సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam
ఆముక్తమాల్యద - ద్వితీయాశ్వాసము (మొదటి భాగము)     

శ్రీనయన కువలయుగళా
నూనజ్యోత్స్నాయిత స్మితోజ్వ్జ్వలముఖ దై
త్యానీత సుర శ్రీ పున
రానయనక్రమణ వేంకటాచలరమణా

లక్ష్మి దేవి యొక్క కలువలవంటి కన్నులను వికసింపజేసే వెన్నెలవంటి చిరునవ్వులచేత ప్రకాశించుచున్న ముఖము గలవాడా, రాక్షసులచేత అపహరింపబడిన దేవతల లక్ష్మిని మరలా తెచ్చువాడా, వేంకటాచలపతీ, అవధరింపుము, అని ఆముక్తమాల్యద లోని రెండవ ఆశ్వాసమును ప్రారంభించాడు రాయలు.  కలువలు చంద్రుని రాకతో వికసిస్తాయి. లక్ష్మీదేవి రెండు కన్నులు అనే కలువలు వేంకటాచలపతి యొక్క చిరునవ్వులు అనే వెన్నెలను వొలికించే ముఖము అనే చంద్రుడిని చూసి వికసిస్తాయి. ఆ వేంకటాచలపతి రాక్షసులచేత అపహరింపబడిన దేవతల లక్ష్మిని (దైత్యానీత సుర శ్రీ )మరలా తెచ్చి ఇస్తాడు. ఇక్కడ దేవతలు అంటే దైవీ సంపద గలిగిన, సద్గుణములు కలిగిన ఉత్తములు అనడానికి సూచకంగా 'పునరానయన' అనే పదంతో సూచించాడు. 'అయనము' అంటే ధర్మ సంబంధమైన అని.'క్రమణ' అంటే పాదముల ఉనికి అని, కనుక ఆయన పాదములను స్మరించడం ధర్మమార్గపు సిరిని తెచ్చిఇస్తుంది అని. ఆ పదములనే నమ్ముకున్న విష్ణుచిత్తులకు ధర్మ మార్గాన్ని ప్రబోధించిన 'సిరి' లక్ష్మీ దేవియే కూతురై జన్మించింది, అంతే కాదు, వైష్ణవ ధర్మ మార్గ ప్రబోధం చేసిన విష్ణ్జుచిత్తులవారికీ 'ధన లక్ష్మి' బహూకరింపబడబోతున్నది. వీటికి సూచనగా, కావ్యాల ఆరంభంలో, మధ్యలో, చివరిలో మంగళ పూర్వకంగా వుండాలి గనుక ఇలా శుభ సూచకంగా ఈ పద్యంతో ప్రారంభించి ఈ ద్వితీయాశ్వాసములో మదురానగర వైభవాన్ని, ఆ నగరంలోని పుష్పలావికలు, అంటే పూవులనమ్మే సుందరీమణుల చాతుర్యాన్ని, గ్రీష్మ ఋతువును, మధురరాజు మత్స్య ధ్వజుడు తన ఉంపుడుగత్తె  ఐన వేశ్యవద్దకు వెళ్తూ, మార్గమధ్యంలో ఒక పండితుడి సంభాషణ విని వైరాగ్యాన్ని పొంది వెనక్కు తిరిగివెళ్ళి, తన సభలో తనను కటాక్షించి ముక్తిని ప్రసాదించే దైవమును చూపిన వారికి బహుమానమును ప్రకటించడం, అనేక ధర్మాలకు చెందినవారు తమ తమ దైవములను గురించి బోధించడం, మహావిష్ణువు విష్ణుచిత్తులవారిని మధురకు వెళ్లి, ఆ మహారాజు సభలో వైష్ణవ ధర్మాన్ని గురించి ఉపన్యసించి రాజునూ వైష్ణవునిగా జేయమని ఆదేశించి పంపడం, విష్ణుచిత్తులవారి మధురా ప్రయాణము, వీటి గురించిన అద్భుతమైన నూటఒక్క పద్యాలను అందించాడు. రాయల కవనశక్తికి మరొక తార్కాణమైన ఈ ఆశ్వాసంలో ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఒకటి రెండు పద్యాలను  మాత్రం పరిశీలిద్దాము!

ఏవీట సతులపాలిండ్లపై గంబూర        
      నవహారముల చిప్ప కవుచు మాన్చు
మలయజం బేవీట దొలుచెక్కడులిచి   మే 
      డల కిడ్డ మిగుల భూములకు డిగ్గు
గలచునేవీట సింహళ గజంబుల గాలి 
      చైత్ర వేళ నుదగ్దిశాగజంబు 
దాల్తురేవీటి ప్రాక్తన భూప నిర్మాల్య 
     మరకతంబులు పెర ధరణిపతులు
 
కపివర నియుక్త గిరి సద్రుగ్గహననిలయ
గాత్ర గాహిత కనక ముక్తా కవాట 
గోపురావేదితోచ్చతా క్షోభ్యవప్ర
దనరు దక్షిణ మథుర సాంద్ర దృమధుర

ఎక్కడ స్త్రీల పాలిండ్లపై పూయబడిన గంధపు పూత వారు ధరించిన కొత్త ముత్తెపు హారములలోని అప్పుడే కొత్తకొత్తగా సేకరించిన ముత్తెములకున్న ముత్తెపు చిప్పల పాచివాసనను అణిచి వేస్తుందో,ఎక్కడ శ్రీ గంధపు చెట్లనుండి తొలిచిన పై పై బెరడులు వారి ఇళ్ళకు ద్వారాలు, కిటికీలు మొదలైన వాటికి ఉపయోగించగా మిగిలిన మ్రానులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయో, (మలయజంబు.. అంటే మలయపర్వత సానువులలో మొలిచిన శ్రీగంధపు చెట్లు) ఎక్కడ సింహళ గజంబుల గాలి చైత్ర మాసంలో అంటే వసంత రుతువులో ఉత్తర దేశంలోని గజమును కలచివేస్తుందో (ఉదగ్దిశాగజంబు), ఎక్కడ ప్రాచీన సార్వభౌములు ధరించి వదిలేసిన, వాడి వదిలేసిన నిర్మాల్య మువంటి మరకతమణులను ఇతరదేశాల రాజులు 'మహా ప్రసాదం' అని ధరిస్తారో, కపివరుడైన సుగ్రీవునిచేత నియమించబడిన కొండలవంటి శరీరాలు కలిగిన కోతులు, అంటే వానర సేన, సీతాన్వేషణ చేసిన సందర్భంలో ప్రవేశించిన, ముత్తెములు పొదిగిన బంగారు ద్వారములు, కవాటములు, ఉన్నతమైన గోపురములు కలిగినది, ఆక్రమించడానికి శక్యముగాని కోట కలిగినది, దట్టమైన వృక్షములచేత శోభించే మధురమైన 'దక్షిణ మధుర' వొప్పారును. తమిళనాడు లోని పొదిగై మలై పర్వత సానువులలో జన్మించే తామ్రపర్ణి నదిలో ప్రపంచ ప్రశస్తమైన ముత్తెపుచిప్పలు లబిస్తాయి. ఆ నదీతీరపట్టణం కనుక ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముత్తెపు చిప్పలు సేకరించి, ఆముత్తెపు చిప్పలపాచివాసన కూడా వదలని కొత్తకొత్త ముత్యాల హారాలు ఆ పట్టణ స్త్రీలు ధరిస్తారు. శ్రీ చందనం విరివిగా లభించే దేశం కనుకవారు తమ వక్షోజములపై అలదుకున్న శ్రీ గంధపు పరిమళము ఈ ముత్యాల హారాల పాచివాసనను అణిచి వేస్తుంది.ఆ పట్టణప్రజలు వాడగా మిగిలిన గంధపు చెట్లభాగాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. అక్కడి చక్రవర్తులు వాడి పారేసిన మరకత పచ్చల హారాలను ఇతర ప్రాంతాల చక్రవర్తులు ధరిస్తారు. అంత సంపన్నమైన దేశం, పట్టణం.అక్కడి సింహళ గజములు అంటే సింహళ దేశము నుండి తెచ్చిన మేలు జాతి ఏనుగులు మాత్రమే కాదు, సింహళం అంటేలంక, అక్కడి మదగజం రావణుడు, వాడు కలిచింది, బాధపెట్టింది  చైత్ర మాసంలో జన్మించినవాడు, వసంత ఋతువులో  తన భార్యా వియోగముతో బాధపడిన 'ఉత్తరదేశపుగజము ఐన శ్రీ రాముడిని' అని ధ్వని. మరొక చమత్కారం సింహళదేశపు ఏనుగులు గనుక సింహపు శరీర పరిమళముతో ఉత్తర దేశపు ఏనుగులకు కలవరం కలిగిస్తాయి అని. మరొక అద్భుతమైన చమత్కారధ్వని సింహ మధ్య ఐన గోదాదేవి ఉత్తర దేశపు గజగమనుడైన శ్ర్ఫీ కృష్ణుని కలిచివేసింది అని, సహజంగానే వసంతఋతువు మదన తాపాన్ని కలిగిస్తుంది కనుక. ఇవన్నీ ఉద్దేశ పూర్వకంగా ధ్వనించిన ప్రతీకలు. రామాయణధ్వనిగా కపిసేన సీతాదేవి కోసం అన్వేషణ చేస్తూ మధురా పట్టణాన్ని కూడా ప్రవేశించారు అని చెప్పాడు, వాల్మీకివారు కూడా " ముక్తా కవాటం పాండ్యానాం తత్రద్ర క్ష్యథవానరాః " అని సుగ్ర్రేవునిచేత పలికించారు. పురాతన భూపతులు అంటే ఆదివరాహుడు, శ్రీరంగనాధుడు మొదలైన అవతార మూర్తులు. వారు వరించిన భూదేవి అంశతో జన్మించినది గోదాదేవి అని ముందు ముందు చెప్తాడు రాయలు. కనుక ఆ గోదాదేవిని స్వీకరించిన శ్రీకృష్ణు డు,  ఆ గోదాదేవియే స్వయంగా తను ధరించి వదిలివేసిన పూలహారాన్ని, ఆ నిర్మాల్యాన్ని ధరించిన శ్రీకృష్ణుడు కూడా ఈ పద్యంలో ధ్వనిగా  సూచింప బడ్డాడు. ఈ శ్రీకృష్ణ ప్రతీకకు సూచనగానే 'దక్షిణ మధుర' అన్నాడు, 'ఉత్తరమధుర', శ్రీకృష్ణుని మధుర కూడా ఒకటి ఉన్నది కనుక. ' మాయనై వడమదురై మైందనై..తూయ పెరునీర్ యమునై తురైవనై' అన్నది గోదాదేవి తన తిరుప్పావైలోని ఒక పాశురంలో,'ఉత్తర మదురలో పెత్తనం చెలాయించేవాడు' అనే అర్ధముతో. ఇన్ని అద్భుతమైన ప్రతీకలతో మధురా పట్టణ వైభవాన్ని ఈ అద్భుతమైన పద్యంలో వర్ణించాడు రాయలు.   |

స్థిర సౌధాగ్రవిహార యౌవతరతి చ్చిన్నాచ్చ హార స్ఫుర
ద్గురుముక్తావలి చేటికల్విరులతో గూడంగ ద్రోయన్నిజో
దరలగ్నంబగుదాని నెమ్మొగులధస్థంబై తరిన్ రాల్ప నా 
కర మభ్రంబని యండ్రుగా కుదధి దక్క న్బుట్టునే ముత్తెముల్  

రాయల గాఢ శృంగార వర్ణనలకు ఇది ఒక ఉదాహరణం. ఆ పట్టణంలోని మేడలపై సంచరించే యువతులు, మదవతులు తమప్రియులపై ఉపరతి సల్పుతుంటే, ఆ తీవ్రతకు వారి మెడలలోని పూలహారాలు, స్వచ్చమైన ముత్తెపు హారములు తెగిపోయి, వాటిలోని పూవులు, ముత్యాలు దొర్లి పడిపోతే, ఆ పూలను, ప్రకాశవంతములైన పెద్ద పెద్ద ముత్యాలను పరిచారికలు వూడ్చి పారబోస్తుంటారు. ఉపరతితో అలిసిపోయి తమ ఉదరములమీద వ్రాలిపోయిన ఆ యువతులు మదన వర్షం కురిపిస్తుంటే గగనమే నిలయమని (ఆకరము అభ్రంబని యండ్రు గాక ) అంటుంటారు ( పురుషులు), ఆ రతిపారవశ్యము చేత పొందిన ఆనందముతో స్వర్గలోకపుటంచులను చేరుకుంటారన్నమాట! సముద్రములో తప్ప ముత్యాలు పుడతాయా? (ఉదధి దక్కన్ పుట్టునే ముత్తెముల్) అంటే, మదనసాగరమధనంలో తప్ప శృంగారభావ సంతృప్తి లోని ముత్యములవంటి అనుభవాలు దొరుకుతాయా? దొరకవు!ఆ పట్టణం లోని మేడలు ఆకాశాన్ని తాకుతుంటాయి గనుక, పరిచారికలు వూడ్చి పారబోసినప్పుడు మేఘములలో చేరిన ఈ హారములలోని ముత్తెములనే మేఘములు వర్షించడం వలన మేఘములలో కూడా ముత్తెములు వుంటాయి అని అంటారు గానీ, ఎక్కడైనా మేఘాలలో ముత్యాలు ఉంటాయా? సముద్రములో వుంటాయి గానీ!..అనికూడా మహానుభావులైన పండితులు అర్ధమును చెప్పారు దీనికి క్రితం, కానీ, ఈ వ్యాసకర్త ఉద్దేశములో మాత్రము ఈ పద్యములో రాయలు లోతైన శృంగార వర్ణన మాత్రమే చేశాడు, ఇది ప్రబంధము కనుక, తను రసిక రాయలు గనుక! గిరికొను గోపురాగ్ర పరికీలిత పంకజ రాగ రశ్మి గట్టెర యగు చాయ బొల్చు దివసేంద్రుడు చక్కన మింట బోవుచో      మరచి విధాత పాటలిమ మధ్యమ సంధ్యకు జేయలేని యాకొరతయు దీర్చుకో దొగరు కొల్పిన కైవడి బట్టణంబునన్ సూర్యునికి రెండు సంధ్యలున్నాయి. ఉదయ సంధ్య, సాయం సంధ్య. ఈ రెండు సంధ్యలలోనూ సూర్యుడు ఎర్రని రంగులో ఉంటాడు.ఒక్క మధ్యాహ్న సమయంలో, మధ్యాహ్న సంధ్యలో మాత్రం ఆ ఎర్రని వర్ణం వుండదు. విధాత బహుశా మరిచిపోయి ఆ మధ్యాహ్నపు సంధ్యకు ఆ ఎర్రని రంగును కలిగించని కొరతను దీర్చటానికా అన్నట్లు మధ్యాహ్న సమయంలో ఆ పట్టణము పైనుండి సూర్యుడువెళ్ళేప్పుడు ఆ పట్టణంలోని మేడలపైన, కోట బురుజులయందు  చెక్కబడిన పద్మ రాగ మణులయందు పడిన సూర్యుని కాంతి (గిరికొను గోపురాగ్ర పరికీలిత పంకజ రాగ రశ్మి) ఆ పద్మ రాగ మణుల ఎర్రని కాంతిని ప్రతిఫలించడం వలన ఎర్రని రంగును అలదుకొని మధ్యాహ్నపు సూర్యుడు కూడా ఎర్రని ఛాయతో ప్రకాశిస్తూ 'అరుణుడు' అనే పేరును సార్ధకం చేసుకుంటాడు!  ఇలా ఎటు చూసినా సిరి, సంపద, ఠీవి, రాజసం వెలుగొందుతున్న పట్టణం ఆ దక్షిణ మధుర. ఇటువంటి ప్రకృతి శోభతో, ఐశ్వర్యవంతమైన మేడలలో, కోటలలో వుండే సంపన్నులతో బాటు చతురులైన, సరసులైన సామాన్య జనులకు కూడా ఆ పట్టణం లో కొదువలేదు. ఆ పట్టణ వీధులలో పూవులమ్ముకునే యువతుల లౌక్యాన్ని, ఆ పూవులకోసం అనే మిషతో వచ్చే పురుషుల సరస సంభాషణా చాతుర్యాన్ని ఇలా వర్ణించాడు. స్త్రీ పురుషుల మధ్య శ్రుతిమించని ఈ సరసం, మొరటుగా అనిపించని శృంగార రసపోషణం మానవ జీవితంలో సహజసుందరమైన అత్యవసరమైన అంశాలలో కొన్ని. వీటిని తెలుసుకొనడం వలన సరససంభాషణా చతురత కలుగుతుంది. యాంత్రికంగా సాగే జీవన సమయం రసమయం అవుతుంది. కనుక 'కొద్దిగా' తెలుసుకుందాము.

వెలది యీ నీదండ వెల యెంత నా దండ 
       కును వెలబెట్టనెవ్వని తరంబు 
కలువ తావులు గానమలి కదంబక వేణి 
       కలువ తావులు వాడకయ కలుగునె
కడివోదు నా కిమ్ము పడతి యీ గేదంగి 
       నన కడివోమి ముందరికి జూడు 
జాతు లేవంబుజేక్షణ పద్మినులు సైత
       మును నున్న యెడ జాతు లునికి యరుదె   
 
యనుచు దొలి నుడి నభిలాష లెనయ మూగి
పలుకుతోడనె నర్మ గర్భంబు గాగ 
నుత్తరము పల్లవ శ్రేణికొసగు చలరు
లమ్ముదురు పుష్పలావికలప్పురమున

వెలదీ, యీ నీ దండ వెల ఎంత? నా దండకు వెలగట్టడం ఎవ్వరి తరమయ్యా? (దండ అంటే పూల దండ, బాహువులు, సమీపమున అని కూడా అర్ధం) తుమ్మెదల గుంపు వంటి జడకట్టు గలదానా!(అలి కదంబక వేణి ) కలువల వాసనయే కనబడడం లేదేమిటి? మనము కలుసుకోవడానికి స్థలమే కనబడదేమిటి అని శ్లేష!(కలువ తావులు గానము) వాడి టే ధరించి చూడకుండానే కలువపూవుల వాసనలు ఎలా తెలుస్తాయయ్యా?(కలువ తావులు వాడకయ కలుగునె)టే ప్రాధేయపడి, తిరిగి తిరిగి అలిసి వాడిపోకుండానే, కలుసుకోవడానికి స్థలం, సమయం, సందర్భం దొరుకుతాయా?అంత తేలిగ్గా మీకు పడిపోయేవాళ్ళలాగా కనబడుతున్నామా? అని శ్లేష! బొడ్డును కూడా తామరపూల కుదురుతో పోల్చడం సరస కవిత్వ సంప్రదాయం కనుక ఆ సుందర నాభి దర్శనం గురించి కూడా అడిగేవారు, చెప్పేవారు చెప్పకనే చెప్తున్నారని రాయలు రసమయంగా చెప్తున్నాడు! ఓ పడతీ, వాడిపోని ఈ మొగిలి పూవురేకును నాకు యివ్వు(కడివోదు నా కిమ్ము పడతి యీ గేదంగి)వాడి..పోని.. అంటే ఒకసారి అనుభవించి ఆనందిస్తే మరలి పోని, ఈ 'మొగిలిపూరేకు' అంటే 'ఆడతనాన్ని' నాకు ఇవ్వు అని,కడివోదు..అంటే..ముద్ద నోట్లోకి పోదు, తిండి పోదు అని అతని శ్లేష కూడా, దానికి జవాబుగా 'కడివోమి ముందరికి జూడు'ఈ మొగిలిపూరేకును వాడిన తర్వాత అప్పుడు చూడు వాడిపోయేదీ లేనిదీ, ఒకసారి నాతో కలిసి ఎడబాటు కలిగితే అప్పుడు కూడా తిండి నోటికి పోదు అనేది ముందు ముందు చూద్దువుగాని అని ఆమె! జాతులు' అంటే జాజి పూవులు, ఏ జాతి స్త్రీలు, పద్మిని, హస్తిని, శంఖిని అని కూడా, కనుక జాజులున్నాయా? అని అడిగాడు. పద్మినులు అంటే తామరపూలు, పద్మినీ జాతి స్త్రీలు కూడా, కనుక పద్మినులున్న చోట వేరే జాతులు ఎందుకుండవు, జాజులు ఎందుకు వుండవు, కావలసినన్ని!('జాతు లేవంబుజేక్షణ పద్మినులు సైతమును నున్న యెడ జాతు లునికి యరుదె?)స్త్రీలలో పద్మినీ జాతి స్త్రీలు, పూలలో పద్మములూ, యితర జాతుల స్త్రీలకన్నా, జాజిపూలకన్నా కొద్ద్దిగా శ్రమతో లభించడం జరుగుతుంది, ఆ జాతి వారే, ఆ పద్మాలే లభిస్తున్నప్పుడు ఇతర జాతులు దొరకడం ఏమన్నా అరుదా? ఇలా మొదటిమాట, తొలి పలకరింపుతోనే తమ కోరికలు తెలిసేలా, నర్మగర్భముగా పలికే సరసులకు, విటులకు, వారి భావానికి తగ్గట్టు సరిగా, గడసరిగా, ముక్తసరిగా, ముచ్చటగా సమాధానాలిస్తూ సొగసరులైన విరిబోణులు విరులమ్ముతూవుంటారు మధురాపట్టణంలో.  

పద్మాస్య పురి ననుభవితకు నీవ ఎ
        త్తులు వెట్టు దనగ రావలసె నిటకు
దెలుపుమా జాముండు నలరింపొ ఘటికా ద్వ
        యం బుండు నల రింపొ కంబుకంఠి            
యే వేడుటకు నీవు ఋతువేల చెప్పెద
      వువిద మే మందాక నోర్వగలమె     
చేరగా రాదె బాసికము గే ల్సోకిన
      యంతనే చెడునె యేణాయతాక్షి
 
యనుచు బరిభాష వోలె దమ్మాస దొరల 
నాద మోవి జెరంగిడి యాగు నవ్వు 
కంట నిగుడ విరుల్నాన్చు కరణి జల్లు 
సరసపు జలంబె జాణల మరులుకొల్పు

ఓ పద్మముఖీ! యీ పురములో అనుభవించు వానికి, విరుల గంధమును అనుభవించు వానికి నీవే ఎత్తులు అంటే పూల ఎత్తులు పెడతావట గదా (శృంగార క్రీడకు ఎదురు చెల్లిస్తావట గదా అనీ, కామక్రీడలో ఎదురొత్తులు ఇచ్చే కాముకివి అట గదా..అనిన్నీ!) అని ఇంత దూరం రావలసి వచ్చింది (పద్మాస్య పురి ననుభవితకు నీవ ఎత్తులు వెట్టు దనగ రావలసె నిటకు) ఓ శంఖము వంటి కంఠముగలదానా!  ఒక ఝాము నిలిచి వుండే 'అలరు' ఇంపో, రెండు ఘడియలు వుండే 'అలరు' ఇంపో తెలుపుము..'అలరు' అంటే పుష్పము కనుక ఒక జాము అంటే మూడు గంటలు వాడకుండా నిలువ వుండే పువ్వు మంచిదో, రెండు ఘడియలు అంటే గంట నిలువ వుండే పువ్వు మంచిదో చెప్పవూ అని అర్ధము, మూడు గంటల కామకేళియో, ఒక గంటసేపే ఉండేదో ఏది కావాలో చెప్పవూ అని అంతరార్ధము! (దెలుపుమా జాముండు నలరింపొ ఘటికా ద్వయంబుండు నలరింపొ కంబుకంఠి) నేను అడిగిన పూవును ఇవ్వడానికి ఆ పూవు దొరికే ఋతుకాలం రావాలి అని ఎందుకు ఠలాయిస్తావు, వాయిదా వేస్తావు, ఏడిపిస్తావు? నేను అంత దాకా వోర్చుకోగలనా?..అని అర్ధము, సంభోగానికి ఋతుస్నానం చేసిన తర్వాత అని ఎందుకు వాయిదా వేస్తావు, నేను అంత దాకా వోర్చుకో గలనా అని అంతరార్ధము!(యే వేడుటకు నీవు ఋతువేల చెప్పెదవువిద మేమందాక నోర్వగలమె)    ఓ లేడి కన్నుల చిన్నదానా! నేను దగ్గిరికి రాకూడదా? దగ్గరకు వచ్చినంత మాత్రాన, చేయి తగిలినంత మాత్రాన  బాసికము ఏమన్నా చెడి పోతుందా? ( బాసికము అంటే పూలదండలలో అలంకరించి అల్లే ఒక రంగురంగుల బిళ్ళవంటి అలంకరణ, బాసికము అంటే ఊరువుల మధ్య భాగము, పొత్తి కడుపు క్రింది భాగము అని కూడా అర్ధము!)    (చేరగా రాదె బాసికము గే ల్సోకినయంతనే చెడునె యేణాయతాక్షి)ఇలా ఏదో రహస్య సంకేత పరిభాష లాగా మాట్లాడుతుంటే అంతరార్ధమును గ్రహించి, చీర చెంగుతో వస్తున్న నవ్వునుబిగబట్టి, చీర చాటున దాగిన పంటి నవ్వు దాగకుండా కన్నుల్లో ప్రతిఫలించే కంటి నవ్వుగా మదన భావంతో కనులు మెరుస్తుండగా, పూలనుతడిపే నెపముతో వాటిమీద చల్లుతున్నట్లుగా ఈ సరసులమీద చల్లే నీళ్ళే సరసపు నీళ్ళుగా విటులను ఆకర్షిస్తుండగా విరిబోణులకు విటులకు విరుల వ్యాపారం విరహ వ్యాపారం జరుగుతూ వుంటుంది ఆ మధురా పట్టణంలో.

(కొనసాగింపు వచ్చేవారం)

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి