సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam

ఆముక్తమాల్యద-

శ్రీకృష్ణ దేవరాయలవారి రసికత  రుచి చూసిన తర్వాత ఆయన వర్ణనా చమత్కృతి కొద్దిగా రుచి చూద్దాము. మధురాపురములోని సరసులైన యువతీ యువకులను వర్ణించిన తర్వాత ఆ పట్టణము లోని వేద, జప, యజ్ఞ శీలురైన బ్రాహ్మణులను గురించి వర్ణిస్తున్నాడు.

చిర సముపాశ్రితాగ్ని తడి జెంది నశించునటంచునో, కృతా    
ధ్వరత దదగ్ని మైనునికి దాన నొకంగము దాచు చేతనో
పుర ధరణీసురుల్నిగమ భూధరముల్జప యజ్ఞ శీలురా
హరి ధనదేశులైన వల హస్తము సాపరు వారి ధారకున్

చిరకాలము యజ్ఞ యాగాది క్రతువులను చేయుట వలన సాధించుకున్న అగ్ని ఎక్కడ ఆరిపోతుందో అని కాబోలు (చిర సముపాశ్రితాగ్ని తడి జెంది నశించునటంచునో), వేదపర్వతములవంటి ఆ బ్రాహ్మణులు సాక్షాత్తూ ఏ దేవేంద్రుడో(హరి), కుబేరుడో(ధనదేశుడు, అంటే ధనమునునిచ్చువాడు, ధనమునకు అధిపతి) వచ్చి దానమునివ్వడానికి సిద్ధమైనా తమ దక్షిణహస్తమును అంటే కుడిచేతిని చాపకుండా, దాచిపెడతారు. యజ్ఞ యాగాది క్రతువులను నిరంతరమూ నిర్వర్తించుచుండడం వలన అగ్ని స్వరూపులైన వారు ఆపట్టణములోని బ్రాహ్మణులు. బ్రాహ్మణుని దక్షిణ హస్తము అంటే కుడి చేయి అగ్ని స్వరూపము అని వేదం చెప్తుంది. దాన జలాన్ని స్వీకరించడం వలన ఆ నీటి వలన తమ చేతిలోని అగ్ని ఎక్కడ చల్లారుతుందో అన్నట్టుగా ఇంద్రుడు, కుబేరుడు వచ్చి దానం చేస్తామన్నా వద్దు అని, చేతిని కనీసం కనపడను కూడా కనపడకుండా దాచుకుంటారు ఆ పట్టణములోని బ్రాహ్మణులు. అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము అంటే, నిరంతరమూ శాస్త్ర అధ్యయనము చేయడం (చదువుకొనడం, నేర్చుకొనడం), యితరులచేత శాస్త్ర అధ్యయనము చేయించడం (యితరులకు నేర్పడం), యజ్ఞము చేయడం, చేయించడం, దానం చేయడం, దానమును స్వీకరించడం, ఈ ఆరు బ్రాహ్మణులకు విధులు, అవి వారి లక్షణాలు అని ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వీరు దానమును స్వీకరించడానికి ఎందుకు వెనుకంజ వేస్తారు అంటే, ఆ దానములకు, ప్రలోభములకు లొంగకుండా, అయాచితముగా వచ్చిపడే దానికోసం కలలు కనకుండా, తమ ధ్యాస అంతా జ్ఞాన సముపార్జన, జ్ఞాన వితరణ మొదలైన వాటి మీదనే పెట్టి వుంచుతారని చమత్కారము మాత్రమే.

ఉరవడి పోరికై కవచ మొల్లరు మంత్రములందు దక్క సు
స్థిర నిజ శక్తి నైదు పది సేయరు దత్తిన తక్క మంటికై
పొరల రధీశుడీ కమల బుద్ది ఖలూరిక దక్క వజ్ర దో:
పరిఘ వశీక్రుతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్
అప్పురి రాకుమారకుల్..ఆ పట్టణములోని రాకుమారులు..మంత్ర అనుష్ఠానములో తప్ప పోరులో కవచమును ధరింపరు. కవచము అంటే పోరాటంలో శరీర రక్షణ కొరకు  ధరించే కవచము, మంత్ర శాస్త్ర అనుష్ఠానము లో ధరించే కవచము కూడా. పోరాటములో మాత్రము కవచము ధరింపరు, మొండిధైర్యము, తెగువ, ఆత్మ విశ్వాసము కలవారు. మంత్ర అనుష్ఠానములో మాత్రము కవచమును ధరిస్తారు. అంటే యుద్ధ తంత్రం, మంత్రం..రెండింటా నేర్పరులన్నమాట. ఐదు పది సేయడం అంటే సందేహించడం, ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించి వెనుకంజ వేయడం. ఆ రాకుమారులు నిజ శక్తిని చూపించడంలో ఐదు పది సేయరు(శౌర్యములో వెనుకంజ వేయరు) దానం చేయడంలో తప్ప, అంటే దానం ఇచ్చేప్పుడు ఐదు ఇవ్వాల్సినప్పుడు పది యిస్తారు, లోభితనము చూపించరు. ఖలూరిక అంటే సాముగరిడీలు అని అర్ధము. సాముగరిడీలు, యుద్ధ విన్యాసాలు చేసేప్పుడు తప్ప, ప్రభువు తనకై తాను యివ్వనిదే భూములకోసం, మంటిలో పొరలరు, పొర్లుదండాలు పెట్టరు, స్వాభిమానము కలవారు, విమల బుద్ది కలవారు, వజ్రసన్నిభములైన భుజములకున్న పరిఘలచేత జయింపబడిన యితర రాజులను కలిగినవారు, ఆ పట్టణ రాకుమారులు. ఆ రాచనగరిని వర్ణించిన తర్వాత రాజుగారిని వర్ణిస్తున్నాడు  రాయలు.

విద్వయోపాయ ధీ విద్వద్వతంసంబు
షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి
క్రీడాచలీకృత శ్రీఖండగిరి రాజు 
కనకాద్రి ముద్రణ గ్రంధ కర్త
యందూ నిబద్దాబ్ద బృంద వేదండాళి
వననిధి స్తంభనాధునిక రఘువు
తామ్రపర్న్యమల పాధ: కేళి హంసంబు
లంకేశ మైత్రీ ప్రియంకరుండు
స్వస్తికృద్వాస్తవ స్తుత్యగస్తి మఘవ
మకుట మోటన శరకోటి మంత్రభ్రుత్య
భూత భూతాత్త శాంభవ భూమికుండు
దత్పురంబేలు బాండ్య మత్స్యధ్వజుండు

ఆ పురమును ఏలే పాండ్య మత్స్యధ్వజుడు, ద్విద్వయ అంటే రెండు రెళ్ళు, అంటే నాలుగు ఉపాయాలలో, అంటే సామ, దాన, భేద, దండము అనే ఉపాయాలలో నిపుణుడు. బుద్ది కుశలుడు. పండిత శ్రేష్టుడు. సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము అనే ఆరు గుణములలో నిపుణుడు. శ్రీఖండ పర్వతము అంటే మలయపర్వతము. ఆ మలయపర్వత సానువులయందు క్రీడగా విహరించేవాడు. కనకాద్రి అంటే మేరు పర్వతము. కనకాద్రిపర్వతమందు తన గెలుపులను, యుద్ధ విజయములను గురించి శాసనములను లిఖించిన వాడు. 'అందూ నిబద్ద అబ్ద బృంద వేదండాళి' అంటే సంకెలల చేత బంధింపబడిన మేఘములవంటి నల్లని గజసమూహములను కలిగినవాడు. వననిధి అంటే సముద్రము, సముద్రము మీద కట్ట గట్టిన ఆధునిక రఘురాముడు. (కామవాంఛలు అనే అలలతో ఎగసిపడే మోహ సముద్రానికి ఆధ్యాత్మిక మార్గమనే వారధిని కట్టినవాడు, అది ముందు ముందు జరిగే సంఘటన మత్స్య ధ్వజుని జీవితంలో, ఇక్కడ దాన్ని ధ్వనిస్తున్నాడు రాయలు.) నిర్మలమైన తామ్రపర్ణి అనే నదీ జలములలో క్రీడించే రాజహంస వంటివాడు. లంకేశునితో అంటే ఆనాటి లంకాదేశమునకు అంటే నేటి శ్రీలంకకు ప్రభువు ఐన వాడితో స్నేహమును కలిగినవాడు. ఇందులో కూడా ఒక ధ్వని వున్నది. లంకాధిపతి ఐన విభీషణుడు శ్రీరంగనాధుని భక్తుడు. శ్రీ రంగనాధుని నిత్యమూ అర్చించేవాడు. శ్రీ రాముడు రావణవధ అనంతరం తన పటాభిషేక మహోత్సవానికి వచ్చిన తన మిత్రులందరికీ అనేక కానుకలను యిచ్చి సత్కరిస్తూ, విభీషణునకు ఇక్ష్వాకు వంశీయులు తమ పూజా మందిరం లో నిత్యమూ అర్చించే 'రంగనాధుని' ప్రతిమను బహూకరించాడు. లంకకు తిరిగి వెళ్తున్న విభీషణుడు కావేరీ నదీ తీరానికి చేరుకొని, తనకు సంధ్యా వందన విధుల సమయం కావడంతో అక్కడ ఇసుక తిన్నెలమీద ఈ రంగనాధుని ప్రతిమను వుంచి, తన సంధ్యావందన, జప, తపాదులు నిర్వహించుకుని, మరలా విగ్రహాన్ని తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ విగ్రహం కదలలేదు. ఇదేమిటి అని ఖిన్నుడైన విభీషణునకు రంగనాధుడు దర్శనమిచ్చి ఈ కావేరీనదీతీర ప్రాంతము తనకు తగినది, నచ్చింది అని చెప్పి, తనను అక్కడే నిలుపమని కోరడంతో, అక్కడే రంగనాధ ఆలయ నిర్మాణం చేసి, నిత్యమూ అక్కడికే వచ్చి విభీషణుడు అర్చనాదికాలు చేసేవాడు. లంకాధిపతితో చెలిమి చేసినవాడు అనడంలో, విష్ణుచిత్తుని ఉపదేశముతో ముందు ముందు రంగదాసునిగా, వైష్ణవునిగా మారబోతున్నాడు ఈ మత్స్యధ్వజుడు అని ధ్వనిపూర్వక సూచన! ఈ మత్స్యధ్వజుడు తనను స్వస్తి వాక్యములతో, వాస్తవములైన స్తుతులు చేసే అగస్త్యుని వంశమునకు చెందిన భూసురులు కలిగినవాడు. 'మఘవ మకుట మోటన శరకోటి',   మఘవుడు అంటే దేవేంద్రుడు. దేవేంద్రుని కిరీటమును కూడా నుగ్గు నుగ్గు చేయగలిగిన బాణములను కోట్ల సంఖ్యలో కలిగినవాడు, అంటే అంతటి శస్త్రాస్త్ర పరాక్రమ శక్తి కలిగినవాడు. 'మంత్రభ్రుత్య భూత భూతాత్త శాంభవ భూమికుండు', అంటే, మంత్ర, భూత, భ్రుత్యగణ వైభవములో సాక్షాత్తూ పరమశివుని అంతటివాడు.ఆ మత్స్యధ్వజుడు మేరు పర్వతము వరకూ అంటే ఆసేతు శీతాచల పర్యంతమూ విజయ గాధలను కలిగి, తన విజయ చరిత్రను మేరు పర్వతము మీద లిఖించినవాడు. స్వదేశములోనే కాదు, విదేశాలకూ తన కీర్తిని వ్యాపింప జేసినవాడు, శ్రీలంక ప్రభువుకు మిత్రుడు. చక్రవర్తికి కావలసిన చతుర్విధ ఉపాయాలలో, షడ్గుణాలలో, బుద్ది కుశలత లో, పాండిత్యములో, గజసంపదలో, మంత్రశక్తిలో, క్రీడావిలాసములో, ఒకటేమిటి, అన్ని విషయాలలోనూ నిపుణుడు. సరసుడు. రసికుడు. దేవేంద్రుని సైతమూ పరాభవించగలిగిన పరాక్రమ శక్తి సంపన్నుడు.

ఇందుకులావతంస మత డే తరి నేతరిగాడరిం బ్రజ
ల్కంద గొనం డొరుం డొరుతల న్వినిపించిన మాట డెందముం
జెంద ముదంబు దక్కి  చెడ జేయ డొరు న్వినతాస్యుడౌ నుతిం
పం దను బందనుం గొరత వల్కడు శూరత దాను మించియున్

ఆతడు ఇందు కులావతంసము, అంటే చంద్ర వంశమునకు అలంకార ప్రాయమైనవాడు. ఏతరి అంటే ఎప్పటికీ. 'ఏతరి' అంటే  నీతి తప్పిన వాడు అని కూడా అర్ధం. ఇక్కడ తన భాషా వైదుష్యాన్ని చూపుతున్నాడు రాయలు. ఆ రాజు ఏ తరి కూడా 'ఏతరి' కానివాడు అంటే ఎన్నటికీ నీతి తప్పని వాడు. 'అరి' అంటే పన్ను, శుల్కము. ప్రజలు కందకుండా, బాధ పడకుండా పన్నులను విధించే వాడు. చెప్పుడు మాటలు విని ఎవరినీ బాధించేవాడు కాదు. ''..వినతాస్యుడౌ నుతింపం దను..'', తనను ప్రశంశిస్తూ ఎవరైనా నుతులు చేస్తుంటే లజ్జతో తల వంచుకునే వాడు. పొగడ్తలకు 'ఆహా..వోహో..అవును..నేను అంతటి వాడినే, ఏమనుకున్నావు మరి!' అని తల ఎగరెయ్యడం మదానికీ, అహంభావానికీ లక్షణం. తనను ఎవరైనా పొగుడుతుంటే తలవంచి మౌనం వహించడం అంటే ఆత్మ ప్రశంస యందు ఇష్టము లేని వాడు అని. కానీ ఇది ఆతని అంతర్ముఖత్వ లక్షణానికి ప్రతీకగా భావి కథా సూచనగా రాయలు చెప్పాడు అని నా ఉద్దేశము. తను చేసే కొన్ని పనులు తననే సిగ్గిల జేయడం ఎంతటి వారికైనా జరిగేదే. స్వానుభవంతో తెలుసుకోవాలి వీటిని. నిజాయితీ కలిగిన వాడు తనను ఎవరైనా పొగుడుతుంటే, అయ్యో, ఇన్ని ప్రశంసా వాక్యాలకు నేను పాత్రుడినా, నా తప్పులు తెలియక నన్ను ఉన్నతుడిని అని భావిస్తున్నారు ఈ అమాయకులు! అని ఆత్మ విమర్శ చేసుకోవడం తమను తాము సరిదిద్దుకొనడం కోసం మరల మరలా ప్రయతనములను చేయడం మానవ నైజం. నిర్మలమైన పసిపిల్లల విషయంలోనూ, పసిపిల్లల వంటి మనసున్న వాళ్ళ విషయంలోనూ ఇది అక్షర సత్యం. అందుకే నువ్వు ఈ తప్పు చేశావు అని కాకుండా నువ్వు ఈ వొప్పు చాలా బాగా చేశావు, ఇంకా బాగా చేయగలవు అనడం ద్వారా, సున్నితమైన ప్రశంసల ద్వారా ఎవరి తప్పులను, వొప్పులను వారే గుర్తించేలా జేసి సరిజేయడం, సంస్కరించడం తెలివైనవారు చేసేపని, చేయాల్సిన పని. 'మెన్ మేనేజ్మెంట్' లో ఆధునిక మార్గాలు ఇవే చెప్తాయి. ఇన్ని మంచి లక్షణాలు వున్నా ఈ మత్స్యధ్వజునికి వేశ్యాలోలుపత్వం ఉన్నది. ఒక వేశ్యకు ఇతను దాసుడై నిత్యమూ ఆమెను చేరి, ఆమె అందంచందాలకు ముగ్ధుడై కామకేళిలో తేలేవాడు, అది తన బలహీనత అని తనకు తను వితర్కించుకునేవాడు కనుకనే, ఒకే ఒక నీతి వాక్యమును అనుకోకుండా వినడంతో తన మార్గాన్ని, మనసును, ప్రవర్తనను మార్చుకుని 'తనకు ముక్తిని ప్రసాదించ గలిగే దైవం యొక్క అన్వేషణలో' పడతాడు, ముందు ముందు. అది ఈ ప్రబంధములోని అందమైన సంఘటనలలో ఒకటి. త్వరలోనే ఆ ఘట్టాన్ని మనం రుచి చూస్తాము. ముందు ముందు జరగబోయే దానికి సూచకంగా ఇక్కడ ఈ విషయం చెప్పాడు రాయలు, ఆత్మ విమర్శ చేసుకునే వాడికే త్వరగా ఆత్మ శుద్ది చేసుకునే శక్తి వుంటుంది. ఆ సమయమూ, సందర్భమూ తారసిల్లాలి, అంతే! కనుక వెంటనే మారిపోతాడు మత్స్యధ్వజుడు. ఇంతే కాకుండా, తన పరాక్రమానికి లొంగి, బెదరి, పారిపోయే వారిని చులకన చేసే వాడు కూడా కాడు ఈ మత్స్యధ్వజుడు. అంటే ఆత్మస్తుతిని, పరనిందను మెచ్చనివాడు. ప్రజారంజకుడైన పరిపాలకుడు. సకలకళా వల్లభుడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు       

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి