సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఉన్నట్ల యుండ నద్దరి
కి న్నరులను నావ చేర్చు క్రియ వెసఁ దాఁ బో
కున్నట్ల యుండి కాలం
బు న్నరులకు వయసుఁ బుచ్చి మోసముఁ దెచ్చున్

శ్రీకృష్ణ దేవరాయలు మాత్రమే చేసిన వర్ణనలు, ఊహలు ఇవి. నావలో ( ఆమాటకొస్తే ఈనాడు మనంవిమానాలలో, రైళ్ళలో, బస్సుల్లో, కార్లలో ప్రయాణము చేస్తున్నప్పుడు కూడా) ప్రయాణము చేసేవారికిఆ నావ ప్రయాణం చేస్తున్నట్లు కనిపించదు. చుట్టుప్రక్కలకు పరికించి చూస్తేనో, నావ ప్రయాణములోకుదుపులకు గురి అయితేనో తప్ప. నావ మాత్రము మౌనముగా తన ప్రయాణము తాను చేస్తూనేఉంటుంది. తీరా దిగాల్సిన రేవు వచ్చేదాకా తెలియనే తెలియదు ప్రయాణం ఎలా జరుగుతున్నదో. ఉన్నచోటేఉన్నట్టు వుండి, కదులుతున్నట్టు కనిపించకుండానే ప్రయాణము పూర్తిజేసి, ప్రయాణీకుడిని తీరానికి చేర్చేనావవంటిది కాలము. జీవనము ఒక ప్రయాణము, ఆయువు ఒక ప్రవాహము, జీవుడు ఒక ప్రయాణికుడు. మరణము తీరము. కాలప్రవాహము వెనక్కు జారుతూనే ఉంటుంది, ఆయువు దిగజారుతూనే ఉంటుంది,ఆయువు అనే ప్రవాహాన్ని తెలియకుండా దాటించి, ఆయువును పోగొట్టి (వయసుఁ బుచ్చి)మోసము చేస్తుంది కాలము అనే నావ! అన్ని కాలాలలో, అన్ని ప్రదేశాలలో, అందరికీ అన్వయించుకోగలిగిన భావనలు కేవలం కల్పనలు కావు,నిత్య, శాశ్వత సత్యాలు. ఈ పద్యం అటువంటిది.

దీని తాత్పర్యము, దీని సంబంధము సమస్త మానవాళికీఒకే రకమైన, నిజమైన, మధురమైన సందేశాన్ని ఇస్తుంది. కనుకనే రాయలు మహాకవి, కాదు, మహర్షి.ఎందుకంటే వాక్యం రసాత్మకం కావ్యం కదా, రసాత్మకమైన ఒకే ఒక్క వాక్యము కూడా కావ్యమే అని.అటువంటి కావ్యాన్ని ఋషి లేదా ఋషికల్పుడు మాత్రమే సృష్టించ గలుగుతాడు అని కదా 'నానృషిః కురుతేకావ్యం' అన్నది. అంతే కాదు, '' లౌకికానాం హి సాధూనాం అర్ధం వాగనువర్తతి, ఋషీనాం పునరాద్యానాంవాచమర్థోనుధావతి '' అన్నారు కదా, అంటే లౌకికులయిన సాధువుల  పలుకు లకు  తగిన అర్థం ఉంటుంది,కానీ మహర్షుల మనసులోని అంతరార్ధానికి అనుగుణముగా పలుకులు అనుసరించి వస్తాయి.  కనుక రాయలు మహర్షి తుల్యుడు సాహిత్య యజ్ఞములో!ప్రశాంతముగా జీవన పయనము సాగిపోతుంటే చివరి గడియలు అకస్మాత్తుగా వచ్చిపడి, మృత్యువు కళ్ళలో కళ్ళుపెట్టి నిలదీసి చూసినప్పుడు ఉలికిపడి తన ప్రయాణము ఇంత స్వల్పమా, తన శక్తి ఇంతఅల్పమా అపుడే దిగిపోవాలా అనుకుంటాడు జీవన పయనము ముగిసిన ప్రయాణికుడు, తనను తానుమరిచిపోవడం వలన. యిది కేవలము ప్రయాణ మేనని,  నావనెక్కినప్పుడే నావ దిగడం ఖాయమన్నసంగతి తెలుసుకుని ఎప్పుడంటే అప్పుడు ప్రశాంతముగా ఏ తొట్రుపాటూ లేకుండా దిగడానికి సంసిద్దుడైఉండేవాడు తెలివైన ప్రయాణికుడు, ముందుజాగ్రత్త ఉన్న ప్రయాణికుడు. జీవనపయనములో ప్రయాణీకుడు తీసుకొనవలసిన ముందు జాగ్రత్తలు దైవచింతన, సత్ప్రవర్తన, సాధుజీవనం, తోటి ప్రయాణీకులతో స్నేహము, ప్రేమ మొదలైనవి. ఈ జీవితము కేవలము ఒక ప్రయాణము,గమ్యము కాదు అనే సంగతి మరచిపోయానే, తీరానికి చేరుకునే సమయానికి సిద్ధము కావడం జరగలేదేఇంతవరకూ, దిగిపోక తప్పదు కదా, ఇకనైనా నా పరలోకపు తీరాలకు సర్వ సన్నద్ధుడనై ఉండాలి అనిసంకల్పించుకున్నాడు మత్స్యధ్వజుడు. 

కానఁ దటిచ్చల మగు రా
జ్యానందము మరగి యింద్రియారాముడ నై
పో నింతనుండి పరలో
కానందంబునకె యత్నమాపాదింతున్   

రాజ్యములూ రాజులూ శాశ్వతులు కారు, మహామహులు కారణజన్ములు ఎందఱో కాలగర్భములో కలిసిపోయారు, నేనెంత? కనుక మెరుపువలె క్షణికమైన (తటిచ్చల మగు) రాజ్యభోగాలను మరిగిఇంద్రియసుఖములలో పరవశుడను అయిపోను, ఇకనుండి పరలోక ఆనందముకొరకే ప్రయత్నముచేస్తాను అని స్థిరమైన నిశ్చయము చేసుకున్నాడు మత్స్యధ్వజుడు.

వర్గత్రయ పరత ముహు
స్స్వర్గ క్ష్మామధ్యమాధ్వ జజ్ఘాలకతా
దుర్గతియునొల్ల మఱి యప
వర్గదుడే వే ల్పెఱింగి వాని భజింతున్    

అని నిశ్చయించుకున్నాడు. వర్గత్రయము మీది ఆసక్తితో అంటే ధర్మము, అర్ధము, కామము అనే మూడు పురుషార్ధాల మీది ప్రేమతో నాలుగవ పురుషార్ధము ఐన మోక్షమును నిర్లక్ష్యము చేసి మాటిమాటికీ స్వర్గానికీ,భూమికీ మధ్య పరుగులు పెట్టే దుర్గతిని పొందను. ( స్స్వర్గ - క్ష్మా - మధ్యమ - అధ్వ - జజ్ఘాలకతా -దుర్గతియునొల్ల) మోక్షము అంటే ముక్తి. అంటే జనన మరణ చక్ర బంధమునుండి విముక్తి. అది కావాలిగానీ,ధర్మమూ, అర్ధము, కామము అనే వాటిని అనుసరించి అంటే ధర్మమార్గము, ధర్మార్ధము, ధర్మ కామముఅనే మూడూ మంచివే ఐనప్పటికీ, వీటి ఫలితముగా ఆ పుణ్యఫలము అనుభవించేదాకా ఉత్తమ లోకగతులను పొందినా ఆ పుణ్యరాశి క్షయము ఐన తర్వాత మరలా జన్మను పొందవలసినదే, ఎందుకు మరలమరలా ఈ లంపటం? మోక్ష పథ గామిని అయితే ఇక పునరావృత్తి రహితమైన పరమపదమే కనుక నాకుమోక్షమే కావాలి. అంటే ఎంత లోతైన వివేచనాశక్తి గలవాడో మత్స్యధ్వజుడు అనే విషయాన్ని చెప్తున్నాడు రాయలు ఇక్కడ.

స్వర్గ సౌఖ్యము అంటే ఇహ లోకపు సౌఖ్యము కంటే ఉన్నతమైన సౌఖ్యమే, ఆ తర్వాత మరలా మానవజన్మ తప్పదు. కనుక తాత్కాలికమైన స్వర్గ సౌఖ్యము నాకు వద్దు, మోక్షము కావాలి, ఆ మోక్ష పదవి,ఆ అపవర్గ పదవిని ఇవ్వగలిగిన వేల్పు ఎవరో తెలుసుకుని ఆ వేల్పును భజించెదనుగాక అని నిశ్చయముచేసుకున్నాడు. చతుర్విధపురుషార్ధాలు, స్వర్గాపవర్గ తారతమ్యము, మోక్ష పథ ఔన్నత్యము ఇంత లోతైనఆధ్యాత్మిక పరిజ్ఞానము ఉన్నవాడే కానీ ఇంతవరకూ తనకు తెలిసిన దానిని ఆచరణలో పెట్టలేకపోయినవాడుతాత్కాలికమైన భోగలాలసలో పడిన కారణంగా.పాత్రలను పరిచయం చేయడం, ఆ పాత్రలను ఉన్నతమైన తీరులో పోషించడం అంటే ఇదే కవి పరముగా.నాటకమైనా, కావ్యమైనా, ప్రబంధమైనా నవల అయినా, సాహిత్య ప్రక్రియ ఏదైనా అందులోని పాత్రలు క్రమపరిణామము చెందాలి, చెందినట్టు సహజముగా చూపించగలగాలి, అది ఉత్తమ సాహిత్య కారుడి ప్రతిభ.కనుక మత్స్యధ్వజుడిని పరిచయము చేసిన దగ్గరినుండీ చివరివరకూ అతని వ్యక్తిత్వములోని సహజ పరిణామ దశలను, వ్యక్తిత్వ వికాసమును అతి సహజముగా అతి తక్కువ మాటలలో చూపించాడు రాయలు. అందుకే అయన మహా కవి అయినాడు, ఆముక్తమాల్యద ఐదు మహా కావ్యాలలో ఒకటిఅయ్యింది తెలుగు భాషలో!

అని తలఁచి మెచ్చి యవ్వి
ప్రునకు న్వీటి కరండమున ముద్రితమై
యునిచిన యొక ముడు పార
క్షునిచే నిప్పించి నగరు సొచ్చి నిశి చనన్

ఈ విధముగా తనలో తాను తర్కించుకుని, ఒక నిశ్చయానికి వచ్చి, ఆ బ్రాహ్మణుడి బోధకు మెచ్చి,కృతజ్ఞతా పూర్వకముగా, దక్షిణగా ( తనకు జ్ఞాన బోధ చేసినందుకు గురుదక్షిణగా) తన తాంబూలపుబరిణలో ఒక ముడుపు, అంటే, ఎంతో కొంత విలువైన ధనమో, రత్నమో ఉంచి, తన రక్షకులలో ఒకతలారిచేత ఆ పరదేశి బ్రాహ్మణునకు ఇప్పించి, తన నగరు చేరి, నగరు అంటే తన రాజప్రసాదము,అంతఃపురము మొదలైనవి ఉన్న నగరు అని, ఆ రాత్రి గడచిపోయిన తర్వాత, మరునాడు ఉదయముననేతను నిర్దేశించుకున్న మార్గములో పయనము కావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు మత్స్యధ్వజుడు.

కొలువై బహుసమయంబుల
మెలగెడు కోవిదులజూచి మీమీశాస్త్రం
బులలో నెవ్వడు మోక్షం
బెలయించునొ చూచి నిశ్చయింపు డటంచున్

తన కొలువు దీర్చి, బహుసిద్దాంత మార్గాలలో మెలిగే వారిని( సమయము అంటే వేదాంత, మత సంబంధమైనసిద్ధాంతము అని ఒక అర్ధము) పిలిపించి, మీమీ శాస్త్రముల ప్రకారము ఏ దైవము ముక్తిని ప్రసాదించునోపరిశీలించి చెప్పండి అని తన కోరికను తెలియజేశాడు.

వాదమొనరించి గెలిచి తత్త్వంబు దెలుపు
వానికని బీఱపువ్వులబోని టంక
సాలవాటులు నించి యాస్థానిఁ గట్టఁ
గాలసర్పము గతి వ్రేలు జాలెఁ జూచి

మీ మీ సిద్ధాంతములను ప్రతిపాదించి వాదించి గెలిచినవారికి ఇవిగో, ఈ బీరపువ్వులవంటి తళతళ లాడే క్రొత్తబంగారు నాణెములు కానుక, అని బంగారు నాణెములు నిండిన సంచిని వ్రేలాడదీశాడు తన ఆస్థానములో,తన సభలో. ఇంతవరకూ మామూలు పద్యమే. విశేషము ఏమీలేదు. ఇక్కడ ఉత్తమమైన విశేషణం పొదిగాడురాయలు. ఆ జాలె కాలసర్పములాగా వ్రేలాడుతున్నది. ఆ జాలె విషనాగువంటిది, క్షణికమైన సంపదతో నిండిఉన్నది కనుక అని, ఆ ధనమును ఆశించని మహానుభావుడు ఎవరో ధనార్జన చేయడంకొరకు గాకజ్ఞానధన వితరణచేయడంకొరకు రాబోతున్నాడనీ, నల్లనివాడు, మహా సర్పముపైన శయనించినమహావిష్ణువు యొక్క మహిమను సూచించడానికీ ఈ విశేషణము వాడాడు విశిష్ట భావికథా సూచనగా!

హరు నొకఁ డన నుమ నొకఁ డన
హరి నొకఁ డన శిఖి నొకఁ డన నర్కు నొకఁ డనన్
గరిముఖునొకఁ డన రజనీ
శ్వరు నొకఁ డన నజు నొకఁ డన వా దైనతరిన్

శివుడిని ఒకరు, పార్వతిని ఒకరు, శ్రీహరిని ఒకరు, అగ్నిదేవుడిని ఒకరు, సూర్యుడిని ఒకరు, గణపతినిఒకరు, చంద్రుడిని ఒకరు ప్రతిపాదించగా పండిత వాదము జరిగిన ఆ సమయములో, అని వెంటనేసన్నివేశాన్ని విల్లిపుత్తూరుకు తీసుకుపోయాడు రాయలు.

విల్లిపుత్తూరిలో నల్ల విష్ణుచిత్తు
డతుల తులసీ సుగంధి మాల్యమును మూల
మంత్రమున నక్కు సేర్చుచో మన్ననా రు
దారమధురోక్తి నిట్లని యానతిచ్చె

ఆ సమయములో, విల్లిపుత్తూరులో, విష్ణుచిత్తుడు శ్రేష్ఠమైన సుగంధముతో నిండిన తులసీ మాలను మూలమంత్రమైన అష్టాక్షరీ మహామంత్రమును అనుసంధిస్తూ తన వక్షస్థలము మీద అలంకరిస్తుండగా మధురగంభీరమైన మాటలతో ఈ విధముగా సెలవిచ్చాడు మన్ననారు అని పిలువబడే వటపత్రశాయి ఐన శ్రీమహావిష్ణువు.

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి
Devashilpi viswakarma cheta srujinchabadina dhanussulu
విశ్వకర్మ చేత సృజనచేయబడిన ధనస్సులు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు