సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

అటువంటి గ్రీష్మఋతువులో ఎక్కడినుండో యాత్రలకు బయలుదేరాడు పరదేశి విప్రుడు ఒకడు.దేశాటనం చేస్తూ, పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ పాండ్య దేశం వచ్చాడు, ఆ దేశపు రాజుగారి పుణ్యం పండే సందేశం తెచ్చాడు, ఆ శ్రీహరి పనుపున వచ్చిన దూతలా అద్భుతమైన ఆదేశం యిచ్చాడు!

అప్పెను వేసవి విభవము
విప్పుగ దన్నగరనికట వృషగిరి హరికిం
దెప్పతిరునాళ్ళు రా ముద
మొప్ప న్బరదేశివిప్రు డొక్కడు భక్తిన్

సేవించి పోవుతరి మధు
రా విభవము జూడవచ్చి  శ్రాంతి మెయి న్మా
పా వైఘనీట గ్రుతసం
ధ్యావిధి యై నృపపురోహితా వాసమునన్   

ఆ మధురా నగరానికి సమీపములో వున్నవున్న వృషగిరిని దర్శించుకుని, అక్కడి 'సుందరబాహుస్వామి' అనే పేరున్న విష్ణుమూర్తిని సేవించుకుని వచ్చిన ఆ బ్రాహ్మణుడు, మధురా నగరము యొక్క వైభవాన్ని చూడడం కొరకు నగరానికి వచ్చాడు. వై ఘై నదిలో ఆ మునిమాపు వేళలో అంటే సాయం సంధ్య వేళలో, స్నానం చేసి, సాయం సంధ్యావందన 'విధులు' నిర్వర్తించుకుని ఆ నగరములో వున్న రాజపురోహితుని ఇంటికి బసకోసం చేరుకున్నాడు.చిన్ని చిన్ని పద్యాలే కానీ, ఆ నాటి జనజీవన చిత్రీకరణ వున్నది వీటిలో. బ్రాహ్మణునకు సంధ్యావందనము 'విధి', అంటే తప్పించుకునే అవకాశము, తప్పించుకోవాలి అనే ఆశ ఉండకూడని ఒక పవిత్రమైన బాధ్యత,ఒక సామాజిక బాధ్యత, ఎందుకంటే, సాయం సంధ్యా వందనం అనేది సమాజం ప్రశాంతంగా, శాంతియుతంగా వుండడం కోసం, ప్రజలందరూ సద్భావనతో, సద్వర్తనతో, సుఖంగా వుండడంకొరకు చేసే ప్రార్ధన.

ఆధ్యాత్మిక జీవనం బ్రాహ్మణుడి హక్కు కాదు,  సహజమైన జీవన ప్రక్రియగా కొనసాగవలసిన పవిత్రమైన బాధ్యత, విధి, కనుక అది నిర్వర్తించుకున్నాడు ఆ పరదేశి విప్రుడు. అనవసరమైన లంపటాలు తగిలించుకోకుండా తమ విధులు తాము నిర్వర్తించే నిరంతర సత్యాన్వేషులు, జ్ఞానార్జనాపరులు, జ్ఞాన ధన సముపార్జన చేసి, ఫలితాన్ని కోరుకోకుండా వితరణ జేసే విప్రులు, పురోహితులు వున్న సమాజం అది! అమ్మానాన్నలు, అన్నదమ్ములు వచ్చినా 'అయ్యో' అనుకునే రోజులు కావు అవి. ముక్కూ మొహం తెలియని పరదేశి యాత్రికులు కూడా స్వేచ్చగా వచ్చి ఆకలిబాధను తీర్చుకుని, విశ్రాంతి తీసుకోవడం కొరకు స్వాగతం చెప్పే యిళ్ళు ఉండేవి. అందునా 'పురోహితుడు' అంటే పురమునకు హితాన్ని కోరుకునేవాడు, అలా కోరుకునేవాళ్ళను ఆదరించాల్సిన బాధ్యత వున్నవాడు కనుక, ఆ రాజ పురోహితుడు ఇలా ఎక్కడెక్కడినుండో వచ్చే యాత్రీకులకు ఉచిత భోజన వసతి సదుపాయాలూ సమకూర్చేవాడు. కనుక, ఈ పరదేశి విప్రుడు ఆ రాజపురోహితుని ఇంటికి చేరుకొని..

పరిపక్వ సురభి రంభా ఫలంబులతోడ 
దలమెక్కు పనస పెందొలలతోడ
ఘ్రుతపిండనిభ కర్కరీఖండములతోడ
  బలుదెరంగుల మావి పండ్లతోడ        
గోస్తనీ మృదు గుళుచ్చ స్తోమములతోడ 
   గప్పులేరిన వడప్రప్పుతోడ
సుమధుర స్థూల దాడిమ బీజములతోడ 
   దనుపారు రసాదాడి గనెలతోడ

బానకం బతిథుల కిడ్డ తాను గ్రోలి
యర్చనాదత్త చందన చర్చ దేలి
విరులు సిగ దాల్చి కర్పూర వీటి జౌరు
గొట్టుచు ద్విజుండు వెన్నెల బిట్టు గాయ

పూర్తిగా పండి, మ్రగ్గిన వాసన వస్తున్న అరటిపండ్లతో (పరిపక్వ సురభి రంభా ఫలంబులతోడ ), పెద్ద పెద్ద పనస తొనలతో, పేరిన నేతిముద్దలవంటి తెల్లని చెరకుముక్కలతో, (ఘ్రుతపిండనిభ కర్కరీఖండములతోడ), రకరకాల మామిడి పండ్లతో, మృదువైన ద్రాక్ష పండ్లతో(గోస్తనీ మృదు గుళుచ్చ స్తోమములతోడ) పొట్టుదీసిన వడపప్పుతో, పెద్ద పెద్ద తీయని దానిమ్మ గింజలతో, తృప్తికరమైన రసవంతములైన 'రసదాడి' చెరుకు గడలతోనూ (సుమధుర స్థూల దాడిమ బీజములతోడ,దనుపారు రసాదాడి గనెలతోడ)..ఇన్నింటితో తయారుజేసిన పానకాన్ని అతిథులకు ఇస్తుంటే తానుకూడా తీసుకుని త్రాగి, ఆతర్వాత ఇచ్చిన 'చందనము'ను తీసుకుని, హాయిగా పూసుకుని, విరులతో 'శిఖ' ముడివేసుకుని, కర్పూరం వేసిన తాంబూలం వేసుకుని నములుతూ ( కర్పూరవీటి చౌరు గొట్టుచు) దేదీప్యమానమైన వెన్నెల కాస్తుండగా..

మాత్ర సంచి తలాడగా మార్గవేది
నొక్క డార్యలు గీత లొండొకడు తాసు
భాషితంబులుగా దోడి బ్రాహ్మనౌఘ
ముబుసుపోకకు జదువ బరున్న వేళ   

చేతి సంచీని తలగడగా పెట్టుకుని, 'మార్గవేది' అంటే మార్గంలో వున్నా వేదిక మీద, అరుగుమీద కూర్చుని, తనలాగే అతిథులుగా వచ్చిన వారిలో ఒకాయన 'ఆర్యలు' చదువుతుంటే, ఒకాయన 'గీత'లు గానం చేస్తుంటే,తాను సుభాషితాలు పఠిస్తూ కూర్చుని ఉన్న సమయంలో ఈ కావ్యంలోని అత్యద్భుత ఘట్టాలలో ఒకదానికి అంకురార్పణ జరిగింది!  ఎప్పటిలాగానే ఆ చల్లని సాయం వేళలో ...

పన్నీటితో గదంబము సేసి పూసిన 
   మృగనాభి పస రాచ నగరు దెలుప
బాటలానిలములార్పగ దపారపుజుంగు
   లలరుదావికి మూగు నళుల జోప
గర్ణడోలా మౌక్తిక చ్చాయ లెగబ్రాకు
   నురుహార రుచుల ద్రస్తరికి దన్న
|శశికాంతి చెంగావి దసిలి మించినకేల
   స్వర్ణస్తరువు వాడి వాలు మెరయ

మెలత యడపము దే జరన్మేరువనగ
దలవరులు కొందరొలసి ముందర జనంగ  
నర్థి రథ్యా౦తరాంతః పురాంతరమున
భోగినీ సంగతికి రాజు పోవుచుండి

పన్నీటితో కలిపి పూసుకున్న కస్తూరీ పరిమళము రాచనగరికి తెలియవస్తుండగా,  కస్తూరీమృగం నుండి  తీసిన ఖరీదైన పరిమళము ఇది రాచ నగరు, ఈ వచ్చేది మహారాజు అని తెలియజేస్తుండగా, తను ధరించిన కలిగొట్టుపూలు వెదజల్లుతున్న పరిమళములకు మూగుతున్న తుమ్మెదలను తన తలపాగాకు వున్న కుచ్చులు తను తల పంకిస్తున్నప్పుడు ఊగుతూ పారద్రోలుతుండగా, చెవులకు ధరించిన ముత్యాల కాంతులు క్రిందికి జారుతూ, తను ధరించిన రత్నహారములనుండి పైకి ఎగసి వస్తున్న కాంతులను ధిక్కరించి క్రిందికి తోసివేస్తుండగా, చేతిలోనున్న చెంగావి రుమాలు చంద్రకాంతులను వెలయిస్తూ, చేత ఇముడ్చుకున్న బంగారు పిడివున్న వాడి ఖడ్గము మెరుస్తుండగా, ఒక స్త్రీ తాంబూలపు సంచిని తీసుకొస్తూ వుండగా, తలారులు కొందరు రక్షగా ముందు నడుస్తుండగా, ఆసక్తితో, ఆ మార్గంలో రాజుగారి రెండవ అంతఃపురము అన్నట్లుగా వెలుగొందే వైభవోపేతమైన విలాసగృహములో వుండే భోగపుగత్తెను అంటే వేశ్యను కలవడానికి వెళుతున్న రాజు, కదలి వెళుతున్న ఒక మహా పర్వతములాగా వున్న మదురానగర మహారాజు, పాండ్య చక్రవర్తి మత్స్యధ్వజుడు, ఈ పరదేశి విప్రుడు పఠిస్తున్న సుభాషితమునొకదానిని, ఆత్మలో నాటుకునేట్లు అన్నదానిని, నిద్రాణమైన బుద్ది  మేలుకునేట్లు అన్నదానిని విన్నాడు.

(కొనసాగింపు వచ్చేవారం )
వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి