నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

“మా నాన్నకు జేజేలు”

‘నాన్న’ అంటే నమ్మకం.  బిడ్డల  మనస్సుల్లో భద్రతా భావం, ధైర్యం, ఆత్మస్థైర్యాలని  పెంపొందించే వ్యక్తి నాన్నే.

తండ్రిలా ఉన్నత స్థితిలోకి రావాలని, తండ్రి వృత్తినే చేపట్టాలని, తండ్రి బాటలోనే నడవాలని అనుకునే తనయులుంటే - తండ్రిని అనుసరించి, అభిమానించి, తండ్రికి అన్ని వేళలా అండగా ఉండి, ఆదుకునే తనయలు కూడా ఉన్నారు.

కుటుంబానికి చుక్కానియై నిలిచే ఎందరో తండ్రులకి, శతకోటి వందనాలు.

మా నాన్నంటే, నాకు ప్రత్యేక అభిమానం, గౌరవం...నా అభివృద్ధి కోసం ఓ పదడుగులు ఎక్కువే నడిచారు...

ఆయన గురించిన ప్రస్తావన ఇక్కడ సమంజసమని భావిస్తాను...

తన పరివారానికి మార్గదర్శకులై, తన గ్రామ ప్రజలెందరికో సహాయ సహకారాలని అందించి, మరికొన్ని కుటుంబాలకి ఉపాధి కల్పించిన మా నాన్న,  శ్రీ మేజర్. ఆరె. సత్యనారాయణ గారి జీవితంలోని కొన్ని విశేషాలు ఇందు పొందు పరచడమైనది. వాణిజ్య, దేశసంరక్షణ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో విశిష్టమైన సేవలందించి గుర్తింపు పొందిన వ్యక్తి మా నాన్నగారు. ‘కళానిలయం’ వంటి పలు పత్రికల ప్రశంసల ఆధారంగా కూర్చిన  వ్యాసం... కోసూరి ఉమాభారతి

బహుముఖ ప్రజ్ఞాపరాయణ
మేజర్. సత్యనారాయణB.A. L.L.B
1931-2013

ఒక చేత ఖడ్గం, మరొక చేత కలం పట్టుకొని దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడిన మహనీయులు మనకి గర్వకారకులు.  మిలిటరీ అధికారి మేజర్. ఆరె. సత్యనారాయణ ఆ కోవలోకే వస్తారు.

మేజర్ సత్యనారాయణ పూర్వీకులు యోధులు.  వీరి తండ్రి, తాత, ముత్తాత అందరూ దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సైన్యంలో పని చేసిన వారే. వీరి వంశం వారు ఛత్రపతి శివాజీ కాలంలో సైన్యంలో సేనానులుగా కూడా నియమితులై,  సేవలందించి పేరు ప్రఖ్యాతులార్జించారు.

ఆ యోధుల కుటుంబంలో, జన్మించిన సత్యనారాయణ, వారికి ఏ విధంగాను తీసిపోలేదు.  కాక, కళాభిరుచిలో వారిని మించిన వారయ్యారు.  1931 అక్టోబర్ 23 వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో, హనుమంతు, చెన్నమ్మలకు జన్మించిన సత్యనారాయణ, హైస్కూల్ చదువులు మర్కాపురంలోను,  ఇంటరు గుంటూరు ఏ.సి కాలేజీలోనూ పూర్తయ్యాయి.

నాటక, సినీ రంగాల ఆసక్తి, గాయకుడిగా గుర్తింపు :

ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యి, రెండవ ప్రపంచ యుద్ధంలో రెండు సంవత్సరాలు సైన్యంలో పని చేసారు సత్యనారాయణ.  యుద్ధం ముగిసాక,  ప్రెసిడెంట్ అకడెమిక్ స్కాలర్షిప్ తో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ పూర్తి చేసి, మద్రాస్ ‘లా’ కాలేజీలో చదువుతుండగా సినీ దర్శకులు, రచయిత గోపీచంద్ తాము తీస్తున్న ‘ప్రియురాలు’ చిత్రంలో ఆయనను అప్పటి వర్ధమాన నటి సావిత్రి పక్కన హీరోగా బుక్ చేసారు.  ఒకనాటి మహా నటుడు, మాజీ గవర్నర్ శ్రీ కోన ప్రభాకరరావు హీరోగా నటించిన ‘సావాసం’ సినిమాలో విలన్ గా నటించారు.  నాటకరంగంలో ఉత్తమ నటుడుగా, గాయకుడిగా ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు సత్యనారాయణ.ఆ తరువాత మీర్జాపురం రాజా వారు, తమ సొంత చిత్రంలో అప్పటి అగ్రనటి కృష్ణవేణి పక్కన హీరోగా ఆయనకి అవకాశం ఇచ్చారు.

వీటి నిర్మాణం మొదలయ్యేలోగా ఆర్మీ వారి పిలుపందుకొని తిరగి ఆర్మీ డ్యూటీకి వెళ్ళి కమీషన్డ్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు, సత్యనారాయణ.  టెరిటోరియల్ ఆర్మీలో నేరుగా సెకెండ్ లెఫ్ట్ నెంట్ గా నియమితులయ్యారు.   అందులో పార్ట్ టైం సర్వీస్ చేస్తూ మేజర్ గా పదోన్నతి పొందారు. మేజర్ హోదాలో తనకున్న న్యాయశాస్త్ర  పరిజ్ఞానంతో అనేక మంది సీనియర్ అధికారులని సైతం కోర్ట్ మార్షల్ చేస్తూ మిలిటరీ జడ్జీగా వ్యవహరించారు.

చైనా యుద్ధం ముగిసాక ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసులో కమర్షియల్ టాక్స్ అఫీసరుగా వ్యవహరించి డిప్యూటీ కమీషనర్ హోదాలో పనిచేశారు.   ఉద్యోగపరంగా స్టేట్ అవార్డులు, రివార్డులు, పతకాలు పొందారు.

సత్యనారాయణ గారి కుమార్తె, కుమారుడు కూడా కళాకారులు కావడం విశేషం.  కుమార్తె ఉమాభారతి సౌత్ ఆఫ్రికా, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాలు విస్తృతంగా పర్యటించి, నృత్య ప్రదర్శనలిచ్చి,  కళాభిమానుల మన్ననలందు కున్నారు. ఆయన కుమారుడు ఏ.వి. నాగేంద్ర ప్రసాద్ ప్రఖ్యాత నటుడు, చిత్ర నిర్మాత, దర్శకుడు.  విరాజిత హైబ్యాండ్ స్టూడియో అధిపతి.  జయంతి, అనురాధలు కుమార్తెలు. భార్యశారదతో...

కళారాధన : ఓం ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ స్థాపించి, ‘ఆలయనాదాలు’ అనే టెలిఫిలింకి సహా నిర్మాతగా వ్యవహరించారు మేజర్ గారు. జెమిని టి.వి వారు నిరవధిక సీరియల్ గా ప్రచురించారు. అందులో ఆయన మనమరాలు శిల్పతో కలిసి నటించారు.

దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా, మహాత్మా గాంధీ లాయరుగా పనిచేసిన ‘వెరులం’ సెంటర్ లో, ‘మొట్టమొదటి సాంస్కృతిక రాయభారిగా’ సన్మానం అందుకోడమే కాక,  మలేషియా, సింగపూరు, మారిషేస్ లలో కూడా కళారంగాన ఆయన అందించిన సేవలకు సత్కారాలు పొందారు మేజర్ గారు.

మేజర్ గారికి ఆధ్యాత్మకత, తాత్విక చింతన మెండు:  అందుకే ఆయన, కాలజ్ఞానాన్ని రచించి,  జాతిని జాగృతి పరచిన కవి, తత్వవేత్త సజీవ సమాధి చెందిన దైవాంశ సంభూతుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధిస్తారు.  శ్రీ వీర బ్రహ్మేంద్ర కల్చరల్ సెంటర్ స్థాపించి, దానికి అధ్యక్షులుగా కార్యక్రమాలు నిర్వహించారు.

సత్యనారాయణగారికి ‘పాము కాటు చికిత్స’ వచ్చు.  ప్రఖ్యాత మంత్రవేత్త పాముల నర్సయ్య శిష్యుడు.  పాము కాటుకి బలైన ఎందరో  పీడితులకి  చికిత్స చేసి ప్రాణాపాయం నుండి కాపాడగలిగారు.  న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులై తన కోసమే కాక, కొందరు పేద ప్రజలకు నిస్స్వార్ధంగా తన సేవలందించి న్యాయం చేకూర్చగలిగారు మేజర్ గారు.

మానవీయత: తన ఆస్తులని ట్రస్ట్ ద్వారా, శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన నిర్మాణానికి కేటాయించారు ఆయన.  తన భూములని,  రైస్ మిల్లుని కూడా పేదవారికి దానం చేసిన గొప్ప వ్యక్తి మేజర్ గారు.  రిటైర్ అయ్యాక, తన పెన్షన్ లోనే పేదలకు ఇంజినీరింగు చదువు, కాలేజీ చదువులు చెప్పించిన దయామయుడు సత్యనారాయణ.

గాయకుడిగా, నటుడిగా, దేశ సంరక్షణలో భాగస్వామిగా, న్యాయ శాస్త్ర పారంగతుడుగా, జ్యోతిష్య శాస్త్రవేత్తగా, సంస్కృతి పరిరక్షకుడుగా,ఆధ్యాత్మికవేత్తగా, అన్నిటికి మించి మానవతావాదిగా, మేజర్ సత్యనారాయణ జాతికే గర్వకారకులు, తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు.

మరిన్ని వ్యాసాలు

Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి
Devashilpi viswakarma cheta srujinchabadina dhanussulu
విశ్వకర్మ చేత సృజనచేయబడిన ధనస్సులు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు