మనసా...... తుళ్ళిపడకే - జంపని జయలక్ష్మి

manasaa.. thullipadake

ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, మరోటి పొందాలని తుళ్ళిపడే మన మనస్సును జయించే శక్తి ని మనం సాధించుకోవాలి. మనస్సును స్వాదీనపరచుకోకపోతే మనం దానికి బానిసలం అవుతాము. అపుడు దాని ఆజ్ఞ ప్రకారం నడచుకోవాలి. మనస్సుకు బాహ్యంతో ఆసక్తి కాబట్టి మనల్ని అన్ని పిచ్చిదోవలు పట్టిస్తుంది. మనస్సు ఎప్పుడు బహిర్ముఖం కాబట్టి మనల్ని అటు ఇటు తిప్పుతూ మన ఇంద్రియాల ద్వారా అన్నీ చూడాలని ఇలా ఎపుడు ఏదో ఒకటి కోరుతూ ఉంటుంది.

పంచేద్రియాలు సహజముగానే మనస్సు కు సాయపడి దాని కోరిక తీరుస్తాయి. ఇలా ఎందుకు సాయం చేస్తాయంటే మనస్సు వాటి మీద అధికారం చెలాయిస్తూ ఉంటుంది కాబట్టి. ఇంద్రియాలు మనస్సు కోరిందంతా చేస్తూ పొతే చివరకు శరీరం దెబ్బతింటుంది. జీవితంలో సుఖాన్ని ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది అసత్యం. ఇంద్రియ భోగం ప్రతిసారీ మనలను బలహీనులను చేస్తూ ఉంటుంది. ఇంద్రియాలు అనుభవించే ఆలోచనలు, కోరికలు మనస్సువే. అవి ఇంద్రియాల ద్వారా కార్యరూపం పొందుతాయి. అందువలన మనస్సును స్వాదీనపరచుకోకపోతే, దానికి శిక్షణ ఇవ్వకపోతే లేదా దాన్ని సరి అయిన దారిలో పెట్టకపోతే మనం బలహీనులవడం ఖాయం. ప్రకృతి క్రమంలో మనం త్వరత్వరగా వృద్దులము అవుతాము.

మన(స్సు)కు తృప్తి :
సహజముగా మనకు సంతృప్తి చాల తక్కువగా ఉంటుంది. సంతృప్తి, మనస్సు ఒకదానితో రెండవ దానికి పొత్తు కుదరదు. ఆస్థి గానీ ఆహారం గాని ధనం గాని లేక సౌఖ్యం గాని ఏది అయిన సరే మనస్సు ఇంకా ఇంకా కోరుతూనే ఉంటుంది. మనస్సు కు చాలు అనే మాట రాదు. ఎవరు అయితే మనస్సును అరికట్టరో, వారు మనస్సులోని అంతులేని చపలత్వాలు, ఊహలు కొత్త పోకడలతో కొట్టుకుపోతుంటాడు. ఆఖరికి వారి మానసిక స్థితి చాల దౌర్భల్యముగా ఉంటుంది.

ఆధ్యాత్మికముగా మనకు దేవునికి మధ్య మనస్సు ఒక ఇనుప తెర లాంటిది. మనస్సును అరికట్టకపోతే ఏమవుతుంది. మనలో చాలా మంది ధ్యానానికి కూర్చుంటాము. శరీరము నిలకడగా ఉంటుంది. కానీ మనస్సు గంతులేస్తూ ఉంటుంది. భౌతికముగా మనము ఒంటరిగా ఉన్నప్పటికి మానసికముగా మనం పెద్ద గుంపులో ఉంటాము. ఒక్కసారి ధ్యానానికి కూర్చోగానే మనం ఎప్పుడెప్పుడో మరచిపోయిన అన్ని విషయాలు గుర్తువస్తూ ఉంటాయి. అసలు ఆధ్యాత్మికముగా భావం ఉండి సరిగా ధ్యానం చేస్తే ఎవ్వరయిన శాంతంగా ఉండాలి. ప్రేమతో నవ్వుతూ ఉండాలి. ధ్యానం ఈ రకంగా మనకు ఆనంద స్థితిని, స్థిరమయిన సంతృప్తి ఇవ్వాలి. కాని వాస్తవముగా మనకు అవేవి రావటము లేదు.

మన గమ్యం ఎంతో దూరమవుతోంది. దీనికి అంతటికి కారణం మన మనస్సే. మనస్సు పూర్తిగా విషయాసక్తముగా ఉండటం, శిక్షణ లేకపోవడం. భగవద్గీత లో కృష్ణుడు ఇదే విషయాన్ని వివరిస్తూ మనస్సు ను నీవు స్వాదీనపరచుకోకపోతే, నేను నీ ముందు నిలబడి ఉన్నా ఏమీ లాభం ఉండదు. అని చెప్తాడు.

మనస్సుకు ఇంకొక దుర్గుణం ఉంది. ఎప్పుడు ఇతరుల తప్పులు ఎత్తి చూపిస్తూ, వారిని తక్కువగా లెక్క కడుతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంటుంది? తానూ గుణాధిక్యత అపాదిన్చుకోవడానికి అవతల వారిని విమర్శించి అల్పులుగా పరిగణించటం ఆవాసము. మనస్సుకున్న అవలక్షణాలలో ఇది నీచమయినది. కాబట్టి మనము ఎవరి విషయములో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించకూడదు. మనం మనస్సును లోబరుచుకోవాల్సిన అవసరం ఉంది. అది బహుళ ప్రయోజనకారి. మనం తృప్తి, సంతోషం పొందడానికి మన ఆలోచన సరళి భావాత్మకం అవటానికి సందేహాలు లేకుండా శరణాగతి తత్త్వం అలవరచుకోవడానికి మనస్సును స్వాధీనం చేసుకోవాలి.

అహంకారం ఆడే నాటకంలో మనస్సు తన వంతు పాత్రగా చాలా అడ్డంకులు తెస్తుంది. బాగా తెలివితేటలు ఉన్నవారు, గర్వం, అహంభావంతో పాటు కృత్రిమ వికారాలు కలిగి ఉంటారు. నిజం చెప్పాలంటే మనస్సు మనల్ని మోసం చేస్తుంది. ఇతరుల కంటే ఫై స్థాయిలో ఉన్నామని అనుకోవడమే మనస్సు ఆడే ఆట.

మన జీవితం అంతా మనస్సుకు బలి కాకుండా హృదయాన్ని కుడా తన అధికారాన్ని నిలుపుకోవాలి. ప్రాపంచిక విషయాలకు మనస్సు అంతరంగ విషయాలకు హృదయం వాడాలి. ఆధ్యాత్మిక ప్రపంచానికి హృదయం కీలకం కాబట్టి దాని ఆధిపత్యం తప్పనిసరి. మనస్సు పరిధి అస్థిరం అయిన భౌతిక ప్రపంచము, ఇంద్రియాలు, వాటిని ఆకర్షించే విషయాల వరకే పరిమితం. హృదయం సరిగా పని చేసినపుడు భగవంతుడు తనలోనే ఉన్నాడని అర్థమవుతుంది. హృదయానికి తన అధికారాన్ని చేపట్టే అవకాశం ఇస్తే సమత్వ బుద్ధి, నిశ్చలత్వం, ప్రశాంతత లభించి పరమాత్మలో లీనమవటానికి మరింత దోహదపడుతుంది.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు