సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద'

గ్రీష్మ ఋతువులోని ప్రకృతి వర్ణన చేస్తున్నాడు రాయలు. ప్రకృతి అంటే స్త్రీ శక్తియే.  గ్రీష్మ ఋతువులో చలివేంద్రాలు వుంటాయి త్రోవలపొడవునా. వేసవి తాపానికి, దాహానికి తాళలేక చలివేంద్రములలోకి వెళ్లి దాహాన్ని తీర్చుకునే బాటసారులు ఉంటారు. రాయల సరస, కవితారస, శృంగార రసకాలం కనుక వారికి మంచినీళ్ళను అందివ్వడానికి స్త్రీలు వుండేవారు. ఆ చలివేంద్రములలోని స్త్రీలను, దాహం తీర్చుకొనడానికి అక్కడికి వెళ్లి మోహదాహంచేత అలమటించే పురుషులను వర్ణించాడు రమణీయమైన సరసమైన పద్యాలలో.  

సుడి నాభి చ్చలనన్సరోజములు చక్షు:ప్రక్రియన్నాచు క్రొ
మ్ముడి దంభంబున జక్ర ఫేన పటలంబుల్చన్నులున్నవ్వుగా
నడరం జేసి నిదాఘభీతి సలిలంబాగామి బీజార్ధమై
కడవం బెట్టినవారిదేవతలు నా కాంతాళి యొప్పెన్బ్రపన్

అద్భుతమైన పోలికలు చెప్తున్నాడు ఇక్కడ. చలివేంద్రాలలో నీరు పోసే స్త్రీలు జలదేవతలవలె వున్నారు. జలదేవతలకు నీటికి సంబంధించిన లక్షణాలు వుంటాయి కాబోలు, బహుశా,ఆ లక్షణాలు ఈ స్త్రీల శరీరములలో ఎలా ఒదిగి వున్నాయో చెప్తున్నాడు.నీటికి వున్న కొన్ని లక్షణాలు ప్రవాహపుసుడులు, కొలనులలోని సరోజములు, నాచు,ఆ నీటితావులను ఆశ్రయించుకుని వుండే చక్రవాకములవంటి పక్షి జాతులు మొదలైనవి,  నీటి దేవతలవంటి, జలదేవతలవంటి ఈ స్త్రీలకూ వున్నాయి.వీరి నాభులు (బొడ్లు) నీటి సుడులుగా(సుడి నాభి చ్చలనన్), కన్నులు సరోజములవలె,నాచు వీరి జారి వ్రేలాడుతున్న కొప్పులవలె, వీరి వక్షోజములు చక్రవాక పక్షులవలె,నురుగు వీరి నవ్వులవలె కనిపిస్తున్నాయి. ఇలా ఈ వనితలు గ్రీష్మ ఋతువులో వేడిమికి నీరంతా ఇంకి పోతే ముందొచ్చే కాలానికి విత్తనాలకోసం నీటిని కడవలలోకి ఎత్తుకుని వెళ్తున్న జల దేవతల వలెనున్నారు. ఇది దాహానికి నీరు పోసే వారి తీరు. ఇక దాహానికి నీటిని స్వీకరించే వారి తీరు క్రింది పద్యాలలో.

సెగకుల్కి మరుగు జొచ్చిన జహ్నురవిజల 
   సరణి మల్లెలతోడి జడలు మెరయ
వాలి చన్ను కొమరు మ్రుచ్చిలిన దిమ్మను తెరం
   గున ముంచు గరిగకాగుల మునుంగ
ధారలోదోచు కన్దళుకులు వాసితో 
   త్పలపత్త్ర పతన సంభ్రాంతి నొసగ                 
దెలి మోము పస మెచ్చి తలయూచు టెరిగి మా 
  నక నవ్వునేర్పు డెందముల గరప

దెరవ లిటు నీరు వోయుపందిరియ చేరి
యవల గొరగాక పిచ్చుగుంటై యనంగు
డనుపుగొన జొచ్చె గల్లగుట్టమర వారి
కధ్వగులు లాచి యిడువిడియముల పేర      

నీరు పోస్తున్న నీటుగత్తెల కొప్పులలో మల్లెలున్నాయి. ఆ మల్లెలు గంగవలె, ఆ కొప్పులు యమునవలె ఉన్నాయి(జహ్ను రవిజలసరణి), ఈ గంగా యమునలు కూడా గ్రీష్మఋతువు లోని సెగకు అంటే వేడిమికి ఉల్కి అంటే భయపడి మరుగుజొచ్చిన అంటే దాగుకొన్నవాటివలె నున్నాయి. గంగా నది తెల్లనిది, యమునా నది నల్లనిది అని సంప్రదాయం. కనుక తెల్లని మల్లెలగంగ, నల్లని కొప్పుల యమున. పెద్ద పెద్ద కడవలను వంచి నీరు పోయడానికి వారు ముందుకు వంగుతున్నప్పుడు కడవలవంటి వారి స్తనములు ఆ కడవలలో, కాగులలో మునిగిపోతున్నాయి. తమ 'పెద్దరికాన్ని' ఆ కడవలు లాక్కున్నాయి అని మరలా తమ వైశాల్యాన్ని లాక్కోడానికి ఆ స్తనములు ఆ కడవలలో దూరినట్లు, పోటీ పడుతున్నట్లు కనబడుతున్నాయి. ఆ కడవలకు సువాసనలకోసం కట్టిన కలువ తూడులవలె జలధారలలోనుండి మెరుస్తూ కనిపించీ కనిపించనట్లున్న కన్నులు కనిపిస్తున్నాయి. నీరు తాగేవాళ్లు 'ఇక చాలు' అని తలలూపుతుంటే, నీటిని గురించి గాక తమ సొగసును మెచ్చి తలలూపుతున్నట్లు భావిస్తూ,అలా తాము భావిస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ, ఆటగా, వేళాకోళంగా,' ఉచ్చిలిగా' ఆగకుండా, వారు నవ్వుతున్న నవ్వులు, ఆ మల్లెల పువ్వులూ పథికుల మనసులను కరిగిస్తున్నాయి.ఆ బాటసారులు తమ మంచితనంతోనో, ప్రత్యుపకారంకోసమో వీరికి తాంబూలాలు ప్రదానం చేస్తుంటారు.ఈ శృంగార రస నిలయాలైన సరసపు చలువ నీటి పందిళ్ళలో దూరిన మన్మధుడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వేరేచోటికి పోలేని కుంటివాడై, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అక్కడే తిష్ఠవేసుకుని కూర్చుంటాడు. బాటసారులు నీరు పోసే స్త్రీలకు ఇస్తున్న తాంబూలాలు వారు మదనునికి చెల్లిస్తున్న మన్మథ సుంకం లాగా వున్నాయి, మన్మధుని కల్ల గాంభీర్యాన్ని డొల్ల జేస్తున్నాయి.  

తొడిబడ నమ్మలక్కలని తూలుచు దీనత దోయి లొగ్గుచున్
వడ మరి తేరదేర నల వాక్యములెన్నక మోము గుబ్బలున్
గడు కొను  కక్ష దీధితు లెగాదిగ గన్గొను చిట్టకంపు ద్రా
గుడు గని సన్నలన్నగిరి కొందరు పాంథు బ్రపాప్రపాలికల్

తొట్రుపాటుతో, దాహపు వేగిరం చేత ముందు 'అమ్మ' 'అక్క' అని పిలుస్తూ దోసిళ్ళు పట్టి నీరు త్రాగి వడ తీరిన తర్వాత, ఎండ వేడిమి తాలూకు అలసట, తమ దాహము తీరిన తర్వాత ముందుతాము చేసిన సంబోధనలను పాటింపక, నీరు పోస్తున్న స్త్రీల ముఖములను, వక్షోజములను, బాహుమూలములను ఎగాదిగా చూస్తూ నీరు త్రాగుతున్న పథికుల చేష్టలను చూస్తున్న ఆ చలిపందిళ్ళలోని స్త్రీలు ఒకరికొకరు సైగలు చేసుకుంటూ నవ్వుతున్నారు. కాముకుడి నైజాన్ని ఎంత సహజ సుందరంగా చిత్రించాడు రాయలు!    తరువాతి ఈ క్రింది పద్యం ఆంధ్ర సాహిత్యములో వేరెక్కడా కనబడని విచిత్రమైన వర్ణన. రాయలవారి చమత్కారానికి, ప్రకృతి పరిశీలనా శక్తికి, వర్ణనా వైదుష్యమునకు చక్కని ఉదాహరణ. |

ఎసగు కట్టావిక్రియ నావిరెగయ బగటి
ఎండయుడుకారకుండు భూమండలమున 
బొలిచె మాపట బండువెన్నెల చకోర
పోత వితతికి జాపట్టు వోసినట్టు

పగలంతా ఎండకు కాగిన భూగోళం పెనం లాగా వుంది. రాత్రి కాగానే ఉదయించిన చంద్రుని చల్లని వెన్నెలదోశెల పిండిలాగా వుంది. చంద్రుని చల్లని వెన్నెలల కోసం ఎదురుచూసే చకోర పక్షులు తినడం కోసంపోసిన 'చాపట్టు' లాగా, పెద్ద అట్టు లాగా వుంది ఆ వెన్నెల! కాగిన భూమి మీదినుండి రేగుతున్న ఆవిరిబాగా కాగిన పెనం మీద పిండి పోయగానే రేగే ఆవిరి లాగా వుంది. ఆంధ్ర సాహిత్య వీదులవెంట అద్భుతమైన ఫలహారశాలను తెరిచాడిక్కడ రాయలు. దాదాపూ ఐదువందల సంవత్సరముల క్రితం రచింపబడిన ఆముక్తమాల్యద గ్రంధంలో చాపట్టు అని ప్రయోగించి ఆంధ్రుల పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని తెలియజేశాడు.అప్పటికే రకరకాల దోశెల పరిచయం ఉందన్నమాట తెలుగు నాలుకలకు.                         

(కొనసాగింపు వచ్చేవారం)

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి