ఫైర్ సర్వీసులు… - భమిడిపాటి ఫణిబాబు

fire service

దేశంలోని ప్రతీ ఊరులోనూ చూసే ఉంటారు. అకస్మాత్తుగా ఎక్కడైనా, అగ్ని ప్రమాదాలు జరిగినా, వీళ్ళకి ఓ ఫోను కొట్టేస్తే చాలు. ఓ అరడజనుమంది . ఓ ఎర్రబండిలో గంట గణ..గణ.. మంటూ కొట్టుకుంటూ వచ్చేస్తారు. మంటలు ఆర్పేసి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మధ్యన నగరాల్లో, ఎలాటి ప్రమాదాలు, మంటలే కానఖ్ఖర్లేదు, జరిగినా కూడా వీళ్ళనే పిలుస్తున్నారు. మన ప్రభుత్వంవారు ఎక్కడైనా అల్లర్లు జరిగితే, సైనికదళాలనే పిలుస్తారు, వరదలొచ్చినా పాపం వాళ్ళే. మరి పోలీసులూ వాళ్ళూ ఏం చేస్తూంటారో? సైనికదళాలకి, కనీసం, దేశ సరిహద్దుల్ని, అహర్నిశలూ కాపాడ్డమైనా ఉంటుంది. కానీ, ఈ ఫైర్ సర్వీసులవాళ్ళకి, ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే, చేతులనిండా పని.అయినా ప్రమాదాలు రోజూ జరుగుతాయా ఏమిటీ? జరిగినప్పుడు వాళ్ళెట్టాగూ వస్తారు, మిగిలిన అన్నిరోజులూ, ఏదో ప్రాక్టీసు చేయడంలోనూ వాళ్ళు ఉపయోగించే ఫైరింజన్లని  కండిషన్ లో పెట్టుకోడంతోనూ సరిపోతుంది. చాలా మంది అభిప్రాయం, వీళ్ళకి అసలు పనే లేదూ, అప్పనంగా జీతాలు తీసికుంటున్నారూ అని ! మరి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీళ్ళే గతి !

ఈ ఫైర్ సర్వీసెస్ వారి కోవలోకి వచ్చేవాళ్ళే, మన అమ్మమ్మ/నానమ్మ/ తాతయ్యలు. ఇందులో అసలు సిసలు ఉపయోగం, అమ్మమ్మా/నానమ్మలే. తాతయ్యలు ఫైరింజను డ్రైవర్ లాగన్నమాట !. అసలు ఆయన లేకపోతే బండే నడవదుగా, అందుకని ఆయనదికూడా ముఖ్యమైన పాత్రే ! కానీ గుర్తింపుండదు. చేసికున్నంతవాడికి చేసికున్నంతా.

భార్యకి నెల తప్పిందంటే చాలు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఓ “రిక్వెస్టు” పెట్టేసికోడం—“నేను ఫలానా ఘనకార్యం చేశానూ, అందువలన మీరిద్దరూ వంతులేసికుని, మీ మనవడో, మనవరాలో,  ఈ భూమ్మీదకొచ్చి, బుడిబుడి అడుగులు వేసి, మాట్టాడ్డం నేర్చుకునే దాకా, మదర్పిత తాంబూల సత్కారాలు స్వీకరించ ప్రార్ధనా..”. ఎంతచెప్పినా కన్నపేగాయే,  ఏ గ్రాండ్ పేరెంట్లు మాత్రం కాదంటారూ? ఆ పిల్లకి వేవిళ్ళలాటివున్నాయా, అమ్మే కావాలి, సుకరాలన్నీ తీర్చుకోడానికి. కాదూ, అత్తగారు ఓకే. కానీ పురిటి టైముకి మాత్రం అమ్మే ఉండాలి. అదీ నిజమే, ఎంతైనా కూతురి మనసు తల్లికే కదా తెలిసేది.

ఇందులో దేశంలో ఉండేవారి విషయం వేరూ, విదేశాల్లో ఉండేవారి విషయం వేరూ.  ముందుగా  NRI  ల విషయం చూద్దామంటే , మేము ఎప్పుడూ విదేశాలకి వెళ్ళినవారం ( ఏ కారణానికీ) కాదు కాబట్టి, అక్కడి సంగతి వ్రాయడం భావ్యం కాదు. అయినా వెళ్ళినవారి కబుర్లు వింటూంటాముగా… అక్కడి విషయాలు ఏదో పుస్తకాల్లో చదవడం వరకే పరిమితం. వెళ్ళొచ్చినవారి కబుర్లకేమిలెండి, లేనిది ఉన్నట్టుగానూ, ఉన్నది లేనట్టుగానూ చెప్పడంలో ఘనులే. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక ! అయినా చిత్రంకాపోతే, ఎవరి గుట్లు వాళ్ళు బయటపెట్టుకుంటారమ్మా ? పైగా అలా అంటే “ grapes are sour “  అన్నా కానీ  ఆశ్చర్యం లేదు, ఎందుకొచ్చిన గొడవా, హాయిగా మనదేశంలోని “ఫైర్ సర్వీసెస్ “ గురించి మాట్టాడుకుంటే పోలా?

వీళ్ళల్లో పైన చెప్పినట్టు, ఉద్యోగంలో ఇంకా ఉంటున్నవారి విషయం వేరూ, రిటైరయిన వారి విషయం వేరూ. ఉదాహరణకి ఓ అమ్మాయీ, అబ్బాయీ ఉన్నారనుకుందాం. సాధారణంగా అమ్మాయి పెళ్ళీ, పురుళ్ళూ తండ్రి ఇంకా సర్వీసులో ఉండగానే పూర్తయిఉండడంతో, ఈ తండ్రిగారికి అంతగా పనుండదు, ఉద్యోగమూ, శలవూ వంకతో. బతికిపోయాడు ! ఏదో పురిటి సమయానికి కూతురిని హాస్పిటల్ కి తీసికెళ్ళడమూ వగైరా తప్పించి.  పడే తిప్పలేవో ఆ తల్లే పడుతుంది. అయినా ఈ రోజుల్లో జనాలు తెలివిమీరిపోయారు, ఇదివరకటి రోజుల్లో లాగ మొదటి  కానుపుకి పుట్టిల్లూ  లాటి  పాత సంప్రదాయాలకి  good bye చెప్పేశారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే చాలా సందర్భాల్లో.  కారణాలేవైనా ఉద్యోగం చేస్తూన్న ఊళ్ళోనే పురుళ్ళూ, పుణ్యాలూనూ. దానితో మన  “ ఫైర్ సర్వీసెస్ “ వాళ్ళ “ వంతుల ప్రకరణం “  ప్రారంభం అవుతుంది.. వియ్యాలారు ఇద్దరూ పై ఊళ్ళోనే ఉంటే  scenario  వేరుగా ఉంటుంది. ఒకరు కొడుకు పనిచేసే ఊళ్ళో ఉంటే, ఇంకోలా ఉంటుంది.

ఉదాహరణకి ఒక scenario  తీసికుందాం. ఇదివరకటి రోజుల్లో భార్యాభర్తలకి ఓ అయిదారేళ్ళైనా తేడా ఉండేది. భర్త ఉద్యోగంలోంచి రిటైరయినా, భార్యకి ఓ మూడునాలుగేళ్ళు సర్వీసుండేది. దానితో, ఏదో పురిటి సమయానికి ఓ రెండు మూడు రోజులముందు వచ్చి, ఏదో బారసాల దాకా ఉండి, శలవు లేదని వెళ్ళిపోవడం. ఇంక పసిబిడ్డ ఆలనాపాలనా నానమ్మగారే చూసుకోవడం. ఆ పసిబిడ్డని చూసుకోడానికి ఓ పనిపిల్లని పెడుతున్నారులెండి. ఆ పిల్లో, పిల్లాడినో ఆరో నెలకి ఏ day care centre  లోనో వేసేస్తున్నారు. అలాగని ఊళ్ళోనే ఉండే నానమ్మ అవసరం తీరిపోయినట్టా అంటే అదీ లేదూ, ఏ కారణం చేతైనా, emergency  వచ్చిందంటే, ఈ నానమ్మే కావాలి. ఈరోజుల్లో యువజంటలు మరీ తెలివిమీరిపోయారులెండి. ఏదో ఇరువైపుల తల్లితండ్రులకీ వంట్లో ఓపికున్నప్పుడే, రెండో బిడ్డని కనేస్తే , ఓ  పనైపోతుందనుకుంటున్నారు. ఎలాగూ చూడ్డానికి పెద్దాళ్ళు ఎలాగూ ఉన్నారూ, వాళ్ళకి మాత్రం ఆనందంగా ఉండదేమిటీ, తమ పిల్లల “ అభివృధ్ధి” చూసి !!

కానీ ఓ వయసొచ్చిన తరువాత, బయటి ఊళ్ళనుండి,  అమ్మమ్మా, నానమ్మా రావాలంటే, ఒక్కొక్కప్పుడు చాలా సమస్యలొస్తూంటాయి. భర్తని ఊళ్ళో వదిలి, భార్య ఒక్కరూ రావడం కూడా కష్టమే. దానితో  buy one get one scheme  లో ఇద్దరూ వస్తారు. అలా వియ్యాలారిద్దరూ వస్తే, నగరాల్లోని అగ్గిపెట్లలాటి ఎపార్టుమెంట్లలో సద్దుకోడం కష్టం. అలాగని రాకుండనూ ఉండలేరూ. ఏమిటో అన్నీ సమస్యలే. ఇందులో ఉన్న ఒకేఒక్క silver lining  ఏమిటయ్యా అంటే, ఫైరింజను డ్రైవరు గారికి అంటే  తాతయ్య గారి పని మాత్రం హాయి. ఏదో, పెద్ద మనవణ్ణో, మనవరాలినో, ఆ day care  కి తీసికెళ్ళడం వరకే. అలాగని మిగిలిన టైమంతా ఖాళీగా ఉంటాడని కాదు,  భార్య ఓసారి నడుం వాలిస్తే, పసిబిడ్డని చూసే డ్యూటీ ఈ తాతగారిదే మరి.

రిటైరయిపోయారూ, మీకేమండీ హాయిగా ఉన్నారూ, అని ఊళ్ళోవాళ్ళందరూ ఆడిపోసుకోవడమే కానీ, వీరి ఎమర్జెన్సీ డ్యూటీల సంగతి వాళ్ళకేం తెలుసూ? పైన చెప్పినట్టుగా, పనుందా అంటే ఉందీ, లేదా అంటే లేదూ… ఫైర్ సర్వీసెస్ వారిలాగానే ఉంటోంది ఈరోజుల్లో పెద్దవారి పరిస్థితి.  At the end of it, they are enjoying…

మరిన్ని వ్యాసాలు