పుస్తక సమీక్ష - -సిరాశ్రీ

book review
పుస్తకం: వర్ణన రత్నాకరము (10 పుస్తకాల సెట్టు)
వెల: ఒక్కొక్కటి సుమారు 150/- నుంచి 200/-
లభించు చోటు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో
ప్రచురణ: ఎమెస్కో
దూరవాణి: 040-23264028, 0866-2436643
 
ప్రాచీన తెలుగు సాహిత్యంలో పద్యానికున్న ప్రాముఖ్యాన్ని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పద్యం లేని ప్రాచీన సాహిత్యం లేదు. తెలుగులో రూపొందిన కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు, శతకాలు ఇలా అన్నీ పద్య రూపాలే. వాటిల్లో నిక్షిప్తమైన ఎన్నో రహస్యాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఎన్నో యేళ్లుగా పలు ప్రచురణ కర్తలు, సంకలన కర్తలు, పరిశోధకులు చాటువులు పేరిట, రోజుకో పద్యం పేరిట, అకారాదిగా గుర్తుంచుకోవల్సిన పద్యాలు పేరిట...ఎన్నో విభిన్నమైన పుస్తకాలు తీసుకొస్తున్నారు. 
 
అయితే దాసరి లక్ష్మణ స్వామి సంకలించిన 90 ఏళ్ల నాటి "వర్ణన రత్నాకరం" మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా అచ్చుకు నోచుకోకుండా, కొత్త తరాలకి చేరకుండా ఉంది. ఇప్పుడు ఎమెస్కో వారు ఆ "వర్ణన రత్నాకరం" ని మన ముందుకు తెచ్చే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకటి, రెండూ కాదు ఏకంగా 25 భాగాలట. వాటిల్లో ప్రస్తుతం 10 భాగాలు మాత్రం లభ్యమవుతున్నాయి. 
 
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే కొన్ని వందలాది కృతుల్లో ఏనుగును ఎలా వర్ణించారు, వెన్నెలని ఎలా వర్ణించారు...అనే అంశాలు పీఠికా క్రమంగా సంకలనం చేయడమే కాకుండా ప్రతీ పద్యానికి అన్వయం, వ్యాఖ్య కూడా పొందుపరిచారు. ఇది పద్యప్రియులు విధిగా ఇంట్లో పెట్టుకోవాల్సిన విషయం. 
 
ఇప్పటికే 5 వ భాగం ఒక్కటీ లభ్యం కావట్లేదు. ఎందుకో అది విడిగా ఎక్కువ సేల్ అయిపోయిందట. మొత్తం సెట్టుని ఒకేసారి కొనలేని వాళ్లకి కావల్సిన భాగాలు కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తున్నారు కూడా. తాజాగా జరిగిన హైదరాబాద్, విజయవాడ పుస్తక ప్రదర్శనల్లో ఈ పుస్తకాలదే హవా. 
 
"ఆలస్యం చేసిన ఆశాభంగం" అనే వాక్యాన్ని ఎవరు పుట్టించారో కానీ, ఈ పుస్తకాలు కొనే విషయంలో అది వర్తిస్తుంది. ఈ ప్రింటులు అయిపోతే మళ్లీ ఎన్నేళ్లకు వేస్తారో! మిగిలిన 15 కాపీలు అచ్చు అవ్వడానికి మరో ఏడాది పడుతుందట. అందాకా ఈ 10 కాపీలు చదవగలిగితే తెలుగు సాహిత్యంలో ఎంతో జుర్రుకున్నట్టే. ఒక ఆరుద్రగారి "సమగ్రాంధ్ర సాహిత్యం", ఈ "వర్ణన రత్నాకరం" కనీసం అక్కడక్కడ చదివి గుర్తుపెట్టుకున్నా చాలా చదివినట్టే బతికేయొచ్చు. అంత గొప్ప పుస్తకాలివి. ఇక మీ ఇష్టం. 
 
-సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు