కళాతోరణం......
నా కళాజీవితంలో ఎందరినో కలిసాను....కళాకారులు, విద్వాంశులు, నాయకులు, కళాభిమానులను ఎందరినో...... నృత్యమన్నా, నేనన్నా అభిమానంతో వచ్చి కలిసేవారిలో కొందరు ముఖ్యులు, ప్రముఖులు కూడా ఉండేవారు. వివిధ రంగాల నిష్ణాతులైన వారు, ప్రదర్శనలకి ముఖ్య అతిధులుగా వచ్చేవారు...శాస్త్రీయ నృత్యానికి అంతటి ఆదరణ ఉన్న కాలంలో నేను కూచిపూడి నర్తకిగా నా ఆసక్తిని కొనసాగించగలగడం నా అదృష్టం...నర్తకిగా, నాకు లభించిన స్పందనలే, నాకు నా కళ పట్ల మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించేవి. ...నా ఆసక్తిని గ్రహించి, అడుగులకి మడుగులొత్తి, ప్రేమతో, క్రమశిక్షణతో నన్ను చేయిపట్టి నడిపించి, నా పురోగతికి బంగారు బాటలు వేసిన నా తల్లితండ్రులే అతిముఖ్యులు...
విశేషమైన జ్ఞాపకాలు..
‘ఊర్వశి’ శారద ని కలుస్తానని ఏనాడూ ఆలోచన కూడా లేని నాకు...సినీ గోయర్స్ వారి ప్రోగ్రాం అయ్యాక, మేకప్ తీసివేయడానికి సిద్దమౌతున్నప్పుడు, భళ్ళున తలుపు తెరుచుకొని లోనికి వచ్చిన ఆమెని, ఆమె వెనుక చలం గారిని చూసి ఆశ్చర్య పోయాను...నా నృత్యాన్ని మెచ్చుకొని, తనకి నాలా నృత్యం చేయాలని ఉండేదని, కాసేపు మాట్లాడి... వెళ్లారు శారద. అంతే కాదు, మరోసారి హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి లంచ్ చేసి మరీ వెళ్ళారు...అప్పుడే అనుకున్నాను ఆవిడ ఎంతటి ‘నిగర్వి’ అని... ఎవరైనా అలాగే ఉండాలని అనుకున్నాను....
అలాగే నటి మంజుల...నన్ను కలవడం చాలా సంతోషంగా ఉనదన్నది ఆవిడ. కలిసిన కాసేపట్లో చాలా నచ్చింది ఆమె.కళాకారులు నా దృష్టిలో మంచి వ్యక్తులు... వారిలో తప్పనిసరిగా తపనతో పాటు, క్రమశిక్షణ ఉంటుంది...అని నా అభిప్రాయం... కళాకారులే కాదు... ప్రేక్షకుల్లో అరుదైన, మరువలేని వ్యక్తుల్ని కూడా కలిసాను... నాకు దగ్గరైన కొందరితో ఏర్పడిన స్నేహాలు చిరకాలం నిలిచిపోతాయి......
అయితే, నా అంతట నేను వారి వెనుక నడిచి, ఫొటో తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది మాత్రం డైరెక్టర్ విశ్వనాధ్ గారిని, తనికెళ్ళ భరణి గారిని...ఇద్దరూ, అమెరికా సభలకి విచ్చేసిన సందర్భమే అది. అలా నా అంతట నేను వెళ్ళి ఒకరితో ఫొటో తీయించుకోవడం అదో కొత్తరకం అనుభవం. అలా అమెరికాలోనే జరుగుతుంది. ఇక్కడ తెలుగు సభల్లో కళాకారులు, ప్రేక్షకులు నిర్వాహకులు అందరూ పరుగులు పెడుతూ ఉంటారు, కార్యక్రమాల జోరులో...
పోతే, నా జీవితంలో తటస్థ పడిన కళాకారులని తలుచుకోగానే, నా చిన్నతనంలో జరిగిన రెండు సంఘటనలు గుర్తొస్తాయి. మద్రాసులో ఉండగా, నాకు ఐదారేళ్ళప్పటి సంఘటన ఒకటి – మా నాన్నకి సినీ ఫీల్డ్ తో సత్సంబంధాలు ఉండేవి. శోభనాచల స్టూడియోలో హిందీ సినిమా షూటింగ్ జరుగుతుందని, చూడ్డానికి తీసుకుని వెళ్ళారు ఓ రోజు సాయంత్రం. అక్కడ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర, నటి మీనాకుమారి పాల్గొంటున్నారని చెప్పారు... ఆమె తెల్ల చీర కట్టుకుని ఉన్నారు. ధర్మేంద్ర నాన్న కరచాలనం చేసి కాసేపు మాట్లాడారు. నన్ను దగ్గరికి పిలిచి “నీకు సినిమాలంటే ఇష్టమా? డాన్స్ నేర్చుకుంటున్నావంట. సినమాల్లో యాక్ట్ చేస్తావా?” అని అడిగారు ధర్మేంద్ర.. మీనాకుమారితో మాత్రం మాట్లాడ్డం అవలేదు. ఏమైనా ధర్మేంద్ర సినిమాలు చూసినప్పుడల్లా ఆ సంఘటన గుర్తొచ్చేది. నాతో ఆయన ముచ్చటించడంతో, చాలా ఇంప్రెస్ అయ్యాను కూడా. నేను కలిసిన మొదటి సినీ హీరో ధర్మేంద్ర. హైస్కూల్, కాలేజీ టైం లో కొన్నాళ్ళు అతను నా ఫేవరెట్ హీరో కూడా...
స్సలు మరువలేని గమ్మతైన సంఘటన మరొకటి... అదీ ఐదారేళ్ల వయసప్పుడే. నాన్నగారిని కలవడానికి కూడా కొందరు సినిమా యాక్టర్లు మా ఫ్లాట్ కి వచ్చేవారు. ఒక రోజు సాయంత్రం అప్పటి యాక్ట్రెస్ ‘కమలా కొట్నీస్’ , ‘మీర్జాపురం రాజ’ వచ్చారు. మేము వాళ్ళని కర్టన్ చాటు నుండి, డోర్ చాటు నుండి చూసాము. ఆమె ఫుల్ మేకప్ లో ఉంది. ఆమె తెల్ల చీరలో, బోలెడన్ని నగలు వేసుకుంది. కళ్ళార్పకుండా ఆమెని చూస్తుండి పోయాను. ఇంతలో అమ్మ ఆరెంజ్ జూస్ కలిపి ఓ ట్రేలో సర్దింది. నన్ను పిలిచి ట్రేలో జూస్ వచ్చిన గెస్ట్స్ కి అందించమంది. చెప్పలేనంత నర్వస్ అయ్యాను. అయినా తప్పలేదు. భయంగానే అతిమెల్లగా అడుగులో అడుగు వేస్తూ కమలా కోట్నిస్ వద్దకు వెళ్లాను. తల పైకెత్తి ఆమె వంక చూస్తూ ట్రే ముందుకు చాచాను. అంతే...ఊహించని విధంగా ట్రే లోనుండి జూస్ గ్లాసులు సర్రున జారి ఆమె మీదకి వొరిగిపోయాయి...బిగుసుకు పోయాను... వణికిపోయాను...’పర్వాలేదు, చిన్నపిల్ల,” అని ఆవిడ అనడం, అక్కడి నుండి ఏడుస్తూ నేను లోనికి వెళ్ళడం మాత్రం తెలుసు..ఆవిడ రెస్ట్ రూమ్ లో చీరని క్లీన్ చేసేసుకుని, మరికాసేపటికి వెళ్ళిపోయింది.నాకు చచ్చేలా తిట్లు చీవాట్లు అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. ఏమైనా అమ్మ నాతో అలా ఆ పని చేయించవలసింది కాదు అని మాత్రం నా అభిప్రాయం...