అవీ- eవీ - భమిడిపాటి ఫణిబాబు

  ఆ భగవంతుడు, భూమిమీద క్రమశిక్షణ లాటిదుండాలని, కొంతమందిని పంపిస్తూంటాడు. వారు మగాళ్ళైనా కావొచ్చు, ఆడవారైనా కావొచ్చు. ఇందులో , మగవారైతే ఉద్యోగధర్మం మూలంగా, ఇంట్లో ఉండేది తక్కువ సమయం కాబట్టి, అంతగా పరవాలేదు. కానీ ఆడవారు, అందులోనూ ఏ ఉద్యోగమూ చేయని సాధారణ గృహిణులైతే, వారితోనే అసలు గొడవంతా.

గుర్తుండే ఉంటుంది, 1976 లో , మాంట్రియోల్ లో జరిగిన, ఒలింపిక్ క్రీడల్లో,  నాదియా కొమెనీచీ (  Nadia Comaneci   అనే ఆవిడ, అవేవో జిమ్నాస్టిక్స్ లో 10/10  స్కోరు చేసి, మొట్టమొదటిసారిగా ఓ రికార్డు ప్రతిష్టించారు. కానీ, దాన్నే ప్రాతిపదికగా తీసికుని, కొందరు గృహిణులు,  వారు చేసే ప్రతీ పనిలోనూ, 10/10 గా ఉండాలనుకుంటారు. వాళ్ళ వరకే అయితే ఏ సమస్యా  లేదు. కానీ, వీరిమీదే ఆధారపడ్డ , భర్త, పిల్లలూ కూడా అలాగే ఉండాలన్నప్పుడే వస్తుంది, అసలు గొడవంతా. ఇలాటివారినే కొండొకచో “ నిక్కచ్చి “ మనుష్యులంటూంటారు.

పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నంత కాలమూ, ప్రతీరోజూ బాధలు పడ్డవారే. బాధలంటే, ఏదో శారీరిక బాధలనికాదు, “నిక్కచ్చి” తల్లి పాటించే “క్రమశిక్షణా పధ్ధతులు” అన్నమాట.  ఫలానా టైముకే నిద్రలేవాలీ, ఫలానా టైముకి భోజనం, ఆటలకి కేటాయించే టైము ఇంతా, ఫలానా టైముకి రాత్రి భోజనం, ఫలానా టైముకి నిద్రా,  స్కూల్లో చెప్పిన పాఠాలు ఏరోజుకారోజే చదవడం. Etc..etc..  స్కూలునుండి రాగానే, కాళ్ళు కడుక్కుని, బట్టలు మార్చుకోడం, మర్నాటికి, పుస్తకాలు సద్దేసికోడం, ..ఇలా చెప్పుకుంటూ పోతే దినచర్య అంతా నిక్కచ్చి గా ఓ పధ్ధతిలోనే జరగాలి. ఎలాటి కాంప్రమైజూ ఉండదు. పిల్లలచేత పాటింపబడుతూన్న ఈ పధ్ధతులు ప్రతీరోజూ చూస్తూ, వాటిని “అతిక్రమించే” ధైర్యం ఏ ఇంటి మగాడికీ ఉంటుందనుకోను. తనూ ఒకలా చెప్పాలంటే, వీటికే అలవాటు పడతాడు.. పోనీ , పిల్లల “కష్టాలు” తీరుద్దామని ఏమాత్రం ప్రయత్నం చేసినా ఇంక అంతే సంగతులు !

పైచదువులకి కొడుకూ, పెళ్ళై కూతురూ , ఈ బంధాలనుండి  విముక్తి పొంది మొత్తానికి సుఖపడతారు. చివరకి మిగిలేది, కట్టుకున్నవాడొకడూనూ. ఆయనగారు జీవితాంతం, ఈ “నిక్కచ్చి” మనిషితోనే జీవించాలి. పైగా ఉద్యోగం నుండి రిటైరయాడు కూడానూ. ఇంట్లో అప్పటిదాకా ఉన్న ఇద్దరు పిల్లలూ కూడా  లేకపోవడంతో, ఇంక మొత్తం రూల్సన్నీ ఈయనగారిమీదే “ లాగూ “ అవడం ప్రారంభం అవుతుంది. ఏమీ చేయలేని నిస్సహాయతా, నిస్పృహా , కలగాపులగం అయిపోతాయి. పోనీ, అలాగని ఎక్కడికైనా పారిపోదామా, అంటే, రేపెప్పుడో అనారోగ్యంగా ఉంటే, చూసేదెవరూ- ఇంటావిడే కదా ! దానితో ఆ “కార్యక్రమం” వెనక్కి పెట్టేసి, “ చూద్దాం... ఆవిడ పెట్టే రూల్సన్నీ పాటించకపోతే, మహా ఏం చేస్తుందీ... అదీ చూద్దాం ..” అనుకుని,  తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఇంట్లోనే సెటిలయిపోతాడు.

పోనీ ఆవిడ పెట్టిన నియమాలన్నీ, ఏమైనా ప్రాణహాని చేస్తాయా అంటే, అదీ కాదు. ఇల్లంతా శుభ్రంగా ఉంచండీ, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండీ,ఇస్త్రీ బట్టలు వేసికోండీ, చెయ్యి కడుక్కోగానే, పక్కనే ఉండే కర్టెన్ కి రాసేయకండీ, ప్రొద్దుటే నిద్ర లేవగానే, దుప్పటీ మడత పెట్టేయండీ... లాటివి, ఏదో ఇల్లు శుభ్రంగా ఉంచాలనే తాపత్రయమే కదా... అన్నీ తెలుసు.. కా..నీ.. తను చెప్పడమేవిటీ, మనం వినడమేమిటీ అని ! మళ్ళీ, తెలిసినవారెవరైనా “ఫలానా వారి ఇల్లు ఎప్పుడు వెళ్ళినా సరే, ఎంత శుభ్రంగా ఉంటుందో, అసలు ఆ ఇంటావిడ, ఇంటిని అద్దంలా ఉంచుతుంది..” అని అన్నప్పుడల్లా , చంకలెగరేసికోడం. మరి అద్దంలాటి మెరుపులు, ఊరికే వస్తాయా, ఒకరికొకరు సహాయపడితేనే కదా. పోనీ, సహాయపడొద్దు, తనపని తను చేసికుంటే, అదే పదివేలు. ఏ గృహిణైనా ఆశించేది ఇదేకదా ! Theoritical  గా బయటివారు వినడానికి బాగానే ఉంటాయి, ఇలాటివన్నీ. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికే అసలు సమస్యంతానూ.

సాధారణంగా డబ్బుల విషయానికొచ్చేటప్పటికి, నూటికి ఎనభై మందిదాకా, ఇంట్లో భార్య ఏదైనా అడిగినప్పుడు, ఉజ్జాయింపుగా ఏదో సమాధానం చెప్పేసి, అప్పటికప్పుడు, పని కానిచ్చేసికుంటారు. కానీ, ఈ “ నిక్కచ్చి “ భార్యలున్నారే, వారు ప్రతీదీ  తమ hard disk  లో నిక్షిప్తం చేసేసికుంటారు. ఆ తరువాత ఎప్పుడో, డబ్బులగురించి ఏదో విషయం, లేవతీస్తారు, ఈ భర్తగారికేమో, అంతకుముందరి సందర్భంలో ఏం చెప్పేడో మర్చిపోయి, ఇంకో సమాధానమేదో చెప్తాడు. అక్కడ “పట్టు బడి” పోతాడు. మొన్నెప్పుడో ఫలానా అన్నారూ, ఇదేమిటీ ఇప్పుడు ఇంకోటేదో చెప్తున్నారూ అని గయ్యిమంటుంది. ఇలాటప్పుడే, “నిక్కచ్చి” గురించి ఓ క్లాసు వినాల్సొస్తుంది.

ఈ నిక్కచ్చి ప్రాణులకి ఇల్లెప్పుడూ అద్దంలా మెరిసిపోతూండాలన్నానుగా, రోజులో ఓ నాలుగైదుసార్లైనా, తుడవడం, తప్పదు.  తీసిన సరుకులు ఎక్కడవక్కడ పెట్టకపోవడమనే ప్రసక్తే లేదు. వీరితో వచ్చిన గొడవల్లా ఏమిటంటే, చేసే ప్రతీ పనిలొనూ, అలసత్వం ఉండకూడదు. సాధారణంగా మొగాళ్ళు, “పోనిద్దూ..చల్తాహై..”అనె పధ్ధతిలోనే ఉంటూంటారు. ఉదాహరణకి రోజూ వేసికునే బట్టల విషయమే తీసికోండి, ఆడవారికి బట్టల మీద ఉండే శ్రధ్ధ, మగవారికి అంతగా ఉండదు. ఓ నల్ల రంగు ప్యాంటు ( మాపాగుతుంది కదా అని) వేసికుని, మూడురోజులోకోసారి, పైన వేసికున్న షర్టు మారిస్తే సరిపోతుందనుకుంటాడు. ఈ “నిక్కచ్చి” వారితో, అలా కుదరదే. రోజు విడిచి రోజు బట్టలు మార్చాల్సిందే, ఈయనగారికేమో బధ్ధకం. పోనీ బట్టలు వేసికునే ముందర చెప్తుందా, అబ్బే, సరీగ్గా చెప్పుల్లో కాళ్ళు పెట్టేముందర చెప్పడం—“ ఇంకో బట్టలు వేసికోపోయారా..” అంటూ. ఈయనకేమో చిర్రెత్తుకొస్తుంది. బయటకెళ్ళినంతసేపూ ఎడమొహం, పెడమొహమూనూ.

మరీ ఈరోజుల్లోలాగ మాటామాటావచ్చిందికదా అని, విడిపోతారా, అబ్బే ప్రతీవిషయంలోనూ, ఏదో ఒకవిషయానికి వాదనలు చేసికుంటూంటారు, అలా చేసికుంటూనే  ఏళ్ళ తరబడి కాపరాలూ చేస్తున్నారు. వీటివెనక్కాల ఉండే అసలు రహస్యం—ఒకరిమీద ఒకరికున్న ప్రేమా, అభిమానమూ. దెబ్బలాటల దారి వాటిదే. అసలు ఏ గొడవా లేకుంటే, అసలా ఇల్లు ఇల్లేనంటారా? భార్యాభర్తలిద్దరూ “ నిక్కచ్చి” మనుష్యులైతే , అసలు మజాయే ఉండదు కదా. ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే, ఆ ఇంట్లో “ జీవం “ ఎక్కణ్ణుంచొస్తుందీ? అందుకనే జంటలో ఒకరు “ నిక్కచ్చి”, రెండోవారు “ చల్తాహై” గా ఉండడమే ఉత్తమం.

మరిన్ని వ్యాసాలు