ఏడడుగుల బంధం - బాటసారి

relation

నమ్మకమైన ఒక స్నేహం , మనసు తెలిసి మసిలే ప్రేమని పంచే ఓ ఆత్మీయ బంధం ప్రతి ఒక్కరికి ఓ వయసొచ్చిన తరువాత ఉండాలి . సాధారణంగా వయసొచ్చిన తరువాత ఎన్ని ప్రేమాయణాలు సాగించినా మన సంప్రదాయం ప్రకారం పెళ్లి అనే బంధంతో ఒకరికొకరు తోడుగా ప్రయాణం మొదలు పెడతారు. వివాహం తరువాత ఆలుమగల మధ్య అల్లుకున్న మనస్తత్వాల ఆధారంగా మూడు రకాల జంటలని మనం చూస్తూ ఉంటాం.

మొదటగా, అభిప్రాయలు మనస్తత్వాలు అర్థం చేసుకుని ఒకరికోసం ఒకరుగా జీవించే జంటలు ఒక పదిశాతం మాత్రమే వుంటారు . వీళ్ళ మధ్య ప్రేమతో గొడవలు రావాలి తప్పించి మామూలుగా గొడవలు రావు . నిజమైన బంధం, మనకోసం ఉన్న తోడులో ఆలంబన వీరి మధ్య మొదటి మూడు నెలలకే తెలుస్తాయి. భర్తతో ఎలా వుండాలి, భార్య మనసేంటి అనే విషయాలు వీళ్ళ మధ్య మాటలకంటే చేతల్లోనే ఎక్కువగా కనపడతాయి . జీవితాంతం వీళ్ళు సంతోషంగానే వుంటారు . ఆ దైవం గీసిన గీతకి కాలం వీళ్ళని విడదీయాలి తప్పించి వీళ్ళు విడిపోరు.

ఇక రెండో వర్గం జంటలు . వీళ్ళు పెళ్ళైన దగ్గరనుంచి చిన్న చిన్న మాట పట్టింపులు, పౌరుషాలతో ఆత్మాభిమానానికి పోయి జీవితాంతం కొట్టుకుంటూ తిట్టుకుంటూ అవసరమైనప్పుడు ప్రేమగావుంటూ జీవిత నావని సాగిస్తూనే వుంటారు . సాధారణంగా వీరి మధ్య గొడవలు అత్తామామలని సరిగా చూడలేదనో, మగని మనసు తెలిసి మసలటం లేదనో, ఆడపడుచులు వచ్చినప్పుడు గౌరవంగా చూడటం లేదనో ఇలా భర్త వైపునుంచి; ఎంతసేపూ నీ తమ్ముడు, నీ అన్నయ్య అంటూ నీ వాళ్ళ గురించి పట్టించుకుంటావ్ కాని పెళ్ళాన్ని; నీకు జీవితాంతం సేవ చేసే భార్యని ఇంట్లో ఒకదాన్ని వున్నానని నన్ను పట్టించుకున్నావా, ఏనాడైనా మా అమ్మ నాన్నలకి గౌరవం ఇచ్చావా, నా మనసేంటో తెలుసు కున్నవా, డబ్బంతా మీ వాళ్ళకే పెడితే మన పిల్లల సంగతి ఏమికాను అంటూ భార్య వైపు నుంచి; ఇలా వీళ్ళ లైఫ్ అంతా పంతాలు పట్టింపులతోనే గడుస్తుంది. ప్రేమ ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు. కాని సమాజం కోసమో, కుటుంబ గౌరవం కోసమో, నాకో తోడూ లేకపోతే నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలోని భయంవల్లనో, వారికున్న సంస్కారం వల్లనో వీళ్ళు కలిసేవుంటారు. విడిపోవాలన్న ఆలోచనే ఉండదు. ఇలాంటి వాళ్ళు 85 శాతం వుంటారు.

ఇక మిగిలింది 5 శాతం. ఈ రకం జంటల వలెనే మన భారత దేశంలో విడాకుల కేసులు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి జంటలకు సరైన దారి చూపితే, జంటలే కాకుండా, వారి పిల్లలు, వారి పైన ఆధారపడిన వారు చుట్టూ పక్కల వారు కూడా సుఖంగా ఉంటారు.

పెళ్ళైన మరుక్షణం నుంచి వీళ్ళ మధ్య గొడవలు మొదలు. భర్త మనసు భార్య, భార్య మనసు భర్త అర్థం చేసుకోవడం అనే మాట పక్కన పెట్టి ఒకరి మాట ఒకరు విని అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అసలు వినే ప్రసక్తే లేదు . ఎప్పుడూ లోపాలు వెతుకుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జంటల గొడవల్లో ప్రధానమ్శాలు రెండు ప్రేమ,గౌరవం. నన్ను ప్రేమగా చూసుకోవటం లేదని భార్య , నువ్వు నాకు మర్యాద ఇస్తే నీకు ప్రేమ దక్కుతుందని భర్త. ఈ గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి, ఆ గాలివానకి ఉరుముల్లాగా వీళ్ళ తరపు పెద్దలను కూడా కలుపుతారు. అసలు గొడవలు మొదలయ్యేది ఇక్కడే. మాలో మేం ఎన్ని గొడవలు పడినా అది పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ల కూడదు అని వీళ్ళకి ఏనాడు అనిపించదు. భర్త ఇంట్లోలేని సమయం చూసి "అమ్మా మా ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు మన నాన్నలాగ నన్ను జాగ్రత్తగా చూసుకోవటం లేదు. బొత్తిగా జాగ్రత్త లేని మనిషి, అస్తమాటు ఫోన్ లో మీ వాళ్ళతో ఏంటి మాటలని విసుక్కుంటున్నాడు" ఇలా భార్య మొదలెడుతుంది.

ఏ బయటకో ఆఫీసులోకెళ్ళిన తరువాత "అమ్మా ఏంటి నీ కోడలకి మర్యాద ఏం తెలీటం లేదు. నువ్వు నాన్నతో ఎంత పద్దతిగా వుంటావ్ తను అందులో సగం కూడా చూపించటం లేదు . ఎప్పుడు చూసినా వాళ్ళ గోలే . మొగుడు మగాణ్ణి ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకోవాలని లేదు. ఏం వండమన్నా నాకు రాదు అంటోంది ఆ అమ్మాయి చేసిన వంటలు నాకు నచ్చటం లేదు . నీకు రాకపోతే మీ అమ్మనో మా అమ్మనో అడిగి తెలుసుకోమన్నా నా మాట లెక్క చేయటం లేదు . నా జీతం గురించి అరా తీస్తోంది. ఎలా కర్చుపెడుతున్నావ్ ఇన్నాళ్ళు ఏం దాచేవ్" అంటూ ఇలా ఇంట్లో విషయాలన్నీ తన తల్లికి చేరవేస్తాడు భర్త. అగ్నికి ఆజ్యం తోడైనట్టు వీళ్ళ ప్రతీ చిన్న గొడవల్ని పెద్దవాళ్ళ దగ్గరకి తీసుకు వెళ్లి లేని అభద్రతా భావాన్ని పెద్దవాళ్ళకు తెప్పించి మొత్తానికి ఆ గొడవల్ని కుటుంబ గొడవల కింద మారుస్తారు.

మా అమ్మాయిని సరిగ్గా చూసుకోవటం లేదంటూ పిల్ల తండ్రి, సంతోషంగా సరదాగా వుండే మా అబ్బాయి జీవితంలోకి దరిద్రంలా దాపురించింది అంటూ అబ్బాయి తల్లి . తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు సమయం చూసి ముఖ్యంగా జరిగే పండుగలకి గాని , ఫంక్షన్సకి కాని డుమ్మా కొట్టడాలు ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఫైనల్ గా విడాకులకి సిద్దపడటమో లేదా ఎవరింటికి వాళ్ళు వెళ్లి మౌన యుద్ధం చేయడమో జరుగుతుంది. నాకేంటి మగాణ్ణి ఎలా అయినా బ్రతుకుతాను అనే ధీమా మగాడిది. తిన తోడు లేకపోతే నేను బ్రతకలేనా నాకు చదువులేదా మా నాన్న నీడ లేదా అంటూ మొండితనానికి పోయి పుట్టింట్లోనే కాలం గడిపే తత్త్వం ఆడదానిది.

ఆ మొండితనం ఆ పంతాలకి అడ్డుకట్ట వేసి కలిసిపొతే మంచిదే . అలా కాకుండా చాలాకాలం పౌరుషాలకి పోయి దూరంగా ఉన్న వాళ్ళు మేం సంతోషంగా ఉన్నావని అనుకుంటారు కాని వాళ్ళు చూసేది అనుభవించేది అన్నీ తాత్కాలిక సంతోషాలే. వీళ్ళ బ్రతుకుల్లో ఆనందం అనే పదానికి అర్థం లేదు, ఉండదు కూడా . కాని నాకు నేను ఆత్మాభిమానంతో బ్రతికేస్తున్నాను అని జబ్బలు చరుచుకుంటూ కాలం వెళ్ళదీస్తారు. వయసులో ఉన్నంత కాలం ఈ జోరు కొనసాగుతుంది. స్నేహితులతో , షికార్లతో, ఈ దిక్కుమాలిన ఇంటర్నెట్ లు , కొత్త కొత్త స్నేహాలతో కాలం పయనిస్తూనే వుంటుంది .వీరి చుట్టూ ఉన్న అందరూ బానే ఉంటారు . ఎప్పుడైనా వీరికి ఒంట్లో బాగోకపోతే ఆ సమయానికి డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్ళేవాళ్ళు కూడా వుండరు . "ఎరా బావున్నావా" అన్న ఒక్క ఫోన్ తప్పించి వీరిని చూడనైనా చూడరు. ఏ పండగలైనా పబ్బాలైనా వస్తే నలుగురు నా అనే కుటుంబ సభ్యులతో వుండే ఆనందం ఉండదు. ఏకాకి బ్రతుకులు ఒంటరి పయనాలు తప్పవు .

నాకేం బయట హోటల్స్ ఉన్నాయిగా అనుకోవచ్చు .సరదాగా గడపటానికి గంతకో బొంత అన్నట్టు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా అనుకోవచ్చు. వండుకునేవాడికి ఒకటే కూర అడుక్కునేవాడికి అరవై కూరలని సంతోషపడచ్చు. కాని ఎన్నాళ్ళు తింటారు. ఆ అరవై కూరల్లోతనకి ఇష్టమైన కూర ఏదైనా ఉందా, వుంటే అందులో రుచి సరిగ్గా ఉన్నా లేకున్నా,  పక్కింటి పుల్లకూర రుచన్నట్టు బయట దొరికిందే మహా ప్రసాదంగా తినాలి తప్ప ఓ ఉప్పు, ఓ కారం, ఓ తీపి, ఓ పులుపు ఇవన్నీ వారికి నచ్చినట్టుగా ఉండవ్. అన్నీ మూసుకుని వాళ్లకు నచ్చినట్టుగా ఉండాలి తప్ప తనకి నచ్చినట్టుగా ఉండే అవకాశం ఉంటుందా.

ఒక గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో నచ్చక పొతే, ఒంటరితనంలో ఇమడలేక, వీళ్ళు కాకపొతే వేరొకరని ఎంత మంది దగ్గరకు వెళతారు. వీళ్ళు సరిగ్గా వున్నన్నాళ్ళు ముచ్చట బావుంటుంది లేదా వీరికి గుడ్బై చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు . వీరితో పాటు జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వామిలోనే అదే సంతోషం, ప్రేమ, కోపం, పంతం, పౌరుషం వీరు అర్థం చేసుకుని అలవాటు పడితే వాళ్ళు వీరిని అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. బయట దొరికే ఆ అరవై రుచులే ఇంట్లో వీరికి దొరుకుతాయి . వీరికి నచ్చినట్టుగా కూడా ఉంటాయి.

ఇలాంటి పెళ్ళైన ఒంటరి పక్షులు వారి వారి పుట్టింట్లో అలాగే వుంటారు. వారి స్నేహితులో, వారి చుట్టాలో, వారి ఇంటి ఇరురుపొరుగు వారో అప్పడప్పుడు పుట్టింటికి వస్తూ పోతూ ఉంటారు . వీరిని చూసి జాలి పడటమో, ఓదార్చాటమో లేదా వీరి వెనక దీని/వీడి బ్రతుకింతే అని ఎద్దేవా చేయటమో తప్పించి వీరు సుఖపడేది ఏదైనా ఉందా. సరదాగా వీరికి బయటకి వెళ్ళాలి అనిపిస్తుంది. ఏ పార్క్ కో , సినిమాకో లేదా ఏ functions కో వెళ్ళాలని వెళ్ళటం తప్ప నిజమైన ఆనందం ఉండదు. వీరిని పలకరించాలని పకలరించటం తప్ప సరైన గౌరవం ఉండదు. వీరి ఒంటరితనానికి నమ్మకమైన ప్రేమ ఉండేది మంచి వారో చెడ్డవారో, ఆ జీవిత భాగస్వామిలోనే. ప్రేమగానో కోపంగానో తననే అర్థం చేసుకుంటే ఈ సాధింపులు ఉండవు. రాను రాను అర్థం చేసుకునే ప్రేమ దొరుకుతుంది.

విడిపోవడం సులువే అంగట్లో దారుల్లా. కలిసి ఉండటం అలవాటు చేసుకుంటే జీలకర్ర బెల్లంలా జీవిత నౌక ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నా గమ్యం చేరేవరకూ ఓ నమ్మకం, ధైర్యం, తోడుతో సాగుతుంది. నాకు నువ్వు నీకు నేను, స్త్రీకి పురుషుడు పురుషునికి స్త్రీ . భార్యకు భర్త భర్తకు భార్య. వీరి చేతి అయిదువేళ్ళే సరిగ్గా ఒకేలా లేనపుడు వీరి జీవితాలలోకి వచ్చిన వ్యక్తి నాకు తగ్గట్టే వుండాలి అనుకోవడం తప్పు . కొన్ని వదులుకోవాలి, కొన్ని రాజీపడాలి. కొన్ని గెలవాలి. ఇదే సంసారం. వీలైనంత వరకు చేసిన తప్పులు సరిదిద్దుకుని కలిసి ఉండటానికి ప్రయత్నించాలి. విడిపోవటం అనే ఆలోచన పక్కకి పెట్టి, ఓ బంధమంటూ ముడిపడ్డాకా ఏడడుగుల సాక్షిగా ప్రేమతో కలిసే ఉండాలి అనే మాటని నిజం చేస్తూ భావితరాల వారికి ఆదర్శంగా ఉండాలి.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి