నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

....’నాతిచరామి’... మంత్రములోని అర్ధం తెలిసిన నేస్తముతో
అడుగు కలుపుతూ వెలుగు వెతుకుతూ సాగే పయనమే పెళ్లి బాట....

 

జీవితం ఓ ‘పరిశోధనశాల’ అయితే, బాధ్యతగా - ప్రయత్నాలు - ప్రయోగాలు చేయడమే.......

 

కోడలు కూడా కూతురు వంటిదే.... అందుకే ఆ సలహా....

        ***************

నాతిచరామి: ‘ధర్మేచ అర్దేచ కామేచ త్యయేషా నాతిచారితవ్యా నాతిచరామి’

ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా ఉంటామని ఇద్దరు కలిసి చేసే ప్రతిజ్ఞ ‘నాతిచరామి’

పెళ్లి చేసుకొని ఈ దేశం వచ్చాకనే, జీవితం గురించి ఎన్నెన్నో విషయాలు  ఆకిలింపు చేసుకొన్నాను,కాలానుగుణంగా నన్ను నేను మలుచుకుంటూ వ్యక్తిగా ఎదిగాను... నేనే కాదు.. నా బోటివాళ్ళేఇంచుమించు అందరూ..

అయితే, వివాహమయి  స్వదేశంలోనే  మెట్టినింట అడుగుడిన  పడతి జీవితానుభవాల నుండి విదేశీ గడ్డ మీద కొత్తకాపురానికి నాంది పలికిన పడతి అనుభవాలు కాస్త భిన్నంగానే ఉంటాయిగా మరి... స్వదేశాన, అమ్మగారి ఇంటినుండి, అత్తగారి వైపు నుండి కూడా బోలెడంత సలహా-సహకార-సహాయాలు ఉంటాయి...

అమెరికా చేరిన కొత్తల్లో, స్నేహితులమంతా కలిసినప్పుడు ఎక్కువగా ఇదే విషయం మాట్లాడుకునేవాళ్ళం.   స్నేహితులంటే, ఇంచుమించు మాలో అందరం,అప్పట్లో కొత్తగా పెళ్ళయి విదేశానికి వచ్చిన వాళ్ళమే.  ఓ ఎనిమిది మందిమి, తరుచుగా కలుసుకునే వాళ్ళం... కొత్త దేశం, కొత్త వాతావరణం... అలవాటు చేసుకుంటూ,  అర్ధం  చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే కదా అనుకునేవాళ్ళం..

పోతే, ‘పిల్లలప్రాపకం–వ్యాపకం–వృత్తి–పోరాటం- వృద్దాప్యం’  వంటి ప్రక్రియలకి “ఉపయోగాదారుల చేపుస్తకం” (USER’S MANUAL) గాని,ఉపయోక్తృవిద్య  బోధించే వ్యవస్థ గాని ఉంటే బాగుండును!’ అనుకుని నవ్వుకునేవాళ్ళం.జీవితం ఓ ‘పరిశోధనశాల’ అయితే, బాధ్యతగా - ప్రయత్నాలు - ప్రయోగాలు చేయడమేఅనుకునే వాళ్ళం.......

నిజానికి,ఓర్పుతో  నేర్పుగా  ఒక్కో అడుగు వేయడం కాలమే నేర్పుతుంది.  ప్రతిరోజూ ఓ కొత్త అనుభవం, ఓ కొత్త పాఠం, అప్పుడప్పుడు ఓ గుణపాఠం అనుభవంలోకి రాక మానవు....అవన్నీ కలిస్తేనే భావాలు, అభిప్రాయాలు ఏర్పడతాయి.అప్పటికే ఏర్పడినవి – మరి మారుతాయి కూడా..

‘పెళ్లి’ అనే వ్యవస్థ పట్ల –కాలానుగుణంగా  ఆలోచనల్లోమార్పులు వస్తున్నట్లే,.. .ఆ వ్యవస్థ పట్ల కొత్త తరాల దృక్పదాలు మారుతున్నాయి. ...అని  నా అభిప్రాయం. దానికీ నా అనుభవాలు – అవగాహనలే కారణం....

**

పాతికేళ్ళ  క్రిందటి  సంగతి....మాకు బాగా పరిచయమున్న రెండు గుజరాతీ కుటుంబాల ప్రస్తావన. వారివురి కుటుంబాలు యేళ్ళగా స్నేహితులు.  వారి పిల్లలు చిన్నప్పటినుండీ కలిసి ఆడుకుని, కలిసే స్కూలుకి కూడా వెళ్ళేవారట.  వారాంతాల్లోపార్టీలు, పిక్నిక్ లుగా గడిపేవారట...

అయితే వాళ్ళల్లో ఒకరి అబ్బాయి, రెండో కుటుంబం వారి అమ్మాయిని ప్రేమించాడు.  కాలేజీకి వెళ్ళే సమయానికి, తల్లితండ్రులకి వారి ప్రేమని గురించి వెల్లడించి, పెళ్లి చేసుకోడానికి అనుమతి అడిగారు.

ఎంతో సంతోషించవలసిన విషయం కదా!  ఎందుకంటే, అప్పట్లో,  తమ పిల్లలు అమెరికన్లను పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో అని,కొందరు తల్లితండ్రులు కాస్త జంకుతున్న వైనాలు వినేదాన్ని.

అల్లాంటిది మంచి స్నేహితులు, ఒకే భాష మాట్లాడే ఈ కుటుంబాలు రెండూ వియ్యమందుకుంటే, ఎంతో బాగు కదా!.... అనుకుంటే – అది అప్పుడు తప్పే అయింది.... 

ఎందుకంటే, ఆ సంబంధానికి, వారిలో ఒక తల్లి తీవ్రంగా  ప్రతిఘటించింది.  గగ్గోలు పెట్టింది.  చాలా వ్యధ చెందింది.  ఆమె ఆక్రోశం –‘తాము శాఖాహారులైతే అవతలి వారు మాంసాహారులని.  తాము బ్రాహ్మలైతే, అవతలి వారు కారని’... ఉన్నట్టుండి ఆమెకి ఈ బేధాలు ఎంతో వ్యధనిచ్చాయి.  మొత్తానికి ఊరంతా ఆవిడ బాధ విన్నారు.  ఎవరెంత నచ్చజెప్పినా,  వారి పిల్లల పెళ్ళికి, ఆవిడ ససేమిరా అనడంతో, ఆమె బిడ్డ ఇల్లువదిలి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాడని తెలుసు.

మరెప్పటికీ  ఆ తల్లి తన బిడ్డకి  దూరమైందని తెలుసు..

ఆ సంఘటన నా మనస్సు పై  బలమైన ముద్ర వేసింది.  అప్పటివరకు వర్ణాంతర కులాంతర వివాహాల విషయంగా ఎటువంటి అభిప్రాయం లేని నాకు, ఆ తల్లిలో అంతటి నైరాశ్యం, అంతటి మనోవ్యధ, వాటి పర్యవసానం చూసాక మాత్రం,  ఆమె తన బిడ్డ సంతోషం గురించే ఆలోచించవలసింది అనుకున్నాను.  కులం, వర్ణం ఇవన్నీ మనం సృష్టించుకున్నవి కాదా?  తల్లీ-బిడ్డల అనుబంధం వీటికి అతీతంగా ఉండాలి కానీ లోబడి కాదు అని అనుకున్నాను.ఆ తల్లి యొక్క ఆ నాటి స్థితికి కారణం – అప్పటి ఆమె మనస్థితి కావచ్చు.   ఆవిడ స్వతహాగా చాలా మంచి మనిషే.  అందరితో కలుపుగోలుగా ఉండేది మరి.

**

మనసున నిలచిపోయిన - ఇరవై యేళ్ళ  క్రిందటి మరో సంఘటన ....

మా అమ్మాయి శిల్పకి, మరో నృత్య రీతి నేర్పే పేరున్న గురువుగారు నాతో చాలా స్నేహంగా ఉండేది.

పి.హెచ్.డి చేస్తున్న ఆమె కూతురు పెళ్ళికి, మమ్మల్ని ఇన్వైట్ చేసారు ఆమె.  పెళ్ళికొడుకు అమెరికన్.

ఆ అమ్మాయి క్లాస్ మేట్ అట.

‘అమెరికన్ని పెళ్లి చేసుకుంటుంది మా అమ్మాయి’ అంటూ దిగులుపడే వాళ్ళని చూసాను ...కానీ  డాన్స్ టీచర్ ఫామిలీ  సంతోషంగానే ఉన్నారు.   కాస్త కన్ ఫ్యూజ్ అయ్యాను.

ఆ పెళ్లి బాగా జరిగింది.  అబ్బాయి అమ్మాయి కంటే కూడా బావున్నాడు.   మంచి చదువు-ఉద్యోగమూను.

**

తరువాత రెండేళ్ళకి, ఆ గురువుగారు, వాళ్ళ డాన్స్ స్కూల్ ఫండ్-రైజింగ్  డాన్స్ ప్రోగ్రాం చేసారు.   మా అమ్మాయి శిల్ప ఆ ప్రోగ్రాములో ప్రముఖంగా పాల్గొనడంతో మేము కూడా మిగతా శిష్యులతో కాస్త ముందుగానే ఆడిటోరియం చేరాము.  మా వెనుకే గురువుగారు, వాళ్ళమ్మాయి కూడా దిగారు.  అందరం గ్రీన్ రూమ్స్ వైపు వెళ్ళిపోయాము.  మరి కాసేపటికి గురువుగారి అల్లుడు ‘జానతన్’,ఓ చేత్తో గురువుగారి (అతని అత్తగారి) మేకప్ కిట్,  మరో చేత్తో హ్యంగర్స్ కి  వేసున్న ఆవిడ డాన్స్ కాస్ట్యూమ్స్ బాగ్,  అన్నీ తెచ్చి  గ్రీన్రూమ్  క్లాజట్ లో సర్దాడు.

Mom call my cell, if you need anything,” అని ఆమెకి చెప్పి, అక్కడే మేకప్ చేసుకుంటున్న భార్యని భుజం మీద తట్టి, ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగి,  వెళ్ళాడు  జానతాన్.  నేను ఆశ్చర్యంలో మునిగి తేలాను.  ‘ఇలా ఒక అల్లుడు, ఎటువంటి సంకోచం లేకుండా ‘మామ్’ అని ఆప్యాయంగా సంభోదిస్తూ, అత్తగారికి సపర్యలు, సాయం చేయడమనేది...మెచ్చుకోవాల్సిందే అనుకున్నాను..

నన్ను మరింత ఆశ్చర్య పరిచిన విషయం –తన  భార్యకి, అత్తగారికి టిఫిన్లు కాఫీలు అందించడమే కాక, ప్రోగ్రాం అయ్యాక కూడా, మళ్ళీ అన్నిటా సాయం, బట్టలు సర్దడాలు కూడా చేసాడుజానతన్... అవాక్కయ్యాను.  డాన్స్ చేస్తూ పాదం బెణికిన అత్తగారికి,  ఊహించని విధంగా సపర్యలు చేసిన అమెరికన్ అబ్బాయికి, అత్తగారి పట్ల  ఇంతటి గౌరవం,  స్వచ్చమైన అభిమానం, ప్రేమ ఉన్నాయి కదా! అనిపించి ముచ్చటేసింది...

**

నా స్టూడెంట్స్ కొందరు విద్యాధికులు, తమ క్లాస్మేట్స్ - అమెరికన్స్ ని ప్రేమ వివాహాలు చేసుకున్నారు.  నాకు తెలిసి ఆ నలుగురు అమెరికన్ అబ్బాయిలు, వాళ్ళ భార్యల్ని అపురూపంగా చూసుకుంటున్నారు.  వారి  అడుగులకి మడుగులొత్తి, ఆదివారాలు ఇంటిపనుల నుండి వాళ్ళకి  సెలవిచ్చి మరీ. 

ఒకటికాదు.. నాకు తెలిసే మరో ఉదాహరణ...

హ్యూస్టన్ కి యాభై మైళ్ళ దూరంలో ఉన్న Galveston లో, వారానికో మారుడాన్స్ క్లాస్ కండక్ట్ చేసేదాన్ని.  పొద్దుటి నుండి క్లాసస్ అన్నీ అయ్యేప్పటికి  సాయంత్రం ఐదయ్యేది.  మధ్యలో ఓ గంట లంచ్ బ్రేక్.  

ఓ సారి క్లాస్ బ్రేక్ టైం లో, తమ ఇంటికి వెళ్లి  టీ తాగుదామని నా స్టూడెంట్ రేణు వొత్తిడిచేస్తే సరేనన్నాను..  ఆమెకి  ఇద్దరు చిన్నపిల్లలు.  భర్త ‘నేతన్’ – అమెరికన్.అతను ‘పల్మనరీ స్పెషలిస్ట్’.....

మేము ‘టీ’ అంటూ ఇంటికి వెళ్ళేప్పటికి, హాస్పిటల్ రౌండ్స్ చేసొచ్చి, సాంబార్,  పొటాటో కర్రీ చేసుంచాడు ఆ డాక్టర్ నేతన్ గారు.  ఆదివారం కాబట్టి, రేణుకి చుట్టీ అట.

మాకు తానే టీ చేసి సర్వ్ చేసాడు కూడా.  ఆ తరువాత, భుజం మీద చేతి టవల్ వేసుకొని మరీ, పిల్లలకి లంచ్ తినిపించడానికి తయారవుతున్నాడు అతడు.   ఏమనాలో అర్ధం కాలేదు.  ఆయనకి మన వంటలు  నేర్చుకొని చేయడం  ఇష్టమట.సాంబార్, రసం, ఎగ్ కర్రీ, పొటాటో కర్రీ చేయడం వచ్చట...

**

పైన  చెప్పిన  శిష్యురాళ్ళ  పెళ్ళిలయ్యి  కూడా  ఇరవైయేళ్ళు దాటింది.  అందరూ బాగున్నారు.. నా శిష్యులు కదా! నాతో క్లోజ్ గా ఉంటారు.  నాకు అన్నీ చెబుతారు.  ఇక డాక్టర్ నేతన్,  రేణు  కూడా  చాలా బాగున్నారు.  జీవితంలో అంచలంచలుగా ఎదిగారు.  ఇప్పటికీ అలాగే ఆనందంగా ఉన్నారు..

నిజం చెప్పద్దూ,  మా అమ్మాయికి నేతన్ వంటి భర్త వస్తే బాగుణ్ణు అని అనుకున్నాను... అన్నాను కూడా...

‘అరే! నేనేమిటి ఇలా ఆలోచించడం, సంశయించకుండా ఇలా అనుకోడం ....అని కూడాఅనిపించింది ఓ క్షణం.అయితే, సంస్కారం - మంచితనంతో పాటు, మనకి నచ్చి, మనం  మెచ్చకోతగ్గ గుణగణాలు ఇతర దేశస్తుల్లో కూడా మెండుగానే ఉంటాయనిగ్రహించగలిగాను....   నా అనుభవంలో,  అమెరికన్  యువకుల్లో కూడా మంచి సంస్కారం, వివాహ వ్యవస్థ పట్ల గౌరవం,  భార్య పిల్లల పట్ల ఎక్కువే  ప్రేమ బాధ్యతలున్న వారిని చూసాను...

**

కోడలు కూడా కూతురు వంటిదే, .... ఎవరికైనా అదే సలహా....

నా మనస్సుకి హత్తుకుపోయిన సంఘటనే...మరోటి...

మాకు పిన్ని వరసయ్యే దూరపు బంధువు ‘భవానిఅమ్మ’.  ఆవిడని బంధువర్గమంతా కొనియాడేవారు... ఆవిడ ఓ సంఘకర్త అవ్వడమే కారణం.  స్త్రీవాది కూడా.  ఎందరికో  ఫామిలీ కౌన్సెలింగ్ చేసేది పిన్ని.  మా అమ్మకన్నా వయస్సులో కాస్త చిన్నదే..  నా పెళ్ళయిన ఐదారేళ్ళకి పిన్ని తమ ఒక్కగానొక్క కొడుకు చందర్రావ్ పెళ్లి చేసింది.  నేను పెళ్ళికి రాజమండ్రి వెళ్లాను.  ఆమె  కోడలు కుందనపు బొమ్మలా ఉంది...

మరో నాలుగేళ్ళకి చందర్రావ్ భార్యతో న్యూయార్క్ వచ్చాడు.  ఒకటి రెండు సార్లు హ్యూస్టన్ వచ్చి మాతో సమయం గడిపి వెళ్ళారు భార్యాభర్తలు.మా పిల్లలతో ఇద్దరూ ఎంతో ఇష్టంగా, సరదాగా గడిపారు.  పిల్లల్ని కనడం భార్య మంజులకి ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు చందూ.   అంతేకాక, ఇద్దరి మధ్యా అంతగా సఖ్యత లేదనిపించింది నాకు.

**

మరో ఆరు నెలలకి, పిన్ని న్యూయార్క్  నుండి ఫోన్ చేసింది.  తను యు.ఎస్.ఎ వచ్చి,  మూడు నెల్లగా చందర్రావ్ వద్ద ఉన్నానని చెప్పింది.  ఆమెని నేను ఇంటికి రమ్మని ఆహ్వానించాను. “నీతో చాలా విషయాలు మాట్లాడాలి. వీలుంటే,  నువ్వే వచ్చి కలువమ్మా,” అంది పిన్ని. 

**

నేను న్యూయార్క్ చేరాను.  ఇంటికెళ్ళేప్పటికి అర్ధరాత్రి దాటింది.  పలకరింపులు, తినడాలు అయ్యాక ఆ మాట ఈమాట మాట్లాడి, చందర్రావ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.  మంజుల జాడ లేదు.  పిన్ని నావంక చూసి, “ఉమ్మీ, నాకు నిద్రొస్తుందమ్మా.   రేపు చందూ వెళ్ళాక మాట్లాడుకుందాము.  పద నువ్వూ పడుకో,” అంది.

**

కాఫీ టిఫిన్లు అయ్యాక, ముఖాన చెదరని చిరునవ్వుతో,  నాకు అసలు విషయం చెప్పింది పిన్ని.

చందూ, మంజుల అసలు మొదటినించీ ‘ఎడముఖం పెడముఖం’ గానే ఉండేవాళ్లంట.   అయినా  ఇండియాలో ఉన్నంతకాలం  కుటుంబాలసహకారాలతో, కలిసి  మనగాలిగారని  చెబుతూ,కళ్ళజోడు తీసి తుడిచి, మళ్ళీ పెట్టుకుంది పిన్ని.

“న్యూయార్క్ కి వచ్చాక మాత్రం,  ‘అడుగడుగు దణ్ణాలు ఆపదమొక్కుల్లా’సాగింది వీళ్ళ కాపురం.  ‘టామ్ ఎండ్ జెర్రీ‘ లో పిల్లి-ఎలుకాలా తన్నుకు చచ్చిపోతున్నారు ఇద్దరూ.  అందుకే నేనే రంగంలోకి  దిగాను ,” అందామె అదే చిరునవ్వుతో....

“నిజానికి, నా కొడుకు చందూ బంగారు కొండ.... ఇక నాకోడలు,  ఆణిముత్యం... నా కూతురు కంటే కూడా నాకు మంజులతోనే కుదురుతుంది.  మంజుల చాలా మంచి అమ్మాయి.  వీళ్లిద్దరూ ఎవరి పాటికి వాళ్ళు చాలా మంచి మనుషులు ఉమా... కాని అదేమీ ఖర్మో!  ఏ విషయంలోనూ వాళ్ళల్లో  పొంతన లేదు.  ఇద్దరి మధ్యా పచ్చిగడ్డి వేస్తే మండిపోతుందనుకో.  మూడు నెల్లగా ఇక్కడ ఉండి వీళ్ళ కాపురం సాగుతున్న వైనం గమనించాను.మంజుల పిల్లలు వద్దనడానికి కారణం,  వీడితో సఖ్యత లేకనేనట.  ఇష్టం అటుంచి ఒకరంటే ఒకరికి  ఏహ్యభావం  అనే నా అభిప్రాయం.  ఇన్నాళ్ళూ  గమనించి,  పోయిన వారం వాళ్లకి నా తీర్పు ఇచ్చేశాను,”  నా వంక చూసింది పిన్ని. ఆత్రుతగా ఉంది.  ఎన్నో జంటలని కలిపిన పిన్ని తన సొంత కొడుకు విషయంగా ఏం చేసిందోనని క్యూరియస్ గా వింటున్నాను.

“మీరిద్దరూ ఇలా కలిసి బతకాలన్న ఆలోచన మానేసి,  లీగల్ గా విడిపొమ్మని సలహా ఇచ్చాను వాళ్లకి.  అదే వాళ్ళిద్దరికీ క్షేమం, సుఖం అని తెలియజెప్పాను.  విడిపోయి సుఖంగా ఉండండని దీవించాను. ఆ విషయంగా,  వాళ్ళతో లాయర్ వద్దకి, కూడా వెళ్లాను. నిజం చెప్పద్దూ? నాకూ ఇప్పుడు  ప్రశాంతంగా, హాయిగా ఉంది,” క్షణమాగింది పిన్ని.

“డైవర్స్ కి ఫైల్ చేసిన మారునాడే  మంజుల వేరే అపార్ట్ మెంట్ కి మూవ్ అయింది.  అందుకే  నీకిక్కడ  కనబడలేదు,”  అంది కప్పులోకి కాఫీ వొంచుకుంటూ..

మళ్ళీ తనే, “అసలు సంగతి విను.  రేపటి నుంచి నేను మంజుల దగ్గరే ఉంటాను.  నా కోసమే, ఒక వారం సెలవు పెట్టింది అది.లాస్-వేగాస్ కి తీసుకెళుతుందట.  ఆ తరవాతే నా ఇండియా ప్రయాణం... ఇదమ్మా సంగతి,” అంది చిరునవ్వుతో....

**

భావాని పిన్ని,  విశాల  దృక్పధంతో  సరిగ్గా  ఆలోచించి, మేలైన తీర్పే ఇచ్చుంటుందని భావించాను.

..... ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని

అత్త గుండెలోన కూడా అమ్మ వున్నదని

బొమ్మలాటలాడుతున్న బ్రహ్మ రాతలని

మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది

చరితలు చదవని తొలి కధగా

మనసులు ముడి పడు మనుగడగా

తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగ దీవించే

చల్లని తరుణమిది...

ఓ పాత పాట లోని చరణం గుర్తొచ్చింది నాకు...

**

ఆ తరువాత, ప్రతి యేడు భవాని పిన్ని అమెరికా వస్తూనే ఉంది.  చందర్రావ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.  వచ్చినప్పుడు కూడా,  ఎక్కువ రోజులు పిన్ని మంజుల దగ్గరే గడుపుతుంది.  మంజుల కూడా పిన్ని సలహా మేరకే మళ్ళీ పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుందని విన్నాను. మరి మా భవానిపిన్ని  అంత ఆధునిక భావాలతో, విశాలమైన దృక్పథంతో అలోచించబట్టే  కొడుకు – కోడల జీవితాలని చక్కబరచగలిగింది ..... ఆవిడ కూపస్థ మండూకంలా  అలోచించి ఉంటే,  పాపం ఆ యువ జంట  జీవితాలు మరోలా  ఉండేవి....కదూ! అనుకున్నా.

**

ఏ కోణం నుండి చూసినా, ‘పెళ్లి’ అనే వ్యవస్థ నుండి - సహజీవనం, సహచర్యంలోని

సుఖసంతోషాలని  అందుకోగలగాలి.    ‘పెళ్లి’ ఓ అందమైన జీవిత గమ్యంగా మలుచుకోగలగాలి....

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి