'అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా' అనే పాట వినని వాళ్ళు వుండరు. అప్పు చేసి పప్పు కూడు తినమన్నారు కానీ బిర్యానీ కాదు సుమా!
కొన్నేళ్ళ క్రితం ఒక మిత్రుడు కలిసి.. చాలా కష్టాల్లో వున్నానని తినడానికి కూడా లేదన్నట్టు మాట్లాడితే.. పాతిక వేలు అప్పిచ్చాను. తర్వాత ఎన్నిసార్లు ఫోను చేసినా ఎత్తలేదు. ఒక రోజు Railway Station లో కనిపించాడు. "రామా రావూ.. ఏమైంది.." అని నేను అడిగేలోపే "బన్నూ ఎలా వున్నావూ.. చాలా బిజీ బాసూ.. నీ బాకీ తీర్చేస్తాలే.. BYE అంటూ AC first class ఎక్కేసాడు. నేను 3Tier బోగీ వెదుక్కుంటూ ముందుకెళ్ళాను. అప్పుడు నాకు అనిపించింది..
"అప్పు తీసుకునే వాడు ఒక్కసారే అడుక్కుంటాడు. అప్పు ఇచ్చిన వాడు రోజూ అడుక్కోవాలి.." అని!
"పుస్తకం, వనితా, విత్తం, పరహస్తం గతం గతః
అథవా పునరాయాపి జీర్ణః, భ్రష్టాచ, ఖండశః "
పుస్తకం, వనిత, ధనం - ఈ మూడు పరుల చేతిలోకి వెళ్ళితే ఇక తిరిగి రానట్టే. ఒక వేళ తిరిగొస్తే, పుస్తకం నలిగిపోయి, వనిత పాడైపోయి, ధనం ముక్కలు ముక్కలుగానూ వస్తాయి.