కొత్త సంవత్సరం ( ఆంగ్ల) వచ్చిన మొదట్లో సంక్రాంతి మొదటి పండగ. ఈ ఆధునిక కాలంలో, పాత సంప్రదాయాలు, చాలామటుకు , కనుమరుగైపోతున్నాయి. కారణాలు ఎన్నో..ఎన్నెన్నో...మొదటిది పట్టణీకరణ/నగరీకరణ అని చెప్పుకోవచ్చు. మన చిన్నప్పటి గ్రామాలలో కూడా, ఎక్కడ చూసినా కొత్త కొత్త పోకడలే కనిపిస్తున్నాయి. మరి అలాటప్పుడు, ఇంకా పాతసాంప్రదాయలని పట్టుక్కూర్చోమని చెప్పడంకూడా భావ్యంకాదు. ఇదివరకటి రోజుల్లో పెద్ద పెద్ద మండువా లోగిళ్ళూ, పెరటినిండా పశుసంపదా ఉండేవి.
సంక్రాంతి రావడానికి ఓ పదిహేను రోజులముందునుండీ, “గోమయం’ సేకరించి,గొబ్బిళ్ళు పెట్టి, ఆ గొబ్బిళ్ళని చిన్నచిన్న పిడకలుగా, వాటికీ మధ్యలో ఓ చిల్లు ( ఎండపెట్టిన తరువాత దండగా గుచ్చుకోడానికి ) పెట్టి, పెరట్లో ఉండే ప్రహారీ గోడకు వేసి, ఎండపెట్టుకోవడం, ఓ సాంప్రదాయంగా ఉండేది. పైగా మనింట్లో, ఓ ఆవు ఉందంటే, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా వచ్చేవారు, గోమయం తీసికోడానికి. ఈ పిడకలు ఎండిన తరువాత, ఓ పురికొసతో ఓ దండగా గుచ్చి, భోగి పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు.. మరి ఈరోజుల్లో , ఎక్కడో అక్కడక్కడ గ్రామాల్లో తప్ప, ప్రహారీ గోడలూ, ఆవులూ, గోమయాలూ రమ్మంటే ఎక్కడొస్తాయీ? ఎక్కడ చూసినా ప్యాకెట్టు పాలూ, డెయిరీలూనూ..
భోగి పండగ కి ముందురాత్రి చుట్టుపక్కలుండే మగపిల్లలందరూ, ఊరంతా తిరిగి, చెక్కతో చేసిన ఏ వస్తువు కనిపించినా , చివరకి ఏ ప్రహారీ గోడకో ఉండే, చెక్క గేటైనా సరే ఎత్తుకొచ్చేయడం. తాటి దుంగలైతే సరే సరి. అందుకే, చెక్కతో చేసిన గేట్లన్నీ, ఆరోజుకి తీసేసి, ఇంట్లో దాచేసుకునేవారు ! తెల్లవారుఝామునే భోగిమంట తయారు. ఇళ్ళల్లో ఉండే చిన్నపిల్లలందరూ, తయారుచేసికున్న పిడకలదండలు ఆ మంటల్లో వేసి, దగ్గరలోనే నుంచుని చలి కాచుకోడం. పైగా బయట అంత చలిగా ఉండడంతో, ఈ భోగిమంటలు ఓ పెద్ద రిలీఫ్ గా ఉండేవి. ఈలోపులో “అమ్మ” లు, “రండర్రా తలంటుపోసుకుని కొత్త బట్టలు కట్టుకోరా.. ఏమిటీ..” అంటూ పిలవడం. ఇంక అమ్మ పోసే తలంటు, కుంకుడుకాయరసం కళ్ళల్లో పడకుండా, చెయ్యి అడ్డం పెట్టుకోడమూ, అయినా, “ అమ్మోయ్ కళ్ళు మండిపోతున్నాయీ.. “ అంటూ అరవడం, ఇంతలో అమ్మ ఓ రెండుచెంబుల వేణ్ణీళ్ళు తలమీద గుమ్మరించడమూ, జీవితంలో మరచిపోయేవా మరి? కానీ ఈ రోజుల్లో షాంపూలతో అప్పటి తలంటు కళ వస్తుందంటారా? ఇళ్ళల్లో ఉండే చిన్నపిల్లలకి “భోగి పళ్ళు “ పోసి, పేరంటాలకి వచ్చిన ముత్తైదువుల కందరికీ వాయినాల తో ఆరోజు కార్యక్రమం ముగిసేది. రోజంతా పిండివంటలే, ముఖ్యంగా అరిశలూ, బొబ్బట్లూ, పులిహోరా, పరవాన్నం లేకుండా పండగొచ్చినట్టే ఉండేదికాదు.
సంక్రాంతి కి బొమ్మల కొలువు లేని ఇల్లుండేది కాదు.ఉదయాన్నే పాటలు పాడుకుంటూ వచ్చే హరిదాసులూ, అలాగే గంగిరెద్దులవాళ్ళు, ఎండొచ్చేసరికి వచ్చేసేవారు. ఆ గంగిరెద్దుతో దండాలు పెట్టించడం , మనం ఇచ్చిన బట్టలు, ఆ గంగిరెద్దుమీద కప్పడం.. అలాగే పశువులపండగా ఎంతో వైభవంగా జరుపుకునేవారు. ఎడ్ల పందేలూ, కోడిపందాలూ అయితే సరేసరి.
ఈ సంబరాలన్నిటిలోకీ ముఖ్యమైనది , మా కోనసీమ లో ఇప్పటికీ వైభవోపేతంగా జరుగుతున్న “ప్రభల తీర్థం “. అదృష్టవశాత్తూ ఆ సంప్రదాయం ఈనాటివరకూ కూడా ఉంది. ఈరోజున చిన్నాపెద్దా తేడాలేకుండా మొక్కుబడులు తీర్చుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. క్షణకాలం తీరికలేకుండా గడుపుతున్న ఈ ఆధునిక కాలంలో తాతలనాటి ఆచారాలపేరుతో సంక్రాంతి పర్వదినాలలో కుటుంబసభ్యులంతా ఒక్కటిగా చేరి ఆనందోత్సహాలతో కాలం గడుపుతారు. పాత సంప్రదాయాలను ప్రక్కనబెట్టే నేటికాలంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలుగా ప్రభల ఉత్సవాలకు కోనసీమలో ప్రాధాన్యత కొనసాగుతుండడం విశేషం.
కోనసీమలో ప్రభలతీర్థం- అందులోనూ జగ్గన్నతోట, కొత్తపేటలలో జరిగే ప్రభల తీర్థాలు, కనులారా చూడాలే కానీ, మాటలలో వర్ణించడం సాధ్యం కాదు. సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందినవారు ప్రభలను తయారు చేస్తుంటారు. తాటిశూలం, టేకుచెక్క, వెదురుబొంగులతో తయారుచేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పింఛాలతో అలంకరిస్తారు. దేవాలయాలలో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. వివిధ గ్రామాలనుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చేటపుడు పంట చేల మధ్యగా, కొబ్బరితోటల మధ్యగా వ్యయప్రయాసల కోర్చి తీసుకువస్తారు. ఇలా తీసుకువచ్చేటపుడు పంటచేలను తొక్కుతూ ఊరేగింపుగా ప్రభలను తీసుకురావడం శుభసూచకంగా భావిస్తారు. దారిలో గోతులు, గొప్పులు, ముళ్లకంచెలను దాటుకుంటూ సుమారు పదిహేను అడుగులు క్రిందకు ఉండే ఆరడుగుల నీటిలో నడుస్తూ నేర్పుగా ప్రభలను తీసుకుని రావడం మరో ప్రత్యేకత.. ఇప్పుడంటే స్కూటర్లమీదా, బైక్కులమీదా, కార్లలోనూ వస్తున్నారు కానీ, ఆరోజుల్లో,ఎడ్లబండిపై కొబ్బరిచాపలను గూడుగా ఏర్పాటుచేసి కుటుంబసమేతంగా ఈ తీర్థానికి రావడం , ఓ తీపి గుర్తు..పచ్చని పంటపొలాల మధ్య గూడుబళ్లు ఒకదానివెనుక ఒకటిగా తీర్థానికి వచ్చే తీరు కన్నులపండుగగా ఉండేది. సంక్రాంతి చివరిరోజైన కనుమపండుగను పురష్కరించుకుని రైతులు తమ వ్యవసాయ పనిముట్లు శుభ్రపరుచుకుని బళ్లను, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి వీధులలో ఊరేగించేవారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఇంకో మరపురాని “పండగ” ఒకటుండేది. ఈరోజుల్లో అంటే, క్రికెట్ వేలంవెర్రిలా ఏడాది పొడూగునా, అవేవో ఐపి ఎల్ లూ, ఒన్డే లూ, టెస్టులూ ఆడుతున్నారు కానీ, ఆరోజుల్లో ఏడాదికోసారో, రెండుసార్లో క్రికెట్ టెస్టులు ఆడేవారు. సంక్రాంతికి మెడ్రాస్ ( ఈనాటి చెన్నై) లో ఒక టెస్టు తప్పకుండా ఉండేది. ఉదయం పదిన్నరా అయేసరికి పిల్లలూ, పెద్దలూ రేడియో ముందర సెటిలయిపోయేవారు. మహరాజకుమార్ ఆఫ్ విజయనగరం, విజ్జీ తన కంచుఖఠంతో ..” This is Vizzy reporting from Corporation Stadium Madras..” అంటూన్న శ్రవణానందం ఎప్పటికీ మరువలేని ఓ తీపి గుర్తు.. అలాగే శ్రీ ఆనందరావు, శ్రీ చక్రపాణి, కూడా వ్యాఖ్యానం చెప్పేవారు. ఆటకి లంచ్ టైములోనే మనమూ భోజనానికి...సంక్రాంతి నాలుగురోజులూ ఇదో కాలక్షేపం..
ఇవే కాకుండా, తెలుగు వారపత్రికల సంక్రాంతి ప్రత్యేక సంచికల “ కునేగా మరికొళుందు “ ఘుమఘుమలూ, ఏ ఎన్ ఆర్ దో ఎన్టీవోడిదో ఓ కొత్త సినిమా బోనసూ...