'సుధామ'ధురం - సుధామ

 

....లాంటి సంగతులు

అలాంటి....ఇలాంటి...ఎలాంటి....

అసలు ఒకళ్ళతో పోల్చుకోవడం అనేది నిజానికి అనవసరంగానీ, చిత్రంగా చాలామందికి ఏదోక సందర్భంలోనో, దేనికోదానికి ఆ అలవాటు వుంటూనే వుంటుంది. ' సామ్యం ' చూసుకోవడం సరదా మరి.! పిల్లవాడో, పిల్లదో పుడితే ఆ పసికందుది అమ్మపోలికా, నాన్న పోలికా అని పోల్చడంతో మొదలౌతుంది. " అచ్చం ఆ కళ్ళు మేనమామవే " అని ఒకరంటే  " ఆ మూతి చూడు అచ్చు వాళ్ళ బామ్మగారిదే " అని ఒకరంటారు. ఇద్దరు పిల్లలు వుంటే వారిద్దరి మధ్యా సామ్యాలు, ఎడాలు కూడా చూసేస్తుంటారు. ఒకరితో పోల్చడం చస్తే గిట్టనివాళ్ళున్నారు. ఆమాట వాళ్ళు ఏ స్నేహితుడితోనో అంటే ఆ స్నేహితుడు " భలే ! మా అన్నయ్యకు కూడా ఇంతేనోయ్..తనని ఒకరితో పోల్చడం నీలాగా అస్సలు పడదు. " అని వెంటనే అనేసి మరీ పోలిక తెచ్చేస్తాడు.

" పాపా..నీకు మీ అమ్మ పోలిక వచ్చినట్టుంది. ఆ జుట్టంతా వచ్చింది నీకు " అని ఓ అమ్మాయితో పక్కింటి పిన్నిగారు అంటే " అబ్బే, నాకు మానాన్నగారి జుట్టు వచ్చేసి వుంటుంది...అందుకే ఆయనకి ఇప్పుడు పాపం బట్టతల " అందిట ఆ పాప అమాయకంగానూ ! నిజమే ఒకరి జుట్టు వీరికి వచ్చేస్తే ఆ ఒకరి దగ్గర ఇంక ఉండకూడదన్నది భలే లాజిక్కే కదా !

' పాదుషా వారిదీ నాదీ బోడిగుండే కాబట్టి ఇద్దరం ఒకటే " అన్నాట్ట వెనకటికి ఒకాయన. పోల్చుకోవడంతో అలా పొంగిపోవడం ఓ తరహా ! అవతలివారు పోలిస్తే ఒకటీ, మనని మనం అలా పోల్చుకుంటే ఒకటీనా అని అడక్కండి మరి. గొప్పగొప్పవాళ్ళతో మనల్ని పోల్చడం గొప్పేకదా మరి. ! అలా పోల్చిన వారూ మన దృష్టిలో గొప్పేలెండి.

ఈ పోలికల కోసం వచ్చినవే అపర, అభినవ, ఆధునిక, ఈకాలపు వంటి పదాలు. అభినవ తిక్కన, ఆధునిక శ్రీనాధుడు, అపర శ్రీశ్రీ, అంటూ కొందరిని పోలుస్తూంటారు విన్లేదూ ! అలాగే ఓ ప్రాంతం వ్యక్తిని పేరున్న ఓ మహనీయుడితో పోల్చడానికి ఇతగాడి ప్రాంతాన్ని ప్రదానం చేసేవారున్నారు. ఒకాయన్ని కరీమ్నగర్ గాంధీ అంటారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను సరిహద్దు గాంధీ అనేవారు.

సినిమాయాక్టర్లకు డూప్ ల్లా వుండేవారు వీరు అనుకోనక్కర్లేదు. రూపురేఖావిలాసాదులలో పోలిక లేకపోయినా అలా పోల్చబడేస్తుంటారు.  ఆవిడ అపర సూర్యకాంతం ' తను అచ్చు సావిత్రి అనుకో ' అన్న రెండు వాక్యాల్లో తేడా వుంది సుమండీ ! మొదటిది అందానికి పోలికగా నిలిస్తే రెండోది స్వభావానికి సామ్యంగా నిలుస్తుంది మరి.

చదువు సంధ్యల్లో, పనిపాటల్లో ఒకరితో పోల్చి చూసి నేర్చుకోమనడం పెద్దలు కొందరికి అలవాటె ! పిల్లలను అలా పోల్చి హెచ్చరికలు చేస్తూంటారు.

" ఆ ఎదురింటి పద్మను చూడు..ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. నువ్వేమో డింకీ కొట్టావ్.." అని అబ్బాయితో ఓ తండ్రి అన్నాడుట.! ఆ పద్మను అలా చూస్తుండడం వల్లనే ఇతగాడి పరీక్ష తన్నేసిందని ఆ జనకుడికి పాపం తెలీదు. ఇంకో తమాషా వుంది.ఘంటసాల గారి గానమాధుర్యం మెచ్చి ఒకరు ' దక్షిణభారతపు మహ్మద్ రఫీ ' అని పోల్చారు. మహ్మద్ రఫీ నే ఉత్తరభారతపు ఘంటసాల అనచ్చు కదా అని మరో ఘంటసాల అభిమాని గింజుకున్నారు. పోలికల్లో లాజిక్కు వుండాలంటారా లేదా?

ఓ సాహిత్య పత్రిక వుందనుకోండి ! అచ్చం ' భారతి ' లా వుందనుకో అని మెచ్చుకోదలుచుకుంటే అనేసేస్తారు. భారతి అంటే సాహిత్య పత్రికకు ఓ ' ఐకాన్ ' మరి.! పోలిక అని మనం మామూలుగా అనేస్తే అదే ఆలంకారికులు అనుకోండి ఉపమ, రూపకం, ప్రతీక అంటూ పెద్దపెద్ద సైద్ధాంతికం ముందుకు తెస్తారు ఒకడు బహుబలశాలి అనుకోండి. భీముడు అనేస్తాం ! ఓ తెలివిమంతుడు బుద్ధికి బృహస్పతి అనబడి రాణిస్తాడు. పోలికలకు పక్షులూ, జంతువులూ కూడా కొందరి గురించి క్యూ కడతారు. స్మీ !

వాడో గుంటనక్క......అతడో సిమ్హం.......ఆమె శూర్పణఖ.........వాడో ఏకాకి..........

ఉడుం పట్టు అనుకో తనది.........

ఇవన్నీ పోలికల కోసం రూపొందే అక్షరమాలికలే ! కొన్ని పోలికలు అమితానందం కలిగిస్తే కొన్ని పోలికలు ఆగ్రహావేశాలనూ కలిగితాయి. లక్ష్మీదేవిలా వర్ధిల్లు, చదువుల సరస్వతిలా రాణించు అని ఆశీర్వదిస్తే అంగీకరిస్తారుగానీ అమ్మయిల్ని " ద్రౌపదిలా సుఖించు " " కుంతిలా సంతానవతివి కా " అని దీవిస్తే చెల్లుతుందా చెప్పండి ! గొడవలైపోతాయి.

ఎవరూ పోల్చకపోతే తనను తానే గొప్పవాళ్ళ సరసన జమకట్టుకుని సంతృప్తిపడిపోయేవాళ్ళున్నారు. తాను నన్నయలా పద్యం రాస్తానని దివాకర్ల వారూ అనుకొనేవారట ! సరే తామే అభినవ శ్రీశ్రీలమనుకునే కవులున్నారు...కృష్ణశాస్త్రిగారిలా జులపాలు పెంచుకుని లాల్చీవేసుకుని భావకవులమని సంచరించే కుర్రకవుల కాలం వుండింది. సి.నా.రె. లా తమను తాము ఊహించుకుని వర్తించేవారూ వచ్చారు.

వేటూరిపాట, బాపుబొమ్మ, కృష్ణశాస్త్రి కవిత, అక్కినేని , ఎంటీ ఆర్ ల నటన, అందం, గాంధీ నెహ్రూల నాయకత్వం, మదర్ థెరిస్సా సేవాభావం ఇవన్నీ పోలికలకు పోతపోసిన నిలువెత్తు పడికట్లు. తాను ఘంటసాలలా పాడతానని పొంగిపోయే గాయకులు బోలెడు.

అయితే కొందరికొందరికి కొన్నికొన్ని సామ్యాలు కాకతాళీయంగా తటస్థిస్తాయి. 18అంకె చూసి రమణారెడ్డి సూర్యకాంతం పక్కపక్కన నించున్నారు అని భావన చేసేవారుంటారు. చూసే దృష్టికోణం బట్టి ఏర్పడే సామ్యాలవి. సామాన్యులవి అయినా మాన్యాలేమరి.

ఇప్పుడు నా సంగతొకటి చెబుతాను. ముళ్ళపూడి వెంకటరమణ అసలుపేరు వెంకటరావు. నాపేరూ వెంకటరావే. వాళ్ళమ్మ రాధాస్వామీ సత్సంగిట. ! మా అమ్మ కూడా రాధాస్వామిసత్సంగియే! ముళ్ళపూడి వివాహం 26జనవరినాడు జరిగింది. నా వివాహం తేదీ కూడా జనవరి 26. ఆయనకు హాస్యం ఇష్టం. కథలూ గట్రా రాశాడు. నాకూ హాస్యం ఇష్టం. నేనూ రచనలంటూ గిలికినవాడినే. ఇలాపోల్చేసుకుని సంతోషపడడం ఓ తరహా! దానివల్ల ఒరిగేది ఏమిటంటే ఏం చెప్పలేం.

అవతలి వారితో పోల్చుకోవడంలో తనకన్నా తక్కువ ఆస్థి, అంతస్థు, స్థాయిగలవారితో పోల్చుకుని తాను ఉన్నతంగా వున్నానని సంతోషపడేవారికంటే, తనకన్నా ఆర్ధికంగా, ఆధికారికంగా ఉన్నత స్థానంలో వున్నవారితో పోల్చుకుని తాను ఆత్మన్యూనతతో బాధపడేవారు కొందరు. వాళ్ళకు సుఖంలేదు. కోటి వచ్చినవాడు ఇంకో కోటి కోసం ఆరాటపడతాడు తప్ప, సంతృప్తి పడేవాడు అయితే నిజంగా ఎంత బాగుంటాడు! " పొరుగింటి మీనాక్షమ్మను చూశారా" అంటూ ఆమెకున్న నగలూ నట్రా, చీరలు సారెలు తమకు లేవని కృంగిపోయే స్త్రీలే ఎక్కువగానీ " చాలు చాలు చాలు ఇక చాలుచాలుచాలు" అని ఆదరించే భర్తా పిల్లలతో ఆనందంగా వుండగలిగే వారెందరు? ఇంతకీ ఒకాయన ' సామ్యవాదం ' అంటే ఇలా ' సామ్యం ' అంటే పోలికలు చూసుకుంటూ బ్రతకడమే అనేసాడు.

ఫేస్ బుక్ లో తన పోస్టింగ్ కు ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు వచ్చాయో చూసుకోవడం, తన బ్లాగ్ వీక్షకులు ఎందరు అని చూసుకోవడం కాదు, అవతలి వారి పోస్టింగ్ కు వచ్చిన లైకులు, కామెంట్లతో ఆ బ్లాగ్ వీక్షకుల సంఖ్యతో పోల్చుకుని పొంగిపోయే జనం కంటే కృంగిపోయే వాళ్ళుంటున్నారని మానసిక విశ్లేషకులు సరికొత్తగా చెబుతున్న మాట!

ఎందరున్నా ఎవరి జీవితం వారిదే ! ఎవరి జీవన పరమార్థమూ, గమ్యమూ వారికే సొంతం. మన బ్రతుకు ఎప్పుడూ మనదే ! మనుషులందరికీ అవే రెండు కళ్ళూ, కాళ్ళూ చేతులూ, ముఖం, వీపూ, కడుపూ అన్నీ సమానమే. అంతే సామ్యం. బుద్ధీ, తెలివీ, జ్ఞానం...ఆ ఒక్క మెదడూ....అనుభవాలూ అనుభూతులూ ఆ ఒక్క హృదయం అవేమరి ఆలంబనం. కానీ ఎవరి జీవిత పరమార్థం వారిదే. " ఏవిట్రా నీవల్ల ఉపయోగం " అని ఎవడికి వాడు తనను తాను ప్రశ్నించుకోవాలి. సహేతుకమైన, సంతృప్తికరమైన సమాధానం రాబట్టుకోవాలి. ప్రపంచంలో ఒక్కలాంటివారు ఏడుగురుంటారట, కానె, ఎవరికి వారే కదా!

" నిన్ను నువ్వు తెలుసుకో "

మతం చెప్పినా, గతి తార్కిక భౌతిక వాదం చెప్పినా అదేమాట!

నీకు నువ్వె సాగిపో..ఫో! ఇక పోలికలొద్దు!వాడ్డూయూసే..!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు