గాంధీ ' వర్ధంతి ! '
గాంధీని ' తాత ' అనీ, నెహ్రూని ' చాచా ' అనీ సంభావించే తరం పిల్లలలోనే మా బాల్యమూ ఉండింది. ఎందుకోగానీ చిన్నప్పుడు నెహ్రూ అంటే బోలెడు ఇష్టం ఉండేది. నెహ్రూ మరణించాక ఆయన పేర ' అమర్ జవహర్ బాలానంద సంఘం ' అని మా మలక్ పేట కాలనీలో చుట్టుపట్ల ఇంటి పిల్లల్ని పోగేసి, నేను ఓ బాలానంద సంఘం పెట్టాను కూడాను.! రేడియోలో మా ' అమర్ జవహర్ బాలానంద సంఘం తరపున ' భారతదేశం-చైనా భూతం ' అని చైనా యుద్ధ సమయంలో ఓ నాటకం కూడా పిల్లల ప్రోగ్రాంలో ఇచ్చాం. అలాగే వినాయక చవితికి తొమ్మిది రోజులు మా కాలనీలో ఉత్సవాలు జరిగినప్పుడు, ఓ రోజు స్టేజి మీద మా బాలానంద సంఘం పిల్లలం ప్రదర్శనలు ఇచ్చేవారం.! నెహ్రూ గారికి గాంధీ ఇష్టుడు కాబట్టి గాంధీ కూడా ఇష్టుడే కానీ, ఎందుకో గాంధీ మీద నాకు మాత్రం పెద్ద క్రేజ్ వుండేది కాదు. ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎం.వీ.ఆర్. శాస్త్రి గారు ' మనమహాత్ముడు ' గ్రంధం చదివితే , గాంధీమీద చాలామందికి వున్న భ్రమలు పటాపంచలైపోతాయేమో. ! అది నాలుగైదు సంవత్సరాలక్రితం వచ్చిన పుస్తకం.
అయితే గాంధీని ద్వేషించడం అనేది ఎప్పుడూ లేదు. ' గాంధీయిజం ' ఒక తరాన్ని ఆకర్షిస్తే , ' గాంధీగిరి ' ఈనాటి తరంలోనూ ఆకర్షణీయమైన సంగతి మనమెరిగినదే ! అయితే కొన్ని కొన్ని విషయాల్లో గాంధీ నచ్చేవాడు. నిజంగా ఆయన అన్న - ' సత్యం ' అనేదానికి, మానవాళి అంతా అనుష్టించగలిగితే కావలసిందేముంది? అలాగే ' అహింస ' కూడానూ. ' ఒక చెంప కొడితే మరో చెంప చూపించమనడం ' అసమర్థతకు, పిరికితనానికీ పర్యాయంగా భావించే రోజుల ప్రపంచమాయె. అసలు భారతదేశం రెండు ముక్కలవడానికి గాంధీయే కారణమనీ, జిన్నాను ఆయన సమర్థించేవాడనీ అనేవారున్నారు. " విడిపోవడమే మంచిది కదా! కలిసి కలహించుకునేదానికన్నా , అంత:కలహాలతో అనుక్షణం రగిలే కంటే విభజన మంచిదే " అని సిద్ధాంతీకరించినవారూ వున్నారు.! అయితే విడిపోయినవారు ఎప్పటికీ శత్రువులే అన్న భావన సరికాదు.కానీ భారత-పాకిస్థాన్ లు శత్రుదేశాలనే భావన నేటికీ తొలగిపోయిందా చెప్పండి. విడిపోయిన వారు శత్రువులు కా(నక్క)ర(లేద)నీ , మైత్రీ భావంతో కలసి పురోగమించడమే మానవీయమనీ- ఇప్పుడు తెలుగువారు కూడా మరీ ముఖ్యంగా సంభావించవలసిన సంగతే కదా! ఏమంటారు?
సరే, గాంధీ గురించి కదూ ,మాటాడుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే అసలు కాంగ్రెసు పార్టీని రద్దు చేయమన్నాడు గాంధీజీ. ఆయన మాట ఎవరూ వినలేదు. అది పూర్తిగా రద్దయ్యే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి చిత్రంగా ! స్వాతంత్ర్యం వచ్చాక గాంధీజీ జీవించింది పట్టుమని అయిదునెలల పదిహేనురోజులంతే. జనవరి 30, 1948న హిందు మతం కు చెందిన నాథూరాం గాడ్సే యే సాయంత్రం 5.37 కు తుపాకీతో మూడు బుల్లెట్లు చాతీలో దిగేలా గాంధీని కాల్చి చంపాడు. నిజానికి తనది అలాంటి చావే కావచ్చని గాంధీజీ ముందే ఊహించాడు.
1947లో దేశంలో చాలాచోట్ల మతకల్లోలాల గాలులు వీచాయి. గాంధీజీ మాటలు పెడచెవిన పెట్టి సోదరులైన హిందూ ముస్లింలు ఒకరిపై ఒకరు కక్ష తీర్చుకోసాగారు. ఇద్దరికీ సఖ్యత చేయాలని ప్రయత్నించిన గాంధీ-యిద్దరికీ విరోధమైపోయాడు. ముఖ్యంగా కొందరు హిందువులు గాంధీజీని ముస్లింల పక్షపాతిగా పరిగణించసాగారు .ఆయనకు వచ్చే ఉత్తరాలలో కొన్ని ' మహ్మద్ గాంధీ ', ' జిన్నా బానిస ' ' మతోన్మాది ' అంటూ రాసాగాయి. తనపై వినపడుతున్న విమర్శ ఆయనకు ఆవేదన కలిగించింది. ప్రార్ధనా సమావేశంలో ఒకరోజున ఆ సంగతే ప్రస్తావించి ఆయన ఇలా అన్నారట-
" అందరు మత ప్రవక్తలు ప్రభోదించిన సత్య సందేశాలలోను నాకు నమ్మకం ఉంది. నా విషయమై దుష్ప్రచారం చేసేవారెవరి మీద కూడా నాకు కోపం కలగకుండా ఉండాలని, నేను దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హంతకుడి తుపాకీ గుండుకు నేను బలి అయినప్పటికీ కూడా - రామనామస్మరణ చేస్తూనే ప్రాణం విడుస్తాను. నన్ను హత్య చేసిన వ్యక్తిని నేను కోపంతో పల్లెత్తు మాటయినా అన్నట్లయితే నన్ను ప్రపంచం ఒక మోసగాడిగా జమకట్టవచ్చు. ఈరోజుల్లో ప్రపంచం మోసగాళ్ళతో నిండి వుంది. నేను మహ్మద్ గాంధీనో, జిన్నాబానిసనో, హిందూమత వినాశకుడినో, రక్షకుడినో నా మరణమే నిర్ణయిస్తుంది. పగ, ప్రతీకారం ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం మానేద్దాం. భగవానుని మనం మరచిపోవద్దు "ఏడాది తర్వాత ఆ రోజున గాంధీజీ చెప్పిన మాటలే నిజంగా నిజమయ్యాయి మరి.!
" భారతదేశం కాక మరే దేశమూ, హిందూమతం కాక మరేమతమూ-గాంధీజీలాంటి మహనీయుణ్ణి ప్రసాదించలేవు " అని వ్రాసింది ' లండన్ టైంస్ ' పత్రిక గాంధీజీ పరమపదించినప్పుడు. కానీ గాంధీజీ హిందువుగా కాక సర్వమతాల సారంగా సంభావించబడినందువల్లే ఆయనకు గౌరవం. మిస్ మాజ్ రాయ్డన్ అనే ఆవిడ " ఈరోజున ప్రపంచంలో వున్న ఉత్తమమైన క్రైస్తవుడు ఒక హిందువు. " అన్నది గాంధీజీ గురించి. అహింసా సిద్ధాంతానికి జీసస్ జీవితం ఓ గొప్ప ఉదాహరణ అనేవారు గాంధీ. ఇక ఇస్లాం లోని నిరాడంబరత, బీదలపట్ళ దయాభావమూ మార్గదీపికలనేవారు.' ఆయన ' వైష్ణవ జనుడు 'అని మాత్రం గ్రహించనివారున్నారు.
ఇంకేమి కావాలే-ఇంకేమి చేయాలె
బ్రతికినన్నాళ్ళు నిను బాపు అని పిలిచితిమి
చచ్చిపోయిన నిన్ను జాతిపిత చేసితిమి .ఇం.
పెక్కుభంగల నిన్ను చెక్కినిలవేసితిమి
వేడ్కతో ఇంటింట వ్రేలాడదీసితిమి .ఇం.
నీ పేరుతో టోపి నిత్యమైపోయినది
నీ సూత్ర భాష్యమే నిలువెల్ల దోచినది .ఇం.
అంటూ ' ఓ గాంధీ ! ' అంటూ కాళోజీగారు రాసిన కవిత నాకు భలే ఇష్టం. గాంధీ శతజయంతి 1969 లో జరిగింది. అప్పటికి మూడేళ్ళుగా నేను ' యువచిత్ర ' లిఖిత మాస పత్రిక నిర్వహిస్తున్నాను. అక్టోబర్ 69 యువమిత్రను గాంధీ శతజయంతి సంచికగా తెచ్చాం.
పి.మురళీధరరావు అని మిత్రుడి చేత ముఖచిత్రం వేయించాను. గాంధీపై ' చూస్తున్నావా బాపూ ! ' అని మిత్రుడు వి. మధుసూధన రావు ( విద్యశ్రీ ) సుదీర్ఘ కవిత రాశాడందులో. గాంధీపై ప్రత్యేక వ్యాసాలూ, కవితలూ, చిత్రాలూ, సూక్తులూ సంతరించాం అందులో. గాంధీ రవీంద్రుడికి రాసిన ఓ ఉత్తరం ' భవన్స్ జర్నల్ ' నుండి అనుకుంటా సంపాదించి పెట్టాం. బేసిక్, వయోజన విద్యల మీద గాంధీకి ధృఢమైన అభిప్రాయాలే ఉండేవి. 25.8.1946 హరిజన్ పత్రికలో గాంధీ ' నేనే మంత్రినయితే ' అంటూ రాసిన వ్యాసం అనువాదాన్ని మా లిఖిత పత్రిక సంచికలో పొందుపరిచాను. ఆ సంచికను గాంధీ స్మారక నిధి గ్రంధాలయంలో పదిరోజులుంచినప్పుడు దాని నిర్వాహకులు గాంధేయవాది శ్రీ కోదాటి నారాయణ రావుగారు ఎంత సంతోషించారో. !.. ' కావ్యాంజలి ' పేర రెండు సంపుటాలతో గాంధీజీపై కవిత్వం గాంధీ శతజయంతి సంవత్సరం సందర్భంగా పూనుకుని ప్రచురించారు. గాంధీపై నేనూ అప్పటి భావజాలంతో రెండు మూడు కవితలు రాసాను గానీ, ' కావ్యాంజలి ' కి ఎందుకో కోదాటి వారు అడిగినా ఇవ్వనేలేదు.
గాంధీగారు మరణించి నేటికి 67 సంవత్సరాలు నిండాయి. నా వయస్సు 63 ఏళ్ళు. గాంధీగారి గురించి వినడమే గానీ ఆయనను చూసే వీలు లేకుండా - ఆయన పోయిన మూడేళ్ళ తరవాత గానీ నేను పుట్టనేలేదు కదా!
మహాత్ముడు, జాతిపిత, అంటూ గాంధీని మాముందూ, మా తరం గొప్పగా సంభావించింది. ' గాంధీనామం మరువాం మరువాం ' అంటూ భజనలు చేసినవారున్నారు. గాంధీపై బుర్రకథలు, తోలు బొమ్మలాటలు ప్రదర్శించేవారు.
" భారత స్వాతంత్ర్య జ్యోతి వెలిగించిన నీశక్తి
దిశలు దాటి ప్రవహించెను జోహారంది ఈ జగతి "
అని అల్లం రాజు వెంకటసుబ్బారావు గారనే ఆయుర్వేద వైద్య నిపుణులైన నాకు తాతగారు అయ్యే ఆయన రాసిన ఓ పాట - చిన్నప్పుడు పదేపదే ' గాంధీ' అనగానే నాకు గుర్తొచ్చేది.! అటెన్ బరో తీసిన ' గాంధీ ' చిత్రం ఆయన మహనీయతను విశదపరిస్తే, సంజయ్ దత్ ' గాంధీగిరి ' కొత్తతరానికి గాంధీకోణాన్ని అందిస్తే, ఎం.వీ.ఆర్. శాస్త్రి గారి ' మనమహాత్ముడూ పుస్తకం గాంధీగురించిన సత్యావిష్కరణలు చూపెట్టింది.ఏది ఏమయినా ' గాంధీ ' అనే రెండక్షరాలు భరతభూమిపై చెరగని శిలాక్షరాలు. ఈ 67వ వర్ధంతికి గాంధీకి ఇదొక భావస్మృతి అంతే..!