సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

Sahitee Vanam

'ఆముక్తమాల్యద'
శ్రీమహావిష్ణువు గంభీరముగా ఆజ్ఞజారీచేయడంతో యిక తప్పనిసరై స్వామిమీదనే సమస్త భారమునూ వదలి, మధురానగరానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు. కొద్దిగా నసగడం, అభ్యంతరం తెలియజేయడం, స్వామిఆజ్ఞకు ఎదురుచెప్పడం ఎందుకంటే, నిత్యమూ సమస్త ప్రాపంచిక విషయాలకూ అతీతుడై స్వామి సేవలో, ఆ ఆలయపరిచర్యలలో గడిపేవాడికి ఆ ఆలయాన్ని, ఆ సేవనూ వదిలి, గ్రామాంతరం వెళ్ళడంకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది?

వెళ్లి చేసేదీ స్వామి సేవయే కానీ, ఈ పాండితీవాదాలు, ప్రతిభాప్రదర్శనలూ, యివన్నీ గిట్టనివాడు, ఆ దర్పముకానీ, అహం కానీ తెలియనివాడు, మౌనముగా ఆనందముగా సేవచేస్తూ, ఆనందబాష్పాలు రాలుస్తూ స్వామికి దివ్యముగా అర్చన జరుగుతుంటే చూసి ఆనందించడమే తెలిసినవాడు, కనుక యిదంతా నాకెందుకు అనుకోడం ఒక కారణమూ, రెండవది ఆ రాజసభలూ, ఆ సమూహాలూ, ఆ వ్యర్ధ, శుష్కవాదాలు, ఆ రాజసిక, తామసిక తత్త్వ నిలయాలు గిట్టని ఏకాంతుడు, దాంతుడు, శాంతుడు, యోగి, భౌతికముగా సంసారములో ఉన్నప్పటికీ మానసికముగా సన్యాసి కనుక. కానీ, అది కూడా నా పనే, నా సేవయే, నా సేవకులతో ఏం సేవ చేయించుకోవాలో నాకు తెలియదా, అని స్వామి కోపగించుకొనడం వలన బయలుదేరాడు.

ఆనతిఁ బడి శ్రీ భండారాన న్సంబడముఁ దనదు ప్రాయందలమున్
స్థానికుఁ డొసంగి పనుపంగా నానతి బడిన నిమితకాండ్రు వహింపన్

స్థానికుడు అంటే ఆ దేవస్థానములోని జమాఖర్చుల అధికారి, కోశాగారపు అధికారి. ప్రాయందలము అంటే పురాతన పల్లకి, నిమితకాండ్రు అంటే ఆ పల్లకిని మోసే బోయీలు. స్వామివారి ఆనతిని పొందిన ఆ ఆలయపు అర్చకుడు కోశాగారపు అధికారికి ఆజ్ఞ జరీ చేశాడు విష్ణుచిత్తుల వారికీ దారిబత్తెముకోసము, యితర అవసరాలకోసం డబ్బునివ్వమని. ఆ కోశాధికారి అలాగే డబ్బులిచ్చి, తన పల్లకిని, ఎప్పటినుండో తను వాడుకునే తన స్వంత పల్లకిని కూడా ఇచ్చాడు. దాన్ని మోయడానికి తన బోయీలనూ కూడా సమకూర్చాడు. రాజుగారి సభలో వాదించడానికి వెళ్తున్నాడు మరి, తమ గ్రామానికి, దేవాలయానికి గౌరవప్రదమైన విషయము, అదీ గాక ఈయనకు మహారాజుతో పరిచయము పెరిగితే ఈ మహానుభావుడితో ముందు ముందు ఎన్నో అవసరాలు ఉండవచ్చు! యిక కావలసిన అన్ని హంగులూ సమకూరాయి కనుక ఆ పల్లకిలో కూర్చుని బోయీలు మోస్తుండగా

లావుగల యట్టిగుఱ్ఱపు జావడములమీఁద మాత్రసంచులు తూలన్
గ్రేవల నేకాంగులు రా వీవధముల నరిసె లవనివిభునకుఁ గొనుచున్

జావడములు అంటే పార్శ్వభాగాలు, డొక్కలు. మాత్రసంచులు అంటే అటుచివర యిటుచివర సంచుల్లాగా వుండి, ఆ రెండు సంచులనూ కలుపుతూ మధ్యలో పొడవుగా వుండే మందపాటి గుడ్డ కలిగిన రెండు సంచుల మూట అన్నమాట. ఆ సంచులలో అవసరమైన వస్తువులు, బట్టలు మొదలైనవాటిని పెట్టుకుని అటుప్రక్క యిటుప్రక్క భుజాలమీదనో, గుఱ్ఱాలమీదనో ఈ సంచులు వ్రేలాడదీసి ప్రయాణాలు చేసేవారు ఆ కాలంలో. ఏకాంగులు అంటే సమస్త ప్రాపంచిక బంధాలను, ఆనందాలను వదిలిపెట్టి, భగవంతుని కైంకర్యముకోసమే జీవించే విరక్తులు. ప్రతిదేవాలయాన్ని అంటిపెట్టుకుని ఇలాంటివారు దేవాలయపు సేవలలో కార్యకర్తలుగా ఆనందంగా బ్రతికేవారు ఉండేవారు. వీవధములు అంటే కావళ్ళు.

పల్లకీకి ఇరుప్రక్కలా ఏకాంగులు నడుస్తుండగా, బలిష్టమైన గుఱ్ఱాలమీద మాత్రసంచులు వ్రేలాడుతుండగా, కావళ్ళలో రాజుగారికోసం ప్రత్యేకముగా వండించిన అరిసెలను కావడివాళ్ళు మోస్తుండగా బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరాడు విష్ణుచిత్తులవారు.భారతీయ, హైందవ ధర్మానికి మూలస్తంభాలైన దేవాలయ వ్యవస్థను పరామర్శిస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు రాయలవారు.దేవుడున్నాడని నమ్మేవారు, ప్రతి జీవిలోనూ దేవుడిని చూసేవారు, భగవంతుడు కూడా ప్రత్యక్షముగానో, నిదర్శనంగానో మాట్లాడి, ఆజ్ఞలు జారీచేస్తే ఆచరించే అర్చకులు, ఆ అర్చకులను గౌరవించే, వారి ఆజ్ఞలను అమలుచేసే దేవాలయ అధికారులు,

తమ జీవితాలను కేవలం దేవాలయసేవకు తద్వారా దేవునిసేవకు, ఏ ఐహిక లాభాలను ఆశించకుండా అంకితం చేసిన పవిత్రాత్ములు, వీరందరి సమిష్టి కృషి, సేవల ఫలితముగా సమాజానికి ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విద్యనూ అందించే దేవాలయ వ్యవస్థ ఉన్నది ఆ రోజుల్లో! ఈరోజుల్లో దాదాపుగా లేదు, అదీ ఆనాటి, ఈనాటి సామాజిక శాంతియుత, అశాంతియుత వాతావరణానికి మూల కారణాలలో ఒకటి! ఎన్నడూ గుడికి పోనివాడు కూడా కేవలం సిఫారసులమీద దేవస్థానపాలకవర్గంలో అధికారిగానో,సభ్యునిగానో నియమింపబడుతున్నాడు ఈనాడు, చాలాచోట్ల! కులం కారణంగా దేవాలయానికి రాకుండా నిషేధింపబడుతున్నారుఅనేకులు అనేక సందర్భాలలో ఈనాడు! 

భక్తిఁ ద్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి కట్టిన పొరివిళంగాయగములు
నెసటిపోతలు గాఁగ నేర్చి నించిన చిరం తనపుశాలిక్షేమ తండులములు
వడిఁబెట్టి లో జీర గుడము సాఁబా లూన్పఁజెఁలగు సంబారంపు జింతపండు
పెల్లులోహండి కావళ్ళకొమ్ముల వ్రేలు గిడ్డి మొత్తము నేతిలడ్డిగలును
బెరుఁగువడియంబులును బచ్చివరుగు బేడ లురుతరాచ్యుత పూజోపకరణ పేటి కలును జాత్తిన చాత్తనికులము బలసి
విధినిషేధము లెరిగి తే మధురకేగె

పొరివిళంగాయగములు అంటే ఒకవిధమైన, తమిళదేశస్థుల తినుబండారాలు. వడిబెట్టి అంటే, మట్టి, యిసుక నలుసులు మొదలైనవి లేకుండా ఏరినవి. నేతిలడ్డిగలు అంటే మట్టితో చేసిన నేతిపిడతలు, కూజాలవంటివి.ప్రయాణములో దారిలో తినడంకోసమని తన భార్య భక్తిగా సిద్ధము చేసి ఇచ్చిన ప్రత్యేకమైన తినుబండారాలు, చక్కగా ఏరిన దాన్యసంబంధమైన ఆవాలు, మెంతులు, జీలకర్ర, బెల్లము, చక్కని చింతపండు, కావళ్ళకు వ్రేల్లాడుతున్న ఆవునేతిపిడతలు, పెరుగు వడియాలు, పచ్చి వరుగులు, వలిచిన (చాయ)పప్పు, అచ్యుతుని పూజోపకరణములు ఉంచిన పెద్ద పెద్ద పెట్టెలను తీసుకుని,  తమ తమ విధులను, తమకున్న పరిమితులను తెలిసినవారైన శ్రీవైష్ణవులు(చాత్తిన) చాత్తాదవైష్ణవులు తనను అనుసరిస్తుండగా బయలుదేరాడు విష్ణుచిత్తులవారు.

శ్రీవైష్ణవులు అంటే  ద్రవిడ ప్రబంధమును తెలుసుకుని, దానిని బోధించగలిగే, అర్చన, పూజ, నివేదనము మొదలైనవి అన్నీ చేసే అధికారము కలిగినవారు, గురుస్థానములో వుండి బోధ చేయగలిగినవారు, చాత్తాద వైష్ణవులు అంటే ద్రావిడప్రబంధాన్ని ఆ ధర్మాన్ని అనుసరించేవారైనప్పటికీ, దానిని బోధించడానికి, నివేదనము చేసి ఎవరికైనా సరే ప్రసాదముగా యివ్వడానికి,గురుపీఠమును ఎక్కడానికి పరిమితులు గలిగినవారు. వీరందరూ అనుసరిస్తుండగా, యిన్ని సంబారాలతో ధర్మయుద్ద విజయానికి బయలుదేరాడు విష్ణుచిత్తులవారు, అదీ యిన్నిరకాల వర్ణనలకు రాయలు పూనుకున్న కారణములోని మరొక మర్మము, ఎవరికి వారు తమ దైనందిన జీవితములో అనుసరించే విధివిధానాలకు ఏమాత్రమూ ఆటంకము లేకుండా ఏర్పాట్లు చేసుకుని మరీ ప్రయాణము చేయాలి. ఆహార విహారాలు, ఆధ్యాత్మిక, నైతిక సాధనలు ఎక్కడవున్నా, ఎవరికైనా ఏ మినహాయింపులూ యివ్వవు, వెళ్ళేది తీర్థయాత్రకే కదా, భగవంతుని సన్నిధికే కదా, కనుక పట్టింపులు అక్కర్లేదు,కాస్త అటూ ఇటుగా తిన్నా, ఎలా ఉన్నా పర్లేదు అనుకుని, ఆ సందర్భముగా మనకున్న చిన్న చిన్న అభిరుచులను,రుచులను తీర్చుకుంటాము మనము, అది కూడదు అని యిక్కడ సూచన. అంటే ఆలోచన, ఆధ్యాత్మిక, నైతిక జీవనము అనేవి ఎవరైనా, ఎన్నటికీ, ఎక్కడా మినహాయింపులు, రాజీ లేకుండా అనుసరించాలి అని!

యమనియమాది లభ్య ద్రుహిణాది జరన్మరుదిభ్య సంసృతి
శ్రమహర నామకీర్తన  ముర ప్రవికర్తన పాతకావలీ
దమన రమాంగనాకమన తామరసాయతనేత్ర భక్త హృ
ద్భ్రమతృణదాత్ర భూయువతిరంజన వర్ణజితాభ్రఖంజనా   

ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు. ఇభ్య అంటే ప్రభువు, పాలకుడు. సంసృతి అంటే పుట్టడం, చావడం అనే చక్రభ్రమణము కలిగిన సంసారము. దాత్రము అంటే కొడవలి, లవిత్రము. అభ్రము అంటే మేఘము. ఖంజనము అంటే కాటుక పిట్ట, కాటుకలాగానల్లగా ఉండే ఒక పిట్ట.

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగయోగమార్గముద్వారా  పొందబడేవాడా, బ్రహ్మ మరుత్తులు మొదలైన ఆది దేవతలకు ప్రభువైనవాడా, జననమరణాల చక్రబంధనము వంటి సంసారశ్రమలను దూరముచేసే పవిత్రమైన నామకీర్తన గలిగినవాడా, మురాసురుని హతమార్చినవాడా, పాపపు సమూహాలను నాశనంచేసేవాడా, లక్ష్మీదేవిని కామించువాడా, తామరదళములవంటి విశాలమైన, నాజూకైన, కించిత్తు ఎర్రనివైన కనులు గలవాడా, భక్తుల హృదయములలోని భ్రమలు అనే గడ్డిపోచలను తెగేసే కొడవలివంటివాడా,భూదేవికి ఆనందమును కలిగించినవాడా వరాహరూపా, శరీరకాంతిచేత గెలువబడిన మేఘమును, కాటుకపిట్టనుకలిగినవాడా, ఓ రమారమణా నీకు మంగళము అని ద్వితీయాశ్వాసమును ముగిస్తున్నాడు రాయలు.

అష్టాంగయోగముద్వారా తెలియదగినవాడు అంటే కేవల పాండిత్యము అక్కర్లేదు అని సూచన, కనుకనే విష్ణుచిత్తులను పాండితీ వాదానికి పంపాడు అని సూచన. దేవతలు ఎల్లరికీ ప్రభువు, వారినే శాసించి తన పనులను చేయించుకునేవాడు, విష్ణుచిత్తుని కూడా ప్రభువులా శాసించి తన పనిని చేయించుకుంటున్నాడు అని చమత్కారము. తామరదళములవంటి కించిత్తు ఎర్రనైన కనులను ఇంకొంచెం ఎర్రగా చేసి, దొంగకోపము నటించి, విష్ణుచిత్తుల చిత్తములోని సందేహాలను చిత్తుచిత్తుచేసినవాడు అని చిలిపి చమత్కారము. జనన మరణాది శ్రమలనే దూరము చేసేవాడు, ఈ మధురా ప్రయాణము, ఆ వాదన,ఆ తర్కము అనే శ్రమను తీర్చడం ఎంతలోపని? అని ఒక మెరుపువంటి విరుపు. భక్తుల హృదయాలలోని సంశయములనే లతలను ఖండించే కొడవలివంటి వాడు కనుకనే విష్ణుచిత్తుల సంశయాన్ని తొలగించి, నువ్వా వెళ్ళేది, వాదించేది, గెలిచేది, అన్నీ నేనే అని తేల్చిచెప్పి పంపిన ప్రభువు, కాటుక వంటి మత్స్యధ్వజుని అజ్ఞానమును
గెలిచినవాడు ఐన విష్ణుచిత్తుని హ్రుదయాకాశమును(అభ్రము) నింపిన నల్లనివాడు, లక్ష్మి(ఆండాళ్) స్వరూపిణి ఐన గోదాదేవిని కామించినవాడు ఐన శ్రీమహావిష్ణువును మంగళ పూర్వకముగా పొగిడి ద్వితీయాశ్వాసమును ముగిస్తున్నాడు రాయలు. ఈ చమత్కారపు సూచనలే కాక దివ్యమైన ధారతోకూడిన అంత్యానుప్రాసలకు రాయల కవిత్వములోని ఉదాహరణలకు ఈ పద్యము ఒక మచ్చుతునక, అచ్చుగా ఒక బెల్లపుతునక!

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.   

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు