‘ఆముక్తమాల్యద’ మథురానగర చక్రవర్తిని పరిచయమాత్రంగా పరామర్శించి వేసవి ఋతువును వర్ణించడం మొదలుబెట్టాడు రాయలవారు. ‘ఆముక్తమాల్యద’ ప్రబంధము కనుక, వివిధ ఋతువుల వర్ణన ప్రబంధ లక్షణాల రీత్యా అవసరం గనుక ప్రబంధ లక్షణాలను నిక్షేపించడంకోసం గ్రీష్మఋతువర్ణన ఒక కారణం అయితే, మరొక కారణం కథా సంబంధమైన అవసరం కూడా. ఆ మథురానగర చక్రవర్తి మత్స్యధ్వజుడికి ఒక ప్రియురాలు ఉన్నది. ప్రతి సాయంత్రమూ ఆమె దర్శనం, స్పర్శనం, కామోపభోగ ప్రకర్షణం జరిగేవే, వింత ఏమీ లేదు. ఒక వేసవినాటి సాయంత్రం మాత్రం ఎప్పటిలాగే తన ప్రియురాలి సమాగమం కోసం ఆయన వెళ్తున్న సందర్భములో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఆ చక్రవర్తి జీవితంలో. ఆ సంఘటన విష్ణుచిత్తుల వారి జీవితంలో కూడా మరొక అద్భుతమైన సంఘటనకు తెర తీసింది. కనుక వేసవి ప్రస్తావన ఎంతో సహజసుందరమైన రీతిలో, ఏదో అతికించినట్లు కాకుండా అత్యవసరమన్న కథాంశంగా ఒదిగిపోయింది ఈ ప్రబంధంలో. గ్రీష్మ ఋతు వర్ణనలో భాగంగా అద్భుతములైన 27 పద్యాలను అందించాడు రాయలవారు. ఏ ఒక్కటీ ఒదిలిపెట్ట బుద్ది పుట్టనీయదు, కొన్ని కవిసమయాలు, కొన్ని సరసరసమయాలు, అన్నిటికి అన్నీ అద్భుత కవితారసమయాలు, అయినా అన్నిటినీ పరీక్షించడం వీలు కాదు కనుక
మచ్చుకు కొన్నింటిని రుచి చూద్దాము.
పాటల వసుంధరారుహ భాగధేయ
మాతతమరీచికాంబువర్షాగమంబు
ధరణి బొడసూవె నంత నిదాఘసమయ
ముదుటుతొ శాల్మలి ఫల విదళనంబు
పాదిరిచెట్లను పుష్పింపజేస్తూ, ఎండమావుల నీళ్ళకు వర్షాకాలమువంటిది అవుతూ( పెద్ద పెద్ద ఎండమావులను కల్పించే పెద్ద వర్షం అవుతూ) బూరుగు కాయలను పగులకొడుతూ ఉదుటుతో అంటే ఉద్ధతితో తీవ్రంగా ఎండాకాలం భూమి మీద పొడసూపింది. వర్షాకాలం నిజమైన నీటికి కాలం అయితే వేసవికాలం ఉత్తుత్తి నీళ్ళకు అంటే ఎండమావులకు కారణం అవుతుంది. అది చిన్ని చమత్కారం. వేసవిలో పాదిరి చెట్లు పుష్పించడం, బూరుగు చెట్లకున్న కాయలు పగిలి విచ్చుకుని ఆ బూరుగు దూది పింజలు, వాటితోపాటే గింజలు వెదజల్లబడడం అనేది ప్రకృతిసహజమైన విషయం, రాయల పరిశీలనా శక్తికి యిది నిదర్శనం.
దవధూమంపుదమంబులో దమరస ద్రవ్యంబు బంకేజ బాం
ధవభాను ప్రతతుల్హరింప గుయి వెంటన్వెళ్ళు శూన్యోరుకూ
పవితానం బన జాడజాడ బుడమిన్బాటిల్లి పై విప్పులై
యవసం బంచుల నాడగా నెగసె వాత్యాళిన్రజశ్చక్రముల్
వేసవి కాలంలో కార్చిచ్చు పుట్టడం సహజమే. ఆ కార్చిచ్చు రగులుతున్నప్పుడు వచ్చే నల్లని పొగ అనే చీకటిలో (దవధూమంపుదమంబులో) మాయజేసి, తమ ద్రవాలను అంటే నీళ్ళను సూర్యకిరణాలు హరించివేయడం వలన సూర్యునితోనే మొరబెట్టుకోవడం కోసం నీళ్ళు యింకిపోయి శూన్యాలు అయిపోయిన బావుల గుంపులేమో అన్నట్లు (బంకేజ బాంధవభాను ప్రతతుల్హరింప గుయి వెంటన్వెళ్ళు శూన్యోరుకూపవితానం బన) వాయువు సుడిగుండాలుగా సుడిగాలులు దుమ్మూ ధూళి కలిసి విపరీతముగా చెలరేగిపోతున్నాయి. గుండ్రని చేదబావులు గుండ్రంగా సుళ్ళు తిరుగుతూ పైకెగురుతున్న దుమ్మూ ధూళితో పోల్చబడ్డాయి. ఇప్పుడు చూసిన రెండు పద్యాలూ కవన చక్షువులతో చూసి ఋతువులో ప్రకృతిని పరిశీలించి వర్ణించాడు రాయలవారు. ఈ క్రింది పద్యంలో తన కవనశక్తితో పౌరాణిక ధార్మిక ఐతిహ్యాలను జోడించి వేసవిప్రక్రుతిని వర్ణించాడు. భారతీయుల వర్ణనలలో సూర్యునికి ఒక రథం ఉంది. దానిని ఎక్కి లోక సంచారం చేస్తుంటాడు సూర్యుడు. ఆ రథానికి ఏడు గుర్రాలు, కళ్ళాలు పాములు, రథసారధి అనూరుడు కుంటివాడు (పిచ్చుకుంటు) , ఇంతవరకూ పురాణం సంబంధమైన వివరం. ఇక సహజంగా వేసవిలో ఉండే లక్షణం పగటిసమయం ఎక్కువగా ఉండడం. పొద్దుసాగి సూర్యుడు పడమటికి తిరిగేసరికి ఉదయమునుండి వేడెక్కిన భూమి వేడిగాలులను వెలువరించడం జరుగుతుంది. ఇప్పుడు పద్యాన్ని పరిశీలిద్దాము.
పడమరవెట్ట నయ్యుడుకు ప్రాసనమొల్లక కూటిపేదలై
బడలికనూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికి
న్ముడియిడ బిచ్చుగుంటు రథమున్నిలుపం బయనంబు సాగమిన్
జడను వహించె నాగ దివసంబులు దీర్ఘములయ్యెనత్తరిన్
పాములు గాలి తిని బ్రతుకుతాయని కవికల్పన, కవిసమయము, అందుకే ‘పవనాశనము’ (పవన+అశనము)అని పాముకు మరొకపేరు. వేడి పడమటి గాలిని తినలేక కూటికి పేదలై డస్సిపోయిన సూర్యుని రథానికున్న కళ్ళాలు ఐన పాములు వడలిపోయి, వాటిని రథముతో బిగించిన ముడులు వదులైపోయి, గుర్రాలు పరుగెత్తడం ఆపడం, రథాన్ని ఎక్కివున్న సూర్యుడు యిదేమిటి? అని గద్దించి ఆజ్ఞాపించడం, సారధి ఐన అనూరుడు మరలా ఆ పాముకళ్ళాలను బిగించి కట్టడంకోసం రథాన్ని ఆపడం, దీనివల్ల ప్రయాణం సరిగా కొనసాగక, సూర్యుడు అస్తాద్రికి చేరుకోవడం ఆలస్యం అవుతున్నదేమో అన్నట్లు పగళ్ళు బాగా దీర్ఘములు అవుతున్నాయి నిడివిలో, ఆ వేసవిలో, యిదీ రాయల వర్ణనా వైదుష్యం!
ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై పాటిల్లె గుంభోంభనో
ద్భూతాంబుధ్వని వాద్యమై మరుదధః పుంజీభవత్పాటల
వ్రాతామ్రేడితసిక్త భూసురభిళా రామాంబుకుల్యాబహు
స్రోతస్సంధుల నంధుయంత్రనతికృత్ప్రోద్గీత గేయౌఘముల్
ప్రాతర్వేళలలో, ఉదయపు వేళలలో అటువంటి వేసవి కాలంలో, ఆ నగరంచుట్టూతా ఉన్న ఉద్యానవనములలో రెండు, మూడు వరుసలుగా నేల తడుపబడి ఉన్నది. పాటలీ కుసుమాలు, అంటే, కలిగొట్టుపూలు నేల కనిపించకుండా పరుచుకుని ఉన్నాయి. ఆ ఉద్యానవనములలో ఉన్న అనేకములైన నీటి కాలువలకు బావులకు ఏతం కట్టి నీటిని తోడుతూ తోటమాలులు తాము చేసే పనిని ఆనందమయం చేసుకొనడం కోసం, శ్రమను మరిచిపోవడం కోసం పాటలు పాడుతూ ఉన్నారు. వారి గానానికి అద్భుతమైన మద్దెల ధ్వని ఒకటి జోడు కడుతూ బ్రహ్మాండమైన సంగీత కచేరీ జరుగుతున్నది. ఏమిటయ్యా ఆ మద్దెల ధ్వని అంటే, ఏతాముకు కట్టిన కుండలు నీళ్ళలో మునిగినప్పుడు చేస్తున్న ధ్వనియే ఆ మద్దెలధ్వని!( గుంభోంభనోద్భూతాంబుధ్వని వాద్యమై) తోడు ఎలాగూ వేసవి ఉదయకాలాలలో వీచే గాలి వేణువు ఉండనే ఉన్నది. ఆ గాలికి రాలిపడిన పూలచేత వర్ణశోభ, ఆ పూల సౌరభము, ఉద్యానవనములలోని ఇతర సుగంధములచేత దివ్యమైన పరిమళము, ఆ ఉద్యానవనములలోని చెట్లకు నీళ్ళు పెట్టడంకోసం ఏతం ఎత్తుతూ తోటమాలులు సాగిస్తున్న గానలహరికి ఆ నీటి కడవలు చేస్తున్న ధ్వని పక్కవాయిద్యంలా తోడై, అంతటి తీవ్రమైన వేసవికాలంలో కూడా కన్నులవిందుగా, వీనులవిందుగా ఉన్నది ఆ నగరములోని ప్రకృతిశోభ!
(కొనసాగింపు వచ్చేవారం)