'సుధామ' ధురం - సుధామ


అచ్చుదిద్దిన జీవన గీత

కొన్నికొన్ని జ్ఞాపకాలు చాలా మధురంగా వుంటాయి. పుస్తకం అచ్చువేయాలంటే ఆ రోజుల్లో ప్రెస్సువాళ్ళకి రాతప్రతి శుద్ధంగాఇవ్వవలసి వుండేది. అప్పుడు ఆ రచనను కంపోజిటర్లు సీసంతో పోతపోసిన అక్షరాలతో, ఒక్కొక్క అక్షరం కూర్చుకుంటూ కంపోజ్ చేవారు. ఆతరువాత - ముందుగా ' గ్యాలీ ప్రూఫ్ ' అని పొడుగాటి కాగితం మీద కూర్చిన దానిని, నల్లసిరా అద్ది ఇచ్చేవారు. ప్రూఫ్ రీడింగ్ చేసి పేరాలూ అవీ సూచించి ఇస్తే, అప్పుడు ' పేజ్ ప్రూఫ్ ' అని ఏ పేజిలో ఎంత విషయం వస్తుందో ఆ మేరకు కట్టి ,అద్ది ఇచ్చేవారు. అది కూడా ప్రూఫ్ చూసాక అప్పుడు మిషన్ కెక్కించి ' మిషన్ ప్రూఫ్ ' ఇచ్చేవారు. అది ఫైనల్ ప్రూఫ్ అన్నమాట. అదికూడా ప్రూఫ్ రీడింగ్ చేసి ఇచ్చాక తప్పులటినీ సవరించామని నిర్ధారణ చేసుకుని ' స్ట్రైక్ ఆర్డర్ ' అని ఇచ్చాక ,లెటర్ ప్రెస్ లో క్రెడిల్ మిషన్ మీద ఒక్కసారి నాలుగు పేజీలో, ఎనిమిది పేజీలో అచ్చు యంత్రాన్ని కాలితో నొక్కుతూ, కరెంట్ మీద నడుపుతూ అచ్చు వేసేవారు.

ఒక రచనను అటు కంపోజ్ చేసేవారు గానీ ,ఇటు ప్రూఫ్ రీడింగ్ చేసి దిద్దేవారు కానీ, ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదవవలసి వుండేది. ప్రూఫ్ రీడింగ్ చేసేప్పుడు, శుద్ధ ప్రతితో సరి చూసుకుంటూ ,తప్పులు దిద్దడం జరిగేది. ఒక పుస్తకం ప్రెస్సు నుంచి అచ్చు అయి, బైండింగ్ అయి రావాలంటే, ఆరోజుల్లో కనీసం నెల్లాళ్ళదాకా పట్టేది.

ఒక పుస్తకం అచ్చుపనిలో పాలుపంచుకోవడం అనేది, మొదటిసారిగా నాకు ,1967లో జంటనగరాల సాహితీ సాంస్కృతి క సంస్థ యువభారతిలో చేరాక ,1968లో సంస్థ రెండు రూపాయల ప్రచురణ పూర్వ విరాళంతో ప్రచురించిన ' జీవన గీత ' తోనే ప్రారంభం. అది యువభారతి రెండవ ప్రచురణ. అంతకుముందు అనుముల కృష్ణమూర్తి గారి ' సరస్వతీ సాక్షాత్కారం' యువభారతి మొదటగా ప్రచురించిన కావ్యం. అదికూడా ప్రచురణపూర్వ విరాళంతో వేసింది.

' జీవన గీత ' ఖలీల్ జిబ్రాన్ ' ది ప్రాఫెట్ ' కు కాళోజీ గారి తెలుగు సేత. యువభారతి వ్యవస్థాపకుల్లో ఒకరు, నాటికీ, నేటికీ ఆ సంస్థకు వెన్నెముక అయిన శ్రీ వంగపల్లి విశ్వనాథం గారు సికింద్రాబాద్- 5 ,కింగ్స్ వేలో నివసిస్తూండేవారు. అప్పట్లో ఆయన ఇల్లే యువభారతి కేంద్ర స్థానం. ఆ తరువాతి రోజుల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ భవనాల్లోకి యువభారతి కార్యాలయం తరలింది.

విశ్వనాథం గారింట్లో కాళోజీగారితోబాటు కూర్చుని, ప్రెస్సుకు ఇవ్వవలసిన ' జీవనగీత ' శుద్ధప్రతిని తయారు చేయటంలో పాలుపంచుకునే భాగ్యం కలగడమే కాదు, సికింద్రా బాద్ లోని శ్రీరామా పవర్ ప్రెస్ లో ప్రూఫ్ రీడింగ్ లో కూడా పాలుపంచుకునే అవకాశం కూడా కలిగింది. అచ్చుతప్పులు దిద్దడానికి ప్రూఫ్ రీడింగ్ పద్ధతి ఒకటుంటుంది. ఆ పద్ధతి తొలిసారిగా నేర్చుకున్నది అక్కడే. అక్షరదోషాలు, పేరా విభజనలు, కామా, పులిస్టాప్ లు, పదాల మధ్య వాక్యాలమధ్య వుండవలసిన స్పేస్ లు, పున రు క్తులు తొలగించడాలు, తప్పిపోయిన పదాలనో, వాక్యాలనో చేర్చడాలు ప్రూఫ్ రీడింగ్ లో అచ్చు పనికి అనుగుణంగా, కంపోజిటర్లు సరి చేసేందుకు సూచించే విధం ఏమిటో అలానే అవగాహనలోకి వచ్చింది. నిజంగా ప్రూఫ్ రీడింగ్ కూడా ఒక కళ. ఆ రోజుల్లో ప్రూఫ్ రీడర్ ఉద్యోగాలు పత్రికల్లో వుండేవి కూడాను.

కాళోజీగారితో సన్నిహితంగా మసలే అదృష్టం ' జీవన గీత ' అచ్చుపనిలో రోజుల్లో ఒనగూడింది. జీవితంలోమరపురాని సందర్భం అది. ఆయన వరంగల్ నక్కలగుట్ట నుండి నాకు రాసిన ఉత్తరాలు, నా ఉత్తరాలకు ప్రత్యుత్తరంగా రాసిన విషయాలు భద్రపరుచుకోవాలనే ఆలోచన కూడా లేని మా అమాయకపు రోజులవి.

' జీవన గీత ' ఖలీల్ జిబ్రాన్ ' ది ప్రాఫెట్ ' కు కాళోజీ గారి అనువాదం. ఆతరువాత ' ది ప్రాఫెట్ ' ను చాలామంది అనువదించారేమో గానీ ,నాకు తెలిసి తొలి తెలుగు అనువాదం కాళోజీ గారిదే. ' జీవన గీత ' ను- రెండు రూపాయలు ప్రచురణపూర్వ విరాళంగా సేకరించి ,యువభారతి ఆరువేల కాపీలు ముద్ద్రించి ,విరాళాలు ఇచ్చినవారందరికీ ఉచితంగా అందించింది. పుస్తకం వెల ' అమూల్యం ' అని వుంటుంది అందుకే. బాపు గారు అద్భుతమైన ముఖచిత్రం వేశారు. ఎమెస్కో అధినేత శ్రీ ఎం.ఎన్. రావు గారు ప్రచురణకు సలహా సహకారాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కాళోజీ గారికి ' జీవన గీత ' ప్రచురణకై వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. అప్పట్లో అది విలువైన సహాయమే.

కాళోజీగారికి ఖలీల్ జిబ్రాన్ తో పరిచయం చేయించింది నయాగరా కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు.ఆ విషయం కాళోజీగారే చెప్పుకున్నారు.  1953 డిసెంబర్ లో కాళోజీగారి ' నాగొడవ ' రెండవ ముద్రణకు కొత్తగేయాలు కలిపి అచ్చుప్రతిని సిద్ధం చేస్తున్న రోజుల్లో హైద్రాబాద్ లో వున్న ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ఇంట్లోనే 'నా గొడవ ' ఎడిటింగ్ సాగిందట.ఆఖరు పుటల్లో ' చెలిమి ' గేయం చదివి ఏల్చూరి వారు ' మీరు ఖలీల్ జిబ్రాన్ రచనలు బాగా చదివినట్లున్నారు ' అన్నారట కాళోజీ గారితో. " అతనెవరు? " అని అడిగారు కాళోజీ. " అదేమిటి, ఖలీల్ జిబ్రాన్ నే ఎరుగరా ? " అని ఎంతో ఆశ్చర్యంగా అడిగిన సుబ్రహ్మణ్యం గారు   ఎరుగనన్న కాళోజీ గారికి తమవద్దనున్న ' ది ప్రాఫెట్ ' ను వెతికి ఇచ్చారు. తన ' చెలిమి ' గేయానికి బహుమతిగానన్నట్లు మిత్రుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం నుండి కానుకగా అందుకున్న ఆ పుస్తకం; మానవతకు ప్రామాణిక గ్రంధంగా బ్రతుకు బాటగా, జీవన గీతగా తనదగ్గర వుండిపోయింది.

1953 చివర్లో తెలంగాణ రచయితల వార్షికోత్సవం జరిగి ' మంజీర ' అనే సంచిక వెలువడింది. కాళోజీ దానిలో మొదటగా ' కర్మయోగము ' పేరుతో ఖలీల్ జిబ్రాన్ ' ది ప్రాఫెట్ ' నుంచి ఒక అధ్యాయం తెనుగించి ప్రచురించారు. ఆ తరువాత అనువాదం సాంతం చేసాక వ్రాతప్రతి పోగా, మళ్ళీ మళ్ళీ వ్రాసారు. ' ది ప్రాఫెట్ ' అనువాదం బ్రతుకుబాట, ఖలీల్ పాట. ' జీవన గీత ' అని కాళోజీ అనువాదానికి నామకరణం చేసింది శశాంక గారు. వ్రాతప్రతి విని, తాను చదువుకుని, ' జీవన గీత ' విషయ పరిచయ వ్యాసం వ్రాసారట శశాంక. అది చూసి ' జీవన గీత ' ప్రతులకు ఎందరో కాళోజీ గారికి లేఖలు రాశారు. యువభారతి పూనుకుని కాళోజీ గారి ' జీవన గీత ' ను 1968 లో అచ్చు వేసింది. కాళోజీగారు చెబుతుంటే శుద్ధప్రతి తయారీలో, నేనూ భాగస్వామిని అయ్యాను. ఖలీల్ జిబ్రాన్ చిత్రలేఖకుడు కూడానట..ఆయన స్వయంగా గీసిన బొమ్మలకు యువభారతి ప్రచురించిన పుస్తకంలో హెచ్.వి. రాంగోపాల్ అనుకరణం అందించారు. శశాంక గారు మా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘానికి అధ్యక్షులు. నేను సహ కార్యదర్శుల్లో ఒకడిని. విద్యార్థి కవిగా నేను పురోగమించడానికి ఆ మహనీయుల ప్రోత్సాహం అవిస్మరణీయం.

ఖలీల్ జిబ్రాన్ -కవి, తాత్త్వికుడు, చిత్రకారుడు. నలభై ఎనిమిదేళ్ళు జీవించాడు. 1931లో చనిపోయాడు. (ఆయన పోయిన ఇరవై ఏడేళ్ళకు గానీ నేను పుట్టనేలేదన్నమాట!)కవిగా, చిత్రకారుడిగా అతనికి ప్రపంచఖ్యాతి లభించింది. ఖలీల్ చిన్నవయసులోనే ' ప్రాఫెట్ ' అనే మహాకావ్యం మొదటిసారిగా అరబ్బీభాషలో రాశాడు. తల్లికి వినిపించాడు. బానే వుందిగానీ, ఇంకా ' పచ్చి ' గా వుంది అందట తల్లి. ఖలీల్ తన కావ్యాన్ని అలా తల్లికి చూపిస్తూ ఏడుసార్లు దిద్దుకున్నాక ఏడోసారి ' బాగుంది ' అందిట తల్లి. అప్పుడది అచ్చయింది. కొన్నేళ్ళ తర్వాత తానే దానిని ఇంగ్లీషులోకి అనువదించాడు. 1923లో ' ప్రాఫెట్ 'మొదటిసారి ఇంగ్లిష్ లో అచ్చయింది. అంతే! అదిమొదలు అమెరికాలో, ఇంగ్లాండులో  ప్రచురణ సంస్థలు వందలసార్లుదానిని ఇంగ్లీషులో అచ్చువేశాయి. బైబిల్ తరువాత లక్షల ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకం ఏదన్నా వుందంటే, అది ఖలీల్ జిబ్రాన్ ' ది ప్రాఫెట్ ' . భారతానికి పంచమ వేదం అని పేరు వచ్చినట్ట్లుగా, ' ది లిటిల్ బ్లాక్ బుక్ ' అని ' ప్రాఫెట్ ' కు పేరొచ్చింది. అమెరికాలోని కొన్ని చర్చిల్లో 'ప్రాఫెట్' గ్రంధపఠనం నేటికీ జరుగుతుంటుంది.యూరప్ లోని అన్ని భాషల్లో, జపాన్ లో, ఖలీల్ జిబ్రాన్ ' ప్రాఫెట్ ' అనువాదమైంది.భారతీయ భాషలలో హిందీ, తమిళం, మళయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో ఖలీల్ జిబ్రాన్ రచనల అనువాదాలున్నాయి. నాకు తెలిసి మరి తెలుగులో కాళోజీ ' జీవన గీత ' యే మొదటి అనువాదం.

ఖలీల్ జిబ్రాన్ మరణం తర్వాత, చాలా సంవత్సరాలకు 1948లో లెబనాన్ స్వతంత్ర్య రిపబ్లిక్ అయ్యాక, ఆయన సమాధిని త్రవ్వి, లెబనాన్ లో సమాధి నిర్మించి ఆయనను ఆరాధిస్తున్నారు.

అతని పేరు ' ఆల్ ముస్తఫ '

ఎన్నికయిన మిన్న అతడు

అందరి ప్రేమకు పాత్రుడు

తానుండిన కాలమునకు

తానె ఉషస్సయిన వాడు

అని మొదలయ్యే కాళోజీ అనువాద ' జీవన గీత ' లో ' అల్ ముస్తఫ అర్థ లీజు పురవాసులకు బ్రతుకుబాటగా చెప్పిన - ప్రేమ, వైవాహిక బంధం, పిల్లలు, దానము, తినుట, త్రాగుట, కాయకష్టం, సంతోషం, ఇల్లు, వస్త్రాలు, క్రయవిక్రయాలు, నేరము-శిక్ష, శాసనాలు, స్వాతంత్ర్యం , వివేకం- అవివేకం, వేదన, తనను తానెరుగుట, విద్యాబోధన, మైత్రి, సంభాషణ, కాలము, మంచి-చెడు, ప్రార్థన,, సుఖం, సౌందర్యం, ధర్మం, మృత్యువు, మొదలైన అనేక విషయాలను గురించిన అద్భుత ప్రవచనాలున్నాయి. మానవాళి నివాళులెత్తిన కారుణ్యోపనిషత్తుగా ' జీవన గీత ' సంభావింపబడింది. కాళోజీ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ ' జీవన గీత ' తో యువభారతిలో నేను ఆనాడు పొందిన వికాసం ఒక చిరంతన స్మృతి పరీమళం.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు