శుక్రవారం! - బన్ను

Friday Special - Lakshmi Katakshyam
గోతెలుగు.కాం ప్రతి శుక్రవారం కొత్త సొగసులతో, సాహితీ చిత్రకళా సంపదతో పలకరిస్తున్న విషయం మీకు తెలిసిందే. అసలు శుక్రవారమే ఎందుకు? శుక్రవారం విశిష్టత ఏమిటి?

సనాతనధర్మంలో శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యం చెప్పుకోదగ్గది. శుక్రవారాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రగ్రహాన్ని బట్టి ఈరోజుకి ఈ పేరు వచ్చింది. శుక్ర గ్రహం భోగాలకి, భాగ్యాలకి, సంపదలకి, సుఖాలకి ప్రతీక అని అదే శాస్త్రం చెబుతోంది. అందుకే శుక్రవారాన్ని లక్ష్మీ సంకేతంగా భావించడం మన సంస్కృతిలో భాగం అయిపోయింది. శ్రావణ శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతంలోని విశేషం కూడా అదే. ఇక శుక్రవారం నాడు చేయకూడనివి, చేయవలసినవి ఏమిటో ఒక పాట రూపంలో "లక్ష్మీ కటాక్షం" అనే సినిమాలో పొందుపరిచారు. అది యధాతధంగా -

శుక్రవారం పొద్దు సిరిని విడువద్దు
దివ్వెనూదగవద్దు
బువ్వ నెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు 
సంధ్య, మలి సంధ్య నిదురపోవద్దు
నా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు 
ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట 
కల్లలాడని ఇంట
గోమాత వెంట 
ముంగిళ్ల ముగ్గుల్లో, పసుపు గడపల్లో 
పూలల్లో, పాలల్లో, ధాన్యరాసుల్లో
మా తల్లి ధనలక్ష్మి స్థిరముగానుండు

శుక్రవారం నాడు చేతికొచ్చిన డబ్బుని వద్దనకూడదు అంటారు అందుకే. అలాగే దీపాలు ఆర్పడం, భోజనానికి పిలిస్తే రాననడం వంటివి చేయకూడదట. ఇంకా తోబుట్టువుల మనసు, భార్య మనసు కష్టపెట్టడం వంటివి చేయకూడదు. అసుర సంధ్య వేళలో- అంటే అటు సాయంత్రము, ఇటు రాత్రి కాని వేళలో నిద్రపోవడం ఏ రోజులోనూ మంచిది కాదు, ఇక శుక్రవారం అసలు తగదు. దీనికి ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. గోవును లక్ష్మిగా భావించడం కూడా మన సంస్కృతిలో భాగమే. అందుకే గోమాత ఉన్నచోట, గోవుని సేవించిన ఇంట లక్ష్మీ సిరులు తాండవిస్తాయి. ముంగిట్లో ముగ్గు, గడపమీద పసుపు కూడా లక్ష్మీ చిహ్నాలే. పూలు, పాలు, ధాన్యరాసులు కూడా లక్ష్మీ నివాసాలే.

పెద్దలు చెప్పిన ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని లక్ష్మీ కటాక్షానికి పాత్రులవుదాం. ప్రతి శుక్రవారం గోతెలుగు చదువుదాం!!

 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి