హేమంత ఋతువు పుష్యమాసం... నేను అనుకున్నదొకటి జరుగుతోంది ఒకటి . తప్పక నీకు దూరంగా ఉంటున్నాను కాని లేదంటే నీకు దూరంగా ఉండగలనా . ప్రేయసి ప్రియులకు దేవుడు ఇచ్చిన ప్రేమ కానుక ఈ ఋతువు .
ఉదయం 8 కావస్తున్నా బ్రద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ, మంచు దుప్పటి చిల్లుల్లోంచి నా కిటికీ లోపలకి వచ్చి మెత్తగా తాకే నులి వెచ్చని సూర్య కిరణాలు, కళ్ళు తెరచి సూరిబాబు కి ఓ గుడ్ మార్నింగ్ చెప్పే లోపే నీ వెచ్చటి శ్వాస నా కన్నులు తాకుతూ , నడుం చుట్టూ అల్లుకున్న నీ చేయి, పట్టు విడువకుండా అల్లరి చేస్తూ, ఇంకా మన ప్రేమోదయం కాలేదంటూ దుప్పటి కప్పేస్తున్ననువ్వు. మళ్లి ఆ రోజుల్ని ఇప్పుడు కూడా చవి చూద్దామంటే లేకుండా చూడు దేవుడు ఎంతకీ అసూయపరుడో. అంతటి ప్రేమ తనకి దక్కలేదని మనల్ని విడదీశాడు.
అటుమొన్న పున్నమికి నీతో అన్నమాట "పుష్య మాసంలో పున్నమి రోజున నీతో ఉండాలనుంది నాకు" . చలికి బిగిసుకున్న చందమామ, బిక్కమొహం వేసుకుని వెన్నెలతో వేడి పుట్టించలేక, మంచు తెరల మాటున రాత్రి దుప్పటిలో నిద్రపోతూ ఉంటాడు. వెన్నెల చల్లదనం నీ కళ్ళల్లో అస్వాదిస్తూ, వెచ్చటి నీ కౌగిట్లో చలి కాచుకుంటూ, అన్ని సమయాలు నీవు కావు మాకు ఓ టైం వస్తుందని ఆ వెన్నెలమ్మకి చెపుదామంటే లేకుండా పోయిందే .
ఎముకలు కొరికేసే ఈ చలిలో,తూరుపు రేఖ నీ శిరోజాల్లో జారి పొద్దు తెలీకుండా చేస్తుంటే, సాయంత్రం అయిదు కాకుండానే పడమటమ్మ నీ కాళ్ళపై చక్కిలి గింతలు పెట్టి, నా ఒడిలో నిన్ను ముడుచుకు పోయేలా చేస్తుంటే, పడమటి గాలితో విహారానికొచ్చే వన దేవత కూడా చప్పుడు చేయకుండా మనిద్దరి ఏకాంతాన్ని శీతంగి సమీరానికి అప్పచెప్పి, నిశ్శబ్దంగా వీడ్కోలు పలికే ఈ పున్నమి నీతో వుండాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో !
చూసావా మనల్ని కలిపిన ఆ క్రిష్ణయ్యకి కూడా మనపై ఎంత అలకో. ధనుర్మాసం చలిలో, బృందావనంలో నాకు లేని ఆనందం ఈ జంటకేల అని దూరంగా పెట్టి విరహ లేఖ వ్రాయిస్తున్నాడు నా చేత. చేయగలిగింది ఏముంది వచ్చే పుష్యమి పున్నమి కోసం ఎదురు చూడటం తప్ప.