.....అలా మొదలైంది......
అక్షరం తో అనుబంధం....సాహిత్యం తో సాన్నిహిత్యం.....
...‘భాషాట’ చిన్నప్పుడే మొదలవుతుందిగా మరి!...
….మాటలతో ఆటలు గమ్మత్తుగానే.....
తెలుగు భాష - సంస్కృతీ - సాహిత్యాలు, నా జీవితంలోపెద్ద పాత్రే పోషించాయి. నృత్యానికి సంబంధించి శ్రావ్యమైన సంగీతం ఓ ఎత్తైతే, పాటల్లోని సాహిత్యం నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేది. భామాకలాపం –లేఖ సన్నివేశం లోని సాహిత్యం నన్ను ఆకట్టుకుంటే, ఆండాళ్ స్వప్నం లోని ప్రతి పదం నన్నలరించింది.
తకధిమి-తకధిమి –తఝణులు, ఆలాపనలు, నట్టువాంగం, జతులు, నడకలు–కాక, నవరసాలని గుప్పించగలిగే సాహిత్యం - ఇలా..నన్ను జీవితాంతం నిలువునా కట్టిపడేసాయి సాహిత్య - సంగీత - నాట్యాలే....
మామూలుగానే సంగీత సాహిత్యాలు ఇష్టముండని వారు ఉండరు. నృత్యకళ అభ్యసించడం వల్ల, సాహిత్య సాగరంలో మరింతగా మునిగి తేలే అదనపు అవకాశం, నాకు దొరికింది.
నర్తకిగా - భావ ప్రకటనకి, అభినయానికి పాట లోని సాహిత్యం, ప్రతి పదానికి అర్ధం, ప్రత్యర్ధం, తాత్పర్యం పూర్తిగా అవగహన చేసుకోవలసిన అవసరం ఉండడంతో, భాష - సాహిత్యాలకి నేను చాల దగ్గరయ్యాను.
భాషాట -
భాషతో ఆట.... మనిషికి పసితనంలోనే ఈ ‘భాషతో ఆట’ మొదలవుతుందనుకుంటా!.. అచ్చమైన తెలుగు స్పష్టంగామాట్లాడాలని, చిన్నప్పుడు అమ్మ పదే పదే చెప్పడం బాగా గుర్తు. మారోవైపు స్కూల్లో,‘క్లుప్తంగా చెప్పు’, ‘కుదించి రాయి’ అన్న సూచనలువినబడుతూనే ఉండేవి..అప్పుడు మొదలయింది నా అక్షరాన్వేషణ.అమ్మతో నైనా, ఫ్రెండ్స్ తో నైనా నేననబోయేది ముందుగా ఓ సారి లోలోపల గుణించుకొని గాని బయటకి అనేదాన్ని కాదు నా చిన్నప్పుడు...అలాగే స్కూల్ వర్క్ లో కంపోజిషన్స్, వ్యాసాలూ రాయాలన్నా అదే తంతు...సరైన అక్షరాల కోసం అన్వేషణ కొనసాగేది..
తొలి రచనలు బుట్ట దాఖలు
జూనియర్ కాలేజీలో ఉండగా..బాగా గుర్తు –‘బుద్ధిమంతుడు’, ‘నేల రాలిన తార’ అనే కథలు రాసాను. నాన్నకే చదివి వినిపించాను. “Jack of all trades’ లా ఇన్ని వ్యాపకాలు వద్దమ్మా- డాన్స్ మాత్రం చేయి” ...అన్నారు. అంతకు ముందు, పన్నెండేళ్ళప్పుడు, పాటలు రాసి ట్యూన్ చేసి నాన్నకి వినిపించాను...దానికీ నాన్న పెద్దగా ప్రోత్సహించలేదు. “నువ్వు డాన్స్ లో రాణిస్తావు. దాని మీదే దృష్టి పెట్టు,” అనడంతో చాలా కాలం పాటు నా జగమంతా నాట్యమయమే అయింది. రచనలు చేయాలన్న నా ఆశ తాత్కాలికంగా కాస్త అణగారిపోయిందనే చెప్పాలి. అయినా భాష మీద నాకున్న ఆసక్తి, అభిమానం చెదరలేదు సరికదా నాతోపాటు ఎదిగిందనే అనాలి.......
దానికి కారణమైన వ్యక్తులు, సంఘటనలు కూడా ఉన్నాయి మరి...
నా పదో యేట వరంగల్లో జరిగిన అఖిల భారత రచయిత్రుల మహా సభలో డా. ఊటుకూరి లక్ష్మికాంతమ్మ గారి చేతుల మీదుగా నా మొట్ట మొదటి డాన్సు అవార్డు అందుకొన్నాను. ఆ సభ లో ఆవిడ ప్రసంగం విన్నాను.చాలా గొప్పగా మాట్లాడారు ఆమె. ఆవిడ వాగ్ధాటి ఓ వైపైతే, తెలుగు భాషలోని మాధుర్యంమరో వైపు అన్నట్టున్న ఆ నాటి ప్రసంగం విన్న తరువాత మన భాష మీద నాకున్న అభిమానం రెట్టింపయ్యింది... ఆ దిశగా నన్ను ప్రభావితం చేసిన వారు మరో మహా కవి. సాహిత్య, సాంస్కృతిక, సంగీత రంగాల్లో ప్రముఖులు, డా. సి. నారాయణ రెడ్డి గారు. నృత్య కళాకారిణిగా నా ప్రస్థానం హైదరాబాద్లోనేమొదలయ్యింది... నేను చేసిన ఎన్నెన్నో నృత్య కార్యక్రమాలకి అయన ముఖ్య అతిధిగా వచ్చేవారు. నా గురించి, నా నాట్యం గురించే కాక, ప్రసంగానికి తెలుగు భాష నుండి ఆయన ఎంచుకునేపదాలు నా కెంతో ఇష్టం. గ్రీన్ రూం నుండి పెరిగేత్తుకొని వెళ్లి, ఆయన ప్రసంగం వినేదాన్ని. అలా ప్రత్యక్షంగా,పరోక్షంగా కుడా అయన మాటలు, పాటలు, కవిత్వం, వాక్యాలు, వ్యాఖ్యానాలు నాకెంతో స్పూర్తి నిచ్చాయి.....ఆ స్ఫూర్తి తోనే, నృత్య సంబంధిత రచనలు చేస్తూ, నృత్యాలకి వ్యాఖ్యానం రాస్తూ, కొత్త పంధాలో నృత్యాలని ప్రదర్శించాలని, అందు కోసం కాన్సెప్ట్స్ (concepts) సృజించాను.
‘భరతముని భూలోక పర్యటన, దేవిస్తోత్ర మాలిక, అమెరికాలో అనసూయ,పెళ్లి ముచ్చట, డ్రీం గర్ల్, కన్య, మానస పుత్రి, తెలుగింటి వెలుగు, సంభవామి యుగే యుగే’
, లాంటి కొన్నిరచనలు చేసి, నాట్యాలతో కూర్చి విజయవంతంగా ప్రదర్శించాము. ‘భరతముని’ కైతేప్రశంసతో పాటు, TANA వారి ‘Outstanding Performance Award’ కూడా వచ్చింది..
మా అకాడెమి తరఫున నిర్మించిన ‘ఆలయ నాదాలు’ టెలిఫిలిం కి కొంత వరకు కథ, సంభాషణ కూడా రాసాను. అమెరికాలో తీసిన నిడివికిదర్శ కత్వం వహించాను కూడా.
కథ-వ్యాసం-కవిత-నవల.......
మా హూస్టన్ నగరంలో,వంగూరి ఫౌండేషన్ స్థాపించి,కొత్తగా రచనలు చేసేవారినికూడాప్రోత్సహిస్తూ, స్పూర్తి దాయకంగా నిలిచారు వంగూరి చిట్టెన్ రాజుగారు. ప్రవాసాంధ్రుల భాషాభిమానానికి, సాహిత్యాభిమానానికి పెద్దపీట వేసి,ప్రతి యేడు కథల సంపుటి ప్రచురిస్తూ, ఉగాది రచనల పోటీలు పెడుతూ,ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కూడా, రచన పట్ల నా అభిలాష కికారణం అనొచ్చు. అలాగే నా చిన్నప్పటి నుండి తెలిసిన, అనసూయ ఆంటీ – వింజమూరి అనసూయ దేవి గారు కూడా నాకు ఎంతో స్ఫూర్తి నిస్తారు...
దీనికీ నాన్నే నాంది పలికారు.....
ఐదేళ్ళ క్రితం - తెలుగు యూనివర్సిటీ వారి ‘అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం’ సందర్భంగా,హైదరాబాదులో నృత్య ప్రదర్శన చేసాను...మా నాన్నగారు ప్రోగ్రాం అయిన మరునాడు నాతో, “ఇక పై నీవు కష్టపడి ఈ ప్రోగ్రాములు అవీ పెట్టుకోవద్దు,” అన్నారు. కొద్దిగా ఆశ్చర్య పోయినా, ఒకింత విరామం నాకూ కావాలనిపించింది. దాంతో, బోలెడంత సమయం దొరికినట్టయింది. అదే టైం లో మా అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళింది. మరింత తీరిక దొరికింది... డాన్స్ క్లాసులు, రంగాప్రవేశాలతో మరో రెండేళ్లు గడిపాను... ఆ తరువాత కాని తట్టలేదు...ఎప్పుడూ ఆలోచనల్లోనే ఉండిపోయిన రకరకాలఇతివృత్తాలు, పోయట్రీ,ప్రోజ్, కథ, వ్యాసం, నాలో ఆలోచన కలిగించే ప్రతిదీ రాయవచ్చు అన్న విషయం..... అప్పుడే, రెండేళ్లగా నాకు తోచింది రాయడం, ‘బాగా వచ్చింది’ అనుకున్నదాన్ని ఏదో ఒక పత్రికకి పంపడంమొదలు పెట్టాను. దాంతో, సాహత్యం పట్ల, తెలుగు భాష పట్ల కూడా నాకున్న అవగాహన ఓ కొత్త మలుపు తిరిగింది.ఈ రచనలతో, నా లోకం అక్షరమయమయిందనే...చెప్పొచ్చు...మాటలతో ఆటలు గమ్మత్తుగానే అనిపిస్తాయి.....అనుకున్న భావాలని అనుకున్నట్టు వ్యక్తపరుస్తూ, రచనలు చేయగలగడం అంత సులభం కాదు,,, అలాగని అంత కష్టమూ కాదు. రచనా ప్రక్రియలో - భావం, అనుభవం, ఆసక్తి, ఊహ, సమన్వయము అన్నీ మిళితమవ్వాలి...అలా మాటలతో ఆసక్తికరమైన ఆటాడుతూ నేను రాసిన మొదటి కవిత, కథ, వ్యాసం పబ్లిష్ అవడమే కాక,
2012 లో, ‘ముళ్ళగులాబి’ కథకి ‘వంగూరి ఫౌండేషన్’ వారి ఉగాది పురస్కారం లభించడం చాలా ఆనందం కలిగించింది...
‘ఆంధ్రభూమి’ లో పబ్లిష్ అయిన మొట్టమొదటి కథ ‘కాఫీ-టిఫిన్ తయ్యార్’చదివి మా నాన్న ఎంతగానో మెచ్చుకున్నప్పుడు ఆ ఆనందం అవధులు దాటింది. నాన్నకి నచ్చేది,ఆయన మెచ్చేది - మరో ప్రక్రియ నాకు సాధ్యమైనందుకు రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని కథలు, కవితలు రాయడం చేసాను.... పబ్లిష్ అయినవాటికంటే, అవ్వనివి తక్కువే.
2013 లో, మరోమారు ‘ఏం మాయ చేసావో’ కథకి వంగూరి వారి ఉగాది పురస్కారం అందుకున్నాను.
మా నాన్నగారికి, అమ్మకి అంకితం చేస్తూ 2013 లో ‘విదేశీ కోడలు’ కథా సంపుటిని వంగూరి ఫౌండేషన్ పబ్లిష్ చేసారు.,
...’సారంగా’ సాహిత్య వార పత్రిక లో సీరియల్ గా ప్రచురితమైన ‘ఎగిరే పావురమా’2014 లో నవలగా పబ్లిష్ అయ్యింది...
2013 లో రచించిన ‘రాజీ పడిన బంధం’అనే నవల కినిగె పైప్రస్తుతంలభ్యం .....
http://kinige.com/book/Rajee+Padina+Bandham
http://kinige.com/book/Videsee+Kodalu
http://kinige.com/book/Egire+Pavurama
ఈ నా రచనా ప్రస్థానం కూడా నా తల్లితండ్రుల ఆశీర్వాదంతోనే ముందుకు సాగాలాని ఆశిస్తాను... .....
‘నాట్యభారతీయం’ నుండి కొద్దిపాటి విరామం కోరుతూ....
శెలవా మరి! కొద్ది విరామం పిమ్మట, మరిన్ని కబుర్లు, అనుభవాలతో తిరిగి మీ ముందుకు వస్తాను.
నాట్యభారతీయం’ శీర్షిక ద్వారా మీతో ఇన్నాళ్ళూ ఎన్నో సంగతులు, కబుర్లు, జీవితానుభవాలు పంచుకోగాలిగాను. చదివి స్పందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు....
ఇటువంటి అవకాశాన్ని కల్పించిన బన్ను గారికీ, మాధవ్ గారికి ధన్యవాదాలు.
**********************************************************************
ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ వీలు కల్పించుకుని నాట్యభారతీయం ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించిన కోసూరి ఉమాభారతి గారికి ధన్యవాదములు. అశేష పాఠకాదరణతో సాగిపోతోన్న అనంత భావతరంగాంతరంగంలో ఒక చిన్న విరామం అంటే పాఠకులకు కాస్త నిరాశ కలిగించేదే. అయితే...త్వరలో ఈ రచయిత్రి గారి నుండి రాబోతున్న కొత్త సీరియల్ గురించిన ప్రకటన ఆనందం కలిగిస్తుంది....ఈ శీర్షికను ఎంతో ఆదరించిన పాఠకులకు నిరాశ కలిగించకుండా కోసూరి ఉమాభారతి గారు నిజంగా చిన్న విరామం తరవాత తమ అనంతభావతరంగాంతరంగాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.
-సం.