నాట్యభారతీయం - కోసూరి ఉమాభారతి

నేస్తమా! నువ్వా దరిని నేనీ దరిని....

.....కాలానుగుణంగా సాగాలిగా, మరి.....

...కళ్యాణ  ఘడియలు ఎప్పుడా అని ఎదురు చూడడం మినహా ......

నేను హైదరాబాదు నుండి హ్యూస్టన్ వచ్చిన అనతికాలంలోనే,  తెలుగు వారిని కొందరిని కలవగలిగాను.  మమ్మల్ని తరుచుగా ఇళ్ళకి ఆహ్వానించేవారు.  ఆప్యాయంగా మెలిగే వారు.  ఎన్నో విషయాల్లో  అవసరమైన సమాచారం ఇచ్చి సహాయం చేసేవారు.... వారిలో కొందరి పిల్లలప్పుడు హై స్కూల్, మిడిల్ స్కూల్లో ఉన్నారు.  అనుభవం ఉన్న తల్లితండ్రులు కదా.  వారి పిల్లల ప్రాపకం,  చదువులు, ముచ్చట్లు ఒకటేమిటి - అన్నీ విని అబ్జర్వ్ చేసేద్దాన్ని..... ఎన్నో  కొత్త విషయాలు తెలుసుకోనేదాన్ని.

పిల్లల పెంపకం విషయంగా, ఇండియాకి - ఇక్కడకి వ్యత్యాసం గమనించాను.  నేను పెరిగిన వాతావరణంలో నాకు తెలిసి, మనకక్కడ  ‘Spare the rod and spoil the child’ అనే చందంగా సాగుతుంది పిల్లల పెంపకం.  అమ్మా నాన్న చేతుల్లో కొద్దో గొప్పో దెబ్బలు తినని వాళ్ళు ఉండరనే అనుకుంటాను.   కానీ ఇక్కడ అలా పిల్లల వీపులు మోగించడాలు,  చెంప చెళ్ళుమనిపించడాలు కాదు కదా, పిల్లల్ని పల్లెత్తి మాటనకూడదేమో అనిపించింది.

అయితే పిల్లల పెంపకంలో ఏది సరి, ఏది కాదు అని చెప్పడం కష్టం అని నా అభిప్రాయం.  ఫలానా పద్ధతి  సబబా కాదా అనేది సిట్యుయేషన్ ని బట్టే.........స్వానుభవంతో మాత్రం నేనూ గ్రహించాను...అన్నిటా మంచి – చెడు.... మంచి అనుభవాలతో పాటు బాధ కలిగించేవి కూడా  ఉంటాయిగా మరి!...

***

ఓ సారి మా ఫ్రెండ్స్ ఇంటికి డిన్నర్ కి వెళ్ళాము.  ఐదేళ్ల వాళ్ళబ్బాయి బర్త్ డే పార్టీ.  మా పాపకి అప్పుడు నాలుగేళ్ళు.  ఓ పదిమంది చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ని పిలుచుకున్నారు.   కొన్ని గేమ్స్,  మాజిక్ షో ఆర్గనైజ్ చేసింది మా హోస్టెస్.  యాక్టివిటీస్ అయ్యాయి.  ఇక మెయిన్ ఇవెంట్ – కేక్ కటింగ్...టేబిల్ చుట్టూ చేరి ‘హ్యాపీ బర్త్-డే’ పాడటం, కేరింతలు నవ్వులు నడుమ కేక్ కటింగ్ కూడా అయింది. చిన్నవాళ్ళు కేక్ కోసం వెయిటింగ్.  హోస్టెస్ కి హెల్ప్ చేద్దామని నాలుగడుగుల కిచెన్ లోకి వెళ్లి కేబినేట్ నుండి పేపర్ ప్లేట్స్ అందుకొని వెను తిరిగేప్పటికి మా అమ్మాయి కేక్ వైపుగా  చేయి చాచడం, బర్త్-డే బాయ్ ఆ చేతిని  పట్టుకుని గట్టిగా కొరకడం ఒకేసారి జరిగాయి. మా అమ్మాయి పెద్దగా ఏడుస్తూ గగ్గోలు పెడుతుంది.   పరిగెత్తుకెళ్ళి నేను, వాళ్ళమ్మ కూడా వాళ్ళని విడిపించాలని ప్రయత్నిస్తే, అసలు ఆ అబ్బాయి దాని చేయి వదలడే? కాస్త నేనే గట్టిగా కోప్పడి మొత్తానికి మా అమ్మాయి చేయి విడిపించాను.

మా పాపని ఓదార్చి చేయి కడిగి చూస్తే ఏముంది? భయంకరమైన పంటి గాట్లు.  అక్కడ వరకు చేయి కమిలిపోయింది.  ఆల్కహాల్ స్వాబ్స్  అడిగి తీసుకొని క్లీన్ చేసాను. పాపం అది ఏడుస్తూనే ఉంది. నాకు దుఃఖం కోపం తన్నుకొచ్చాయి.  పాపని సముదాయించి,  రెస్ట్ రూమ్ నుండి లివింగ్ లోకి వచ్చాను. అంతా హడావిడిగా ఉంది.  ఇలా పిల్లలు చాలా మంది ఉంటే, ఆడుకునేప్పుడు దెబ్బలు తగులుతాయేమో అని ఇంచుమించు అందరం ఓ కంట అబ్జర్వ్  చేస్తూనే ఉంటాము.  అయినా ఇలా జరిగిందని బాధగా ఉంది.

పాపని మా వారి వొళ్ళో కూచోబెట్టాను.  మా హోస్టెస్ అక్కడే ఎదురుగా  బర్త్-డే బాయ్ ని పక్కనే కూచోబెట్టుకుని, నచ్చజెపుతుంది.  నాకర్ధం కాలేదు... ఆ అబ్బాయిని ఆ తల్లి మందలిస్తుందేమో అని చూసాను.  ఎంతకీ వాడ్ని బుజ్జగించడం తప్ప వాళ్లకి  వేరే ధ్యాసే లేదు.  ఒకపక్క బాగా లోతుగా దిగిన నాలుగు పళ్ళగాట్ల బాధకి ఓర్చుకోలేక, మా పాప ఏడుస్తుంటే, దాని మీద కొంచెమైనా కన్సర్న్ చూపకుండా,  అంత గట్టిగా పాప చేతిని కొరికిన తమ కొడుకుని ఓదారిస్తున్నారు మా హొస్ట్స్... వచ్చిన గెస్ట్స్ లో ఒకళ్ళిద్దరు డిన్నర్ టేబిల్ సెటప్ చేస్తున్నారు.  ఒకావిడ కేక్ సర్వ్ చేస్తుంది.

బర్త్-డే బాయ్ ని సముదాయించి, ముద్దు చేసాక,  “why did you bite her hand like that?” వాడ్ని మా ముందే వాళ్ళమ్మ అడిగింది.  ఆ పిల్లవాడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు.  క్షణమాగాక, “…So, did she Provoke you?”  మళ్ళీ ఆమే వాడ్ని అడిగి, వాడి తల మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంది.

“No Raja, maybe she was just reaching for the cake baby.. That’s all,”  అంటూ వాళ్ళబ్బాయిని  వాళ్ళాయనకి  అప్పజెప్పి మా వైపు చూసారావిడ.

అవాక్కయి వింటున్నాము.  మా అమ్మాయి ‘Provoke’  చేసిందా? అలా ఎలా అంటుంది ఆవిడ? అర్ధం కాక నాకు చాలా అసహనంగా ఉంది...

“సారీ అండి....పిల్లల్ని అందరిముందు తిట్టడం అదీ చేయకూడదు.  పైగా మా చిన్నూ ఇవాళ బర్త్-డే బాయ్ కదా! మందలిస్తే హర్ట్ అవుతాడు.  వాడి పర్సనల్ డెవెలప్మెంట్  కి అది మంచిది కాదు...” ఆగి ఆశ్చర్యంగా వింటున్న నా వంక చూసి నవ్వింది.

“నేను చైల్డ్ సైకాలజీ చదివానండి ఉమా,” అంటూ లేచి వచ్చి నా భజం పై చేయి వేసింది.

‘అయితే మా పాప పర్సనల్ డెవెలప్మెంట్  సంగతేంటి? అది హర్ట్ కాలేదా?’ అనుకొని  అయోమయంగా మా వారి వంక చూసాను.  ‘ఓపికపట్టు వెళ్ళిపోదాం’  అన్నట్టుగా ఉన్నాయి అయన చూపులు.  ముళ్ళ మీద ఉన్నట్టు మరో అరగంట ఉండి, అక్కడినుండి  బయటపడ్డాము.

***

మరునాడు హైదరాబాదులోని, నా క్లోజ్ ఫ్రెండ్ ఉషతో మాట్లాడుతూ జరిగిన సంఘటన వివరించాను...

“అదేమిటి? అసలా మదర్ ఏమనుకుంటుంది?  అంత పోగరేమిటి? తన బిడ్డని మందలించడానికి కూడా మనసొప్పదు కాని,  ఇవతలి వాళ్ళ పిల్లలు మాత్రం ఫిజికల్ గా హర్ట్ అయినా పర్వాలేదన్నమాట. చైల్డ్ సైకాలజీ కాదు ముందు ఆమె సైకాలజీ చెక్ చెయ్యాలి,” అంటూ చడామడా దులిపేసింది.

“అయినా పాపని  కనిపెట్టుకుని ఉండడానికి  పనిపిల్లని వెంటతీసుకెళ్ళవా?”  అడిగింది ఆశ్చర్యంగా.

“ఇక ఆమె అంతేలే ఉషా.  కాని, తల్లీ, మీకు లాగా ఇక్కడ చైల్డ్ లేబర్ లేరు.  ఇక్కడ పనివాళ్ళము మేమే- ఇంటివాళ్ళము మేమే,” అంటూ నవ్వేసాను....

“నువ్వా హాయిగా అక్కడ – ఆ దరిని ఉన్నావు. నీ పిల్లకి అమ్మమ్మ, నానమ్మ కాక ఆయమ్మ, పనిపిల్ల కూడా.... మరి ఈ దరిని నేనున్నాను.  ఇక్కడ నేనే అన్నీ -  ఆల్-ఇన్-వన్ అనుకో....” అన్నాను...

***

మరో మరువలేని సంఘటన---

నా స్టూడెంట్ ఒక అమ్మాయి యేడేళ్ళు డాన్స్ నేర్చుకొని, ‘కూచిపూడి రంగప్రవేశం’  చేయబోతుంది.  దాంతో పాటు ఆ అమ్మాయి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పార్టీ కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళమ్మావాళ్ళు ప్లాన్ చేస్తున్నారు.  మాకు బాగా పరిచయస్తులే.   అయితే ప్రోగ్రాం గురించి వివరాలు మాట్లాడ్డానికి  ‘గురువుగారికి  ఆహ్వానం’ అంటూ ఓ శనివారం సాయంత్రం నన్ను, మావారిని వాళ్ళింటికి సాదరంగా డిన్నర్ కి ఆహ్వానించారు ఆ అమ్మాయి పేరెంట్స్.

భోజనం, ప్రోగ్రాం గురించిన ఇనిషియల్ ప్లానింగ్ కూడా అయ్యాక,  లివింగ్ లో కుర్చుని, టీ సిప్ చేస్తూ మాట్లాడుతున్నాము.  ఏదో జోక్ చేస్తూ నవ్వుతున్నాము కూడా.  అంతలో పైనుండి, పద్దెనిమిదేళ్ళ  వాళ్ళమ్మాయి – నా  స్టూడెంట్ -  సుడిగాలిలా మా వద్దకు దూసుకొచ్చింది.   “ఏమిటి  మీ గోల?  అసలు ఆపకుండా మీ కబుర్లు, నవ్వులు. ఎంతసేపటి నుండి ఓపిగ్గా ఉన్నానో.  కాస్త మీ వాల్యూం తగ్గిస్తారా లేక ఇక ఊర్కుంటారా లేదా?  నేను చదువుకోవాలి,”  అని మా అందరినీ ఉద్దేశించి రంకెలు వేసి వెళ్ళిపోయింది.  అందరం తలలు వొంచుకుని కాసేపు గమ్మునుండిపోయాము.  కాసేపటికి తేరుకుని, టీ కప్పులు టేబిల్ మీద ఉంచి,  శెలవు తీసుకున్నాము.

**

మరునాడు ఊరుకోకుండా ఇండియాలోని నా ఫ్రెండ్ ఉషాకి,  స్టూడెంట్ తో ఇంసిడెంట్ గురించి చెప్పాను.... తను కూడా నాలా షాక్ అయింది... “గురువన్న రెస్పెక్ట్ కూడా లేదా? అదీ అన్నేళ్ళు డాన్స్ నేర్చుకొని, కొద్ది రోజుల్లో ప్రోగ్రాం పెట్టుకొని,  అదేమీ బిహేవియర్?  ఏమో తల్లి మీ అమెరికా పిల్లల పెంపుకాలు.  కష్టమే.  అపాలజీ చెప్పాలి వాళ్ళు... లేదంటే ప్రోగ్రాం కండక్ట్ చేయబాకు,” అంది ఉష...

“ఏమోనే,  నా పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఎలా ఉంటారో గాని.. చెప్పలేం.. కంఫ్యూజన్ గానే ఉంది.  పిల్లల పెంపకం ఎక్కడైనా కష్టమేలే,”  అన్నాను.   “అయినా తల్లీ, నువ్వా అక్కడ హైదరాబాదులో, ఆ వాతావరణమే వేరు...నేనేమో ఇక్కడ అమెరికాలో.  అదీకాక, అందరూ ఒకేలా ఉంటారా?” అని కూడా అన్నాను ఆలోచిస్తూ.

***

మరో ఆసక్తికరమైన సంఘటన: ------

పొలిటికల్ సైన్స్ మేజర్ గాను, బయాలజీ మైనర్ గాను తీసుకొని -బి.ఎస్- అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాడు మా అబ్బాయి ఆకాష్.  తరువాతి చదువు ఏ ఫీల్డులో కొనసాగించాలో మీమాంసలో పడ్డాడు.  మెడిసిన్ కి అవసరమైన సైన్స్ క్రెడిట్స్ తీసుకొని M-CAT (మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష) రాసాడు... లా-స్కూల్ కి వెళ్లాలని కూడా మరోపక్క ఆలోచన. అటూ ఇటూ కాని ఆలోచనలో ఉన్నాడు.  నేను వొత్తిడి చేయదలుచుకోలేదు.  టీచింగ్ ప్రొఫెషన్ కూడా మంచిదే అని సూచించాను.  డెసిషన్ చేసేలోగా ఊరికే ఉండడం ఎందుకని ... మర్విన్స్ అనే పెద్ద  డిపార్ట్ మెంట్  స్టోర్ లో జాబ్ తీసుకున్నాడు.

అదే టైం లో హైదరాబాదు నుండి మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ అమెరికా విజిట్ కి వచ్చి మా వద్ద పదిరోజులు గడిపారు... ఓ రోజు షాపింగ్ మాల్ కి వెళ్ళాము.   ఆకాష్  వర్క్ చేస్తున్న  స్టోర్ కి వెళ్లి వాడిని కలిసాము.  ఆ వారం మెన్స్ షూజ్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నాడు.  బ్రేక్ తీసుకొని మాతో కలిసి లంచ్ చేసి వెళ్ళాడు ఆకాష్.  షాపింగ్ ఫినిష్ చేసుకొని మేము ఇంటికొచ్చేసాము. 

కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తుండగా, “ చూడు ఉమా,  ఆకాష్ బాగున్నాడు.  మేము ఇండియా నుండి పెద్ద సంబంధం తీసుకొచ్చాము.  అమ్మాయి అందంగా ఉంటుంది, తండ్రి కొటీశ్వరుడు. బోలెడంత కట్నం ఇస్తారు.  పైగా ఈ అమ్మాయి ఏకైక సంతానం.  మరి మన ఆకాష్  చెప్పుల దుకాణంలో పని చేస్తున్నాడేమిటా! అని ఆలోచనలో పడ్డాము... మీ అబ్బాయి డాక్టరో, ఇంజినీరో అవుతాడని అనుకున్నాము. మరి ఇలా?” అడిగింది మా కజిన్ భార్య రజని.

నేను మా అయన ముఖాలు చూసుకున్నాము.  ఏమనాలో తెలియలేదు.  నేనే చొరవ చేసి మాట్లాడాను. “అదేమిటి వదినా, నీవు మరీ అలా పాతకాలపు మాటలు చెబుతున్నావు.   మా ఆకాష్ ఏమి చదవాలో ఇంకా నిశ్చయించుకోలేదు.  ఊరికే ఉండడం ఇష్టం లేక జాబ్ చేస్తున్నాడు.  షూజ్ అయినా సూట్స్ అయినా  మన ఇష్టం కాదుగా.   అయినా ఈ పిల్లలు ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అనే దాన్ని ఫాలో అవుతారు.  మా ఆకాష్ తానిక ‘చదవను’ అంటే ఆలోచించాలి కాని, మాకేమీ భయం లేదు.. వాడు తనకిష్టమైనదే చదువుతాడు...

వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిం’..... ఇక పోతే పెళ్లి సంగతి,” క్షనమాగాను.  వాదన భుజం పై తట్టాను.

“అమ్మా, రజని వదినమ్మా, ఇక్కడ మా పిల్లలు అలా కట్నకానుకల మీద ఆశలు పెట్టుకునే రకం కారు వదినా... ఇక్కడ ఎక్కువ మంది పిల్లలికి అసలా సంగతులే తెలియవనుకుంటా,” అన్నాను నవ్వుతూ. 

“మీరు, అక్కడ మన ఇండియా పద్ధతిలో ఆలోచిస్తారు వరుణ్ గారు... మేము మరి ఇక్కడ కదా ఉన్నాము... ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లల దృక్పదాలు, ఆశయాలు కాస్త భిన్నంగానే ఉంటాయి కదండీ,” అని సర్దేసారు మా వారు...

.... ఆ తరువాత కొన్నాళ్ళకి మావాడు హెల్త్-కేర్ ఫీల్డ్ లోనే తన చదువు సాగించాడు....

***

పిల్లలకి చదువులయ్యాయి... ఇప్పుడు ఇక వాళ్ళ పెళ్లిముచ్చట... మా సర్కిల్లోని ఫ్రెండ్స్ అందరికి ఇక అదే ధ్యాస.

ఓ రోజు నా రాజమండ్రి ఫ్రెండ్ రాగిణి ఫోన్ చేసింది.  నాకు ఫస్ట్ గ్రేడ్ నుండీ ఫ్రెండ్.   క్లోజెస్ట్ అనొచ్చు.  వసబోసిన పిట్టే అనవచ్చు దాన్ని.“ఉమా మా అమ్మాయి పెళ్లి సెటిల్ చేసాము.  ఇల్లు కట్టడం పూర్తి అవ్వగానే పెళ్లి పెట్టుకుంటాము.   ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటారు కదా! నేను వాటిని కంప్లీట్ చేసినట్టే అనుకో.  ఇక నీ సంగతి చెప్పు... పిల్లలకి సంబంధాలు చూస్తున్నారా?  ఇక్కడ సంబంధాలు చూస్తే, చేసుకుంటారా? అక్కడ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారని విన్నాలే,” అన్నాక ఊపిరి తీసుకుంది....

“ఇక్కడ డిఫరెంట్ లేవే రాగిణి.  అక్కడిలా కాదనుకుంటా,” అన్నాను నింపాదిగా.....

“నాకు బోలెడంత టైం ఉంది.  అక్కడి సంగతులు ఎలా డిఫరెంట్ చెప్పు... కాక మీ వాళ్ళు పెళ్ళికి రెడీనా కూడా చెప్పు... నీకు తెలిసి, వాళ్ళ జీవితాల్లో  ఏమన్నా ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయా? చెప్పాలి,”  ఏకరువు పెట్టింది.

“సరే ఓపికుంటే కొద్దిపాటి లెక్చరు మరి. వినడానికి రెడీ అవ్వు,” అన్నాను. ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ లోని ‘ఇల్లు కట్టి చూడు’  ఎంతో మందికి చాలా సుళువైపోయిందిగా.  పెళ్ళీడుకొచ్చిన పిల్లల విషయంలో మాత్రం,  వారి కళ్యాణ  ఘడియలు ఎప్పుడా అని ఎదురు చూడడం మినహా, ఎక్కువగా ఏమీ చెయ్యలేకపోతున్నాము ఇక్కడ మేము,” అన్నాను.

“అంటే, జనరల్ గా కాదులే మీ పిల్లల విషయం చెప్పు.  అదీకాక  ఏమన్నా ప్రేమలు, ఇష్టాలు ఉన్నాయేమో కనుక్కోకపోయావా,” అడిగింది రాగిణి.

“నిజానికి, అసలు ఏ గొడవ లేకుండా, కాలేజి చదువులయ్యే లోగానే, జీవిత భాగస్వామిని ఎన్నుకొంటే, కొడుకు విషయంలో అయితే, ‘వచ్చిన కోడలు నచ్చిందని’  సరిపెట్టేసుకుంటానోయ్.  చిట్టితల్లి  విషయంలో అంటావా? అది ఏరి కోరి వలచిన వాడితో వివాహానికి మా ఆమోదం తెలిపి ఆనందిస్తాము.

“అదేమిటి అలా అంటావు?  అంటే సూచనప్రాయంగానైనా ఇంకా ఏమీ లేనట్టేగా? అదీగాక మరీ అలా పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేస్తావా? భలేదానివే,” అంది రాగిణి.

“ఎందుకు వదిలేస్తాను?  చెబుతాను... అడుగుతాను...పిల్లల దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తేనే,  ఉన్నట్టుండి తామెంత పెద్ధవారమో గుర్తొచ్చి, “మా నిర్ణయాలు మేము చేసుకోలేమా?  మీ తరంలోలా ఎలా సాధ్యం మమ్మి, మీరు అమ్మాయిని ఎంపిక చేసి చూసి, నాకు చూపించి, చేసుకో పెళ్లి అంటే ఎలా కుదుర్తుంది?, మనుషులు తెలియక, మనస్సులు కలవక, ఎలా? అదీగాక, ఒకరికొకరం నచ్చకపోతే, మీ అందరికీ కారణాలు తెలియాలి,”  అని ఎదిగిన కుమార రత్నం వేసే ఎదురు ప్రశ్నకి జవాబు దొరక్క గింజుకుంటున్నాము.   తిరిగి ఆలోచిస్తే, నిజమే కదా!  ఈ రోజుల్లో బాగా చదువుకుని, సొంత వ్యక్తిత్వం, ఆలోచన ఉన్న పిల్లల్ని, బలవంతపెట్టి తిట్టి మన దారికి తేలేనుగా రాగిణి... వాళ్ళు బుద్దిమంతులు. అన్నిటికీ వాళ్లకి స్వేచ్చ నిచ్చాం కదా!.. నాకు నమ్మకముంది వాళ్ళ మీద,” అన్నాను.

“ఇకపోతే, మెడిసిన్ పూర్తి చేసిన కూతుర్ని, “ ఇంక నీకు పెళ్లి చేయ వలసిన బాధ్యత  మాకుంది.  మమ్మల్నన్నా చూడనివ్వు, లేదా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు,”  అనగానే, “ నీకెలా తెలుస్తుంది మమ్మీ, నాకెలాంటి వాడు నచ్చుతాడో? నేనే చూస్తానులే, అయినా నాకు ఇప్పుడు టైం లేదు,” అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.  అయినా, ఇది మా ఒక్కరి సంగతే కాదు.  మెజారిటీ ఇళ్ళల్లో  ఈ రోజుల్లో ఇలాగే ఉంది పరిస్థితి,” అన్నాను.రాగిణి నిశబ్దంగా విన్నది.. కాసేపటికి, “అవునులే, మా అక్కావాళ్ళు మొన్నామధ్య ఇండియా వచ్చారు. వాళ్ళబ్బాయి రమేష్.  ఇంజినీరు.  ముందే ఓ మంచి సంబంధం చూసుంచాను.  మంచి సంబంధం కదా! ఒప్పేసుకో,  చక్కగా రెండు వారాల్లో పెళ్లి చేసుకొని వెళ్ళొచ్చు,” అని చాలా ప్రయత్నించాను ఉమా.  ససేమిరా అన్నాడు వాడు.  ఏమంటే,  “పిన్నీ,  ఇక్కడ పిల్లని చేసుకుంటే కాస్త ఇబ్బందేమో..పెంపకంలో,  ఆలోచనలో తేడాలుంటాయి కదా! అర్ధం చేసుకోవడం, చేసుకొని మనగలగడం చాలా కష్టం,”  అంటూ నవ్వేసాడు వాడు. అంతేకాక ఇటువంటి కొన్ని కలయికలు వికటించిన వైనాలు, వివరాలతో చెప్పడం మొదలెట్టాడు.  ఇంకేం చేస్తాను చెప్పు.  ‘అంత అలోచించి చించీ ఎప్పటికి పెళ్లి చేసుకుంటావురా ‘అన్నాను,” వాపోయింది రాగిణి.

“మన పిల్లల్ని, మనలా ఆలోచించ మనడం న్యాయం కాదేమో రాగిణీ..! మనమున్న పరిధిలోనే, వాళ్ళనీ అలోచించమంటే, ఎలా కుదురుతుంది చెప్పు,”  అన్నాను. “ఏది ఏమైనా ఈ తరం యువతీ యువకులు, విద్యావంతులే కాక లోక జ్ఞానం మెండుగా ఉన్నవారే.  తమ జీవితాలని మలుచుకొనే నేర్పు, అవగహన ఉన్నవారు.  వారి అభిప్రాయాలను, ఆలోచనను గౌరవించే అవసరం, తల్లితండ్రులుగా మనకుంది అని నేననుకుంటాను,” అంటూ హితవు పలికాను.

“అంతేలే ఉమా... ఆ దరిని నువ్వు - అక్కడ మీ సిట్యుయేషన్ మీది...  ఈ దరిని నేను - ఇక్కడ మాది వేరులే...  తీరాలు మారాయి ... తీరు తెన్నులూ మారుతాయిగా మరి... కాలాలు మారాయి.  అనుగుణంగా సాగాలిగా!  అదీ గాక, ఇప్పుడు ఇక్కడ కూడా నీవు చెప్పే లాంటి పరిస్థితులే మెండుగా ఉన్నాయి,”  అంది రాగిణి  నవ్వుతూ...

****

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు