నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

‘అన్ని కళల పరమార్థమొక్కటే,  అందరినీ రంజింపజేయుటే’ –

‘యమగోల’ లో ‘ఆడవే అందాల సురభామిని’


.గానమేదైనా స్వరములొక్కటే
నాట్యమేదైనా నడక ఒక్కటే
ఆశ ఏదైనా భావమొక్కటే
అన్ని కళల పరమార్థమొక్కటే
అందరినీ రంజింపజేయుటే….ఆడవే అందాల సురభామిని

‘యమగోల’ సినిమాలో పై పాటకి ఊర్వశిగా నృత్యం చేసాను...

‘యమగోల’ లో ఆ నృత్యం చేసే అవకాశం

1977 మే నెల ఆఖరున, విజయవంతంగా,  నాన్నగారి ఆధ్వర్యంలో  మా మా మొదటి విడత విదేశీ ట్రిప్పులో –ముప్పైఐదు స్టేజ్ పర్ఫామెన్సులు,  టి.వి. చిత్రాలు చేసి, ప్రేక్షకులు-పత్రికల నుండి ఎనలేని  మెప్పు –మన్ననలు అందుకొని,  ఎంతో సంతోషంగా, సంతృప్తిగా  హైదరాబాదు చేరుకున్నాము...మారిషస్, సౌత్ ఆఫ్రికా, జొహన్నస్బర్గ్ లో విరివిగా పర్యటించి,  ఏనాడూ ఊహించని మిన్నంటే ఆదరణ అభిమానాలు లభించాయి....

హైదరాబాదులో సత్కారాలు, సన్మానాలు, పత్రికల ఇంటర్వ్యూల తో హడావిడిగా గడిచింది ఓ రెండు వారాలు...

నాకు బాగా గుర్తున్న ఫోటో సెషన్ - పత్రిక ఇంటర్వ్యూ,  ‘వనిత’  మాస పత్రిక కోసం.

ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ - కె.ఆర్.వి.  భక్త గారు యింటికి వచ్చి రెండు గంటల సేపు వివిధ నాట్యభంగిమల్లోస్టిల్స్ తీసి, ఇంటర్వ్యూ జరిపారు......

అదే సమయంలో, సినీరంగంలో ఛాయాగ్రహకులువెంకటరత్నం గారినుండి నాన్నకి ఫోన్ కాల్.  ‘యమగోల’ సినిమాకి ‘రంభ ఊర్వశి మేనక’ నృత్యం లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేశారాయన.  ఆలోచించి చెబుతానన్నారు నాన్న.

అప్పటికే, నటి శ్రీమతి అంజలి  గారి ‘భక్త తుకారాం’ చిత్రంలో నృత్యం చేయమని అడిగితే ఒప్పుకోని నాన్న,  వారం పాటు ఆలోచించిన మీదట, ‘యమగోల’ డాన్స్ సీక్వెన్స్ కి ‘ఓకే’ అన్నారు. 

వెంకటరత్నం గారితో నాన్నకి పరిచయమున్న మాట నిజమే అయినా, నటి అంజలి గారు, ఆదినారాయణ గార్లతో స్నేహమే కాక సాన్నిహిత్యం కూడా ఉంది మరి... నాన్న నిర్ణయాలని నేనెప్పుడూ ప్రశ్నించలేదు.

అమా నాన్నలతో ‘యమగోల’ పాట చిత్రీకరణకు మద్రాసు వెళ్లాను.   మొత్తంగా రిహార్సల్స్, షూటింగ్ కలిపి... వారం రోజులు పట్టింది, ఆ నృత్య సీక్వెన్స్ లో నేను, మంజుభార్గవి, లక్ష్మి పాల్గొన్నాము.... సరదాగానే గడిచింది షూటింగ్... యెన్.టి.ఆర్. గారితో చేసిన చిన్న బిట్స్ కూడా ఎంజాయ్ చేసాను...

నాతో, మా నాన్నతో ఫ్రెండ్లీగా మాట్లాడారు ఎన్.టి.ఆర్.

నాన్న, ఆయన బి.యే లో క్లాస్మేట్స్ అట.  నాన్న మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లోనూ, తరువాత ‘లా’ కాలేజీ లోనూ చదివారు.  సీనియర్ నటులు కీ.శే. గుమ్మడి గారు కూడా మా నాన్న గారికి క్లాస్మేట్ అట.

రంభగా నృత్యం చేసిన, లక్ష్మి, మెడికల్ కాలేజీ మొదటి సంవత్సరం చదువుతుంది.  ఆమె నటి ఎల్. విజయలక్ష్మి రిలేటివ్ అని విన్నట్టు గుర్తు.  మంజుభార్గవి అప్పటికే సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి నృత్యాలు చేసింది...నేను సరే, నాట్య ప్రదర్శనలిస్తూ బి.యే లో ఉన్నాను.వాళ్ళిద్దరూ మంచి డాన్సర్స్.  నేను 5ft 6in.  అయితే వాళ్ళిద్దరూ కూడా నాకంటే రెండు అంగుళాలు పొడవే ఉన్నారు.  బ్రేక్ లో ఫ్రెండ్లీ గా మాట్లాడుకున్నాము.  ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్చేసుకున్నాము కూడా.  అయితే ఆ తరువాత కొద్ది  కాలానికే  నా వివాహం జరగడం, నేను యు.ఎస్. కి రావడంతో వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకునే అవకాశం కలగలేదు....

లక్ష్మికి డాక్టర్ అవడమే ధ్యేయం అని, డాన్స్ అనేది ఆమెకి దేవుడిచ్చిన టాలెంట్ అని అర్ధమయింది.

మంజుభార్గవి అప్పుడు తన సిస్టర్ సునంద పెళ్ళి జరగబోతుందని చెప్పింది.

వాళ్ళిద్దరూ నాకు చాలా నచ్చిన డాన్సర్స్ మత్రమే కాదు.  నైస్ పీపుల్కూడా.......

యమగోల సినిమా మేము థియేటర్స్ లో చూసాము.  ఎంజాయ్ చేసాను.

సినిమాల్లో నృత్యానికి మరి కొన్ని  అవకాశాలు....

యమగోల షూటింగ్ అయి తిరిగి ఇల్లు చేరాక, మరెన్నో ప్రోగ్రాములు, డాన్స్ డాక్యుమెంటరీ నిర్మాణ సన్నాహంలో మునిగిపోయాము...ఓ రోజు, యెన్. టి. ఆర్ గారు స్వయంగా నాన్నకి ఫోన్ చేసారు.  ఆయన నిర్మించబోయే ‘కర్ణ’ సినిమాలో నాకు అవకాశం కల్పిస్తానని అన్నారు.

నాన్న మరి ఎందుకు వద్దనుకున్నారో?  “ఉమకి పెళ్ళి సెటిల్ అయ్యేలా ఉంది....అన్నీ కుదిరితో, వచ్చేవారం నిశ్చితార్ధం జరిగే అవకాశం ఉంది.. మీ ఆఫర్ కి కృతజ్ఞతలు,” అని ఆయనకి సర్ది చెప్పి వద్దనేసారు.

‘అలాగే ‘నర్తకి’ అనే సబ్జెక్ట్ రాస్తున్నాము’.... అందులో ప్రధాన పాత్ర పోషించమని మరో పేరున్న నిర్మాత నాన్నని ఎప్రోచ్ అయ్యారు...

**

నాన్న, నా సినీరంగ  ప్రవేశం విషయంలో, పాజిటివ్ గా లేరని,  అమ్మ నాన్న నిత్యం మాట్లాడుకునే తీరుని బట్టి అర్ధమయింది.  సాంప్రదాయ నృత్య రంగంలో  కృషి,  విదేశీ పర్యటనలు వరకు బాగు’ అన్నది అమ్మ.   అప్పట్లో ఆ దిశగా, మా కృషి ఫలితాలు మేమూహించనంత సంతృప్తిగా ఉన్నాయి.

అప్పట్లో, నాకు ఆ విషయంగా నిర్దిష్టమయిన అభిప్రాయం ఏమీ లేదు....ఏనాడూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిందీ లేదు...కాని నా జీవితంలో,  సాంప్రదాయ నృత్యం మాత్రం శాశ్వతమై,  నా ఆరోప్రాణంగా కొనసాగింది.  నాలోని సృజనాత్మకతకి సరయినది నృత్యమే అని నేను భావించాను.  ఏదైనా,  నాన్న అమ్మ గార్ల  నిర్ణయాలు నాకు అప్పుడూ, ఎప్పుడూ శిరోధార్యమే.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి