' సుధామ 'ధురం - సుధామ

జీవన్ మే ఏక్ బార్ ఆనా సింగపూర్ "

మేం స్కూల్లో చదువుకునే రోజుల్లో-రేడియోలో సిలోన్ నుంచి వచ్చే హిందీ పాటల్లో-అప్పట్లో బాగా పాప్యులర్ అయి, నన్ను ఆకర్షించిన పాట ఒకటుంది."

దేఖోజీదేఖో సున్లో ఏ బాత్
జీవన్ మే ఏక్ బార్ ఆనా సింగపూర్ "

లత మంగెష్కర్ పాడిన ఈ పాట - బాలీవుడ్ చిత్రం ' సింగపూర్ ' సినిమాలోదే ! శంకర్ జైకిషన్ దాని సంగీత దర్శకుడు. 1960లో విడుదలైందని గుర్తు ఆ సినిమా. ' శక్తిసామంత ' దర్శకత్వంలో, షమ్మికపూర్ హీరోగా వేసిన - ఆ సినిమా అయితే నేను చూడలేదుగానీ, ఆ పాట చాలా ' హంట్ 'చేసేది.

జీవితంలో సింగపూర్ దేశాన్ని ఒక్కసారైనా చూసి తీరాలని, ఆ పాట చెప్పే మాట, నెరవేరే అవకాశం వస్తుందని అప్పుడనుకోలేదు. !

వెళ్ళిపోయిన 2014 సంవత్సరం మిగిల్చిన ఒక మధురానుభూతి మా సింగపూర్ పర్యటన. నవంబర్ 25న నా పుట్టినరోజు సింగపూర్ లోనే జరుపుకుంటానన్నది ఊహించని విషయమే మరి.!

డెల్లాయిట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రమోద్ మా అన్నయ్య కొడుకు నవంబర్ మొదటివారంలో ఫోన్ చేసి " సింగపూర్ వెడదాం బాబాయ్ ! " అన్నాడు. అనడమే కాదు - వాళ్ళమ్మకూ,నాన్నకూ నాకూ,మా ఆవిడకూ, వాళ్ళావిడకూ, పాప సమిరకూ వీసాలు, టికెట్లు, ఏర్పాట్లు అన్నీ తనే చూసుకున్నాడు. చెన్నై లోని ' ఆర్బిస్ ఇండియా టూర్స్ ' ద్వారా నాలుగు రాత్రుల, మూడు డబుల్ రూంస్ అకామడేషన్ తో, సింగపూర్ లో మాకు ' చెర్రీలాఫ్ట్ హోటల్ ' బుక్ అయ్యింది. అయిదు రోజులూ ఉచిత బ్రేక్ ఫాస్ట్. సింగపూర్ ఫ్లయ్యర్, ట్రాం లో నైట్ సఫారీ, మీల్ కూపన్ తో బాటుగా యూనివర్సల్ స్టూడియోస్ , ఇండియన్ రెస్టారెంట్ లో ఓ రాత్రి డిన్నర్ , ఇలా ...సింగపూర్ లో టాక్సీ, టికెట్లతో సహా అన్నీ రెడీ అయ్యాయి.. రేడియోలో పనిచేస్తున్న ఉషకు ఎన్ వో సీ కూడా ఢిల్లీ నుండి సమయానికే రావడంతో మా ప్రయాణం ఖరారైంది.

హైదరాబాద్ నుంచి నవంబర్ 23 రాత్రి ' టైగర్ ఎయిర్ వేస్ ' విమానంలో బయలుదేరి , సింగపూర్ లో ఉదయం 8.45 అవుతూండగా దిగాం. ఓ పది నిముషాల్లోనే ట్రావెలర్స్ వారి వాహనం మమ్మల్ని ఎక్కించుకుని సింగపూర్ 180 రంగూన్ రోడ్ లోని ' చెర్రి లాఫ్ట్ హోటల్ ' కు చేర్చింది. మనకంటే రెండున్నర గంటలు ముందుంటుంది సింగపూర్ కాలమానం! అంటే మనకన్నాముందే సూర్యోదయ, సూర్యాస్తమయం చూస్తారన్నమాట. అక్కడ హోటల్స్ లో చెక్ ఇన్ టైం మధ్యాన్నం 3 గంటలకు. అంచేత అంతదాకా-రూంస్ ముందే బుక్ అయినా, వాటిల్లో చేరడానికి లేదు. ' ఎర్లీ చెక్ ఇన్ ' కు కొన్ని సింగపూర్ డాలర్లు పే చేసి , ఒక రూం లో ముందు సామాన్లు అవీ పెట్టేసుకుని , స్నానపానాదులతో తయారై, దగ్గర్లో లిటిల్ ఇండియా ఏరియాలోని- సెరన్ గూన్ రోడ్ లోని ' కోమల్ విలాస్ ' లో చక్కగా నూరుశాతం వెజిటేరియన్ భారతీయ వంటకాలు లభించే చోటుకి వెళ్ళాం. కడుపునిండా తిని, ఓ గంటసేపు దగ్గర్లోనే వున్న ' సిటీ స్క్వేర్ మాల్ ' లో తిరిగి ,  మూడింటికి హోటల్ కెళ్ళి , మాకు కేటాయించిన రూం ల్లో చేరిపోయాం. హోటల్ గది విశాలంగానూ, కాఫీ కాచుకు తాగేందుకు కావలసిన కెటిల్, కాఫీ పౌడర్ లతో బాటు, అన్ని సౌకర్యాలతో బాగుంది. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఆరింటికల్లా హోటల్ లాబీకి ' నైట్ సఫారి ' కి తీసుకు వెళ్ళడానికి మాకోసం ప్రత్యేకించిన ఏ.సీ. వాహనం వచ్చింది. డ్రైవర్ - కీర్లోనే సెంటోసా టూర్ కు, యూనివర్సల్ స్టూడియోస్ , జురాంగ్ బర్డ్ పార్క్ వంటి వాటి తాలూకు టికెట్లన్నీ ముందే ఇచ్చేశాడు. రేపటి ఫ్లయ్యర్ టిక్కెట్ మటుకు రేపు ఇస్తానన్నాడు.

విశాలమైన సింగపూర్ రోడ్లమీదుగా, ఎత్తయిన బహుళ అంతస్తుల కట్టడాలూ అవీ వీక్షిస్తూ , 80 ముడాయే లేక్ రోడ్ లోని ' నైట్ సఫారి ' కి చేరుకున్నాం. రాత్రివేళ జంతు ప్రదర్శనశాల ఇది. మనం ట్రాం లో వెడుతూ - రాత్రివేళ జంతువులను, వాటి సహజ పరిస్థితులలో చూడడం నిజంగా గొప్ప అనుభూతి.! లోపలికి వెళ్ళే ముందే ఆకర్షణీయమైన ప్రదర్శన - ' కాగడాలతో విన్యాసాల ' ను చూసి థ్రిల్లయ్యాం. అలాగే వివిధ జంతువులను-వాటి సహజవాతావరణంలో-మనం చీకట్లోనూ, అవి వెలుగులోనూ కనబడుతూండగా, ప్రయాణించడం గొప్ప అనుభూతి. అలాగే కాలినడకన చీకట్లో అడవిలో వెడుతున్నట్లుగా కొంత దూరాలు వెళ్ళి, కొన్ని జంతువులను చూడడం కూడా ఎంతో బాగుంటుంది. నైట్ సఫారీలో రెండువేల అయిదువందల వరకూ వివిధ ప్రాణులున్నాయట. సిమ్హాలు, పులులు, నక్కలు, కంగారూ, ఖడ్గమృగం మొదలైనవన్నీ ఆ రాత్రివేళ చూసాం.' నైట్ సఫారీ ' నుండి తిరిగి వస్తూ, భోంచేసి హోటల్ చేరుకున్నాం.

మర్నాడు 24వ తేదీ సోమవారం. పొద్దున్నే హోటల్ వాడు చక్కని బ్రేక్ ఫాస్ట్ ఇచ్చాడు. తొమ్మిదింపావు లోగా కాఫీ, టీలు ఏవి కావాలంటే అవి కావలసినంత తినచ్చు. ఉదయం 9 గంటలకల్లా తయారైపోయాం ! సిటీ టూర్ కు మాతోపాటు మరికొందరు పర్యాటకులనూ ఎక్కించుకుని, టూరిస్టు బస్సు బయల్దేరింది.
ఆ మినీ బస్సులో గైడ్ సివిల్ ఇంజనీర్ గా రిటైరైన సింగపూర్ వాసి. అతను దారిపొడుగూతా ప్రయాణిస్తున్న ప్రాంతాలను విశదపరుస్తూ , సింగపూర్ విశేషాలు చెప్పాడు. బ్రిటిష్ పాలన నుండి మనకంటే 18 సంవత్సరాల తర్వాత స్వతంత్ర్య దేశమైన సింగపూర్ , ప్రపంచవ్యాప్తంగా మొదటి అయిదు, పది స్థానాల్లోని పెద్ద దేశాలకు సమౌజ్జీగా సత్వరాభివృద్ధి చెందటం, అన్ని రంగాల్లో ముందడుగు వేయడం నిజంగా ఆదర్శనీయమైన సంగతే! అందుకే తమ రాజధానిని సింగపూర్ లా చేస్తామని ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబు అంటున్నారనిపించింది. సింగపూర్ జనాభా 54లక్షల 69వేల 700. వీరిలో 33 లక్షల 43వేల మంది స్థానికులు. మిగిలినవారు విదేశీయులు. కానీ అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా , నాల్గవ అతిపెద్ద ఆర్ధిక కలాపాల స్థావరంగా , తలసరి ఆదాయంలో మూడో అతిపెద్ద దేశంగా, అమెరికా , జపాన్, ఐరోపాలకు చెందిన ఏడువేలకుపైగా బహుళజాతి కంపెనీలున్న దేశంగా సింగపూర్ రాణిస్తోంది. అలాగే చైనావి 1500, మన భారత్ వి 1500 కంపెనీలు సింగపూర్ లో ఉన్నాయి. అత్యుత్తమ విమానాశ్రయం వుంది. ప్రపంచంలోనే వైద్యచికిత్సల పరంగా ఆరోస్థానంలో వుంది. ఇలాంటి సింగపూర్ లో ప్రభుత్వ రవాణా సదుపాయాలే ఎక్కువ. అలాగే గవర్నమెంట్ ఇళ్ళు కూడానూ. అలాగే టూరిజం గొప్పగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ వనరులు వాడుకుని జీవన ప్రమాణాలు పెంచుకున్నవారు. సింగపూర్ విస్తీర్ణంలో 1960 ల్లో 581.5 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడది 718.3 చదరపు కిలోమీటర్లు. భూమి తక్కువగా ఉంది కాబట్టి భవన నిర్మాణంతో కిందకి సెల్లార్ లోకీ, పైకీ వెళ్ళారు. అంటే నాలుగు ఫ్లోర్లు కిందకి పది ఫ్లోర్లు పైకి కట్టుకున్న ఎత్తయిన భవంతులున్నాయి. సముద్రంలో కూడా చిన్న దీవులను పెద్ద దీవులుగా మార్చుకున్నారు. అసలు సింగపూరే ఒక దీవి. లేక ద్వీపకల్పం. 63 దిబ్బలు, లంకల సముదాయం వంటిది.

సింగపూర్ కబుర్లు చెబుతూ గైడ్ మమ్మల్ని ముందుగా స్కై ఫ్లయర్ తీసుకెళ్ళాడు. పేద్ద జెయింట్ వీల్ లా వుండే ఆ ఫ్లయర్ నెమ్మదిగా మూవ్ అవుతూ, ఎంతో ఎత్తుల నుండి మొత్తం సింగపూర్ నే కాక, చుట్టూ వుండే ఇండోనేషియా, మలేషియాలను కూడా చూపుతుంది. ఫ్లయర్ లో కూర్చుని అంత ఎత్తు నుండి సింగపూర్ అందాలను వీక్షించడం ఒక మరపురాని అనుభూతి. అక్కడనుండి సింగపూర్ జాతీయ చిహ్నమైన మెర్లయన్ దగ్గరకు చేరుకున్నాం. సిమ్హం తలతో, క్రింద చేపలాగా వుండేది మెర్లయన్.మెర్లయన్ పార్క్ లో పర్యాటకులు దీనిని సందర్శించనిదే సింగపూర్ పర్యటించినట్లే కాదు. మెరీనా బే సాండ్స్ యొక్క మూడు టవర్లను కూడా ఇక్కడనుండి చూడగలం. మెర్లయన్ దగ్గర ఫోటోలు తీసుకుని అక్కడనుండి చైనాటౌన్ కి వెళ్ళాం. దారిలోనే పెద్ద చాక్లెట్స్ దుకాణంలోకి తీసుకెళ్ళాడు గైడ్. చైనా టౌన్ అంతా విశాలమైన పెద్ద పెద్ద చైనా వారి షాపులతో అలరారుతోంది. గొప్ప వర్తకకేంద్రం అన్నమాటే. అక్కడనుండి సిటీటూర్ ముగించి , మధ్యాన్నానికి భోంచేసే కోమల్ విలాస్ దగ్గర దింపేసాడు.

మళ్ళీ మధ్యాన్నం రెండింటికి సెంతోసా టూర్ కి మళ్ళీ మినీవ్యాన్ వచ్చింది. సెంతోసా సింగపూర్ లోని ద్వీపమే. ఆ దీవిని చేరి, ముందుగా కేబుల్ కార్ లో ప్రయాణించాం. రెండు మూడు స్టేషన్లు దాటుకుంటూ, ఎత్తయిన ఆకాశమార్గాన కేబుల్ కార్ లో ప్రయాణిస్తూ దిగువ ప్రకృతి దృశ్యాలనూ, పట్టణ ప్రాంతాన్నీ చూడడం కూడా నిజంగా ఒక థ్రిల్. కేబుల్ కార్ దిగాక, అక్కడి స్టార్ బక్స్ రెస్టోరెంట్ లో వేడివేడి కాఫీ తాగాం.
సింగపూర్ లో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం. సడెన్ గా వాన పడుతూంటుంది. మళ్ళా తెరిపిచ్చి ఎండకాస్తుంటుంది. కాఫీ తాగుతూ, ఫ్రీ వై-ఫై వుండడంతో ' ఐ-ఫోన్ ' లో సరదాగా మావాళ్ళకి ఫోటోలు వాత్స్ అప్ లో పెడుతూండగా , సడన్ గా పెద్ద వాన మొదలైంది. ఓ పావుగంట పైగా వానపడింది. కొంచెం తగ్గుతూండగా గొడుగులు తీసుకు వెళ్ళాం కాబట్టి గొడుగేసుకుని, దగ్గర్లోనే వున్న మేడం టుస్సాడ్ మ్యూజియం వెళ్ళాం. లండన్ లో లాగానే ఇక్కడి మేడం టుస్సాడ్ మైనం బొమ్మల మ్యూజియం. సజీవకళతో ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయా ప్రముఖులు స్వయంగా అక్కడే వున్నారా అన్నట్లుంటాయి ఆ బొమ్మలు. ఒబామాను, గాంధీని, మార్లిన్ మన్రోను, అమితాబ్ ను, మాధురీ దీక్షిత్ ను......

మరిన్ని సింగపూర్ సంగతులు వచ్చేవారం........

మరిన్ని వ్యాసాలు