సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevnam

ఆముక్తమాల్యద'

శ్రీ క్షితి నీళా వర! దను
జోక్షప్రాణహర!   దంష్ట్రికోత్క్రుత్త హిర
ణ్యాక్షక్షపాచర!క్రుపా
వీక్షా ద్రుత బాహులేయ వేంకటరాయా

లక్ష్మీదేవికి, నీళాదేవికి భర్త ఐన వాడా, వృషభ రూపములో ఉన్న రాక్షసుని సంహరించిన వాడా (దనుజోక్షప్రాణహర)దంష్ట్ర చేత ఉత్క్రుత్తము చేయబడిన హిరణ్యాక్షుడనే క్షపాచరుని కలిగినవాడా(కోరచేత  ఖండింపబడిన హిరణ్యాక్షుడు అనే నిశాచరుడు అంటే రాక్షసుని కలిగినవాడా)క్రుపాకటాక్షముచేత ఆదరింపబడిన బాహులేయుడు అంటే కుమారస్వామిని కలిగినవాడా, వేంకటాచలరాయా వినుమని ఆముక్తమాల్యదలోని మూడవ ఆశ్వాసమునుప్రారంభము చేస్తున్నాడు శ్రీకృష్ణ దేవరాయలు.ఆముక్తమాల్యదలో కఠినమైన పాండితీ వాదానికీ, ఉపాఖ్యానాలకూ నిలయమైనది, విశేష ఆధ్యాత్మిక రక్తి కలిగినవారికి మాత్రమే రుచించేదీ ఐన ఈ మూడవ ఆశ్వాసములో కొన్ని పద్యాలను మాత్రమే పరిశీలిద్దాము,కథకుఅవసరమైనవి కనుక, ప్రతి ఆశ్వాసాన్నీ ఎంతోకొంత చర్చించుకొనడం మన లక్ష్యము కనుక.సమస్త సన్నాహాలతో, సర్వేశ్వరునిపై భారంవేసి మధురానగరమునకు వెళ్ళిన విష్ణుచిత్తుడు

నిత్యంబున్బ్రతిహారి వాద మగుటన్విజ్ఞప్తి లే కంపఁ దా
నత్యూర్జస్వలుడౌట భూపతియు సభ్యవ్రాతమున్శంకమైఁ
బ్రత్యుత్థానము జేసి మ్రొక్కఁగ సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్జ్వలరాజ దత్త వర రత్న స్వర్ణ పీఠస్థుడై

మత్స్యధ్వజుడు తనకు తగిన దైవమును చూపినవారికి బహుమానమును ప్రకటించిన నాటినుండీ ప్రతిరోజూ పండితులు రావడం పాండితీ వాదాలు జరగడం చూస్తున్నవాడు కనుక విష్ణుచిత్తులవారిని చూడడంతోనే ఈయన కూడా పాండితీ వాదము కోసమే వచ్చాడు అని గ్రహించి 'తమరి దర్శనము కొరకు ఎవరో పండితుడు వచ్చాడు ప్రభూ' అని విజ్ఞప్తి చేయకుండానే విష్ణుచిత్తులవారిని లోపలికి పంపించాడు. యిందులో ఒకచమత్కారము ఉన్నది. లోపల మహారాజు తన సభలో జరుగుతున్న వాదోపవాదాలను విని విసుగు చెందిఉన్నాడు,ఎవరి వాదము చేతా ఆయనకు సంతృప్తి కలుగలేదు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో ఈ ప్రతీహారికూడా విసుగు చెంది ఉన్నాడన్నమాట, అందుకే వచ్చిపోయే వాళ్ళను చూస్తూ కూర్చునే స్థితికి వచ్చినిర్లిప్తముగా తయారయ్యాడు, అదీ సూచన. అప్పటికే మహావిష్ణు కరుణా ప్రభావము చేత 'అత్యూర్జస్వలుడు'అంటే మహా తేజస్సును కలిగినవాడైనాడు విష్ణుచిత్తులవారు, కనుక మహారాజు, యితర సభ్యులు ( సభికులు అని ఎక్కడా వాడకూడదు, రాయల సాహిత్య పరిశీలనలో అసలు వాడకూడదు, సభికులు అంటే 'గాడిదలు'అని అర్ధం, ఈనాడు ప్రతిసభలోనూ సభికులు అనే వాడుతున్నారు, బహుశా అదే సమంజసము అనో, లేక తెలియకనో!) అందరు కూడా ఈ వచ్చినవారెవరో మహాత్ముడు అని భావించి లేచి నిల్చుని మ్రొక్కగా,వెళ్లి, సభమధ్యలో ఉన్న ఎత్తైన, స్వర్ణ మయమైన సింహాసనాన్ని మహారాజు చూపించగా, అందులో కూర్చున్నాడు. ప్రతీకాత్మకంగా విష్ణుచిత్తుల వారి భావివిజయాన్ని సూచిస్తున్నాడు రాయలు.

కతిపయోక్తులకే వారి ప్రతిభఁ దెలిసి
నగవు తళుకొత్త రాజు నెమ్మొగము జూచి
'యీవు మాధ్యస్థ్యమున నున్న నేముఁ గొన్ని
నొడివెదము మాట'లని తదనుజ్ఞ వడసి

కతిపయోక్తులకే అంటే కొన్ని మాటలలోనే వారి ప్రతిభను తెలుసుకున్నాడు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా అన్నం అంతా ఉడికిందీ లేనిదీ తెలిసికొనడానికి, లీలగా 'అమాయకులు!' అన్నట్టు నవ్వుతూ రాజు ముఖమును చూస్తూ ' మహారాజా! తమరు మధ్యవర్తిగా అంటే తటస్థముగా ఉంటానంటే నేను కొన్ని పలుకులు పలుకుతాను అని, దానికి మహారాజు అనుమతించగా ప్రారంభించాడు విష్ణుచిత్తులవారు తన వాదాన్ని. ఆ పాండితీ వాదము మహారాజు తనకు మోక్షమును ప్రసాదించ గలిగిన దైవమును చూపించడం కొరకే ఏర్పాటు చేశాడు కనుక, అయన సంతృప్తి చెందడమే ప్రధానము కనుక, సహజముగా ఒక పండితుడు మరొక పండితుని వాదన ఎంత సత్యమైనా ఉన్నతమైనా అంగీకరించడు కనుకా, మహారాజునే మధ్యవర్తిగా ఉండమని కోరి, అంతవరకూ తను జన్మలో ఎరుగని లౌక్యాన్ని ప్రదర్శించాడు విష్ణుచిత్తులవారు, విష్ణుమాయ!

అంతవరకూ వాదన చేస్తున్న పండితులను ఒక్కొక్కరినే 'మీరేమన్నారు? మీరేమన్నారు? అని వారి వాదనలను విని, ఒక్కొక్కరి వాదనలలోని లోపాలను వారికి వారే గుర్తించి మౌనము వహించేట్లు చేసి,ఒక్కొక్కరి వాదాన్నే చిరునవ్వుతో, తొట్రుపాటు లేకుండా, మిగిలినవారు మెచ్చుకునే విధముగా ఖండిస్తూ ఒకరి వాదాన్ని వింటున్నప్పుడు వేరే ప్రక్కవారి మాటలను ఆలకించకుండా అంటే తన ధ్యాసను తన ఎదురుగా ఉన్న వాది మాటలపైననే నిలుపుతూ, అందరినీ సమాధానపరచి, మరలా మొదలు ప్రారంభించిన పండితుని వద్దకు వెళ్లి, అక్కడినుండీ వరుసగా తన ఉపమానాలను వేదములనుండీ,స్మ్రుతులనుండీ, ధర్మ శాస్త్రములనుండీ, బ్రహ్మసూత్రముల నుండీ వినిపిస్తూ ఒక్కొక్కరినీ మొదలు వారి వారి వాదాలను ఖండించి తర్వాత తన వాదాన్ని వినిపించి, నిరూపించి అందరినీ ఓడించాడు.ఒక్కొక్క పండితుడు ప్రస్తావించిన దేవీ దేవతలకు కూడా ఆరాధ్యుడు శ్రీ మహావిష్ణువే అని నిరూపించాడు.

అన్నిటికీ ప్రకృతియే కారణమనే సాంఖ్య వాదాన్ని సమర్ధించిన వారిముఖాలను 'ఈక్షత్య' మొదలైన సూత్రములతో ఖండించి, పరాభవ భారముతో విక్రుతముగా చేశాడు. నేనే ఈశ్వరుడిని అని వాదించే అద్వైతులకు 'భోగమాత్ర' మొదలైన సూత్రములతో రోగం కుదిర్చాడు. మీమాంసకులు మీసములు దించుకునేలా 'ఫలమత' మొదలైన సూత్రాలను ఫలవంతములుగా ప్రయోగించాడు. పరమాణువులే ఉత్పత్తికి కారణం అని పిడికిళ్ళెత్తి వాదిస్తున్న వారి కణుపులను 'శాస్త్ర యోనిత్వాత్' మొదలైనసూత్రములతో విరగ్గొట్టాడు. శూన్యవాదులైన బౌద్ధులకు  'నిత్యో నిత్యానాం' అనే శ్రుతిపలుకులతో బుద్దిచెప్పాడు.కంటికి కనిపించే, శక్తివంతుడైన రాజే దైవము అని పలికే ప్రత్యక్ష వాదులైన చార్వాకుల చపలత్వాన్ని 'అనుపపత్తేః న' అనే సూత్రముతో చక్కదిద్దాడు. మహావిష్ణువు కన్నా మిన్న ఐన దైవము, విశిష్టాద్వైతము కన్నా మిన్నయైన మతము లేదని సర్వ సమ్మతముగా వాదించి, ఓడించి, గెలిచాడు.అద్భుతంగా పది పద్యాలలో విష్ణుచిత్తులవారి వాదనా పటిమను, తన ఆధ్యాత్మిక సంపదనూ వెల్లడించాడు రాయలవారు. యిది ఒక ప్రత్యేకత అయితే, నిత్యమూ తన సభలో పెద్దన, రామకృష్ణుడుయితర ఉద్దండులతో, తన ఆధ్యాత్మిక గురువైన వ్యాసరాయలతో జరిగే సాహిత్య, ఆధ్యాత్మిక చర్చల,వాదోపవాదాల అనుభవముతో, తన విశేష లోకపరిశీలనానుభవముతో శాస్త్ర చర్చ జరగవలసిన విధానాన్ని, ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా గుర్తింపు పొందిన 'కమ్యునికేషన్ స్కిల్స్'  అని పిలువబడుతున్న సంభాషణా చాతుర్యాన్ని వర్ణించాడు రాయలవారు. చర్చలో ఆవేశపడకూడదు, ఎవరైనా, ఎవరితోనైనా, ఏ అంశము గురించి అయినా, చిరునవ్వును చెదిరిపోనీయకూడదు, ఎవరితో మాట్లాడేప్పుడు వారి మీదనే ధ్యాసను పెట్టాలి, శ్రద్ధగా వినాలి, ఎదుటివారి వాదనలోని లోపాలను మొదలు వారే గుర్తించేలా చేయాలి,ఆత్మవిశ్వసముతో, స్పష్టముగా, సరైన ఉదాహరణలతో తన భావాలను ప్రకటించాలి. వారు నోళ్ళెత్తకుండాచేయాలి, అదే చేశాడు విష్ణుచిత్తులవారు. అనంతరం ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. ఖాండిక్యుడు,కేశిధ్వజుడు అనే నిమివంశానికి అంటే జనకుని వంశానికి చెందిన యిద్దరు మహారాజుల సంవాదాన్ని చెప్పడం ప్రారంభించాడు.

(కొనసాగింపు వచ్చేవారం)***

వనం వేంకట వరప్రసాదరావు.     

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు