బాపు బొమ్మలు - కార్టూనిస్ట్ జయదేవ్

bapu bommalu

నాకు వయసు పదమూడో, పద్నాలుగో. కోమలంగా ఆడపిల్ల గొంతులా పలికే నాగొంతు వున్నట్టుండి గరగర-బొరబొరగా మారింది. మా నాయనమ్మ నాకు పసుపు రాసి దిష్టి తీసింది. తర్వాత తలంటు స్నానం చేయించింది. ' ఒరేయ్ వీడికి అర నిజార్లు తొడగడం మాని ఫుల్ నిజార్లు కుట్టించాల్రా ' అని మా బాబాయికి ఉత్తర్వు జారీ చేసింది. నాతోపాటు పక్కింటి గోపాలు, ఎదురింటి కణ్ణన్, చివరింటి నాదమునికి యించుమించు వారం, పదిహేను రోజుల్లో తలంటు స్నానాలు జరిగాయి. మా నలుగురికి జరిగిన యీ మార్పుని మరింత ప్రభావితం చేశాయి. ఆరోజుల్లో మేం చదివే పత్రికలు !

ఇంకా ఎంతకాలం చందమామ చదువుతాంలే, అడపాదడపా ఆనంద వికటన్, కల్కి, ఆంధ్ర పత్రికలని కూడా తిరగేద్దాం అనిపించింది. క్రమేణా చందమామ మీద మక్కువ తగ్గి ఆంధ్ర పత్రిక మీద పడింది. ముఖ్యంగా ఆ పత్రికలలోని కథల బొమ్మల మీద. ఎవరండీ ఈ మహానుభావుడు ఇంతందంగా అమ్మాయి బొమ్మలు గీస్తున్నారు అని కళ్ళు పెద్దవి చేసుకుని పదే పదే ఆ చిత్రకారుడి సంతకాన్ని, ఆ చిత్రకారుడు గీసిన అమ్మాయి బొమ్మల్ని చూడ్డం మాకు ఒక హాబిట్ గా మారిపోయింది. క్రమేణా మేం నలుగురం ఆ బొమ్మల్ని " లవ్ " చేయడం ప్రారంభించాం. అలా " లవ్ " చేయడం మూలని, మాకు మీసాలు తొందరగా మొలిచాయి. మా కంఠంలో కొత్త శక్తి తొంగి చూసింది. మా చేష్టలు మారాయి. ఆకలెక్కువైంది. ఆసక్తి పెరిగింది. అమ్మాయిల వెంటపడ్డం ఆరంభించాం.

అమ్మాయిల వెంటపడ్డం అంటే, అందులో పెడర్థాలు వెతక్కండి. అందులో ఒక అన్వేషణ వుండేది. పత్రికలో, ఆ చిత్రకారుడు గీసిన అమ్మాయిల్లాన్టి అమ్మాయిల కోసం మేం తిరిగాం. ఇళ్ళూ, వీధులూ, మార్కెట్లూ స్కూళ్ళూ, కాలేజీలూ, వెతకని చోటు లేదు. " మనం మద్రాసు వాసులం. తమిళమ్మాయిలు అందంగా వుండరు. తెలుగమ్మాయిలు మద్రాసులో అటు టీనగర్, మాంబళంలో కనిపించొచ్చేమో ప్రయత్నిద్దాం. " అనుకుని అక్కడ కొన్ని రోజులు తిరిగాం. ఒకరిద్దరు కనిపించారు. ఐతే వాళ్ళకి జడలు పొట్టి, ఓణీలు వేసుకోరు. వేసుకున్నా, పొట్టి కొంగు వోణీలు. ఆ కొంగులు గాలిలో ఎగరవు. భుజం మీద జాకెట్టుకి పిన్నీసుతో బిగించి వుంటాయి. ఇంకోసారి చూడాలనిపించేది కాదు.

నేను కాలేజీ శెలవులకి జనగామ వచ్చాను. మానాన్నగారి షెల్ఫు నిండా ఆంధ్ర పత్రిక వీక్లీ కట్టలు కట్టలుండేవి. అన్నిట్ని బైటికి తీసి, పేజీ పేజీ తిప్పి, అమ్మాయిల బొమ్మలు చూడ్డం మొదలు పెట్టాను. ఇప్పుడు, ఆ బొమ్మలు గీసిన చిత్రకారుడు, బాపు మీద అభిమానం పెరిగింది. ఎంత అద్భుతమైన చిత్రకారుడీయన. ఇంత అందమైన బొమ్మలు ఎలా గీయగలుగుతున్నాడు? నాలో, ఆ బొమ్మల మీద పరిశీలనాసక్తి కూడా పెరిగింది. ప్రతిబొమ్మని కాగితం మీద ట్రేస్ చేయాలనిపించింది. తర్వాత చూసి గీయాలనిపించింది. నా శెలవులు ముగిసేసరికి నా ఫుల్ స్కేప్ నోట్ బుక్ నిండా బాపు బొమ్మలే. అన్నీ అమ్మాయిల బొమ్మలే. అందమైన అమ్మాయికి నిర్వచనం బాపుబొమ్మ అని తేల్చడానికి ఎక్కువరోజులు పట్టలేదు.

బాపు బొమ్మ మీద కలిగిన ప్రేమ వల్ల ఒళ్ళు హూనం అయింది. నిద్ర పట్టేది కాదు. కళ్ళు మూసినా, తెరిచినా బాపు బొమ్మే సాక్షాత్కరించేది. పెళ్ళి చేసుకుంటే బాపు బొమ్మ లాంటి అమ్మాయినే చేసుకోవాలి అనే పట్టుదల బుర్రలో బలంగా చోటు చేసుకుంది. ఈ పట్టుదల వల్ల ఒక మంచి జరిగింది. బుద్ధిగా చదువుకుందాం, మంచి ఉద్యోగం సంపాదించుకుందాం, రెండూ వుంటే బాపు బొమ్మలు మనల్నే వెతుక్కుని వస్తారని ఆ బాటలో పయనించాం.

మేం నలుగురం స్నేహితులం పెద్ద చదువులు చదివాం. ఉద్యోగాలు సంపాదించుకున్నాం. పెళ్ళిళ్ళు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, ఐతే, బాపు బొమ్మలేరీ? ప్చ్...దొరకలేదు. ఓ మోస్తరుగా ఫర్లేదు అనిపించే అమ్మాయిలతో మా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. పిల్లలు కూడా పుట్టారు. మధ్యలో బాపుగార్ని కలిశాం. ఆయనతో మైత్రి సంపాదించాం. ఆయనింట్లో ఒకట్రెండు సార్లు బస కూడా చేశాం. ఆయనగారింట్లోనైనా, బాపు బొమ్మలుంటారేమోనని చూశాం. గోడలమీద ఆయన చిత్రించిన బొమ్మలు తప్పించి మరెక్కడా కనిపించలేదు.

పోనీ బాపు గారి సినిమాల్లో ఐనా, బాపుబొమ్మ కనిపిస్తుందా అన్న ఆశతో, బాపుగారు షూట్ చేస్తున్న సెట్లకి వెళ్ళాము. బాపుగారు పడుతున్న తంటాలు ప్రత్యక్షంగా చూశాం. హీరొయినుకి సవరం జడ అతికించి కళ్ళకి కాటుక రాసి, చీర కుచ్చెళ్ళు, జాగ్రత్తగా కట్టించి, పోజులు బొమ్మలు గీసి చూపించి, ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా ఎక్స్ ప్రెషనివ్వాలో స్వయంగా నటించి చూపించి, ఫ్రేము ఫ్రేముకీ, షాటుషాటుకీ ఆయన అష్టకష్టాలు పడేవారు. సినిమా పూర్తయ్యాక, ఆ హీరోయిను చివరికి నాలాంటి బాపుగారి వీరాభిమానికి బాపు బొమ్మలా కనిపించిందా అనడిగితే " సారీ సార్...! నాట్ హండ్రెడ్ పర్సెంట్ ! " అనిపించేది. దిసీస్ ఫాక్ట్.

ఇంతకీ బాపు బొమ్మ ఎనాటమీ స్పెషాలిటీ ఏమిటి? హెడ్ టు ఫుట్ తనిఖీ చేస్తే టోటల్ గా అమ్మాయి ఆరడుగులకి మించి వుండాలి. ( నా పర్సనల్ ఒపీనియన్ ) ! 36-24-36 ఫార్ములాకి అతి దగ్గలో వుండాలి. ! వేళ్ళూ, ముక్కూ, పెదాలూ ముఖ్యంగా కళ్ళూ రేఖా చిత్రాల్లా వుండాలి. మనదేశంలో చాలా వూళ్ళూ తిరిగాను. అక్కడక్కడా కనిపించారు కానీ తేడాలు, వాళ్ళ అందానికి మించినవి కనిపించాయి. !
అమెరికా వెళ్ళాను. అక్కడ, పైన చెప్పిన స్పెసిఫికేషన్ తో అమ్మాయిలు కనిపించారు. ఐతే వాళ్ళకి పిల్లి కళ్ళు, లేకుంటే పాము కళ్ళు. భయం వేసింది. రెండోసారి చూస్తే కలలోకొస్తారేమోనని మొహం పక్కకి తిప్పుకుని నడిచాను.

బాపు బొమ్మ మీద నా అన్వేషణ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు నాది రిటైర్డ్ లైఫ్. పుస్తకాలు చదివే అవకాశం చాలా దొరికింది. బాపు బొమ్మలు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల్లా వుంటారా, లేకపోతే మన అల్లసాని పెద్దన గారి వరూధినిలా వుంటుందా చూద్దాం అని లైబ్రరీలు తిరుగుతున్నాను. ఒక పద్యం దొరికింది.

(ఇలాంటివి మన తెలుగు సాహిత్యంలో వందలు వందలున్నాయి)
జిలుగుల (బెట్టుంచున్ దొడలజెంద్రికపావడయంటమైతడిం బెళపెళ లేనిచీర (గటి బింకపు (జన్నుల (జేర్చికొంచువే జలకములాడియొకచాన కరస్థిత కేశయైనృపు వ్వెలువడి చూచెలో (బడితి నీకని బాసకునిల్చెనో యనన్.

తాత్పర్యము తెలుసుకున్నాక చమటలు పోసింది. అర్థమైంది. బాపు బొమ్మలు భూలోకంలో లేరు. పైలోకాల్లో ఉన్నారు. ఇప్పుడు బాపుగారు, అక్కడున్నారు. వారు గీసిన బొమ్మల్ని సరిచూసుకొంటున్నారు. రేపోమాపో నేనూ వెళతాను. బాపు బొమ్మల కోసం!

- కార్టూనిస్ట్ జయదేవ్
11-12-2014

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి