007. నందగోపనందనుండే నాటిబాలుడు
నందగోపనందనుండే నాటిబాలుడు
ఇందునేడే రేపల్లె నేచి పెరిగెను
1.పువ్వువంటి మఱ్ఱియాకు పొత్తిబవళించనేర్చె
యెవ్వడోకాని తొల్లె యీబాలుడు
మువ్వంక వేదములను ముద్దుమాటలాడనేర్చె
యెవ్వరూ కొంతనేర్ప నేటికే వీనికి
2. తప్పటడుగు లిడగనేర్చె ధరణియందు నాకసమున
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియే
రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁజెంద్రునందు పగలు
గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేటికే
3.మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె
నంచితముగ శ్రీవేంకటాద్రి మీదను
యెంచి యప్పలప్పలనుచు యెనసి కాగిలించనేర్చె
దించరానివురము మీద దివ్యకాంతను (02-387)
ముఖ్యమైన అర్థాలు
నందగోపుడు = నందుడు
ఏచు = అతిశయించు;
పొత్తి =మెత్తని పలుచని పాత గుడ్డ
పవళించు =పండుకొను
తొల్లె =ముందు
మువ్వంక =త్రిభంగిమ
తప్పటడుగు =తడబడు అడుగు
నెప్పుగా =1. స్థైర్యముగా.2. ఉపాయముగా.
రసాతలము =పాతాళలోకము.
రేసీ = రాత్రి చీకటి (భావార్థం )
మలసి =పెనగు
అప్పలప్ప = 1.క్రీడావిశేషము.2. పిల్లలను దగ్గఱకు పిలుచుటలోని అనుకరణము.
ఎనసి = కలిసిపోతూ
తాత్పర్యము
గోపాలకులు చిన్ని కృష్ణుని చూసిన ఆనందంలో తమలో తాము ఇలా మాట్లాడుకొంటున్నారు.
ఆనాడు మర్రాకు మీద పడుకొన్న బాలుడు - ఈనాడు నందుని కుమారుడు. ఇదిగో ! మన అదృష్టం కొద్దీ మన రేపల్లెలో అందరినీ మించిపోతూ పెరుగుతున్నాడు.
1 . ఏమమ్మో ! ఎందుకే వీడిని అలా పడుకోబెట్టటానికి ప్రయత్నిస్తున్నావు! పూర్వం ఈ బాలుడు ‘వీడు’ అని ఖచ్చితంగా చెప్పలేము. ఎవడో -ఎక్కడివాడో తెలియదు కాని- ఈ బాలుడు -పువ్వులాంటి మర్రాకు పొత్తిలో పడుకోవటం నేర్చుకొన్నాడు. ఓ అక్కా ! నువ్వేదో మాటలు కొంత కొంత వీడికి నేర్పటానికి ప్రయత్నిస్తున్నావెందుకే ! మూడు వేదాలను ముద్దుగా మాట్లాడటం నేర్చుకొన్నవాడే వీడు. (కొత్తగా నువ్వు నేర్పవలసిన పనిలేదని భావం)
2. ఏమిటే ! వీడికి నడక నేర్పించాలని తాపత్రయ పడుతున్నారు! వీడు తక్కువవాడు కాడు.పూర్వం ఒక్కడే వామనావతారంలో భూమిలో, ఆకాశములో, పాతాళములో మూడు అడుగులు పెట్టిన ఘనాపాఠి. ఒక కన్ను రెప్ప ఎత్తి రాత్రిలో చంద్రుడిని చూడటం నేర్చాడు. ఇంకో కనురెప్పలో పగటిని సూర్య నేత్రంలో చూడటం నేర్చాడు. . ఇంకా వీడికి నువ్వు కొత్త కొత్తవి నేర్పాలా ! ( కృష్ణుడి రెండు కళ్లు సూర్య చంద్రులని భావం)
3. ఈ కిట్టమ్మ చిన్న పిల్లాడు కాదు తల్లీ ! ఈ వేంకటగిరి పర్వతం మీద ప్రకాశిస్తూ పోట్లాడి పోట్లాడి వెన్న బువ్వలు తినటం మాబాగా నేర్చాడు. చిన్నపిల్లాడికి మల్లే అప్ప అప్ప అంటూ - ఎవ్వరూ దించటానికి వీల్లేకుండా తన రొమ్ము మీద లక్ష్మీ దేవిని పెట్టుకొని - ఆవిడతో కౌగిలింతలు మొదలైనవి ఎంత బ్రహ్మండంగా నేర్చాడో !
ఆంతర్యము
భక్త కవులందరికీ చిన్ని కృష్ణుడంటే విపరీతమైన మమకారం. అన్నమయ్య కూడా ఇందుకు మినహాయింపుకాదు. కృష్ణుడంటే చాలు -ఆయన కీర్తనలో బాలకృష్ణుడి గజ్జెలు అక్షరాలుగా మారతాయో – మరేమో- కాని- ఘల్లు ఘల్లు మంటూ భావాలు ఝల్లుమనిపిస్తాయి.
ఈ మర్రాకు మీద కృష్ణుడి ప్రస్తావన మనకు మహాభారతంలో కనిపిస్తుంది. చిరంజీవియైన మార్కండేయుడు ధర్మరాజుతో ఇలా చెబుతాడు “ ధర్మజా! ఈ కల్పం చివర వచ్చే జల ప్రళయంలో నేను దిక్కుతోచక తిరిగాను. ఆ ప్రళయంలో పెద్ద మర్రి చెట్టు చూసాను. . ఒక మర్రాకు మీద శ్రీ మహావిష్ణువు చిన్ని బాలునిలా పడుకుని ఉన్నాడు. అతనినోట్లోకి ప్రవేశించి పొట్టలో సమస్త జగత్తు చూసాను. నా భ్రాంతిని తొలగించమని ప్రార్థించగా ఆ చిన్ని కృష్ణుడు నేను బాలుడి రూపంలో ప్రళయకాలంలో వేయి మహా యుగాలు యోగ నిద్రలో ఉంటాను''అని జవాబు చెప్పాడు.(మహా భారతం - అరణ్య పర్వం -చతుర్థాశ్వాసం)
మహా భారతంకంటే కూడా మర్రాకుతో కృష్ణుడనగానే లీలాశుకుడి కృష్ణ కర్ణామృతంలోని ఈ శ్లోకం చాలామందికి గుర్తుకు వస్తుంది. ‘కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం |వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి’ (పద్మం లాంటిది ఆ కృష్ణుని చేయి. దానితో తన పాద పద్మాన్ని ముఖ పద్మంలో ఉంచుకొని మర్రాకు మీద పడుకొన్నాడు. అతనిని మనసారా తలుస్తున్నాను. ) బాల కృష్ణుని చేయి సృష్టికి , పాదం స్థితికి,ముఖం లయానికి ప్రతీకలుగా చెబుతారు.
మర్రికి బదులు అశ్వత్థమని (=రావి ఆకు) కొందరు చెబుతున్నారు. (శ్రీ భగవద్గీతా మథనం - 33వ అధ్యాయము.కంచి కామకోటి పీఠ ప్రచురణ ) . కాని ఇది అంత ప్రసిద్ధమైనది కాదు. అన్నమయ్య కూడా మర్రాకునే స్వీకరించాడు.
చిన్న పిల్లవాడు అడుగులు వేయటం సరిగా రాక అడుగులు వేయటంలో తొట్రుపడి, ఇటు అడుగు అటు , అటు అడుగు ఇటు వేస్తాడు. వామనమూర్తి భూమి , ఆకాశములను ఆక్రమించినప్పుడు వేసినవి ఈ తప్పటడుగులని అన్నమయ్య మనోహరమైన పోలిక.
నందగోపుడు
గోపుడంటే 1. గొల్లవాడు;2. రాజు;3. గోవులకధిపతి;4. అనేక గ్రామములకధిపతి అని నాలుగు అర్థాలున్నాయి. కనుక నందగోపుడంటే నందుడనే గొల్లవాడనే అర్థంతో పాటు , నందుడను గ్రామాధిపతి అని చెప్పుకోవచ్చు. అతని నందనుడు –కుమారుడు- కృష్ణుడు. తండ్రిని సంతోషింపచేసేవాడు నందనుడు.తండ్రిని అనేక సందర్భాలలో కృష్ణుడు సంతోష పెట్టాడు.
నందగోపుడనే పదాన్ని చినజియ్యర్ స్వామి ఇలా వ్యాఖ్యానించారు. ''నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు'' (11వ పాశుర వ్యాఖ్యానంలో)
హరిని కీర్తిస్తూ కావ్యాలు వ్రాసే కవులకి మోక్షం వస్తుందట. మరి ఆ హరిని పెంచే తల్లిదండ్రులకి ఏం లభిస్తుందో ? అని పోతన్న ప్రశ్నిస్తాడు. . (భాగవతం . ద. పూ. 350)అన్నమయ్య కీర్తనల్లో నిలిచిపోయి ప్రజల నాలుకలమీద చిరంజీవిత్వం పొందే అదృష్టం పొందుతాడని మన జవాబు. స్వస్తి.