నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

......’నువ్వు అందరిలా....

“నువ్వు అందరిలా..” అనే ఆ రెండు పదాల ఉపయోగంతో, మా అమ్మానాన్న చిన్నతనంలో నన్నెలా మాట వినిపించేవారో, ఎలా ప్రభావితం చేసేవారో తలుచుకుంటుంటాను ఒక్కోసారి.....

దేనికైనా ఉపోద్ఘాతంగా - ‘నువ్వు అందరిలాంటి..... దానివా? కాదుగా’ అని నాన్న ప్రోత్సాహకరంగానే మొదలు పెడుతుండేవారు.ఏదైనా చాలెంజింగ్ పని నాతో చేయించా లనుకుంటే, అల్లా మొదలు పెట్టి...”నువ్వు చెయ్యగలవు, నాకు తెలుసు, వెనుకే నేనున్నాగా అంటూ ప్రోత్సహించి, మొత్తానికి చేయించేవారు కూడా.  చదువైనా, డాన్స్ ఐనా, కాంపిటీషన్ ఐనా అదే ఫార్ములా ఆయనది.

అయితే మరోప్రక్క, ‘ఖచ్చితంగా ‘నువ్వూ అందరిలాంటిదానివే’కాబట్టి’ అంటూ అమ్మ నన్ను అప్పుడప్పుడు మందలించడానికి, ఆ పదాలనే వాడుతుండేది.

యింట్లో నలుగురు పిల్లల్లో నేను పెద్దదాన్ని.  అందరికన్నా నాకు ఎక్కువ పని చెప్పేవారు, నా నుండి ఎక్కువ ఆశించేవారు, అమ్మానాన్నా.వారి ఆ వైఖరికి, నా ప్రవర్తన సుముఖంగానే ఉండేది.  అందరిలోకి నేనంటేనే వాళ్ళకి ఇష్టమని అనిపించేది... ఆ ఇష్టాన్ని అలాగే ఉంచుకోవాలని, వారి మెప్పు పొందాలని పాటు పడేదాన్ని.**

“చూడు నీకు డాన్స్ అంటే ఇష్టమే కదా! మరి సరిగ్గా ప్రాక్టీసు చేసి ముందుకి సాగాలి... లేకపోతే లాభం లేదు.. అదంతా శ్రమ అనుకుంటే, ఇప్పుడే మానేస్తే మంచిది.

‘నువ్వూ అందరిలా’ మామూలుగా చదువుకో.. చాలు,” అని నాన్న అంటే,

“నేర్చుకున్న డాన్స్ తిన్నగా ప్రాక్టీసు చెయ్యలేకపోతే, నువ్వూ మిగతా పిల్లల్లా, స్కూల్ - ఇల్లు - చదువు చూసుకో. డాన్స్ అంటూ ఈ ఖర్చు, ప్రయాస ఎందుకు మనకి,” అంటూ అమ్మ కూడా కోప్పడేది.  దాంతో, డాన్స్ ప్రాక్టీసుని నా రొటీన్ లో భాగంగా చేసుకొని,

ఆ విషయంలో వాళ్ళకి అసంతృప్తి లేకుండా చూసుకున్నాను...

ప్రోగ్రామ్స్ కాక, డాన్స్ కాంపిటీషన్స్, సుడిగుండాలు, All-India Kuchipudiaward,లాంటివి గెలవడంతో తరచుగా నా ఫొటో, దినపత్రికల్లో, పత్రికల్లో వస్తూనే ఉండేది.

“చూడు, డాన్స్ అంటే నీకు, మీనాన్నకి ఇష్టం కాబట్టి చేస్తున్నావు.  నేను సహకరిస్తున్నా.  పేరొచ్చినంత మాత్రాన నీకేదో కొమ్ములొచ్చాయనుకోకు.  ఇంట్లో “నువ్వూ అందరిలాంటి దానివే”.  మిగతా వాళ్ళని అలుసుగా అనుకోకు,” అంటూ అప్పుడప్పుడు గట్టిగానే మందలించేది అమ్మ.. దాంతో నాలో కాస్త తలెత్తున్న ‘గర్వం’ వదిలిపోయేది కూడా.

“ఎంత గొప్ప డాన్సర్ అయినా వంట-వార్పు, ఇంటి పని చెయ్యకపోతే లాభం లేదు.  ‘అందరి  ఆడపిల్లల్లా’ అన్ని పన్లు నేర్చుకొని చెయ్యి,” అంటూ వారానికి రెండుసార్లు నాతో వంట చేయించేది అమ్మ. కుట్లపనితో సహా. బయటవాళ్ళతో మాట్లాడేప్పుడు మాత్రం ‘ఉమా అందరిలాగా కాదు’.  అన్నీ చేస్తుంది. చక్కగా చదువుతుంది కూడా, అదీ ఇదీ’ అంటూ గొప్పగా చెప్పేవారు ఇద్దరూ....

**

రానురానుడాన్స్ యాక్టివిటీస్ తో ఊపిరాడనంత బిజీగా అయిపోవడంతో, నన్ను వొకేషనల్ స్టూడెంట్ గా మారమన్నారు మా సెయింట్. ఫ్రాన్సిస్ కాలేజీ ప్రిన్సిపాల్ - సిస్టర్ ఆనా. ఎగ్జామ్స్ జరిగేప్పుడు కాలేజీకి వచ్చిన ఇంవిజిలేటర్స్ ని మా హాల్ కి తీసుకొని వచ్చి నన్ను ప్రత్యేకంగా వాళ్ళకి పరిచయం చేసేది ఆమె. 

షి ఇజ్ స్పెషల్ చైల్డ్, టాలెంటెడ్ ఎండ్ గుడ్ స్టూడెంట్ టూ,” అని అనేది వాళ్ళతో...

ప్రోగ్రాంలు చూసిన ప్రేక్షకుల్లో కొందరు, అభిమానంతో రాసిన లెటర్స్ వచ్చేవి కాలేజీకి.. మా నాన్నని పిలిచి మా ప్రిన్సిపాల్ ఆ కలెక్ట్ చేసిన మెయిల్ అందజేసేవారు...

**

విదేశీ కల్చరల్ ట్రిప్పుల కోసం రోజుకి ఎనిమిదేసి గంటలు ప్రాక్టీసులు మొదలయినప్పుడు,నేను బి.యే మొదటి సంవత్సరంలో ఉన్నాను. ఆన్యువల్  ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న టైం.

“చదువుకోడానికి టైం లేదు.. ఇప్పుడు పరీక్షలు రాయలేను,” అన్నాను నాన్నతో. ‘ఏం పర్వాలేదు.  నీకు టైం లేదని తెలుసమ్మా. వచ్చే యేడు రాయచ్చు,” అన్నారు...నాన్న.అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. ముందుగా సౌత్ ఆఫ్రికా టూర్ నుండి రాంగానే, మలేషియా టూర్ సన్నాహాలు మొదలయ్యాయి.  ఈ లోగా కాలేజీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడులయింది.

నాన్న నన్ను పిలిచారు...

“చూడు,  నీ మీద నాకు బోలెడంత కాన్ఫిడెన్స్.  ”నువ్వు అందరిలా కాదు”. ఒక్కసారి చదివినా చాలు.  ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు.  జస్ట్ట్రై చేయి,” అన్నారు.  అప్పటికి పరీక్షలకి పదే రోజులున్నాయి.

చదివాను, రాసాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను.

**

నా వివాహమైన మొదట్లో, మా అమ్మ మా వారికి ఓ లెటర్ రాసింది...”ఉమా  అందరి లాంటి అమ్మాయి కాదు,” అంటూ, ముక్కుసూటిగా వెళతానని, చాలా డిసిప్లిండ్ గా ఉంటానని, అలా మెచ్చుకుంటూ మా వారికి నేను చాలా మంచిదాన్నని చెబుతూ అన్నమాట.అమ్మ అప్పుడప్పుడు నాతో కరుకుగా ఉన్నా నా మేలు కోసమే అని చిన్నప్పుడే తెలుసుకున్నాను.  అమ్మ ఓర్పు, సహకారం వల్లే నేను, మా నాన్న మా కలలని సాకారం చేసుకోగలిగాము.

**

కొంచెం కష్టం-కొంచెం ఇష్టం

నన్ను క్రమశిక్షణలో ఉంచడం కోసం ఒక్కోసారి కాస్త ఎక్కువగానే, నేను కష్టపెట్టుకునేలా కూడా ప్రవర్తించేవారు నాన్న. ఇండియాలో ప్రోగ్రాములు చేసినన్నాళ్ళూ నన్ను గడపదాటనివ్వలేదు. డాన్స్ వల్ల, సైన్స్ నుండి ఆర్ట్స్ కి మారవలసి రావడంతో, మెడిసిన్ చదవాలన్న ఆశ వదులుకున్నాను....కాబట్టి,నేను I.A.S  చేస్తానన్నాను.పాసయితే, ఇంటినుండి ఆర్నెల్లు ఢిల్లీకి ట్రైనింగ్ వెళ్లడం – వీల్లేదన్నారు. M.A  ప్రీవియస్ అయ్యాక, పోనీ జర్నలిజం చేస్తాన్నాను.  లేదంటే ‘లా’ చదువుతానన్నాను. “కాలేజీలు చాలా దూరం... ఎప్పుడెళ్ళి ఎప్పుడు ఇల్లు చేరుతావు? కారు ఉన్నా కేవలం నీ కోసమే దాన్ని ఉంచడం కుదరదు,” అన్నారు.

ప్రోగ్రాములప్పుడు ఆడవాళ్ళు అభిమానంగా నాతో మాట్లాడాలన్నా కుదరదనేవారు... ఇలా నన్ను చాలా ప్రొటెక్టెడ్ గా ఉంచేవారు...అసలు బ్యాక్-స్టేజ్ కి ఎవరినీ రానిచ్చేవారుకాదు. అన్నిటికీ ఆయనే మాట్లాడి మమ్మల్ని వెనక ఉంచేవారు.

అలాంటిది, విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలయ్యాక, నన్ను వేదికలపైన - కనీసం ఇంగ్లీష్ లోనైనా, వారి సన్మానాలకి స్పందించి మాట్లాడమని, న్యూస్ వాళ్ళ ఇంటర్వ్యూలల్లో సరిగ్గా మాట్లాడాలని అనేవారు.  ఉన్నట్టుండి సంకోచం, భయం లేకుండా స్టేజీల మీద మాట్లాడేటంత  ధైర్యం లేకపోయింది. అసంతృప్తితో కోపం తెచ్చుకుని చాలా కోప్పడేవారు నాన్న.... అలవాటు లేని పని నేను ఎలా చేయడం అని చాలా బాధపడ్డాను. అమ్మ కూడా నన్నే సమర్ధించింది ఆ విషయంలో...

అమ్మ విషయానికొస్తే, డాన్స్ ప్రాక్టీసులు, ఆహారం, ఇంటి-వంటపని వంటి విషయాల్లో నిర్దయగానే వ్యవహరించేది...స్ట్రిక్ట్ గా ఉండేది....

**

1990 లో,  యు.ఎస్. నుండి హైదరాబాదు వెళ్ళి, ‘భారతీయ నాట్య కళలు’ అనే ఎడ్యుకేషనల్ వీడియో ఫిలింనిర్మించాను.  నాన్నే అన్ని ఏర్పాట్లు చేసారు. “నువ్వు అందరిలా కాదమ్మా.  బద్దకించకుండా ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఇంత కృషి చేస్తున్నావు,” అని నాన్న మెచ్చుకున్నప్పుడు గర్వంగా అనిపించింది.

**

ఎందుకో మరి....

2009 లో,హైదరాబాదులో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటీ వారి ‘కూచిపూడి సభల’ సందర్భంగా నృత్య ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్ కి వచ్చిన ఆహ్వానాన్ని అందుకున్నాను.  ఇన్నేళ్ళ తరువాత, మా నాన్నగారి కోసమే, ఆ ఆహ్వానాన్ని సదవకాశంగా భావించాను. హైదరాబాదు చేరాక ఆ పదిహేను రోజులు, నాతో పాటు  ప్రాక్టీసులకి వచ్చారాయన.  నావెన్నంటే ఉన్నారు. ప్రోగ్రాం కూడా అయిన మరునాడు పొద్దున్నేనన్ను పిలిచి పక్కన కూర్చోమన్నారు..“నీవింక ఇటుపైన ప్రాక్టీసు, ప్రోగ్రాం అంటూ కష్టపడ వద్దు,” అన్నారు.నిజంగానే ఆ తరువాత నేను డాన్స్ చేసింది కూడా లేదు. శిక్షణ,శిష్యుల రంగప్రవేశాలు  తప్ప.

**

2012 లోఆంధ్రభూమిలో నా మొదటి కథ ‘కాఫీ-టిఫిన్-తయార్’ అచ్చయినప్పుడు కూడా మానాన్న సంతోషం, ఆయన నా గురించి ఎంత గర్వ పడ్డారో తలుచుకుంటే, నాకు ఎక్కడ లేని బలం, ఉత్సాహం, ఇంకా ఏదో చెయ్యాలన్న భావం కలుగుతుంది. “ఓహ్... మార్వలస్, బాగుంది స్టోరీ.... యు ఆర్ డిఫరెంట్, కంటిన్యూ రైటింగ్,” అంటూ ప్రోత్సహించారు....

నేను రాసిన మొట్టమొదటి కథకి ‘వంగూరి ఫౌండేషన్ వారి’ ఉగాది పురస్కారం దక్కడం కూడా నేను, నాన్న ఊహించలేదు... ఆయన సంతోషించారు.

జీవితంలో యేదైనా, అమ్మానాన్నల ఆమోదం ఉండేలా చేయడం అలవాటయిపోయింది.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి