస్తే, వరుసగా అగ్ని లింగము, శేషాద్రి ఆశ్రమము, దక్షిణామూర్తి గుడి, రమణాశ్రమము, యమలింగము, నైరుతి లింగము, సూర్యలింగము, వరుణ లింగము, ఆడి అన్నామలై, వాయు లింగము, చంద్రలింగము.
ఒకసారి శ్రీ రమణులు "విదేశాల నుంచి ఎవరో ఈ కొండపై ఉన్న ఏదో ఒక పవిత్ర స్థలం నుండి ఒక రాయి కావాలని అడిగారు. ఈ కొండంతా పవిత్రమే అని వారికి తెలియదు. ఈ కొండ మహా శివుడే! మన దేహంతో తాదాత్మ్యం చెందినట్టే, పరమశివుడు ఈ కొండతో తాదాత్మ్యం చెందారు." అన్నారు.
రమణాశ్రమంలో చూడవలసిన ప్రదేశములు.
1. మాతృభూతేశ్వరాలయము.(భగవాన్ తల్లిగారైన శ్రీ అళగమ్మ గారి సమాధి)
2. మహర్షి సమాధి మందిరము.
3. మహర్షి దేహ త్యాగము చేసిన గది.
4. భగవాన్ భక్తుల యొక్క సమాధులు.
5. గోలక్ష్మి(ఆవు), కుక్క(జాకీ), కాకి, జింక(వల్లి)ల సమాధులు.
రమణాశ్రమంలో నుంచి కొండపైకి దారి కలదు. దాదాపు రెండు కిలోమీటర్లు దూరం కలదు. మొదట స్కంధాశ్రమం వస్తుంది. భగవాన్ ఇక్కడ సుమారు 6 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడే భగవాన్ తమ తల్లికి మోక్షాన్ని అనుగ్రహించారు.
తర్వాత కొంచం కొండకి మరోవైపు దిగితే విరూపాక్ష గుహ వస్తుంది. ఈ గుహలో భగవాన్ 16 సంవత్సరాలు వున్నారు.
ఇక్కడినుండే వారు ప్రపంచ నలుమూలల నుండి భక్తులను ఆకర్షించారు. భగవాన్ తిరువణ్ణామలైకి వచ్చిన తర్వాత అరుణాచలేశ్వర ఆలయంలోని, పాతాళ లింగం దగ్గర ఎక్కువ రోజులు శరీరాన్ని మరచి పురుగులు శరీరాన్ని తొలుస్తున్నా, శరీరమంతా పుండ్లు పడినా ధ్యానంలోనే వుండిపోయారు. ఇది శ్రీ రమణుల భక్తులు చూడదగిన ప్రదేశము.
(విరూపాక్ష గుహ విశేషాలు వచ్చే సంచికలో...)