నాట్యభారతీయం - కోసూరి ఉమాభారతి

నాంది పలికింది నాన్నే...

అయితే, ఎదురీత – నిరాశ - పోరాటం  – అంటే ఏమిటో మొట్టమొదటి సారిగా అమెరికాలోనే తెలుసుకున్నాను......

సముద్రాలు దాటొచ్చి,  ఇక్కడ కూడా  నృత్యరంగంలో నా పురోగతికి  నాంది పలికింది నాన్నే..

తప్పటడుగుల నుండి తాండవ నృత్యాల వరకు....ఆరంగేట్రం నుండి అమెరికాలోని నా తొలి నృత్య ప్రదర్శన వరకు --- వారి ఆధ్వర్యంలోనే.. రూపు దిద్దుకున్నాయి.ఇండియా లో ఉండగా, మా విదేశీ పర్యటనల విషయంలో కూడా, మా నాన్నగారే ప్రోగ్రాముల ఎంపిక నుండి, అన్ని విషయాలు చూసేవారు... ఏ ఐటమ్స్ చేయాలో, ఏ దుస్తులు వేసుకోవాలో అనేది అమ్మ చూసేది.  నాకు డాన్స్ తప్ప మరే పనీ ఉండేది కాదు..

వివాహమయి నేను అమెరికా చేరిన యేడాదికి, 1982 లో నాన్న, అమ్మా మమ్మల్ని విజిట్  చేసారు.... హ్యూస్టన్ లోని శ్రీ మీనాక్షీ దేవాలయం  కొత్తగా అప్పుడు నిర్మాణ దశలో ఉంది.   నాన్నే చొరవ చేసుకొని వెళ్ళి అక్కడి దేవాలయ కమిటీని కలిసి, నాగురించి నా నృత్యం గురించి మాట్లాడారు.  గుడి నిర్మాణ ‘ఫండ్-రైజింగ్’  కి నా డాన్స్ ప్రోగ్రాం ప్రపోజల్ వారి ముందు పెట్టారు.

అలా అమెరికాలో నా నృత్యప్రదర్శనలకి బీజం వేసారు నాన్న.... ఆ తరువాత ఆయన తిరిగి హైదారాబాదు వెళ్ళిపోయారు.  ఆయనుండగా ప్రోగ్రాం విషయంగా ఏమీ జరగలేదు...

అక్టోబర్ నెల టెక్సాస్ లో తుఫానుల (hurricane) సీజన్.  నాన్నావాళ్ళు తిరిగి వెళ్ళాక, ఆ యేడు అక్టోబరులో ఉధృతమైన పెనుగాలి, తుఫానుకి మీనాక్షి టెంపుల్  ఆవరణ లోని ‘వినాయకుని’ గుడి పైకప్పు కొట్టుకుపోయింది...అప్పటికి  ఒక్క  విఘ్నేశ్వరుని ప్రతిమ మాత్రమే ప్రతిష్టింపబడింది.. 

స్థిరమైన కట్టడం, ప్రాకార నిర్మాణమయ్యే వరకు, ఈ తడవ పర్మనెంట్ గా నిలవగల పైకప్పు వేయాలన్న ఉద్దేశంతో, ఫండ్-రైజింగ్  ప్రోగ్రాం ఇవ్వాలంటూ గుడి నుండి లెటర్ రాసారు చైర్మన్ డా. అప్పన్ గారు.

ఆ ప్రోగ్రాం చాలా బాగా జరిగిందనడం మామూలే... అయితే, ఓ విశేషం జరిగింది...  టెంపుల్ వాళ్ళు రూఫ్ నిర్మాణానికి ముగ్గురి వద్ద ‘బిడ్స్’ తీసుకున్నారట.  4,800 డాలర్ల  ‘బిడ్’  ఖరారు చేసుకున్నా, అంతటి  మొత్తం సమకూరుతుందో లేదో  అని ఆలోచనలో ఉన్న కమిటీకి – ఆ ప్రోగ్రాం వల్ల, సరీగ్గా ఐదు వేల డాలర్ల  ఫండ్ సమకూరడంతో...అంతా చాలా సంతోషించారు.   ఆ విషయాన్ని ప్రోగ్రాం  జరిగిన  వారానికి  న్యూస్ పేపర్స్, టెంపుల్ న్యూస్ కూడా ప్రచురించాయి..

ఆ తరువాత, నాన్న సలహా మేరకు, ఆర్గైనైజింగ్, ప్రమోటింగ్ విషయాల్లో నా పరిజ్ఞానం కూడా కాస్త  పెంచుకొని, ప్రమోటర్ గా మారాను.  అమెరికాలో ఉన్న భారతీయ సాంస్కృతిక సంఘాల ద్వారా ఎన్నెన్నో ప్రోగ్రాములు చేసాను.  సాంప్రదాయ కూచిపుడి ఫక్కీలోనే కాక ఒకటి-రెండు భరతనాట్యం ఐటమ్స్ తో సహా....రెండున్నర గంటల సేపు సోలోగా పర్ఫాం  చేసేదాన్ని.  నర్తకిగా నాకెంతో పేరు, గుర్తింపు, ఆదరణ  లభించాయి.

నాన్న ప్రోత్సాహం మేరకే, ఎక్కువగా  ఆలయ నిర్మాణ నిధుల సేకరణకి నృత్యప్రదర్శనలు చేసాను.  అనౌన్స్మెంట్  కూడా నాన్న ప్రోత్సాహంతో  విఫులంగా ఆంగ్లంలో రాసుకుని, నా ప్రదర్శనకి నేనే M.C (master of ceremonies)  గా కూడా వ్యవహరించేదాన్ని...

మావారు కూడా మొదట్లో చాలా ప్రోగ్రాములకి నా వెంటే ఉండి ఎనలేని సహాయ సహకారాలని అందించారు.  వెళ్ళిన చోట ఒక్కోమారు స్టేజ్ మీద లైటింగ్ బాగుండేది కాదు.  మా వారు పోర్టబిల్  లైటింగ్ సిస్టమ్ సమకూర్చారు. ఓ కళాకారిణిగా – ఎదురీత, నిరాశ, పోరాటం  – అంటే ఏమిటో మొట్టమొదటి సారిగా అమెరికాలోనే తెలుసుకున్నాను......

ఇండియాలో నా వంటి ఓ కళాకారిణికి,  కొనసాగే అనుభూతి, అనుభవం, మాత్రం అమెరికాలో ఏ కోశాన లేవనే అంటాను... ప్రోగ్రామ్స్ కి ఇండియాలో లా రీవ్యూలు,  విశ్లేషణ,  అసలు సున్నా...ఎప్పుడో ఎక్కడో ఒకటి అరా  ఉండేవి.... ప్రేక్షకుల మన్నన, వారి నుండి విన్న వ్యాక్య తప్ప మరే ఫీడ్ బ్యాక్ (న్యూస్ మీడియానుండి) ఉండదు.  ఆ ద్వారా గుర్తింపుకి కావాల్సిన ప్రోత్సాహం,  అంచెలంచలుగా ఎదిగే అవకాశం లేనేలేదు.... ఆ విషయంగా ఆంధ్రలో, ఇండియా లో ఉన్నటువంటి కాన్సెప్ట్  గాని, కల్చర్  గాని ఈ గడ్డ మీద లేవు.  

సాంప్రదాయ కళల పట్ల నిరాదరణ ఉంటుందని మొదటిసారిగా గ్రహించాను.  కళని, కళాకారుల్ని,  కళ కోసం  ప్రోత్సహించే సంస్థలు గాని, ఆర్గనైజర్లు కాని ఇక్కడ చాలా తక్కువ.  ఈ కళలంటే  మక్కువ  లేకపోవడమనేది - ఎక్కువ శాతం - ఆర్గనైజర్స్ కి తెలియక కొంత అయితే, వారి వైఖరి కొంత అని నా అభిప్రాయం. స్వతహాగా ఎంతో తపన పట్టుదల ఉంటే తప్ప నిస్సారమైన వాతవరణంలో కళలు, ఇక్కడ కళాకారులు మనలేరు.  అందుకే  కొందరు  పేరున్న కళాకారులు ఇక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చినా, కొన్నాళ్ళకి తిరిగి వెళ్ళిపోయారు కూడా.  ఎందాకని? ఎంతని? సమయాన్ని, సామర్ధ్యాన్ని,  నృత్యేతర విషయాల పై వెచ్చించగలదు ఓ ఆర్టిస్ట్?  ఇక్కడ తప్పదు.

పైగా నాకు, పబ్లిక్ రిలేషన్స్ ఏర్పరుచుకోడం, నిత్యం టచ్ లో ఉంటూ వాటిని నిలబెట్టుకోడం తెలియదు.  అలవర్చుకోలేదు.  అదే మా నాన్న చేసిన ఒకే ఒక తప్పేమో! నా కెరియర్ ను మలిచే విషయంలో.

అయినా నాకు నాట్యం పట్ల ఉన్న ఇష్టం, మా నాన్నగారికోసం, మా అమ్మ పడ్డ శ్రమ, వారి త్యాగాల దృష్ట్యా, ఉత్సాహంగానే  ఏకాగ్రతతో ముందుకి సాగాను.నాకు లభించిన ఆదరణ, వచ్చిన గుర్తింపు, పేరు, అభిమానం అంతా ప్రేక్షకుల నుండే. వారి స్పందన నుండే.  కావలిసినంత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని  పొందడానికి అవి సరిపోయాయి నాకు. అందుకే ఆలయ ప్రోగ్రాముల ద్వారా వందలాది  ప్రేక్షకులకి,  ‘తాన’ ‘ఆటా’ సభల ద్వారా వేలాది మంది ప్రేక్షకులకి, మా ప్రదర్శన, మా నృత్య తీరులు అందించే ప్రయత్నాలని ముమ్మరం చేసాను.అలా నృత్యప్రదర్శనలు చేస్తూనే, ‘అర్చనా డాన్స్ అకాడెమి’ స్థాపించాను..స్వతహాగా అప్పటివరకు అయితే,  టీచింగ్  విషయంగా  ఆలోచించే  తీరిక  గాని,  కోరిక గాని లేవనే చెప్పొచ్చు. టీచింగ్ – అందులో తెలుగుభాష మాట్లాడని పిల్లలకి ఇటువంటి ఆర్ట్ నేర్పడం అనేది, అదో విధమైన అనుభవం... కాని నృత్య శిక్షణ ఇచ్చే సంస్థ స్థాపించి అలా ఆ విధంగా కృషి చేయడం కూడా ముఖ్యం అనిపించింది.  నా విద్యకి, నా సృజనాత్మకతకి అది ఎంతైనా అవసరమనిపించింది.

నటరాజానుగ్రహం నాపై మెండుగా ఉందని గ్రహించాను...

నేను ఎదురు చూడని, ఊహించని దిశ నుండి ఓ నూతన ఉత్తేజం, ఉత్సాహం  నాకు లభించాయి.... ఆసక్తి,  టాలెంట్  ఉన్న కొందరు స్టూడెంట్స్ లో, నా నృత్యకళ కొనసాగింపుకి గొప్ప భవిష్యత్తు కనబడింది.....

వసపోసిన పిట్టలా అల్లరిగా తిరిగే నా ఐదేళ్ళ కూతురు, శిల్ప, ఏనాడూ క్లాసులో కుదురుగా కూర్చుని డాన్స్ చూసిందే లేదు.   అడుగేసిందే లేదు.  నాక్లాసులో ఏడేళ్ళ వయసున్న వాళ్ళతోపాటు,  ముచ్చటకి  శిల్పకి  కూడా డాన్స్ డ్రెస్సు వేసి ఫోటోలు మాత్రం తీసేదాన్ని.

ఐదేళ్ళు నిండాక, ఓ రోజు తనూ డాన్స్ చేస్తానంటూ క్లాసుకి వచ్చింది శిల్ప.  మిగతా వాళ్ళతో, అడుగులు జతులు అన్నీ చేసేది.  చాలా చక్కగా వొళ్ళు వంచి అందరికంటే బాగా చేసేది... చాలా త్వరగా అడ్వాన్స్ అయింది కూడా...

భాష పూర్తిగా తెలియకపోయినా, ఐదేళ్ళ వయస్సులో, శిల్ప నాట్యం చేసిన తీరు నాకే కాదు అందరికీ అపురూపంగా అబ్బురంగా తోచేది.

‘చైల్డ్ – ప్రాడజీ’  ....

శిల్ప శిక్షణ మొదలు పెట్టిన యేడాదికే మా డాన్స్ అకాడెమీ వార్షికోత్సవం పెద్దఎత్తున జరుపుకున్నాము.  మొదటి పర్ఫామెన్స్ చేసింది... అందరూ దాన్ని ఎత్తుకుని మెప్పులలో ముంచెత్తారు.

తరువాత ఆరునెలలకి, ‘చిన్మయ మిషన్’ వారి ఫండ్-రైజర్ ప్రోగ్రాం చేసాము.  ఆరేళ్ళ శిల్ప ‘జణుతా శబ్దం’ సోలో చేసింది.  డాన్స్ మధ్యలో, దాని భావాలకి మెచ్చుకోలుగా వినవచ్చిన  ప్రేక్షకుల కరతాళధ్వనులకి, బెదిరిపోయి, కళ్ళ వెంట నీరాపుకుంటూ కూడా తన నృత్యం ముగించింది శిల్ప.  అదంతా వీడియోల్లో అప్పుడప్పుడు చూస్తుంటాము..

ఆరేళ్ళ  చైల్డ్ – ప్రాడిజీ అంటూ మరునాడు కమ్యూనిటి  న్యూస్  పేపర్స్ శిల్ప నృత్యాన్ని అభినందించాయి.  కళాభిమానుల మన్ననలు పొందింది.. ప్రతి అవకాశాన్ని తీసుకుని శిల్ప త్వరత్వరగా యువనర్తకిగా ముందుకు సాగింది.  శిల్ప కున్న ఆసక్తి, స్వతహాగా ఉన్న టాలెంట్ నాకు ఓ కొత్త వొరవడినిచ్చింది.

అప్పటికే,  నావద్ద  కొందరు శిష్యులు మంచి డాన్సర్స్ గా రూపొందుతున్నారు.  ఎంతో కృషి చేస్తున్నారు.  వారందిరినీ ఓ గ్రూప్ గా తయారు చెయ్యడంలో కొన్నాళ్ళు ఉండిపోయాను...

ఇలా శిల్ప,  కాక మరి కొందరు శిష్యులు ఉండడం వల్ల కూడా, నా కళ కొనసాగింపు విషయంలో  కొత్త  ఆలోచనలతో, మరో కొత్త ప్రయత్నంతో ఈ రంగాన ముందుకు సాగాను...

శిల్పకి, శిష్యులకి మా అకాడెమీ కి కూడా మంచి పేరు, ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే ఆలోచనతో, ‘ఆలయనాదాలు’ అనే టెలిఫిలిం నిర్మించాలని ఆలోచన చేసాను.

సాంప్రదాయ కళలు, మనవైన భాషా-సంప్రదాయాలు,  వాటి విలువలు, ప్రవాసాంధ్రుల జీవన విధానంలో వాటి ప్రాముఖ్యత గురించి చెప్పే కధా వస్తువు, ఓ కాన్సెప్ట్ కావాలని,  ప్రముఖ రచయిత వోలేటి పార్వతీశం గారితో మాట్లాడాము..

అలా అంకురార్పణ జరిగింది మా మెగా ప్రయత్నం ‘ఆలయ నాదాలు’ టెలిఫిలిం కి.

2014 అక్టోబర్ మాసంలో, అమెరికాలో నా మూడు దశాబ్దాల కళాజీవన సంబరాలు జరుపుకున్నాము.  అసలైతే, ఐదు దశాబ్దాల కళాజీవితం - ఓ చిరుకానుకగా పూజ్యులైన నా తల్లితండ్రులకే అంకితం .......

అర్చన డాన్స్ అకాడమీ తరఫున – ఆలయనిధుల సేకరణకి – మా ప్రదర్శనలు...

U.S.A - Temple Construction projects & India Associations Funds since 1979, include:   (100% proceeds donated)

(దేవిస్తోత్ర మాలిక, టెంపుల్ బెల్స్, ఈ జగమే నాట్యమయం, రాగం-తనం-పల్లవి, కన్య, మానసపుత్రి - ఆలయాలకి ప్రత్యేకంగా రచించి, సమకూర్చి, ప్రదర్శనలు చేసిన నృత్య నాటికలు)

* Sri Meenakshi, Ganesha Temple Roof Fund –Houston, TX

* TANA conference Fundraiser - Houston, TX

* Sri Meenakshi Kalayanamandapam Benefit – Houston, TX

* Hindu Temple fund of - Augusta, GA

* Hindu Temple fund of - Atlanta, GA

* Hindu Temple & Tamil Sangham Funds - Detroit, MI

* Chinmaya Mission Building & Shiva temple project Fund – Houston,

* Sri Venkateswara Temple construction project - Jackson, MS

* Sri Shiva-Vishnu Temple project fund - Washington DC

* Sri Venkateswara Temple Fund – Harrisburg, PA

* Sri Meenakshi Youth Center Fund – Houston, TX

* India Assn Fund raiser – Fortwayne, IN

* Temple Org Fund & India Assn – Tulsa, OK

* Hindu Temple Fundraiser – Memphis, TN

* Hindu Temple project Fund - Greater Kansas City, KS

* Sri Rama Temple funds project - Baton Rouge, LA

* Hindu Temple Project Funds - New Orleans, LA

* India Assn Cultural Relations fund - Ruston – LA

* Sri Venkateswara Temple fund of - New Jersey, NJ

* Telugu Assn Org fund - New York, NY

* Rama Temple Project fund – Chicago, IL

* Sri Venkateswara Temple Fund – Pittsburg, PA

  * Telugu Assn fund - Los Angeles, CA

  * India Worship Center Fund - Grambling LA 

* Staged ‘Kanya’ ’01 & ‘ManasaPutri’ ‘03 for Sree Meenakshi Temple Funds-

Houston, TX

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు