ఇంగ్లాండ్ అయినా, ఇండియా అయినా! .....
చిన్నపిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు గురించి నిత్యం న్యూస్ లో వింటూనే ఉంటాము. చైల్డ్ లేబర్ నుండి, సెక్సువల్ అబ్యూజ్ వరకు... ప్రతిరోజూ, ప్రతిపూట ఏదో ఒక సంచలనం. తల్లీ తండ్రీ, స్కూల్ టీచర్లు కూడా పిల్లల్ని బాధించడం లాంటివి వినడానికే బాధాకరం.
నిజానికి,ఇండియా ఐనా ఇంగ్లాండ్ ఐనా, అట్లాంటా ఐనా అనకాపల్లైనా.... ప్రపంచ వ్యాప్తంగా ‘శిశు సంక్షేమం’ సంక్షోభంలో ఉందనే అనవచ్చు.ప్రపంచంలో ఏ మూలనైనా - పిల్లలపట్ల అలసత్వం, అలక్ష్యం ముందుగానే పసిగట్టి నివారించగలిగితే బాగుండును.ఆయమ్మ ఐనా అమ్మే ఐనా, స్కూల్లో టీచర్ అయినా, చేయిపట్టి నడిపించే తండ్రే అయినా, పిల్లల పురోగతి దృష్ట్యా వారి ఉన్నతికి పాటుపడాలే తప్ప మితిమీరి శిక్షించడం, లేదా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మారాలి.
అమెరికాలో అయితే, స్కూళ్ళల్లో, డే-కేర్ లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారట అని అనుకుంటాము. అభిప్రాయపడతాము... కాదని స్వానుభవంతో తెలుసుకున్నాను.
మా అబ్బాయి, ఆకాష్ చిన్నతనంలో, జరిగిన ఓ సంఘటన నా జీవితాంతం గుర్తుండిపోతుంది...నాలుగేళ్ళ ఆకాష్ ని ప్రైవేట్ ప్రి-స్కూల్ కి పంపాము... యేడాది పొడుగునా వాడు ఇంటికి తెచ్చే డ్రాయింగ్స్, మోటార్ స్కిల్స్, వ్యొకాబలరీ టెస్ట్స్ లో - ఫస్ట్ ప్లేస్, సెకెండ్ ప్లేస్ అంటూ స్కూల్ నుండి తెచ్చే సర్టిఫికెట్స్ ఎంతో సంతోషానిచ్చేవి.
ప్రి-స్కూల్ నుండి కిండర్గార్టెన్ కి ప్రొమోట్ అయ్యాడు. కాస్త దూరంలో ఒక పేరున్న మరో స్కూల్లో పిల్లలకిమంచి సమ్మర్ ప్రోగ్రాం ఉందనిస్కూల్ వాళ్ళే రికమెండ్ చేయడంతో, ఫీజు కట్టి, మా వాడ్ని అందులో ఎన్రోల్ చేసాము.సమ్మర్ స్కూల్ కంటూ వాడికి కొత్త షూజ్, బట్టలు తీసుకున్నాము. నాకూ అదంతా మొదటిసారి అవడంతో, ఉత్సాహపడ్డాను. మొదటి మూడు రోజులు హాయిగానే గడిచింది. నాలుగో రోజు – గురువారం - ఫీల్డ్ ట్రిప్ అన్నారు. ఆ మొదటి గురువారం - అక్కడికి దగ్గరలో ఉన్న స్కేటింగ్-రింక్ కి వెళ్ళి వచ్చేప్పటికి ‘ఎండ్ ఆఫ్ స్కూల్ డే ‘ అవుతుందని నోట్ పంపారు..
అదే రోజు మా వాడి పుట్టినరోజు కూడా. కొత్త బట్టలు వేసి, మెళ్ళో కొత్త కాశీ తాడు వేసి దేవుడికి దణ్ణం పెట్టించి, తీసుకువెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసాను.వాళ్ళ టీచర్ తో ఒక్క నిముషం మాట్లాడాలని వెయిట్ చేసాను.
ఆవిడ పిల్లలతో ప్రేయర్స్ చెప్పించి, కూచోబెట్టాక వెళ్ళి కలిసాను. మా వాడి బర్త్-డే కాబట్టి క్లాస్ అయ్యే టైం కి కేక్ తీసుకు వస్తానని, పిల్లలకి పార్టీ ఫేవర్స్ కూడా తెస్తానని చెప్పాను...
ఫీల్డ్ ట్రిప్ అయ్యి తిరిగి వచ్చాక ఓ అరగంట సమయం ఉంటుంది కాబట్టి, చక్కగా సెలెబ్రేట్ చేద్దామని చెబుతూ, హెడ్ కౌంట్ ఇచ్చింది... వెళ్ళే ముందు ప్రిన్సిపాల్ వద్దకి కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకోమంది. ఆవిడ చెప్పినట్టే చేసాను.
***
అనుకున్న టైం కన్నా కాస్త ఎర్లీగానే, ముందు రోజు ఆర్డర్ చేసిన కేక్, పేపర్ గూడ్స్, పార్టీ బాగ్స్ అన్నీ తీసుకొని స్కూల్ కి వెళ్లాను. పిల్లలంతా ఎవరి క్లాసుల్లో వాళ్ళున్నట్టున్నారు. మెల్లగా కారునుండి సామాను మా వాడి క్లాస్ రూమ్ బయటికి చేర్చాను. టీచర్ చెప్పిన ‘లాస్ట్ హాఫ్-అవర్’ క్కూడా ఇంకా టైం ఉండడంతో, ‘నేను వచ్చానని, కేక్ అవీ అక్కడే డోర్ బయట ఉంచానని డోర్ వద్ద నుండి, ఆవిడకి ‘సైగ’ చేసాను.
మరో రెండు నిముషాలకి - నేను ఒక్కోటి అందిస్తుంటే ఆవిడే సామాను, కేక్ అన్నింటినీ క్లాస్ రూమ్ లోని టేబిల్ మీద సర్దింది.నన్ను లోనికి రమ్మంది.... అనౌన్స్ చేయడానికి, మా వాడి పేరేమిటని అడిగింది...చెప్పాను. పదిహేను మంది చిన్నపిల్లలున్న ఆ క్లాస్ లో, నా కళ్ళు మా వాడి కోసం అప్పటికే రెండుసార్లు వెతికాయి...
“ఆకాష్ ఇక్కడ లేడే?” అడిగాను.. కొత్త టీచర్ కనుక వాడి పేరు తెలియదు సరే, కనీసం వీడొక్కడే ఇండియన్ పిల్లవాడు కదా! అది కూడా గుర్తు లేదా? అనుకున్నాను. పిల్లలని కౌంట్ అన్నా చేసుకోరా? అనుకున్నాను. నాకు చాలా ఆదుర్దాగా ఉంది...
“అయితే, వేరే క్లాసుల్లోకి ఏమన్నా వెళ్ళాడేమో,” అంది...ఏ క్లాస్ అని వెదకాలి. ఆమె కొన్ని క్లాస్ రూములు, నేను కొన్నిట్లోకి వెళ్ళి అడిగాము...చూసాము. ఎక్కడా వాడి జాడ లేదు... నా కళ్ళల్లో నీరు రావడం చూసి నక్కుతూ నసుగుతూ ఉంది ఆ టీచరమ్మ. అలా ఓ ఇరవై నిముషాలు గడిచింది. తరిచి తరిచి అడిగితే, స్కేటింగ్ రింక్ నుండి అందరూ స్కూల్ బస్సుల్లో తిరిగొచ్చి కూడా చాలా సేపయిందన్నారు కొందరు.
అలా వాళ్ళ దగ్గర నిలబడి పంచాయితీ పెట్టే సమయం కాదు... అసలు ఏమంటున్నానో ఏం చేస్తున్నానో తెలయకుండా, వాళ్ళ నిర్లక్ష్యం పట్ల నా అసంతృప్తివెళ్లగక్కుతూ గట్టిగా ఓ నాలుగు మాటలు అనేసి... స్కేటింగ్ రింక్ అడ్రస్ తీసుకొని కార్లో బయలుదేరాను... వాడ్ని చూస్తానో చూడనో ఏమీ తెలియని పరిస్థితి. పెద్దగా ఏడుస్తున్నాను. కళ్ళ వెంట నీరు కట్టలు తెంచుకుంది... కడుపు రగిలిపోయింది...
ట్రాఫిక్ పోలిస్ వాడు ఉండుంటే నా డ్రైవింగ్ చూసి నన్నో అరగంట ఆపేసి టికెట్ ఇచ్చేవాడే.
ఎలాగో స్కేటింగ్ రింక్ చేరాను. పార్కింగ్-ఏరియా బిల్డింగ్ వెనకాల ఉంది. పార్కింగ్ లో ఒక్క కారు కూడా లేదు. అంటే ఆ రోజుకి మూసేసి లాక్ చేసేసారా? గబగబా డోర్ వద్దకు వెళ్ళి చూస్తే, వెనకాలి ఎంట్రెన్స్ డోర్ లాక్ చేసే ఉంది... ‘ఎంప్లాయీస్ వోన్లీ’ అని సైన్ పెట్టున్న పక్క డోర్ వద్దకు వెళ్లాను. దాని మీద గట్టిగా బాదాను....జవాబు లేదు.
దుఃఖం, కోపం, నిస్సత్తువ నన్ను ఆవరించాయి. అప్పటికి, నాకు అమెరికాలో అన్ని విషయాలు పెద్దగా తెలియవు కూడా. మా వాడి స్కూల్ కోసమే, కొత్తగా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. మా వారికి ఫోన్ చేసినా, పేజ్ చేసినా జవాబు లేదు. ముచ్చెమటలు పోశాయి. సమయం గడుస్తుంటే - చిన్నవాడు ఏమయ్యాడో, ఎవరన్నా ఎత్తుకెళ్ళారో, ఎటన్నా వెళ్ళిపోయుంటే ఏమవుతాడో అని బుర్ర వేడెక్కి పోయింది. అడుగు ముందుకి వేయలేకపోయాను.
మా వారికి ఫోన్ ట్రై చేస్తూనే పెద్దగా ఏడ్చేయడం మొదలెట్టాను.. ఆయన హాస్పిటల్లో బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జవాబుండదు. వాళ్ళ ఆపరేటర్ క్కూడా కాల్ చేసి, పేజ్ ఆన్సర్ చేయకపోతే, మెసేజ్ పెట్టాను..
అలాగే కాళ్ళీడుస్తూ వ్యర్ధ ప్రయత్నంగా – చుట్టూ తిరిగి ముందు ఎంట్రెన్స్ వైపు నడిచాను. ఎండవేడి దంచేస్తుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. గొంతు తడారిపోయి ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయింది..
నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో,ఆలోచనే లేకుండా మెదడు కూడా మొద్దుబారిపోయింది. యధాలాపంగా గ్లాస్ డోర్స్ హాన్డిల్స్ మీద చేతులు వేసి నెట్టాను.. తలుపులు తెరుచుకున్నాయి. లోపల మరో ఎంట్రెన్స్ డోర్ ఉంది. అన్నీ డార్క్ బ్లాక్ డోర్స్. బయటికి ఏమీ కనబడడంలేదు.
ఆ రెండో గ్లాస్ డోర్స్ ని కూడా గట్టిగా తోసాను.
ఎంట్రీ వే లో ఓ పక్కకి గోడనానుకుని ఆకాష్ నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా నా ఊపిరి ఆగినట్టయింది.ఏ దేవుడు కరుణించాడో. ఒక్కసారిగా వాడ్ని ఎత్తుకున్నాను. వాడి ముఖాన భయం లేదు. ఆకలిగా ఉందేమో అనుకున్నాను. ‘భయం వేయలేదా కన్నా’ అని అడిగితే, లేదన్నాడు. మమ్మీ వస్తదని తెలుసన్నాడు.ఆనందంతో నా మనసు గంతులు వేసింది....ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. అంతలో మావారి ఫోన్...జరిగింది చెప్పాను.
అర్ధమయిందేమంటే, మూడు గంటలకి క్లోజ్ అయిపోయింది ఆ ఫెసిలిటీ. మళ్ళీ సాయంత్రం సెవెన్ కి ఓపెన్ అవుతుంది. మెయిన్ డోర్ లాక్ చేసేసి అంతా వెళ్ళిపోయారేమో. మెయిన్ డోర్స్ కి ఎంట్రీ డోర్స్ మధ్య ఉన్న స్థలంలో ఆకాష్ నాకోసం వెయిట్ చేస్తున్నాడన్నమాట.ఇంటికి వెళ్ళి స్కూల్ డిస్ట్రిక్ట్ కమిటీకి లెటర్ రాయడం మొదలెట్టాను... కోపం, ఎంతలా ఉందంటే ఓ పది పేజీలయ్యాయి. వారి అజాగ్రత్త, అలసత్వం వల్ల మా అబ్బాయిని కోల్పోయే స్థితి తెప్పించారని, స్కూల్ యాజమాన్యంని ‘సూ’ చేస్తానంటూ అప్పటికి ముగించాను...నాలుగు రోజులైనా నా కోపం కాని ఆ లెటర్ గాని ఓ కొలిక్కి రాలేదు. మాకు తెలిసిన లాయర్ ని సంప్రదించాను కూడా. అయన జరిగిందంతా రాసి ఇవ్వమన్నాడు. స్కూల్ బోర్డ్ తో ఇటువంటి కేసులు అవీ చాలా కాలం మాత్రం పడుతుందన్నారు. పిల్లవాడు క్షేమంగా దొరికాడు కాబట్టి పెద్దనేరంగా అది పరిగణింపబడక పోవచ్చునన్నారు. డిజపాయింట్ అయ్యాను. రాత్రింబగళ్ళు సమయమంతా ఆకాష్ ని కూడా పట్టించుకోకుండా కంప్లైంట్, కేస్ తయారుజేయడంలో గడిచిపోతుందనిపించి.... మరి కొన్నాళ్ళకి వదిలేశాను. అయినా ఇప్పటికీ ఆ సంఘటన మరువలేను.
***
సమ్మర్ స్కూల్ ఎపిసోడ్ ముగిసాక కూడా, ఇంకా నెలకి పైనే సమ్మర్ వెకేషన్ ఉండడంతో, హైదరాబాదు అమ్మావాళ్ళ వద్దకు బయలుదేరాను. మా చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం ఒకేసారి అక్కడ చేరడంతో, సరదాగా సందడిగా ఉంది.
రెండోరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో, మేమంతా పిల్లల్ని ఆడిస్తూ ఇంటిముందు ఆవరణలో ఉన్నాము. ఓ స్త్రీ తూలుతూ గేట్ లో నుండి లోనికొచ్చింది. తాగేసిన మత్తులో ఉందని తెలుస్తూనే ఉంది. మా వాకిలి ముందు నిలబడి, ఇంటి తాళం చెవి ఇమ్మని అడిగింది. మా అమ్మ తాళాలందించింది...ముద్దముద్దగా మాట్లాడుతూ, “మా అమ్మాయి వినీత కూడా రేపు వస్తుంది నా దగ్గరికి,” , “నాకు ఇలా షూటింగ్ ఉన్నప్పుడు మీ వద్దే దింపి వెళతాను ఆంటీ,” అని మా అమ్మతో అనేసి పడుతూ, లేస్తూ మెట్లెక్కి పైన ఫ్లాట్ కి వెళ్ళింది.
సంగతేమని విచారించాను. ఆమె పేరు తార. సింగర్ అట. రాత్రుళ్ళు ఏదోస్టార్ హోటల్లో,క్లబ్బుల్లో సినిమా పాటలు పాడుతుందట. సినిమాల్లో, నాటకాల్లో యాక్ట్ చేస్తుందట. ఇంట్లోకి అద్దెకి వచ్చి ఆరునెలలట. మొగుడు బిజినెస్ మాన్ అట. నాలుగేళ్ళ పాపని ఆవిడ అమ్మగారి వద్ద ఉంచి చదివిస్తున్నారట. ఈ మధ్యనే తార నడవడిక గమనించిన అమ్మావాళ్ళు , ఇల్లు ఖాళీ చేయమని అడిగారట. చేస్తామనే చెబుతున్నారట.
**
మరునాటి నుండి తార వాళ్ళమ్మాయి, వినీత రోజులు తరబడి మా ఇంట్లోనే మాతోనే ఉండసాగింది. రోజులో ఎప్పుడన్నామా అమ్మ చెప్పి పంపిస్తే, పైకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తుండేది. ఆడపిల్లకి సరైన బట్టలు కూడా లేవనిపించింది. వాళ్ళేమీ బీదవాళ్ళు కాదని వినీత వాళ్ళమ్మ కట్టే చీరలు, విలాస జీవితం చెప్పకనే చెబుతుంది. ఊళ్లోనే ఉంటూ ఇంటికి వస్తూపోతూ ఉండే మా చెల్లెలు, వినీతకి తన కూతురి బట్టలు వేయడం చూసాను.ఆ పిల్లకి కొత్త లాంజరే కూడా కొనితెచ్చింది. అదేమిటని అడిగితే, వాళ్ళమ్మ ‘తార’ పచ్చి తాగుబోతని, మొగుడుతో పోట్లాడి వినీతని చావబాదడం మామూలేనని చెప్పింది.ఆ పసిదాని పట్ల ఆ తల్లిది విపరీతమైన అలక్ష్యం అన్నది.నాలుగేళ్ల వినీతపై జాలి కలిగింది.
***
ఓ రోజు పొద్దుటే పైనుండి కేకలు. చిన్నదాన్ని కొట్టడం, వినీత ఏడుపు స్పష్టంగా వినిపించింది. అంతలో ‘ధడేల్’ మని పెద్ద చప్పుడు, వెంటనే ఏడుపు ఆగిపోవడంతో అనుమానం వేసింది. నేను పనిమనిషిని తీసుకొని పైకి వెళ్లాను. తలుపులు పనిమనిషి కోసమేమో, పక్కకి తీసే ఉన్నాయి. లోనికెళ్ళి చూస్తే, ఏముంది? ముందు గదిలో కాఫీ టేబిల్ వద్ద తలకి రక్తం కారుతూ, దెబ్బ తగిలిన నొప్పికి మూల్గుతున్న వినీత. వంటిమీద ఆ పసిదానికి నూలుపోగు లేదు. లోపల ఓ గదిలో గురకపెట్టి నిద్రపోతూ తండ్రి. మరో బెడ్ రూమ్ తలుపులు వేసున్నాయి. పాపని దగ్గరికి తీసుకొని పనిమనిషి సాయంతో కిందకి తెచ్చాను. వాళ్ళ అమ్మమ్మవాళ్లకి కబురంపాము. ‘తనకి ఆకలిగా ఉంది, ఏమన్నా తినడానికి పెట్టమని అడిగినందుకు, అమ్మ కోపంతో కొట్టిందని’ చెప్పింది వినీత, కాస్త కోలుకున్నాక...వాళ్ళ అమ్మమ్మ వచ్చి దాన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది.
అమ్మతనాన్నే హేళన చేసే విధంగా ప్రవర్తిస్తారు కొందరు తల్లులు. ఇది కూడా నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఓ సంఘటన..ఏ ఊరైనా మరే దేశమైనా ఇటువంటి సంఘటనలు, పిల్లల పట్ల నిర్లక్ష్యం, క్రూరత్వం ఎవరినైనా కలవరపెట్టక మానవు...