అచ్చంగా సాహిత్య స్వర్ణోత్సవ వేళ....
'నీకు లెక్కలు, సైన్సు, ఏవీ రావు,! నీపేరే ఏ.వీ.రావు, అంచేత 'గో...తెలుగు' " అని అంతరాత్మ ఘోషించింది. ఇప్పుడా? ఇప్పుడు కాదు., ఎప్పుడో యాభై ఏళ్ళక్రితమే.!
తలుచుకుంటే చిత్రంగానే ఉంటుంది మరి. ఇది నా సాహిత్య స్వర్ణోత్సవ సంవత్సరం. 2015 కొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా! అచ్చులో నా రచన, నా పేరు యాభై ఏళ్ళక్రితం అంటే 1965 డిసెంబర్ లో మొదటిసారి 'బాలబంధూ పిల్లల పత్రికలో వాచ్చాయి. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు నిండింది. హైద్రాబాద్ కోఠీ బస్ స్టాప్ నుండి ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళ్ళె దారిని ' తుర్రేబాజ్ ఖాన్ రోడ్ ' అని పిలిచేవారు. ఆ రోడ్డులోనే ' బాలబంధు ' పిల్లల పక్షపత్రిక ఆఫీసు, ప్రింటింగ్ ప్రెస్సూ వుండేవి.
పదిహేనురోజులకొకసారి వెలువడే ఆ పత్రిక వెల 20పైసలు. మల్టిపుల్ చాయిస్ తో అందులో ఓ పజిల్ వుండేది. అది నింపడం ఓ సరదా!
హయ్యర్ సెకండరీ స్కూల్ హెచ్.ఎస్.సీ. పాసయ్యి, కాలేజీ కుర్రాడిగా అవతారమెత్తుతున్న దశ అది. అచ్చులో నా మొదటి రచన ఓ కథ. అదికూడా పంచతంత్రం కథల ప్రేరణతో రాసిన కథ. నా పూర్తిపేరు అల్లమ్రాజు వెంకటరావ్ పేరిట బాలబంధు 1965 డిసెంబర్ 1వ తేదీ సంచికలో అచ్చయిన ఆ కథపేరు ' చెడు సహవాసం ' మంచో, చెడో తెలియదు కానీ అప్పట్నుంచే రచనా వ్యాసంగ సహవాసం - అచ్చుపోసుకోవడం మొదలయ్యింది.
అయితే నా సాహిత్యాభిరుచి మటుకు ఏడవ తరగతిలో వుండగానే - మొదట మా తెలుగు మాస్టారు నా చేతిరాత బాగుంటుందని , స్కూలు గ్రంధాలయంలోని పుస్తకాల పట్టికను - పుస్తకం పేరు వివరాలతో , నా తో రాయించడంతో, గ్రంధాలు గ్రంధ రచయితల పేర్లతో తొలి పరిచయాలు ఏర్పడ్డాయి. ! ఆయన వారింట్లో కూర్చోబెట్టి, అరటి పళ్ళు, పాలు, నాకు అందుకుగానూ పారితోషికంగా ఇచ్చారు. ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ఆ తరువాత మరో తెలుగు మాష్టారు తిగుళ్ళ వేంకటేశ్వర శర్మ గారు అభిరుచిని పెంచారు. చూచివ్రాత రాయమంటే నేనేదో సొంతంగా రాసేవాడిని. ఆయన దానిని కాదనక అభినందించేవారు. అలాగే లైబ్రరీ పిరియడ్ ఉండేది. గ్రంధాలయం నుండి ఓ పుస్తకం తీసుకుని చదివి, మరువారం దానిని తిరిగి ఇస్తూ - నాటి గ్రంధాలయ పిరియడ్ లో ఆ పుస్తకం గురించి రాయడమో, మాట్లాడడమో చేయించేవారు. చందమామ, బాలమిత్రలతో బాటు, ఆంధ్రపత్రిక, ప్రభ వంటివి చదవడం అప్పుడే మొదలయ్యింది.
స్కూలు రోజుల్లోనే నేనే సంపాదకుడిగా ' విజ్ఞాన జ్యోతి 'అనే పిల్లల చేతిరాత పత్రిక మొదలు పెట్టాను. తరగతిలోని విద్యార్థులే అందులో రచయితలూ, చిత్రకారులూ.! చిన్నచిన్న కథలు, కవితలు, బొమ్మలతో ఓ నోట్ బుక్ నే లిఖిత మాస పత్రిక చేసేశాం. వచ్చీరాని గీతలతోనే, తెలిసీ తెలియని భావాలతోనే మేం రూపొందించిన ఆ పత్రిక మాకో గుర్తింపు తెచ్చిపెట్టింది. పాఠశాలలో మమ్మల్ని ఉపాధ్యాయులు కూడా అభిమానంగా చూసేవారు. స్కూలు వార్షికోత్సవంలో నాటకాలు వేయడం, పాటలు పాడడం అవీ సరేసరి.! పదోతరగతిలో వుండగా కాబోలు, కాబోలు ఏమిటి అప్పుడే ! ఆ ఏడాది హైస్కూల్ సారస్వత సమితి తెలుగులో ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి ప్రసంగాన్ని, ఒక కవిసమ్మేళనాన్ని వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసింది. విజ్ఞానజ్యోతి మే 1964 సంచికలో దాని నివేదిక రాసుకున్నాం. నిజం చెప్పాలంటే నా పదవ ఏటనే ఈ లిఖిత పత్రిక మొదలుపెట్టాను. అసలు సరదాఏమిటంటే మా అమ్మ పేరున వున్న రబ్బర్ స్టాంప్ వేయడం. సంచిక మొదట్లో రేడియోలో పిల్లల ప్రోగ్రాం లాగా ఓ ఆహ్వాన గీతం, చివర్లో ముగింపు పాటలా ఒకటి ఉండేది. నా చేతిరాత, నా బొమ్మలు వేసే తీరు అలా శ్రీకారం చుట్టుకున్నవే. జనవరి 1961 నాటి విజ్ఞానజ్యోతి పుటలు కొన్ని ఇక్కడ చూడండి. నవ్వుకోకండేం ! ఇంతకీ చెప్పవచ్చే సంగతేమిటంటే ఇంత కృత్యద్యవస్థ వంటి సరదా ప్రపంచం వుందని చెప్పడమే ! రేడియోలో పిల్లల కార్యక్రమాల్లో పాల్గొనడం ఏడవతరగతిలో వుండగానే మొదలైంది. లిఖిత మాస పత్రిక అప్పుడే మొదలు. నేను కాలేజీలోకి ప్రవేశించాక కూడా మా కాలనీ లోని పిల్లల్ని పోగేసి అమర్ జవహర్ బాలానంద సంఘం అని ఓ బాలానంద సంఘం కూడా నడిపాను.
ఆనాటి బాల్యం కూడా మాకు ఎంత అర్థవంతంగా, ఆహ్లాద కరంగా వుండేదో చెప్పడానికే ఈ కబుర్లు గానీ నా గురించి డబ్బా కొట్టుకుందామని కాదు సుమండీ.! కానీ పనిలో పనిగా అది మ్రోగుతూంటుంది మరి. నా సాహిత్య జీవిత చరిత్ర అంతా ఓ క్రమంలో చెబుతానని మీరేం భయపడకండి. కానీ సుధామధురంగా జ్ఞాపకాల తోటలో మిమ్మల్ని తిప్పుతాను. ఏది చెల్లో, ఏది పొల్లో తేల్చేదీ, రాజహంసలా మంచిచెడులను వేరు చేసి మంచిని స్వీకరించగలిగేదీ మీరే!
ఇంతకీ నా గో-తెలుగు అన్న అంతరాత్మ ఘోష చెప్పలేదు కదూ! హెచ్. ఎస్. సి. పాసయ్యి సైన్స్ అందునా బయాలజీ గ్రూప్ తో వివేకవర్ధినీ కళాశాలలో పి. యు. సీ. ( ప్రీ యూనివర్సిటీ కోర్సు ) లో చేరినా మొదటి సంవత్సరం కాగానే ఆల్ జీబ్రా గుండె గాభరాగా కెమిస్ట్రీ అంతుపట్టని మిస్టరీ గానూ మారి ఆ కప్పలు కోయడం వంటి జీవహింసా నచ్చక సైన్సు, లెక్కలు లేని కోర్సు వుంటేనే చదువుతానని ఇంట్లో హఠం వేసి తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం కు ఒక్కసారిగా మారిన బెంబేల్ తనం తో వున్న నాకు ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ అనేది నా అభిరుచుల మేరకు నేవదగిన కోర్సుగా తారసపడింది. అంతే ! ' గో..తెలుగు ' అనుకుని ఆ ప్రాచ్య విద్యా కళాశాలలో 1967 లో చేరిపోయాను. నా విద్యార్థి జీవితానికి అదో గొప్ప మలుపు. !
మళ్ళీవారం కలుద్దాం.......