నేడు మహామతీ! మధుర నీవు రయంబునఁ జొచ్చి యందుఁ బాం
డీడు దివాణము న్నెరయ నించినఁ బ్రేలెడుదుర్మదాంధులన్
బోఁడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్
వాడును రోసినాఁడిహము వైష్ణవుఁగా నొనరింపు సత్కృపన్
ఓ మహామతీ, నీవు వెంటనే మధుర వెళ్లి, ఆ మహారాజు దివాణములో నిండిపోయిన, సభలోనున్నదుర్మదాంధులను, నానావిధములుగా పేలుతున్న వారిని, వారి గర్వమణిచి, నా మహిమను ప్రకటించి ఆ మహారాజు ప్రకటించిన శుల్కమును గ్రహింపవయ్యా! ఆ రాజుకు కూడా యిప్పుడు ఇహలోకము మీద రోతపుట్టింది. ఆతడిని అనుగ్రహించి, వైష్ణవునిగా చేయవయ్యా! అని మన్ననారు అని పిలువబడే మహావిష్ణువు ఆనతిచ్చాడు.
మహామతీ అని సంబోధించడము కేవలము అనునయముగా పలకడం మాత్రమే కాదు, ఏ విద్యాపరమైన పాండిత్యము, విజ్ఞానము లేకున్నా, మనసును నిరంతరమూ మాధవునియందు మాత్రమే లగ్నము చేసినవాడు కనుక మహామతి అని. విష్ణుచిత్తుల పాత్రను పరిచయము చేసినప్పుడే లౌకికమైన విద్య, పాండిత్యము నిరర్ధకములు అనిభావించి మనసును పరమాత్మునియందు లగ్నముచేసి తామరాకుమీది నీటిబొట్టులాగా ప్రాపంచిక విషయములను అంటకుండా జీవికను కేవలము పరమాత్ముని సేవలోనే కొనసాగిస్తున్నాడు అని చెప్పాడు రాయలు, కవిగా తాను చెప్పినదాన్ని కావ్యంలో ఆసాంతమూ ఆ పాత్ర పలికే పలుకులలో ధ్వనింపజేస్తున్నాడు, పాత్ర పోషణములో ఉత్తమమైన శైలికి నిదర్శనముగా.
మన్ననారు పలికిన మాటలు వినగానే నేనేమిటి, మహారాజు సభకు వెళ్ళడం ఏమిటి? నిండుసభలో వైష్ణవతత్త్వాన్ని బోధించడం ఏమిటి అని గడగడా వణికిపోయాడు విష్ణుచిత్తుడు. ఉన్నతాధికారులతో మాట్లాడడానికే భయపడే అమాయక, సామాన్య సాత్త్విక సేవకుడు మరి. అలాంటిది రాజువద్దకు వెళ్ళడం మాత్రమే కాదు, ఆయన సమక్షములో వాదించడము, మహా మహా విద్వాంసులకు, పండితులకు బోధ చేయడం అనేప్పటికి యింకా భయపడ్డాడు. ఐనప్పటికీ, తనను అనుగ్రహించి తనతో పలికినందుకు ఆనందబాష్పాలు రాల్చాడు. సాష్టాంగదండప్రణామాలు చేశాడు. పులకితదేహుడై, వినయముగా యిలా అన్నాడు.
స్వామీ నన్ను నితఃపురాపఠితశాస్త్ర గ్రంథ జాత్యంధు, నా
రామ క్ష్మాఖననక్రియాఖరఖనిత్ర గ్రాహితోద్యత్కిణ
స్తోమాస్నిగ్ధకరున్భవద్భవనదాసున్వాదిఁ గాఁ బంపుచో
భూమీబృత్సభ నోట మైన నయశంబుల్మీకు రాకుండునే?
స్వామీ! నన్ను, ఇంతకుముందు శాస్త్రగ్రంధములను పఠించడం అనే విషయములో పుట్టుగ్రుడ్డివాడిని ఐన నన్ను (యితఃపురాపఠితశాస్త్ర గ్రంథ జాత్యంధున్) నీ ఆలయపు ఉద్యానవనములో పాదులు త్రవ్వీ త్రవ్వీ కఠినమైన గడ్డపలుగును పట్టుకొనడం వలన కాయలుగాచిన మొరటుచేతులవాడిని (ఆరామ క్ష్మాఖననక్రియాఖరఖనిత్ర గ్రాహితోద్యత్కిణస్తోమాస్నిగ్ధ కరున్) నీ భవన దాసుడిని ఐన నన్ను వాదించడానికి పంపితే, ఆ మహారాజు సభలో నాకు ఓటమి లభిస్తే ఆ అపకీర్తి నీకు రాదా? అన్నాడు! అదీ విష్ణుచిత్తుడి వ్యక్తిత్వము. పంపేది ఆ మహానుభావుడు. వెళ్ళేది తానుగాదు, ఆ మహానుభావుని దాసుడు. అక్కడ గెలిచినా ఓడినా తాను కాదు, ఆ మహానుభావుడే, కనుక ఆ కీర్తి అయినా, అపకీర్తి అయినా పంపిన మహాశయునిదే గానీ తనది కాదు. ఫలితాన్ని నాకు వదిలివేసి నీవు కేవలము నిమిత్తమాత్రుడవై సర్వకర్మలనూ ఆచరింపుము అని శ్రీకృష్ణ పరమాత్ముడు పలికిన పలుకులను తన జీవితమంతా ఆచరణ లో పెట్టినవాడు కనుక, తను విజ్ఞాని కాడు, జ్ఞానీ కాడు అనుకునే వాడు, స్వాతిశయము, దర్పమూ, అహంకారము లేనివాడు కనుక అక్కడి పండితులతో వాదించి తను ఓడిపోతే, హరిదాసుడు ఓడిపోతే, ఆ అపకీర్తి తన స్వామికి వస్తుందికదా అని భయపడ్డాడు విష్ణుచిత్తుడు. ఇంకా ఇలా మొరబెట్టుకున్నాడు స్వామికి.
గృహసమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా
వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ద్రాగ్దీపికారోపమో
నృహరీ వాదములేల లేరె యితరుల్నీ లీలకుం బాత్రముల్?
స్వామీ! అదేమన్నా నీ గృహసమ్మార్జనమా( అంటే నీ మందిరాన్ని కడిగి పరిశుభ్రము చేయడమా?) నీకొరకు నీళ్ళు తేవడమా? నీ పల్లకిని మోయడమా? నీ ప్రభుత్వమునకు చిహ్నమైన నీ ధ్వజమును మోయడమా? నీకు విసనకర్రనుబట్టి లేదా వింజామరను పట్టి వీయడమా? నీకు దీపారాధనను జేసి సేవజేయడమా? ఇవన్నీ అయితే నాకు అలవాటైనవి, తేలికైనవి, ముఖ్యముగా నాకు ఇష్టమైనవి. మౌనముగా ఏ ఆర్భాటములూ లేకుండా నీ సేవజేయడం అంటే నాకు తెలిసినది కానీ, ఈ వాదములేమిటి? ఇలాంటి నీ లీలలకు, నీ ఆటలకు తగినవారు వేరే ఎవరూ దొరకలేదా? నన్నెందుకయ్యా నాకు చేతగాని పనులలో నియోగించి నీవు అప్రదిష్టపాలు గావడం? నీలీలలకు వేరే ఎవరూ లేరా అంటే ఎందఱో ఉన్నారు విద్వాంసులు, పండితులు, జ్ఞాన, విజ్ఞాన మార్గములలో నిన్ను తెలుసుకున్నవారు, వారిని ఈ పనికి పురమాయించవయ్యా అని ధ్వని. కేవలము ఒక సేవకునిగా, మౌనముగా సేవించి ఆనందించడంలో నాకు ఆనందమున్నది అని విన్నవింపు. నాకు ఏ పండిత వాదములూ, ఆ వాదములలో గెలవడాలు, పండిత శుల్కములను గ్రహించడాలు వద్దు స్వామీ అని ప్రాధేయపడడము.
అనిన దద్భక్తి కెద మెచ్చి యచ్యుతుండు
మొలక నగవొప్ప శ్రీదేవి మోము సూచి
వా దితని చేత గెలిపింతు నాదుమహిమ
మువిద కను మని ప్రాభవం బొప్పబలికె
ఆ విష్ణుచిత్తుని పలుకులను ఆలకించి అతని భక్తికి మెచ్చుకుని, చిరునవ్వులు అంకురించుచుండగా, తన ప్రక్కనున్న శ్రీదేవితో ' వాదములో ఇతనిని గెలిపించెదను, ఉవిదా! నా మహిమ చూతువుగాని ',అని 'ప్రాభవంబొప్ప' క్రిందివిధముగా విష్ణుచిత్తులతో పలికాడు. అంటే, ప్రభువుయొక్క ఠీవి కనబరుస్తూ పలికాడు. యజమానిమీద విశ్వాసముంచి ఆతని పలుకులను జవదాటనివాడే సేవకుడు గనుక, తన
అమాయకత్వముతో నన్ను ఈపనిమీద పంపేవాడే ఆపనిని చక్కబెట్టే నైపుణ్యాన్ని నాకు ప్రసాదిస్తాడు అనే విషయాన్ని మరిచిపోయాడు సేవకుడైన విష్ణుచిత్తుడు కనుక యిప్పుడు చక్రవర్తిలా 'హుకుం' జారీ చెయ్యాలి, కనుక ప్రాభవము ఒలికేట్టు పలికేట్టు చేశాడు రాయలు. అంతటి మహానుభావునికి సకల జగత్పతికి ఏమిటీ పిల్లచేష్టలు అనే అనుమానము రావొచ్చు, తనభక్తునివైభవమే తనవైభవము
గనుక, తన తత్త్వమును తాను తన భక్తుని ద్వారా స్థాపించడము, తనభక్తునికి ఖ్యాతిలభించడము తనకు ఆనందకారకాలు గనుక ఈ ఖేల, లీల! తల్లిదండ్రులు తమ పిల్లలకు అనుభవము, నైపుణ్యము పెరగడం కోసం కొన్ని పనులను పిల్లలకు అప్పజెప్పి, వారు భయపడుతుంటే, నీకేం పర్లేదు, నేను పక్కనుంటాగా, నువ్వ్వు చేయగలవు, నువ్వే చేయాలి అనడం సర్వసామాన్యమైన విషయమే కదా. విష్ణుమూర్తికీ విష్ణుచిత్తులవారికీ ఉన్నది తండ్రీ కొడుకుల సంబంధమే, యజమానీ సేవకుని సంబంధమే, కనుక ఈ ఆట. ప్రాభవము కనబరుస్తూ యిలా పలికాడు 'మన్ననారు'.
నీ యిచ్చయె? మిన్నక పో
వోయి మునిప్రవర! నిన్ను నొప్పింతును భూ
నాయకసభ నిందులకై
యేయడ్డము వలవ దవల నేనున్నాడన్
(తెచ్చిపెట్టుకున్న గంభీరతతో, కాఠిన్యముతో) అంతా నీ యిష్టమేనా? మారుమాట్లాడక పోవయ్యా మునిప్రవరా! ఆ మహారాజు సభలో నిన్ను ఒప్పింతును, ఇందుకు ఏ అడ్డము చెప్పడము అక్కర్లేదు. మౌనముగా ఉండేవాడు ముని. అంటే నీ సంగతి నాకు తెలుసును. మౌనముగా ఉండడమే నీ లక్షణము. అదే మౌనమును నా ఆజ్ఞను పాటించడములో చూపి, ఎదురుమాట్లాడకుండా వెళ్ళు! తర్వాత పూచీ నాది, నేనున్నానుగా! అంతా నీయిష్టమేనా అనడంలో అంతా నా ఇష్టమే అని, నాపనికి ఎవరు పనికివస్తారో తెలుసుకోకుండానే నిన్ను వెళ్ళమంటున్నానా అని కమ్మని కసురు కసురుకుని, ఖరాఖండీగా కమలాకాంతుడు ఆజ్ఞ జారీ చేశాడు.
అనిన మాఱువలుక నలికి యయ్యాళువా
రియ్యకొనియెఁ బోవ నింతలోన
బద్మ నయనుఁ డతని పయనంబు తూఁగింపు
మనుచు నంబితోడ నానతిచ్చె
ఎప్పుడైతే యిలా గంభీరముగా మందలింపుతోకూడిన పరామర్శ, ఆజ్ఞ ఎదురయ్యిందో, యిక మారుపలకడానికి భయపడి, వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు విష్ణుచిత్తుడు. అప్పుడు, నంబి అంటే అర్చకునికి ఆజ్ఞ జారీచేశాడు అచ్యుతుడు. అంటే ఆ మన్ననారుకోవెలలో అర్చకుడు వేరే ప్రత్యేకముగా ఉన్నాడు, ఆ అర్చకునికి కోవెలలో సహకరించడం, ఆలయపుతోటను శుభ్రముగా చెత్తాచెదారమూ లేకుండా తీర్చిదిద్దడము, పాదులు త్రవ్వడము, ఊడవడము, కళ్ళాపు చల్లడం, పూజకు కావలసిన నీళ్ళు, పూలమాలలు వగైరా తెచ్చి సిద్ధము
చేయడము, దివ్యముగా అర్చన జరుగుతుంటే ఆనందించడము, అదీ విష్ణుచిత్తులవారి దినచర్య. అంటే ఆయన ఆ ఆలయపరిచారకుడు అన్నమాట. లౌకికముగాచూస్తే అంతటి సామాన్యుడు, మన్ననారుకే మాన్యుడు పారలౌకికముగా చూస్తే! ఇంత విశ్లేషణను ధ్వనించడానికి ఆ ఆళ్వారు (మామూలు ఆళ్వారు కాదు, పెరియాళ్వారు, ఆళ్వారులు అందరిలోనూ పెద్దవాడు, గొప్పవాడు) మారు మాట్లాడడానికి భయపడ్డాడు అని, నంబితో యీతని ప్రయాణమునకు కావలసిన ఏర్పాట్లు చేయుమని మన్ననారు చెప్పాడు అన్నాడు రాయలు. అంటే విష్ణుచిత్తులవారు అర్చకుడు కూడా కాదు, ఆ విద్వత్తు కూడా లేదు, కానీ, ఆళ్వారులలోనే పెద్ద అయినాడు, పెరియాళ్వార్ అయినాడు కేవలము సాటిలేని తనభక్తివిశేష కారణముగా, నిర్మలులైన తన భక్తులమీద భక్తవత్సలుడైన పరమాత్ముని కరుణ కారణముగా అని క్లుప్తముగా, అన్యాపదేశముగా చెప్పాడు రాయలు. యిక విష్ణుచిత్తులవారు రాజసభకు బయలుదేరారు.