నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి



అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’....

....తనివి తీరనూ లేదు... నా మనసు నిండనూ లేదు....


...ఔను, మా అమ్మతో నేను గడిపగలిగిన సమయం, పంచుకోగలిగిన  జీవితం,  చాల్లేదనిపిస్తుంది...

అమ్మ నాకు పంచిన ప్రేమ-వాత్సల్యాలకి ... ఆమె ఋణం తీర్చుకోలేనని తెలుసు...........

‘అమ్మ’  అనే వ్యక్తి  గురించి  రాయాలన్నా, చెప్పాలన్నా జీవితకాలం  సరిపోదేమో!

’అమ్మ’ ఆరాధన అన్నివేళలా  జరిగేదే.... ఆమె ప్రేమలని, త్యాగాలని మనస్సులో పదిలపరుచుకున్నా  చాలు.. అవి ఆశీస్సులే అవుతాయి...

*********

అదలా ఉంటే,  మీతో పంచుకోవాలనుకున్నకొన్ని ‘అమ్మ’ సంగతులు......

మామూలుగా అయితే,  ప్రతియేడు  ‘మదర్స్ డే’ కి,‘ఆస్టిన్ ఇండియాసొసైటీ’ వాళ్ళ  పిక్నిక్ ఉంటుంది.  ఆయేడుమాత్రం, రిక్రియేషన్ సెంటర్ లో  ‘‘మదర్స్ డే లంచ్”ఏర్పాటు చేసుకున్నాము.  మా వారు హాస్పిటల్ రౌండ్స్ చేసుకొని, నేరుగా లంచ్ కే వస్తాననడంతో, ఆ వేడుకకి,నేను కాస్త ముందుగానే బయలుదేరాను.  ఎప్పటిలా కార్ స్టార్ట్ చేస్తూనే, నా ఓల్డ్ సాంగ్స్ సి.డి ఆన్ చేసాను.....

....ధరణికి గిరి భారమా?

గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా?

కనిపెంచే తల్లికి పిల్ల భారమా?...

నా జ్ఞాపకాల్లో ఉండిపోయిన పాట.నాకు  ‘ఓల్డ్ సాంగ్స్’  అంటే ఇష్టం.  నా చిన్నపుడు రేడియోలో తరచు వినవచ్చిన ఈ సాంగ్ ‘నా ఫేవరేట్ సాంగ్స్ లిస్టు’ లో చేరేప్పటికే పాత పాట...

అప్పట్లో, మా అమ్మని అర్ధం అడిగి తెలుసుకున్నాను.  ఆడపిల్ల  జీవితంలోని ఒక్కో మలుపులో ఒక్కో ప్రాధాన్యతని,  ఒక్కో రకమైన అనుభూతిని, ఒక్కో రకమైన స్పందనని తెలియజేస్తుంది, ఆ పాటలోని సాహిత్యం....

పాట వింటూ ‘అమ్మ’ ఆలోచనల్లో మునిగిపోయాను.

‘అమ్మ’ అనే ఆ రెండక్షరాల్లో ఉన్న మహత్యమేమో!   పసితనంలో తల్లిపై ఆధారపడటాలు.వివాహమయ్యాక  తల్లినవ్వాలన్న తాపత్రయాలు.తల్లయ్యాక మమకారాలు, అనుభూతులుగా సాగుతుంది కదా, ఓ  ఆడపిల్ల జీవితం’అనుకుంటూ  క్లబ్-హౌజ్  చేరేప్పటికి  నా ఓల్డ్ సాంగ్స్  సిడి  కూడా మళ్ళీ  స్టార్టింగ్ పాయింట్ కి వచ్చింది.

**

ఇండియా నుంచి వచ్చిన మాలో కొందరి మాతృమూర్తుల చేత ‘మదర్స్ డే’ కేక్ కట్ చేయించి సన్మానించుకున్నాము.  పెద్దవాళ్ళని సరదాగా ఆటలు ఆడించి పాటలు పాడించాము.

పసిబిడ్డని వీపున మోస్తూ టీ ఎస్టేట్ లో పని చేస్తున్న ఓ తల్లి చిత్రం కవరు గా వేయించి అందరికీ  పర్సనల్ డైరీలు కానుకగా ఇచ్చుకున్నాము..   ఆ చక్కని చిత్రం కింద ‘అమ్మతనం అద్భుత వరం’ అని రాసుంది.

ఇక జరగబోయే  కార్యక్రమమం లోని తరువాతి అంశం షడ్రుచుల విందు.

ఫుడ్ సర్వ్ చేసుకొని,  మా పక్కింటి కారుణ్య, వాళ్ళ అమ్మగారు లక్ష్మీకాంతం గారి వద్దకు వెళ్లి కూర్చున్నాను.లక్ష్మీకాంతం గారు నవలా రచయిత్రి.మాటకారి.   ఏ విషయం గురించైనా  చక్కగా ప్రసంగిస్తారని పేరు.  కాసేపటికి అందరూ ఆమె చుట్టూ చేరారు.  తలో ప్రశ్న వేసారామెని.. అమె రాస్తున్న నవల గురించి చెప్పమని అడిగాము.

“ఏముందమ్మా, ఇదే విషయం..... ఓ తల్లి, ఆమె ఐదుగురు సంతానం.  నలుగురు కడుపున పుట్టినవాళ్ళు. ఒకరు పెంచుకున్న బిడ్డ.  వారి కథనే నవలగా రాస్తున్నాను.


నవల  పేరు ‘అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’,” అన్నారామె.

“టైటిల్ ఆశక్తి కలిగించేలా బాగుందండీ... కొంచెం వివరిస్తారా అభ్యంతరం లేకపోతేనే,” అడిగాను....

నవలలోని అమ్మది ఓ భిన్నమైన ఆలోచన.   ‘నిజానికి చేతికున్న ఐదు వేళ్ళు సమానం కాదుకదా! అయినా ఆ చేతికి  అన్ని వేళ్ళు సమానమే...అలాగే  బిడ్డల్లో ఎవరెలాంటి వారైనా, తల్లి పట్టించుకోదు. బిడ్డలందరూ ఆ తల్లికి సమానమే.  ఆమెని  ప్రేమించి ఆదరించే పిల్లలున్నట్టే, అశాంతికి గురిచేసి బాధ పెట్టే వారూ ఉంటారు.  అయినా ఆమె అందరినీ ఒకేలా ఆదరిస్తుంది. ఆ కాన్సెప్ట్చుట్టూ తిరుగుతుంది ఇతివృత్తం,” అంటూ ముగించారామె.

**

మా వారు లంచ్ కి రాలేక పోతున్నానని  ఫోన్ చేసాక అందరికీ చెప్పి, ఇంటికి బయలుదేరాను... పాత హిందీ పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాను.

ఇన్నేళ్ళగా అమెరికాలో ఉంటూ ఎంతో చూశాను.  మరెంతో నేర్చుకున్నాను.  తల్లి, తల్లి ప్రేమ విషయంగా ఓ రెండు సంఘటనలు మాత్రం నా మనసులో ఉండిపోయాయి. ఎన్నేళ్ళయినా ఇప్పుడు జరుగుతున్నట్టుగా మెదులుతాయి నాలో ముద్రించుకుపోయిన ఆ సంఘటనలు. మా వారు,మొదట్లో ఓ  ప్రైవేట్  హాస్పిటల్లో,  జాబ్ లో చేరినప్పటి విషయం.  ఆ హాస్పిటల్  సి.యి.వొ – వోనర్ ఓ తెలుగు సర్జన్.  వాళ్ళ కొత్తింటి గృహప్రవేశం కి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మేము తప్ప మిగతా వారంతా అమెరికన్స్ , నార్త్ ఇండియన్స్.  తెలుగు వాళ్ళం మాత్రం మేము ఒక్కళ్ళమే.

వారి నూతన గృహం చాలా అందమైన భవంతి అనవచ్చు.. గ్రాండ్ గా ఉంది ఇల్లు.  మాకు ఇల్లు చూపిస్తూ, కాస్త దూరంగా వేరుగా ఉన్న ఓ విశాలమైన గది లోనికి తీసుకువెళ్ళారు.

ఆ పొందికైన గదిలో ఓ పెద్దావిడ సోఫాలో కూర్చుని టివి చూస్తున్నారు.  సర్జన్ గారి  అమ్మగారట.  నేను ఒక్కతినే తెలుగుదాన్నవడంతో,  ఓ నిముషం పలకిరించి, యోగక్షేమాలు అడిగాను.

ఆమె గదినుండి  బయటకి వస్తుంటే, సర్జన్ గారు నాతో మాట కలిపారు.  “నేను పెళ్ళి చేసుకొన్న అమ్మాయిని చూశారుగా తెల్లగా అందంగా ఉంటుంది.  కాశ్మీరీ బ్రాహ్మిన్, శాఖాహారి.  మంచి కల్చర్ ఉన్న వాళ్ళు.  మా అమ్మకేమో చదువు లేదు, దొడ్డుగా మోటు మనిషి, నలుగురితో మెలిగే సంస్కృతి తెలియదు.  వాళ్ళందరితో కలవాలంటే ఇబ్బంది కదా! అందుకే అన్ని సౌకర్యాలు అమర్చి,అన్ని వసతులు కల్పించి, ఈ గది లోనే ఉండమన్నాను,”  అన్నాడు మా సర్జన్ బాస్, తెలుగులో నాతో.  ఆయన అతిశయానికి, ఆలోచనకి విస్తుపోయాను.  గది ఏర్పాటు బాగానే ఉన్నా,  అందుకు ఆయన కారణాలు నన్ను ఆలోచింపజేసాయి.

**

ఆ సంఘటన జరిగి రెండేళ్ళయ్యాక, ఓ సారి  మా వారి కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు,  అమ్మగారు  ఎలా ఉన్నారని సర్జన్ గారినే అడిగాను. వృద్ధురాలైన తల్లికి  మతి మరుపు ఎక్కువయ్యిందని,  పైగా రాత్రిళ్ళు కూడా నిద్ర పోకుండా ఇల్లంతా తిరుగుతుండడం వల్ల, గదికి గేటు - అంటే కటకటాలు పెట్టించానని చెప్పారు. “వృద్ధాశ్రమానికి మాత్రం వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను.ప్రతి రోజు ఒక్కసారి వచ్చి నాకు కనపడు కన్నా, నాకంత చాలు,” అని వారి అమ్మగారు ఆయనతో అన్నదని కూడా ఆయనే గర్వంగా చెప్పారు.

ఆవిడని చూడాలనిపించి ఓ రోజు సర్జన్ గారి అనుమతితో, వాళ్ళింటికి  వెళ్లాను. నే వెళ్ళేప్పటికి, ఆ పెద్దామె  అప్పుడే లేచి సాయంత్రం వేళ టీ తాగుతున్నారు.  వెళ్ళి దగ్గర కుర్చున్నాను.

కబుర్లాడుతూ మాటల్లో,  “ఈ మధ్య రాత్రిళ్ళు గుండెల్లో మంటగా ఉండడంతో  కాస్త లేచి ఇంట్లో,  అటూఇటూ నడుస్తుంటే,  పిల్లలకి, కోడలు పిల్లకి నచ్చలేదమ్మా.  చీకట్లో నన్ను చూసి,పిల్లలు జడుసుకున్నారు కాబోలు, అందుకే ఈ గేటు పెట్టించారు.  ఇక అటుగా వెళ్ళకుండా గుర్తు పెట్టుకోవచ్చు.  ముట్టుకుంటే మాసిపోయేలా అందంగా ఉంటారు నా మనమరాళ్ళు.  వాళ్ళని ఎత్తుకోవాలంటే నా కసలు చిక్కరుగా.  రోజూ నా గది వరకూ పరుగులు పెడుతుంటారులే.  ఒక్కసారైనా కనబడతారు నాకు,” అంది ఆ తల్లి.

అవిడమాటలు విని బాధ కలిగింది. ‘హైదరాబాదు లాంటి నగరంలో ఓ మంచి వృద్ధాశ్రమంలో చేరినా, ఎంచక్కా, హాయిగా స్వేచ్చగా తిరుగుతూ, అందరితో మాట్లాడుతూ ఉండచ్చు  కదా’అనిపించింది.  పైగా ఆమెని దగ్గర పెట్టుకుని చూసుకుంటానని,  సికందరాబాదులో ఉండే ఆమె కూతురు అడుగుతూనే ఉంటారని కూడా ఆవిడ నుండే విన్నాను’  అనుకున్నాను.   అదే అభిప్రాయం ఆవిడ దగ్గర వ్యక్తపరిచాను.

“అలా వెళ్తే, నాకు నెలవారిగా వచ్చే సోషల్ సెక్యురిటీ డబ్బులోంచి అక్కడ వృద్ధాశ్రమం వాళ్ళకి ఇవ్వాలటగా? అందుకే ఆ వచ్చే డబ్బేదో నా మనమరాళ్ళకి  అట్టే పెట్టచ్చని,ఇక్కడే ఉంటానన్నాను,” అంటున్న ఆమెని చూసి నా మనసంతా గుబులుతో నిండిపోయింది. ఆమెలోని ఆ మాతృత్వపు ప్రేమల పొరల్లోకి తొంగి చూడగలిగాననిపించింది.  ఆవిడ లోని మమతలకి మనస్సులోనే జోహార్లు అర్పించాను.

తన బిడ్డ రోజుకో సారైనా కంటబడితే చాలనుకొనే తల్లి.  అందుకోసం తన ఉనికిని, స్వాతంత్ర్యాన్ని కూడా త్యాగం చేసి,  ఆగర్భ శ్రీమంతులైన బిడ్డలకి ఇంకా తన వంతు సంపదలు అందించాలన్న ఆవిడ తాపత్రయం అర్ధమయ్యి నవ్వొచ్చింది కూడా.

లక్ష్మీకాంతం గారి ‘అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’ గుర్తుకొచ్చింది... ఇటువంటి తల్లీ-కొడుకుల సంబంధం ఉండుంటుందా? ఆ నవలలో...

.**

అలాగే మా పరిచయస్తురాలు, ‘వినీత’ ది కూడా ఓ విభిన్నమైన కథనమే....మాకు రెండు వీధుల అవతల, మా సబ్-డివిజన్ లోనే ఉంటారు వాళ్ళు.

నేను కంప్యూటర్స్ లో అసోసియేట్ డిగ్రీకి చదువుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన.ఓ రోజు క్లాస్ అయ్యాక ఇంటికి డ్రైవ్ చేస్తుంటే, భీభత్సంగా వాన, ఈడుపు గాలి.  డ్రైవింగ్ కూడా అసాధ్యమనిపించింది.  ఎదురుగా నాలుగు రోడ్ల కూడలిలో తడిసి ముద్దవుతూ ‘వినీత’ హడావిడిగా పరుగు లాంటి నడకతో వెళుతుంది.  ఆమె కార్ డ్రైవ్ చెయ్యదని తెలుసు. ఆమె భర్త జార్జ్ ఆమెని రోజు పనికి తీసుకెళ్ళి తీసోకొచ్చేవాడు. ఆమె చాలా కాలంగా రిజిస్టర్డ్ నర్స్ గా స్టేట్ ప్రిజన్ హాస్పిటల్లో పనిచేసి ఈ మధ్యనే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొంది.

‘ఏమిటిలా ఈవిడ తుఫానులో ఇలా పరుగులు’  అనుకుంటూ ముందుకి వెళ్ళి కార్ ఓ పక్కగా ఆపుకొని,  కారు నుండి దిగి, బిగ్గరగా పిలిచాను.  గాలి హోరుకి నా గొంతు నాకే వినబడేలా లేదు.  చేసేది లేక వానలో ఆమె వెనకే పరుగు పెట్టి ఎలాగో చేయందుకొని నా కార్లోకి తెచ్చాను.   ఇద్దరమూ ముద్దయిపోయి ఇల్లు చేరాము.  కార్లో గమనించాను, ఆమె ముఖాన వర్షపు నీళ్ళు కావు, కన్నీళ్ళని.   మా ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చుంది వినీత. 

ఎంతో బాధగా చెప్పింది విషయం. ఇరవై నాలుగేళ్ల కొడుకు ఇంజినీరింగ్ చదువులో ఉన్నాడుట. వాడి అలివి కాని కోరికలన్నీ తీరుస్తూ చదివిస్తున్నారుట.  అతని విఫలమైన ప్రేమతో మొదలైన సమస్య చిలికి గాలి వానలా అయ్యి, అదుపులేని కోపంగా మారి, అమ్మని కొట్టడం వరకు వచ్చిందట.  చదువు మానేసి ఇంట చేరి తమని బెదిరిస్తూ బయట ఇతర దేశస్తులతో, పోలిస్ తో గొడవలు తెచ్చుకొని జైలు పాలయ్యడట కూడా.   అష్టకష్టాలు పడి డబ్బు గుమ్మరించి బయటకి తెచ్చి,  బతిమిలాడి, బామాడి, కాళ్ళు  పట్టుకొని మనస్తత్వవేత్త దగ్గరికి తీసుకు వెళ్ళగలిగారట.  మందులు వేసుకొంటే నయమయ్యే అవకాశం ఉన్నా తమని చిత్రవధలు పెడుతూ, మందు వేసుకోవడం లేదని వాపోయింది వినీత.

“ఈ రోజు ఇంతటి వానలో..,” అని సంశయించాను.  “ మీ వారు ఇంట్లో లేరా?”  అని అడిగాను. భర్త జార్జ్ పొద్దుటే  పనికి వెళ్ళిపోయాక, అత్యవసరంగా తనకి పాటలు వినడానికి స్పీకర్స్ కావాలని మంకు పట్టు పట్టాడట కొడుకు.  చేసేది లేక, వాడికి కోపం వస్తదేమో అన్న భయానికి ఆ వర్షంలోనే బయలు దేరారట.  వాల్మార్ట్ లో స్పీకర్స్ కొని ఇంటికి బయలు దేరి సగం దూరం వచ్చాక, అకారణంగా పోట్లాట పెట్టుకొని తనని దారిలోనే కార్లోంచి దింపేసి  వెళ్లిపోయాడట ఆ దయలేని కొడుకు.  అందుకే అలా వానలో తడుస్తూ చెదిరిన తలపులతో,  ఇంటి దారి పట్టిందిట. 

**

మళ్ళీ కొంత కాలం తరువాత, ఓ ఆదివారం వాళ్ళ కిచెన్ గార్డెన్ నుండి కాకరకాయ, వంకాయ మా కోసం తీసుకొచ్చింది వినీత.   ఆ మధ్యన కొడుక్కి పెళ్ళి చేసారు వినీత జార్జ్ దంపతులు. పెళ్ళికి నేను వెళ్ళలేక పోయాను.  కొడుకు, కోడలు ఎలా వున్నారని  అడిగాను. బాగానే ఉన్నారని చెబుతూ ముభావంగానే ఉండిపోయింది.

టీ తాగడం అయ్యాక కాసేపు తమ కూరగాయల మొక్కల గురించి చెప్పింది.

తరువాత సంభాషణ కుటుంబాల వైపు మళ్ళింది.  తన మనస్సు విప్పి కొడుకు విషయం చెప్ప నారంభించింది వినీత. పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుందన్న భావనతో,  కొడుకు జీవితం ఓ గట్టుకి చేర్చాలన్న తపనతో కొడుక్కి పెళ్ళి చేసానంది.  ఎం.బి.ఏ చదివి మంచి ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి అందంగా కూడా ఉంటుందట.  కొడుకు ఉద్యోగం విషయంలో, సంపాదన విషయంలో మాత్రం వీళ్ళు అబద్ధాలు చెప్పారట, అమ్మాయికి, వాళ్ళ కుటుంబానికి.

సంపాదన గురించి ఎలా అబద్ధాలు చెప్పగలరా అని నాకు అర్ధం కాలేదు.

‘స్టేట్ ప్రిజన్ సిస్టమ్స్’ జాబ్ చేసి రిటైర్ అయిన వినీతకి బెనిఫిట్స్ తో పాటు మంచి పెన్షన్ వస్తుంది.  తన పెన్షన్ డబ్బు మొత్తం ప్రతి నెలా కొడుక్కి ఇచ్చేస్తుందట. అది ఆ అబ్బాయి సంపాదించిన రియల్-ఎస్టేట్ రాబడులుగానూ, ఆస్తులమీద వచ్చే నెలసరి అద్దెలుగానూ నమ్మ జూపుతున్నారట అమ్మాయి వాళ్లకి.  కొడుకుని గొప్పవాడిగా చూపాలన్న ఆశతో అవధులు దాటిన ఆ తల్లి ప్రేమను  అర్ధం చేసుకోవాలని ప్రయత్నించాలి ఎవరైనా అనుకున్నాను.

ఇలా తమ బిడ్డల జీవితాలని ఎలాగైనా మంచి మార్గాన వెయ్యాలన్న ఆలోచనతో, కొందరు తల్లులు  విభిన్న  మార్గాలు వెతుక్కుంటారు.   తల్లి, తన బిడ్డల మంచి - మనుగడ కోసం ఎటువంటి బృహత్తర కార్యాన్నైనా మరో ఆలోచన లేకుండా, శక్తి వంచన లేకుండా అమలు పరుస్తుందని కూడా అర్ధమయ్యింది మరోమారు...కాకపోతే, తన బిడ్డ బాగు కోసం ఎంతదూరం వెళ్ళచ్చో, ఇతరులకి అసౌకర్యం కలిగించవచ్చా అనేవి, ఆమెకి పరిగణిలోకి రావాలి.

మళ్ళీ ఓ మారు, లక్ష్మీకాంతం గారి ‘అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’ గుర్తుకొచ్చింది... ఇటువంటి తల్లీ-కొడుకుల ప్రస్తావన ఏమైనా ఉండేఉంటుంది నవలలో....అనుకున్నాను.ఏమైనా, అమ్మ అనే వ్యక్తి, తన-పర బేధం లేక అందరినీ తన బిడ్డల్లా భావించగలిగాలి. ఎవరి బిడ్డో ఇలా చేసిందనో, మరెవరికో అలా అయ్యిందనో విమర్శించే వారితో పాటు, ఎవరి బిడ్డైనా మంచి మార్గంలో నడిచి బాగుండాలని మనస్పూర్తిగా కోరుకునే  అమృతమూర్తులని కూడా చూడగలము ఈ విశాల ప్రపంచంలో.


**

కాస్త రద్దీగా ఉండడంతో,  ఇల్లు చేరడానికి,  మామూలు కంటే పది నిముషాలు  ఎక్కువ పట్టింది... 

కార్ పార్క్ చేసి, లోనికెళ్ళేప్పటికి  మా వారు నా కోసం ‘మదర్స్ డే కేక్, ఫ్లవర్స్  తెచ్చి వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి