జ్యోతిపథం - డా. పులివర్తి కృష్ణమూర్తి

 

లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు

' ధనం మూలం ఇదం జగత్ ' అన్నది నానుడి. చేతినిండా డబ్బు వుంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా వుంటుంది. కానీ ఆ మహలక్ష్మి కటాక్షం అందరికీ లభించదు. కష్టపడిపనిచేసేవారికే ఆ అదృష్టం సైతం కలిసి వస్తుంది. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం మరొక ముఖ్యమైన విషయాన్ని మనకు చెబుతున్నది. ప్రతి పనికీ ఒక అధిదేవత వున్నాడని చెబుతూ ఉన్నది. వారిని కొలిస్తే మన కోర్కెలు తీరుతాయని చెప్పబడింది. ధనానికి ప్రతిరూపంగా లక్ష్మీదేవిని చూడడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటే అన్ని ఆర్థిక సమస్యలూ తీరి, మనుష్యులు మనశాంతితో ప్రశాంత జీవనం గడపగలుగుతారు. ధనవంతుడే బలవంతుడు. ధనవంతుడే గుణవంతుడు. ఆర్థికంగా ఎదగాలనే ఆస్తికులకు తాము చేస్తున్న కృషి ఫలించాలంటే దైవ అనుగ్రహం వుంటే తిరుగుండదని నమ్ముతారు.

ఎవ్వరు ఏ రంగంలో వున్నా వారందరి అభివృద్ధికి తోడ్పడే విధంగా పరమాచార్య జగద్గురు శంకరాచార్యులవారు ఈ జగత్తుకు అందించిన పరమాద్భుత శ్లోకాలు ' కనకధారా స్తోత్రం ' గా మనకు లభించాయి. ఈ స్తోత్రం ఉద్భవించడానికి ఒక సంఘటన్ కారణమైంది. కేవలం రెండు మూడుసార్లు పఠిస్తే చాలు నిరుపేదలను సైతం కుబేరుల సమానంగా చేయగలదని చెప్పిన స్తోత్రం  ' కనకధారా స్తోత్రం '. జగద్గురువు ఈ స్తోత్రాన్ని ఆశువుగా చెప్పరు. నిత్యం పారాయణం గావించితే పేదరికం దరిదాపులకు కూడా రాదన్నారు. శ్రీ ఆదిశంకరులవారు ఒకనాడు భిక్షకోసం ఒక ఇంటిముందు  ఆగారు. ' భవతీ భిక్షాందేహీ ' అంటూ కేక వేశారు. ఆ ఇంట్లో ఒక ముదుసలి వుంది. ఆమె ఈ కేక విని కలవరపడింది. ఆమె ఇంట్లో ఇవ్వడానికి ఏమీలేదు.

సర్వసంగపరిత్యాగియైన జగద్గురువు ఆదిశంకరులవారే ఇంటిముందు భిక్షకు వస్తే ఏమీ చేయాలో ఆమెకు తోచలేదు. చివరకు ఒక ఉసిరికాయను సమర్పించుకుని తన దైన్య స్థితిని వివరించి, ఆపైన విలపించింది. ఆమె నిష్కల్మష హృదయాన్నీ భక్తి భావాన్నీ దర్శించిన శంకరులవారు చలించారు. ఆయన హృదయంద్రవించింది. తక్షణం లక్ష్మీదేవిని ప్రసన్నం గావించుకోడానికి ఒక స్తోత్రం చేసారు. ఏముందీ? వెంటనే కనకధార కురిసింది. పేదరాలి ఆనందానికి హద్దుల్లేవు. ఆమె దశే మారిపోయింది. ధనానికి మూలం లక్ష్మీదేవి అయితే ధనమంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు. ధైర్యం, శౌర్యం, విద్య, వివేకం అన్నీ ధనమే. లక్ష్మీదేవికీ, జ్ఞానానికి వెలుగంటే మహా ఇష్టం. అందుకే దీపాన్ని లక్ష్మీదేవికీ, జ్ఞానానికీ చిహ్నంగా చెబుతారు. అంతేకాదు అమ్మవారు ఎల్లప్పుడూ ఆదిశేషువుపై పవళించిన శ్రీ మహావిష్ణువు పాదాల చెంత కొలువుతీరి వుంటుంది. లక్ష్మీదేవిని ఆదర్శవంతమైన, వినయ , విధేయతలు కలిగిన హైందవ స్త్రీకి నిదర్శనంగా చెబుతారు. ఈమె ఎంత శక్తిమంతురాలైనా విష్ణుమూర్తిపట్ల భయభక్తురాలై మెలగుతుంది. భహుశ, అందుకేనేమో శ్రీహరి తన అవతారాలన్నిటిలోనూ వెంటబెట్టుకునే వున్నాడు. రాముడికి సీతగా, కృష్ణుడికి రుక్మిణిగా సకలవేళలా అంటిపెట్టుకునే వుంది. ఆయనను అనుసరిస్తూనే వుంది. విశేషమేమంటే, శ్రీహరి సేవలే తన లక్ష్యంగా పెట్టుకున్నా కూడా, మహాలక్ష్మిదేవి స్వతంత్ర్యంగా  పూజలు అందుకుంటూనే వుంది.. సకల మానవాళికీ ఆరాధ్యదేవతగా నీరాజనాలు అందుకుంటున్నది.

లక్ష్మీదేవి పాలకడలి నుంచి కాంతులు వెదజల్లుతూ వెలికి వచ్చినపుడు ఆమె చేతిలో వికసించిన పద్మం వుంది. లక్ష్మీదేవి దివ్య మాల్యాలు, దివ్యాంబరాలు ధరించి, భూషణ భూషితురాలై సకల దేవతలు చూస్తూండగా శ్రీహరిక్ వక్షస్థలం చేరగా దేవతలందరూ అమ్మవారిని స్తుతించారు.

నమస్తే సర్వలోకానాం జననీమబ్జ సంభవాం

శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణు వక్ష:స్థితాం

లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ప్రత్యక్షమై వరం కోరుకోమంది. ఇంద్రుడు వెంటనే ఈ స్తోత్రాన్ని పఠించిన వారిని విడువవద్దని కోరాడు. కరుణాంతరంగి తల్లి అందుకు అంగీకరించింది. ఈ స్తోత్రం చదివినవారు శ్రీమంతులవుతారు. విష్ణుపురాణం ఈ విశేషాలను అందించింది మానవాళికి.

లక్ష్మీదేవి అదృష్టానికీ, శుభానికీ సూచికగా చెబుతారు. అమ్మవారి కటాక్షం లభిస్తుందనే ఆశతోనే మనం పిల్లలకు లక్ష్మి అనేపేరు పెట్టుకుంటాము. ఆ కుటుంబంపై మహాలక్ష్మీదేవి సుఖసంపదలు కురిపిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి సిరిసంపదలకు పుట్టుకా, మనుగడా.. సుఖసంతోషాలకే కాదు, లక్ష్మీదేవి ఒక మహా శక్తి. ఆమె కరుణా కటాక్షాలతో ఈ విశ్వమంతా పులకించిపోతుంది.అందుకే ఆమెను ఈ లోకమంతా జగన్మాతగా కొలుస్తున్నది. ఈ విశ్వాన్నంతటినీ రక్షించే మనతల్లి ఆ మహాలక్ష్మి.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు